అప్పటి నేనెరిగిన రవాణా సౌకర్యాలు..!!
గ్రామాలలో ఎంత దూరం పోవాలన్నా సామాన్యుడికి కాలినడక మాత్రమే దిక్కు. పైగా గ్రామాలలో రిక్షాల సదుపాయం కూడా ఉండేది కాదు. వున్నా వాటిని వినియోగించుకునే శక్తి అందరికీ ఉండేది కాదు. అప్పట్లో సైకిల్ ఉంటే చాలా గొప్ప! వాళ్ళని ఉన్నత కుటుంబీకులుగా పరిగణించేవారు. జనంలో వాళ్ళు ప్రత్యేకంగా కనిపించేవారు. కాస్త ఉన్నత కుటుంబీకులైన రైతు కుటుంబాలు తమ వ్యవసాయం కోసం ఉపయోగించే రెండెడ్ల బండ్లు ప్రయాణాలకు ఉపయోగించేవారు.


రెండెద్దుల బండి
గ్రామాలతో బస్సు రవాణా సౌకర్యాలు అనుసంధానం కాని రోజుల్లో గోదావరికి లేదా ఇతర నదులకు దగ్గరలో వున్న గ్రామాలకు లాంచీ (స్టీమర్) సౌకర్యం ఉండేది. అప్పట్లో ఉభయ గోదావరి జిల్లాలకు ఉత్తమ ప్రయాణ సాధనంగా లాంచీలు, నరసాపురం నుండి రాజోలు వరకూ సౌకర్యంగా ఉండేవి. నదికి ఇరువైపులా వుండే గ్రామ ప్రజలు ఈ సౌకర్యం అత్యధికంగా ఉపయోగించుకునేవారు.


లాంచి (స్టీమర్) ప్రయాణం
ఇలా కాకుండా ఒంటెద్దు బళ్ళు, గుర్రపు బళ్ళు బాడుగకు దొరికేవి. వీటిలో ప్రయాణించడం అందరికీ సాధ్యం అయ్యేది కాదు.


ఒంటెద్దు బండి
అందుచేత రవాణా సౌకర్యాలు లేక బడికి వెళ్లలేక గ్రామాలలో నిరక్షరాస్యులుగా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది. ఒకరిద్దరు ఉద్యోగస్థులు వున్నా స్థానికంగానే ఉండిపోయేవారు. విద్యార్థులు వసతి గృహాల్లో ఉండేవారు. పండుగలకు పబ్బాలకు మాత్రమే కాలి నడకతో ఇళ్లకు చేరుకునేవారు. కొందరు నదిని దాటి మరి కొందరు కాలువలు దాటి, గమ్యస్థానాలకు చేరుకునేవారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా వారి బాధ వర్ణనాతీతం. మట్టిరోడ్ల మీద నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది.


