[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


బ్రతుకు పుస్తకంలో.. ఉద్యోగపర్వం..!!
జీవితంలో బ్రతకడానికి చదువే అక్కరలేదు. చదువుకున్నవాళ్ళు అంతా ఉద్యోగం చేయాలనీ లేదు. అయితే, చదువుకున్నతరువాత, అవసరం అయినా, లేకున్నా, ఉద్యోగం కోసం ప్రాకులాడడం, సాధించడం జరుగుతూనే వుంది.


శ్రీమతి అరుణ ముందస్తు పదవీవిరమణ (ఖమ్మం. 2017)సందర్భంగా మాట్లాడుతున్న రచయిత మరదలు శ్రీమతి రేచెల్ హేమలత
ఇక్కడ ఉద్యోగం విషయం వచ్చేసరికి, కొందరు బ్రతుకు బండిని లాగడం కోసమైతే, మరికొందరికి అదొక హోదా! అందుకోసమే అవసరం అయినవాళ్ళూ, అవసరం లేనివాళ్ళూ కూడా ఉద్యోగాల కోసం ఎగబడడం. అందుచేతనే ఈ త్రొక్కిసలాటలో, నిజంగా ఉద్యోగం అవసరం అయినవాళ్లు ఉద్యోగాలు చేజిక్కించు కోలేకపోతున్నారు, అది వేరే విషయం.


అక్క(అరుణ) చెల్లెళ్ళు (హేమ)
కనుక మామూలుగా ఆలోచించిస్తే విద్యావంతుడైన/విద్యావంతురాలైన వ్యక్తి జీవితంలో ‘ఉద్యోగ పర్వం’ అతి ముఖ్యమైనదని చెప్పక తప్పదు. చదివిన చదువు ఒకటైతే (వృత్తి విద్యలు పక్కన పెడదాం) ఉద్యోగ సాధనలో ఎన్ని కష్టాలో, ఎన్ని ప్రయోగాల్లో చెప్పలేము, అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.


2011లో రచయిత పదవీ విరమణ (కరీంనగర్)


అభినందిస్తున్న స్టాఫ్
ఉద్యోగ పర్వంలో, రెండు ముఖ్యమైన (రోజులు) విభాగాలు ఉంటాయి. మొదటిది ఉద్యోగంలో చేరే మొదటి రోజు, రెండవది ఉద్యోగ కాలం (వయసును బట్టి) పూర్తి చేసుకుని, ఉద్యోగ విరమణ చేసే రోజు. ఈ రెండు రోజులూ దేనికవే ప్రత్యేకమైనవి. ఉద్యోగంలో చేరే రోజు చాలా సంతోషం కలిగించే రోజు. ఉద్యోగానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి మంచి చెడ్డలు ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అన్న విషయాలు అప్పుడు మదిలో మెదలవు. కష్టపడి సంపాదించుకున్న వస్తువేదో చేతిలో పడ్డంత ఆనందం ఉంటుంది. తర్వాత దినసరి అనుభవాలు ఒక్కొక్కటి తెలిసి వస్తాయి. ఇతర సహోద్యోగుల మనస్తత్వాలు తెలుస్తాయి.


రచయిత చిన్నన్నయ్య డా. మధుసూదన్ (విశాఖపట్నం) పదవీవిరమణ లో శ్రీ శివారెడ్డి గారు
జీతాలు, కొత్త సంవత్సరంలో ఇంక్రిమెంట్లు, సంవత్సరానికోసారి సెలవులు అమ్ముకోవడాలు, అధికారుల కోపతాపాలు, అభినందనలు, రెండు సంవత్సరాలకొకసారి కుటుంబానికి విహార యాత్రలు, మధ్యలో ఊహించని రీతిలో బదిలీలు, దాని కోసం రకరకాల పైరవీలు, వీటికితోడు తమ ఉనికిని చాటుకునే దినపత్రికల స్టింగర్లూ, ఇలా ఉద్యోగంతో పాటు ఇవన్నీ మనతో కలసి నడుస్తాయి. ఇందులో, ఆనందాలు,నిరాశలు సంతోషాలు, సంతృప్తులు మనల్ని పెనవేసుకుని నడుస్తాయి. ఈలోగా వయసు 58/60 వచ్చేస్తుంది. సత్ప్రవర్తన గలవారు, అదృష్టవంతులు అతి తెలివిగలవాడు, ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోకుండా, హాయిగా, ఆనందంగా, గర్వంగా, సగౌరవంగా బయటపడతారు. అదే సంతోషకరమైన పదవీ విరమణ.


