కరువు రాచ్చసి కోరల్లో సిక్కిగింజే కాన్రాని న్యాల మింద సాము సెయ్యలేకపొట్ట సేతబట్టుకోని పట్నానికి పయనమైపోతి…
పూటైనా మెలిపెట్న పేగులమంట సల్లారకనేనాలుగు మెతుకులతో పిల్లాపీచు ముసిలీముతకలమొగాల్లో ఎలుగులు సూడకనేకాలానికి కన్నుగుట్టిందేమో..యాడదాగున్నో … ఈ మాయదారి మగమ్మారి కరోనా ..
లాకు డౌను రూపంలో మాబతుకులు అతలాకుతలం సేసి ఏడుక జూత్తాంది!పూట గడవడమే కస్టమై.. పైమింద బట్టే ల్యాకపోతేమూతికి ముసుగు.. సేతికి తొడుగు నెనెట్లా ఏసుకునేది….
ఆకిలి క్యాకలను అదిమిపట్టి ఆవగింజెంత ధైర్నంతోపురిటిగెడ్డకు పయినమైతే..అడుగడుగునా అడ్డగింతలే!నెర్లు సీలిన న్యాల మిందికి నెత్తర గారతాండే కాలు మోపేలోపలే..కోరంటైన్ లక్స్మణ రేకై కుచ్చోనుండాది!
గట్టవుతల.. ఇంటికాడ ఎమకలతొడుగు పక్కనపసిదాని కండ్లు.. నా రాక కోసరం.. కాసుకోనుండాయి!“కలో.. గంజో కల్సుకొనే తాగుదాం.. నువ్వురా .. అయ్యా.. ” అని జెప్పినమాయమ్మ మాటలే గింగురుమంటా ఉండాయ్ సెవుల్లో…ప్యానం గట్టవతలకు పోవల్లని లాగేసిన్యాది…
ఈ మాయదారి రోగాన్ని సంకన బెనెట్టుకోని…నెనట్లబోవల్లబ్బా..!
దావలన్నీ తాచుపాములై కాటేస్తా ఉంటే…నా వూరికి ఎట్టక్యాలకు ఎట్లా జేరుకునేది ?
యా.. ద్యావుడో.. దయ్యమోమమ్మల్ని ఆదాటుగా ఎత్తకపోయిమాకింత సాయం జేత్తే బాగుండు ..!!
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన రజిత కొండసాని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని. కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వ్యవస్థాపకురాలు. “ఒక కల రెండు కళ్ళు” అనే కవితాసంపుటి వెలువరించారు. వాట్సప్, ఫేస్బుక్ లలో గ్రూపు ఆద్వర్యంలో కవితా పోటీలు నిర్వహిస్తుంటారు. విరజాజులు గ్రూప్ అడ్మిన్.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™