పడవ ప్రయాణం
వర్షాలు వచ్చినప్పుడు తాటాకు గొడుగులు ఉపయోగించి నడుచుకుంటూ వెళ్లేవారు. ఇలాంటి నేపథ్యంలో, అనారోగ్యం రీత్యా నేను పెద్దన్నయ్య (కె కె మీనన్) దగ్గరకు హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతీయంగా అందుబాటులోవున్న రవాణా సౌకర్యాలను అతి దగ్గరగా చూసే అవకాశం నాకు కలిగింది. ఆ మహా పట్టణంలో అన్ని చోట్లకూ నడిచివెళ్లేలా తక్కువ దూరాలు వుండవు. ఐతే సైకిలు రిక్షా, లేకుంటే ఆటో రిక్షా, మరీ దూరమైతే బస్సు, ఇలా ఉండేది పరిస్థితి. లోకల్ బస్సులు పుష్కలంగా ఉండేవి.
నేను హైదరాబాద్‌లో వున్న ప్రాథమిక దశల్లో, తరచుగా నేను కుబ్ధిగూడా నుండి అఫ్జల్‌గంజ్ లోని ఉస్మానియా ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు సైకిల్ రిక్షానే ప్రధాన సౌకర్యం. ఆటోలో వెళ్లలేని పరిస్థితి. బస్సు ఇంటికి దూరం. అందుచేత బస్సులో చౌక ప్రయాణం అయినప్పటికీ వాటిని వినియోగించుకోలేని పరిస్థితి. అందుచేత సైకిల్ రిక్షాతో నాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. హైదరాబాద్‌లో రిక్షాలు గమ్మత్తుగా ఉండేవి. రిక్షా గూడు (టాప్) ఎత్తు తక్కువగా ఉండేది. పొడుగైన వాళ్ళు తప్పక మెడలు వంచి కూర్చోవలసిందే! (ఆంద్ర ప్రాంతంలో గూడు ఎత్తుగా ఉండేది). భార్యాభర్తలకు, ప్రేమికులకు ఈ రిక్షా మంచి అనుకూలంగా ఉండేది. ఎండ, వర్షం లేకుంటే టాప్ తీసేయమనేవాళ్ళం. టాప్ ఉంటే తల్లి గర్భసంచిలో పిండం ఒదిగి కూర్చున్నట్లు ఉండేది. ఇప్పుడు ఆ రిక్షాలు హైదరాబాద్‌లో ఎక్కడా ఉన్నట్టు లేవు. ఈ రిక్షా గుర్తుకు వచ్చినప్పుడల్లా, డా. సి. నారాయణ రెడ్డిగారి ‘రింజిమ్.. రింజిమ్.. హైదరాబాద్ … రిక్షావాలా జిందాబాద్..’ అన్న పాట తప్పక గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు ఆ రిక్షాల ప్రాధాన్యత అలాంటిది మరి!


అప్పటి సైకిల్ రిక్షా మోడల్