రచయిత పెద్దక్క కానేటి మహానీయమ్మ (నాగార్జునసాగర్) పదవీవిరమణ
పదవీ విరమణ చేసే సమయానికి ఎక్కువ శాతం మంది ఉద్యోగులు తాము నిర్వర్తించే వలసిన బాధ్యతలు అన్నీ సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. అంటే, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వాళ్ళ సెటిల్మెంట్లు, స్వంత ఇళ్లు కట్టుకోవడాలు వగైరా అన్న మాట!


రచయిత మరదలు శ్రీమతి రేచెల్ హేమలత పదవీవిరమణ
కొంతమందికి బాధ్యతలు తీరవు. ఈ కేటగిరీవాళ్ళలో భవిష్యత్తును గురించి ఆలోచించకుండా కొంచెం కూడా పొదుపు చేసుకోకుండా, పదవీ విరమణ తర్వాత ఇబ్బంది పడేవాళ్ళూ, ఎక్కువ కుటుంబ బాధ్యతలు వుండి, సమస్యలతో సతమత మయ్యేవాళ్ళు వుంటారు.


హేమలత దంపతులతో రచయిత దంపతులు
పదవీ విరమణ తర్వాత ఆనందంగా విశ్రాంత జీవితం గడపగలిగేవారు కొందరు, ఇబ్బందులతో నలిగిపోయేవారు కొందరు. పదవీవిరమణ వల్ల లభించే సొమ్మును పంచుకునే విషయంలో పిల్లలు చేసే అల్లరికి మనశ్శాంతిని కోల్పోయే తల్లిదండ్రులు కొందరు. తల్లిదండ్రుల వల్ల, వారి ఉనికి వల్ల అసహనంగా వుండే పిల్లలు, ఆఖరి అస్త్రంగా తల్లిదండ్రులను, వృద్దాశ్రమాలకు పంపడాలు, ఇవన్నీ పదవీ విరమణ తర్వాత ఎదురయ్యే సమస్యలు. పిల్లల సంరక్షణలో ఆనందంగా బ్రతుకు వెళ్లదీస్తున్నవాళ్లూ లేకపోలేదు. అలాగే పిల్లల ఆలోచనలకు భిన్నంగా స్వయంగా వృద్ధాశ్రమాలు ఎంచుకుంటున్న తల్లిదండ్రులు కూడా వున్నారు.


రచయిత అమ్మాయి (నిహార) పిల్లలతో హేమలత దంపతులు
పదవీ విరమణ చేసే వరకూ బ్రతికి ఉండడం దేవుడిచ్చిన వరం. అలాగే తమ తమ సమకాలికులు, బంధువుల పదవీ విరమణ చూడగలగడం ఇంకా అదృష్టం అని నా నమ్మకం. నాకు కొంతలో కొంత ఈ అదృష్టం దక్కింది. హైద్రాబాదులో పెద్దన్నయ్య, నాగార్జునసాగర్‌లో పెద్దక్క, విశాఖపట్నంలో చిన్నన్నయ్య, సికింద్రాబాద్‌లో చిన్నక్క, ఖమ్మంలో నా శ్రీమతి పదవీ విరమణలు చూసే అవకాశం నాకు దక్కింది. నేను 2011లో పదవీ విరమణ చేసి, నా కుటుంబం సంరక్షణలో ఇప్పటివరకూ హాయిగా వున్నాను.


