అంకెలు మోసం చేస్తాయి అంకెలు మాయం చేస్తాయి డెసిమల్ చుక్క అవతలున్న అంకెకి అర్థం వేరు ఇవతలున్న చుక్క అర్థం వేరు అస్తిత్వం వేరు. అటున్నదీ – ఒకటే ఇటున్నదీ – ఒకటే అధికారం అహంకారం ఆడంబరం అలసత్వం ఇటు అవసరం ఆవేదన ఆక్రోశం అటు. తేడాయే అనంతం.
***
మీరు మావూరోస్తారు అడవుల్నీ ఆవుల్నీ మనుషుల్నీ మందల్నీ అన్నిట్నీ కొనేస్తారు ఆలోచించ మంటారు.. అభివృద్ధి అంటారు ఆశ పెడతారు.. ఆకల్నిపెంచుతారు మాఇళ్ళ మీద మేం చదివే బళ్ల మీద మా పూర్వీకుల సమాధుల మీద ఫేక్టరీలు కడతారు.. పోగాల్ని పండిస్తారు అన్నం పెట్టే చేతుల్ని అడుక్కునేలా చేస్తారు మా ఆస్తుల్నేకాడు అభిమానాన్నీ లారీలతో లాక్కెళ్ళి పోతారు.
పల్లెతల్లి తల్లడిల్లుతుంది కన్నతల్లి కడుపు చించుకుంటుంది వెక్కెక్కి ఏడుస్తూ “వలసపో బిడ్డా వలసపో, బతికిపో” అంటుంది గుండె తలుపులు మూసుకుని గుడ్లనీరు కుక్కుకుంటుంది జ్ఞాపకాల సమాధుల మధ్య ఒంటరిగా నిలుచుంటుంది తీరం దాటినా ‘తరం’మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటుంది
మేము మీ ఊరొస్తాము మీకు మా పనిచేసే చేతులు తప్ప మా ఆకారాలు గుర్తుండవు మీ అధికారాలు తప్ప మా మొహాలు గుర్తుండవు పిలిచేదాకా నుంచోమంటారు మరి మీరు మావూరోచ్చినప్పుడూ? యంత్రాంగమంతా మీముందు భక్తిగా చేతులుకట్టుకుని! మిమ్మల్ని పొగుడుతూ మీకు గులాములౌతూ! మీకోసమే పనిచేస్తుంది మీకాళ్ళకే మొక్కుతుంది క్షణాలమీద మీ పనిమొదలెడుతుంది మావన్నీ గుంజుకున్నాక మా గంజి మట్టిపాలయ్యాక మమ్మల్ని బయటికి నెట్టి మరో ఫేక్టరీకి చోటిస్తుంది మరో అంకెని అ౦బరానికేక్కిస్తుంది మరి మేమూ?
ఇదిగో క్యూలో నిలబడి వున్నాం తలలు వంచుకుని చేతులు కట్టుకుని పనికి పిలవకపోతే తలని చేతుల్లో ఇరికి౦చుకుని. పగలో రాత్రో తెలియని పట్నంలో పొట్టపట్టుకు నిలబడ్డాం. మా వూళ్ళో మేం రైతులం మీ వూళ్ళో కూలీలం రెక్కలు తెగిన పక్షులం దారం వీడిన పతంగులం ఫేక్టరీ సైరన్లే మా గుడి గంటలు ఫేక్టరీ పొగలే మా ఉచ్వాస నిశ్వాసాలు మా నవ్వులు మేం మరిచిపోయాం మా బతుకుల్ని మేమే చిదిమేసుకున్నాం పండగల్లేవు పబ్బాల్లేవు మాదనే చోటు లేదు, మాదనే బతుకూ లేదు. దొరికితే పని.. లేకుంటే పస్తు.
ఆ………….. మీరు బాగానే వుంటారు అక్కర వచ్చినప్పుడు మమ్మల్ని అక్కున చేర్చుకుంటూ అక్కరలేనప్పుడు అవతల పారేస్తూ!
అంకెలు మాయం చేస్తాయి అంకెలు నిజాన్ని నగ్నం చేస్తాయి. ఏ పధకాలకీ మా చిరునామా తెలీదు ఏ యోజన్ మాకోసం యోచించదు. ఆధార్ కార్డున్న నిరాధారులం మేము ఏ లెక్కల్లోనూ వుండం మృత్యువు లెక్కల్లో తప్ప అదీ… అంకెకి అవతలే! అంకెలు మాయ చేశాయి… నిజం మళ్ళీ మమ్మల్ని వెళ్ళగొట్టాయి ఏ ఊరూ పిలవలేదు మా వూరు తప్ప అవునూ మా వూరేదీ సమాదులకి౦ద అగాధాల్లో వున్నా పచ్చని జ్ఞాపకంలా పిలుస్తూనే వుంది…
నడక మొదలైంది దారిలోనే కొన్ని కలలు కట్టేలై రాలిపోయాయి కన్నీళ్ళు కరువై, బతుకు బరువై కీళ్ళు కదలక, కాళ్ళు నడవక ఆశలు అంపశయ్య లయ్యాయి. ఎండిన చెట్లు గాలికి కూలినట్టు కూలిపోతున్నాం.. నేలకివాలిపోతున్నాం వలస కూలీలం వరస కూలీలం కా‘వల’ సినప్పుడొచ్చే ఆకలి కూలీలం. ఆ‘కలి’ ప్రతినిధులం. మాకు తెలుసు మాకోసం ఏ అంబులెన్స్లూ రావు వైద్యులూ రారు.. మా వార్తలూ మీ పత్రికల్లో టీవీల్లో రావు. మా కాళ్ళల్లో ముళ్ళు మా కంట్లో కన్నీళ్ళు.. అవే మా తోడూ అవే మా నీడ. పునాది లేని భవనాల్లా కూలిపోతున్నాం ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాం నదిలో శవాల్లా తేలిపోతున్నాం. మేం పోయేముందైనా మాబిడ్డలకి గుక్కెడు గంజి నీళ్ళు గొంతులో పొయ్యరూ!!! ఎవరక్కడ పాడేదీ ‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం’ అనీ.
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు” అనే పుస్తకాలు వెలువరించారు.
Kannillu pettinchaaru Bhuvanji
Tq బాలాజీ……
ఆర్తి ఆవేదనా కలగలిపి కన్నీరొలికేలా, గుండె చెమర్చేలా ఉంది అనేక గుండెలోతుల్లో ఎండిన గాధలు. వెలకిరాని నిజాలివన్నీ. . ఇలా మీ కలంలో ఇమిడిపోయాయి. ఇక్కడ వొలికి హృదయాన్ని తడి చేసాయి. ప్రణామాలు _/\_ గురువర్యా..
Tq యామినీ
వలసబతుకుల వ్యధ..చాలా బాగా అక్షరికరించారు👌🙏🙏నమోనమః
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™