హైదరాబాద్‌లో విద్యార్థి దశలో అడుగు పెట్టిన తర్వాత, సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు వినియోగించుకున్నా, బస్సులకే ప్రాధాన్యత అధికంగా ఉండేది. వెళ్ళవలసిన ప్రాంతాలకు బస్సులే సౌకర్యంగా ఉండేవి. అత్యవసర పరిస్థితిలో ఆటోల వాడకం బాగానే ఉండేది. హైదరాబాద్ ఆటోలు ప్రయాణానికి సౌకర్యంగా ఉండేవి. ఆటో డ్రైవర్లు కొంతమంది ఎంతో నిజాయితీగా, మర్యాదగా ఉండేవారు. కొంతమంది (చాలా తక్కువమంది) గూండాలుగా ప్రవర్తించేవారు.


ఇప్పటికీ బ్రతికి ఉన్న ఆటో
ఒకసారి నేను మలక్‌పేట్ నుండి ఉస్మానియా మెడికల్ కళాశాల హాస్టల్‌కు ఆటో మాట్లాడుకున్నాను. ముప్పై రూపాయలకు ఒప్పందం కుదిరింది. ఆటోవాలా ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర ఆటో ఆపి దిగమన్నాడు. “నేను చెప్పింది ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ కదా!” అన్నాను.
“కాదు ఇక్కడే దిగు” అన్నాడు
“నేను హాస్టల్‌కు వెళ్ళాలి, దిగను” అన్నాను. సర్రున ఆటోలో నుండి తళ.. తళ.. మెరిసే కత్తి తీసి నా వైపు చూపించాడు.
“యాభై రూపాయలు ఇస్తాను, నన్ను హాస్టల్లో దించేయి” అని బ్రతిమాలను. “సరే” అని తీసుకువచ్చి హాస్టల్ దగ్గర దింపాడు
ఆటో దిగి “నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను, ఏమి చేసుకుంటావో చేసుకో” అన్నాను. అప్పటికే నాకు తెలిసినవాళ్ళు, నా మిత్రులు, పదిమంది వరకు నా దగ్గరకు వచ్చేసారు. విషయం తెలిస్తే వాళ్ళు ఏమి చేస్తారో ఆటోవాలాకు అర్థమైపోయింది. అతను గభాలున పారిపోయే పరిస్థితి కూడా లేదు. అప్పుడు కాళ్లబేరానికి వచ్చాడు. “క్షమించండి.. తప్పైపోయింది” అన్నాడు. ముందుగా మాట్లాడుకున్నట్టు ముప్పై రూపాయలు ఇచ్చి పంపేసాను. ఇలాంటి వాళ్ళు కూడా వుండేవాళ్ళన్నమాట!
మళ్ళీ ఎప్పుడూ అలంటి సంఘటన నాకు ఆటోవాళ్ళతో ఎదురుకాలేదు.
విద్యార్థిగా నేను ఎక్కువగా సద్వినియోగం చేసుకున్నది ఆర్టీసీ బస్సులే! బస్సుల్లో ప్రయాణం చేయడం సరదాగానూ తక్కువ ఖర్చుతోనూ గడిచిపోయేది. మాకు ఉస్మానియా మెడికల్ కళాశాలలో కూడా క్లాసులు ఉండేవి. డెంటల్ సబ్జెక్టులు అఫ్జల్గంజిలోని దంత వైద్య కళాశాలలో ఉండేవి. అందుచేత కోఠి – అఫ్జల్‌గంజ్ మధ్య బస్సులో ప్రయాణం చేసేవాళ్ళం. స్టూడెంట్ పాస్ ఉండేది. అప్పట్లో రెండంతస్తుల బస్సులు (డబుల్-డెక్కర్) ఉండేవి.


డబుల్ డెక్కర్ బస్సు
అందులో ప్రయాణం చేయడానికి బాగా ఇష్టపడేవాడిని. ఎక్కువగా పై భాగంలో కూర్చోవడానికి మనసు పడేవాడిని. ఆ బస్సుకు ఇద్దరు కండక్టర్లు ఉండేవారు. పై అంతస్తులోవున్న కండక్టర్ బెల్ కొట్టాక క్రింది కండక్టర్ బెల్ కొడితే బస్సు కదిలేది. అదొక వినోద భరితమైన ప్రయాణంలా ఉండేది. రోడ్డు మీద ఒక మేడ కదిలిపోతున్న భావన కలిగేది.
తర్వాత క్రమంగా ఈ మేడ బస్సులు కాల గర్భంలో కలిసిపోయాయి.
అప్పుడు ఒకదానికి మరొకటి గొలుసుతో అనుసంధానం చేసిన బస్సు ఉండేది. రెండు బస్సులు, ఇద్దరు కండక్టర్లు, ఒక డ్రైవర్ ఉండేవారు. దీనిని ట్రైలర్ బస్సు అనేవారు. అవసరాన్ని బట్టి లేదా కుర్రతనం చూపించడానికి, కదులుతున్న బస్సు ఎక్కడం వేగంగా పోతున్న బస్సు దిగడం వంటి చిలిపి చేష్టలు ఇప్పటికీ గుర్తున్నాయి. ట్రైలర్ బస్సులు కూడా ఇపుడు కనుమరుగైనాయి.
ఇప్పుడు క్యాబ్‌లు, మెట్రో రైళ్ల అవసరం ఏర్పడింది. ప్రయాణాలు సులభతరం అవుతున్నాయి. అయినా పెరుగుతున్న జనాభాకు సరిపడా ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో లేనట్లుగానే భావించాలి. అయితే ఒక సాధారణ ఉద్యోగి సైతం మోటారు సైకిల్, లేదా కారు కొనుక్కొనే అవకాశం ఇప్పుడు బ్యాంకులు కల్పిస్తున్నాయి. అడిగి మరీ రుణ సదుపాయం అందించే బ్యాంకులు ఇప్పుడు మనకు అందుబాటులోనికి వచ్చాయి. అయితే తక్కువ ఖర్చులో సామాన్యుడికి రవాణా సౌకర్యం ఏర్పడే పరిస్థితి మనకు రావాలి. కదిలే కాలంతో పాటు సమాజంలో అనేక మార్పులు వస్తాయి. దానికి రవాణా సౌకర్యాలు అతీతం కాదు. రాబోయే కాలంలో మరిన్ని సామాన్యుడికి ఉపయోగపడే రవాణా సౌకర్యాలు ఆశించడంలో తప్పు లేదనుకుంటాను.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
29 Comments
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
——డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Aanaati ravaanaa soukaryaala gurinchi bommalatho sahaa chakkagaa vivarinchaaru..
Patharojulanu gurthucheshaaru..
Dhanyavaadaalandi
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
సాంబశివ రావుగారు.
డి. వి. శేషాచార్య
మీ కాలంనాటి ప్రయాణ సాధనాలను చాలా బాగా గుర్తు చేసారు. మీరు చెప్పిన వాటిల్లో డబుల్ డెక్కర్ బస్సులు మాకు వరంగల్లులో తెలియదు. కాని మాకు టాంగాలు బాగా తెలుసు. సెకండ్ షో కి వెళితే తిరుగు ప్రయాణంలో ఎక్కువ టాంగాలలోనే.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అవునా…
ధన్యవాదాలు మిత్రమా
Rajendra+Prasad
ధైర్యం కూడా తెలివితో కూడు కున్నది అయి ఉండాలి అని మిమ్మలను చూసి తెలిసింది.







ఓపిగ్గా passenger transport లోని మార్పులు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సర్



ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ప్రసాద్ గారూ
మీకు ధన్యవాదాలండీ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
బాగుందండీ ఆ కాలంలోని రవాణా వాహనాలు, అనుభవాలు




—కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ.
sagar
మీరన్నట్లు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా రవాణా సదుపాయాలు ఉండాలని ఆశించడంలో తప్పులేదు. కానీ ప్రతి ఒక్కడి నోటివెంటా వచ్చేమాట కాలంమారింది. అనుగుణంగ ఇలాంటి సదుపాయాలు ఖరీదు అయ్యాయి. మరి విలాస వస్తువులైన చరవాణి లాంటివి ఎలా చవక అయ్యాయో చెప్పలేరు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ నాటి సదుపాయాలు ఒక రకమైన మదుర ఙ్ఞాపకాలు. అలాగే పెరిగే జనాభాకు అనుగుణంగ సదుపాయాలు పెరగలేదన్న మీ వ్యాఖ్య అక్షర సత్యం. అలాంటి ఙ్ఞాపకాలను ఆస్వాదించిన మీకు శుభాకాంక్షలు మాకూ పంచి ఆనందింపచేసినందుకు ధన్యవాదములు సర్
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలు
సాగర్ రెడ్డి.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
తన జ్ఞాపకాల పందిరి 115వ భాగంగా ఆనాటి రవాణా సౌకర్యాలు, కాలక్రమేణా వాటి రూపాంతరాలను గురించి సృజనాత్మక చిత్రాలతో చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. కొన్ని ప్రాంతాలలో ఆధునికమైన రవాణా సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నవారే అటువంటి వ్యవస్థను ఉపయోగించుకోగలిగేవారు.
నేను 1990 సంవత్సరము హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో సొంత ఇంటిని నిర్మించుకుని ,అప్పటివరకు అద్దె ఇంట్లో ఉన్న ఇంటి సామాను తరలించటానికి ఒక ట్రక్ ను ఏర్పాటు చేసుకున్నా , సహాయకులు అందుబాటులో లేక చివరికి పనివారి తో కూడిన ఎడ్లబండి ఎన్నుకో వలసి వచ్చింది . అందులో నుండి సామాను క్రిందకు దించే సమయంలో వీధి కుక్కల అరుపులకు బెదిరిన ఎద్దులు సాగించిన విన్యాసంతో , బరువైన అల్మరా క్రింద పడిపోవటం, ఒక పనివాడికి కాలు చితికి పోవటం ,తత్ పరిణామాలు.. ఎక్కడైనా సామాను తో వెళుతున్న ఎడ్లబండిని గమనించినప్పుడు గుర్తుకువచ్చి లోలోన నవ్వుకుంటాను
—–బి.రామకృష్ణా రెడ్డి
వాషింగ్టన్.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
రెడ్డి గారు.
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 115 లో పాత అలనాటి రవాణా సౌకర్యాలు అప్పటి పరిస్థితులు మరియు ఫొటోలతో సహా చాలా చక్కగా వివరించారు.పాత రోజులు గుర్తుకు వచ్చాయి సర్.అప్పటి వాహనాల లో మన తరం వాళ్ళు అందరూ ప్రయాణం చేసిన వాళ్ళమే,హైదరాబాద్ పోయినప్పుడు అవకాశం కల్పించుకొని డబల్ డక్కర్ బస్సులో పైకి వెళ్లి కూచునేవాళ్ళం చాలా సంతోషం వేసేది,ధన్యవాదములు డాక్టర్ గారు
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలు
భుజంగరావు గారూ…
ADLURU NARASIMHA MURTHY
శుభ సాయంత్రం సర్….
గ్రామీణ వాతావరణం, వాహనాలు, రవాణా వ్యవస్థను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.
ఇది నిజంగా జ్ఞాపకాల పందిరే.
మీకు అభినందనలు… నమస్కారం!
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
రవాణా సౌకర్యాలు అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాయి.. మీరన్నట్లు సామాన్యుడికి అవి తక్కువ వ్యయంలో అందాలి.. మహబూబాబాద్లో రైల్వే సౌకర్యం ఉండడం వల్లే స్టూడెంట్ సీజన్ టికెట్ తో వరంగల్ వెళ్లి చదువుకోగాలిగాం.
వెంకట్ రామనర్సయ్య
మహబూబాబాద్.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలు మిత్రమా…
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
హైదరాబాద్ లోఈ విద్యార్థిదశ నాటి రవాణా సౌకర్యాలు ,వాటిని మీరుపయోగించూకున్న తీరు బాగా రసారు సర్.విద్యార్థులకు బస్పాస్ సదుపాయము బాగావుండేది.సాధారణప్రజలకూ నెలకుపనికొచ్చే జెనరల్ పాస్ వుండేది.
ఆటోవాలాల జులుం ఇప్పుడుగూడా అక్కడక్కడ నడుస్తున్నట్టే వున్నది. ఏది ఏమైనా మంచి జ్ఞాపకం
సర్
—రామశాస్త్రి. నా
హన్మకొండ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
శాస్త్రి గారు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
మీ జీవితంలో ముడిపడిన ప్రతి అంశాన్నీ ఎంతో నిశితంగా గమనించి వాటినో చక్కని జ్ఞాపకాలుగా అందిస్తున్నారు.కోనసీమలో ప్రయాణం ఇప్పటికీ కొన్ని చోట్ల మీరు చెప్పిన పడవ ప్రయాణాలే సాగుతున్నాయి.మీరన్నట్టు ప్రజలకు మంచి రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తే అభివృద్ధి కూడా బావుంటుంది. ఆటోవాలతో మీ అనుభవం మీ ధైర్యాన్ని చూపిస్తోంది.వివిధ రవాణా మార్గాలద్వారా మీ జీవన పయనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు.ధన్యవాదాలు సర్

—నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
జ్ఞాపకాల పందిరి..115 లో నాటి రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సరియైన రవాణా సౌకర్యాలు కరువై నిరక్షరాస్యురాలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడక, సైకిల్, రిక్షా, ఆటో, బస్సు, డబుల్ డెక్కర్ బస్సు, మెట్రో వంటి ప్రయాణసాధనాలను చక్కగా వివరించారు. హైదరాబాద్ లో ఎన్ని ప్రయాణ సాధనాలు ఉన్నా, రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు సరిపోవు. కథనం బాగుంది.
—జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
చారిగారూ.
పుట్టి. నాగలక్ష్మి
కాలినడక నుండి డబల్ డెకర్ బస్సుల వరకూ.. సవివరంగా, సచిత్రంగా రవాణా సౌకర్యాల పరిణామగతిని .. సరళమైన భాషలో వివరించారు.. మా పిల్లలు డబల్ డెకర్ బస్ లు ఎక్కేటందుకు మక్కువ చూపేవారు. గుర్తు తెచ్చి నందుకు ధన్యవాదాలు మీకు డాక్టర్ సాబ్!
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
కృతజ్ఞతలు మేడం.
శ్యామ్ కుమార్ చాగల్
మన దేశం లో కాల క్రమేణా మార్పు చెందిన రవాణా వ్యవస్త గూర్చి వ్యక్తిగత అనుభవాలతో , చాలా బాగా విశదీకరించారు రచయిత. ఒకప్పుడు దూరాభారా ప్రయాణాలు కూడా కాలినడకన జరిగేవి. అప్పుడు దారి దోపిడీలు, క్రూర మృగాల తాకిడి కూడా ప్రాణాంతకంగా ఉండేవి. తాను చెప్పినట్లు సైకిల్ యొక్క గొప్పతనం నేను అనుభవించినదే. ప్రభుత్వ వుద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను సైకిల్ కొనుక్కోలేక అద్దె సైకిల్ మీద కాలం వెళ్ళ బుచ్చాను. ఇంకా చెప్పాలంటే కట్నం కింద సైకిల్ ఇచ్చేవారు. బాగా వున్నా వారికి స్వంత ఎడ్ల బండ్లు ఉండేవి. వాటి లో గడ్డి వేసి పైన దుప్పటి పరిచి కూర్చునేవారు. జమీందార్లకు గుర్రాపు బగ్గేలు ఉండేవి. వీటి సమయాల్లో జీవితాలు చాలా సంతోషదాయకంగా ఉండేవి. ఇప్పుడు విమానాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ ఎవరికీ అంత ఆనందం కలగటం లేదు.రచయిత చెప్పినట్లుగా రిక్షా లు ప్రేమికులకు మరింత అనువుగా ఉండేవి. ఇక ఆటోల విషయానికి వస్తే ఆ గూండాగిరి ఇప్పుడూ కొనసాగుతూ వుంది.
ఆపద సమయాలలో ఆటో దోచుకున్నంత గా దోపిడీ మరెక్కడా జరగదు సుమా. మేము కూడా సిటీ లో సిటీ బస్సు ఎక్కువగా వాడే వాళ్ళం. అందులో కొన్ని సార్లు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే వుండే మజా నే వేరు. డబల్ డెక్కెర్స్ లో అయితే పై కి కిందకి మధ్యలో నించుని వాళ్ళం. టికెట్ తప్పించుకొనటానికి .
ప్రస్తుతం తక్కువ ఖర్చుతో సామాన్యుడి ప్రయాణం ఒక కలే . అన్నీ ఫ్రీలు ఇస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా ఫ్రీ చేసేస్తే పీడా పోతుంది.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
మన దేశం లో కాల క్రమేణా మార్పు చెందిన రవాణా వ్యవస్త గూర్చి వ్యక్తిగత అనుభవాలతో , చాలా బాగా విశదీకరించారు రచయిత. ఒకప్పుడు దూరాభారా ప్రయాణాలు కూడా కాలినడకన జరిగేవి. అప్పుడు దారి దోపిడీలు, క్రూర మృగాల తాకిడి కూడా ప్రాణాంతకంగా ఉండేవి. తాను చెప్పినట్లు సైకిల్ యొక్క గొప్పతనం నేను అనుభవించినదే. ప్రభుత్వ వుద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను సైకిల్ కొనుక్కోలేక అద్దె సైకిల్ మీద కాలం వెళ్ళ బుచ్చాను. ఇంకా చెప్పాలంటే కట్నం కింద సైకిల్ ఇచ్చేవారు. బాగా వున్నా వారికి స్వంత ఎడ్ల బండ్లు ఉండేవి. వాటి లో గడ్డి వేసి పైన దుప్పటి పరిచి కూర్చునేవారు. జమీందార్లకు గుర్రాపు బగ్గేలు ఉండేవి. వీటి సమయాల్లో జీవితాలు చాలా సంతోషదాయకంగా ఉండేవి. ఇప్పుడు విమానాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ ఎవరికీ అంత ఆనందం కలగటం లేదు.రచయిత చెప్పినట్లుగా రిక్షా లు ప్రేమికులకు మరింత అనువుగా ఉండేవి. ఇక ఆటోల విషయానికి వస్తే ఆ గూండాగిరి ఇప్పుడూ కొనసాగుతూ వుంది.
ఆపద సమయాలలో ఆటో దోచుకున్నంత గా దోపిడీ మరెక్కడా జరగదు సుమా. మేము కూడా సిటీ లో సిటీ బస్సు ఎక్కువగా వాడే వాళ్ళం. అందులో కొన్ని సార్లు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే వుండే మజా నే వేరు. డబల్ డెక్కెర్స్ లో అయితే పై కి కిందకి మధ్యలో నించుని వాళ్ళం. టికెట్ తప్పించుకొనటానికి .
ప్రస్తుతం తక్కువ ఖర్చుతో సామాన్యుడి ప్రయాణం ఒక కలే . అన్నీ ఫ్రీలు ఇస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా ఫ్రీ చేసేస్తే పీడా పోలుతుంది.
—శ్యామ్ కుమార్. చాగల్
నిజామాబాద్.