హేమలత పదవీవిరమణలో ఎస్.బి.ఐ. మేనేజింగ్ డైరెక్టర్ సన్మానం చేస్తున్న దృశ్యం.
ఈమధ్య, అంటే జూన్ 30 న, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌గా నా మేనకోడలు /మరదలు, శ్రీమతి రేచల్ హేమలత పదవీ విరమణ కూడా హైదరాబాద్‌లో జరిగింది. సుల్తాన్ బజార్ లోని ముఖ్య కార్యాలయం కార్పొరేట్ కార్యాలయాలకు మించి వుంది. ఒకే రోజు 17 మంది పదవీ విరమణ చేసిన వారిని ఘనంగా సత్కరించారు. అందులో నా మరదలు కూడా వుంది. ఈమె పదవీ విరమణ నాకు కొంచెం ప్రత్యేకమే! హేమలత నాకు మేనకోడలు, తర్వాత మరదలు అయింది. చిన్నప్పటి నుంచి ఈమె నాకు తెలుసు. నా కళ్ళముందు ఎదిగి విద్యా పర్వం పూర్తి చేసుకుని, పెళ్ళి చేసుకుని, ఉద్యోగం సంపాదించి ఒక కుమారుడికి తల్లి అయి, నా కళ్ళముందే పదవీ విరమణ చేయడం భగవంతుడు నాకు కల్పించిన గొప్ప అవకాశంగా నేను భావిస్తాను.
ఏది ఏమైనా మన గతం, వర్తమానం, అలాగే భవిష్యత్తు తీర్చి దిద్దుకునే అవకాశం చాలామట్టుకు మన చేతిలోనే ఉంటుంది.
మన జీవనశైలి, పిల్లల్ని పెంచే విధానం మంచైనా, చెడైనా, పిల్లల మీద తప్పక ప్రభావం పడుతుంది. అదే చివరి రోజుల్లో మన మీద ప్రయోగింప బడుతుంది. దేనికైనా మనం బాధ్యత వహించవలసిందే!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
20 Comments
sagar
మీరన్నట్లు పదవీ విరమణతో పాటు తోటివారి పదవీ విరమణలను చూసి ఆనందించడం అదృష్టమే. ఆ అదృష్టం పొందిన మీకు శుభాకాంక్షలు. మరియు మంచివ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
ధన్యొష్మీ.
ggmbabu@gmail.com
ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక అతిముఖ్యమైన అంశం ….. పుట్టిన తరువాత గిట్టడం ఎంత సత్యమో ఉద్యోగంలో చేరిన తరువాత ఎప్పుడోఒకప్పుడు విరమణ తప్పదు ……. మీ వ్యాసంలో మనం ఉద్యోగబాధ్యతలతో బాటు వ్యక్తిగతమైన బాధ్యతలను కూడా పూర్తిచేసుకోవాలన్న మంచి సూచన చేశారు , బాగుంది ” ఉద్యోగo పురుష లక్షణం ” అన్న మాట ఒకటుంది , ఇక్కడ ‘ పురుష ‘ అంటే కేవలం మగవాళ్లేనేమోనని చాలామంది భ్రమపడతారు , పౌరుషమున్న ప్రతి వ్యక్తీ స్త్రీలైనా , మగవారైనా పురుషులే …… దాన్ని కాలక్రమంలో మార్చిపారేశారు ….. ప్రతి మనిషీ తాను ఉద్యోగించే కాలంలోనే తనకుటుంబబాధ్యతలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసుకోగలిగితే మీరన్నటు విరమాణానంతర జీవితం సుఖవంతంగా సాగిపోతుంది , కాకపోతే ఒకళ్ళిద్దరి జీవితాల్లో కొన్నికారణాలవల్ల అది సాధ్యంకాకపోవచ్చు కాని , ప్రతి ఉద్యోగి ఈ విషయంలోమాత్రం జాగ్రత్తగానే ఉండాలి .. వ్యాసం చివర్లో మాంఛి సూచనలాంటి ఒక హెచ్చరికకూడా చేశారు అది అక్షరసత్యం , ప్రతివ్యక్తీ తన జీవనశైలి తన పిల్లలకు ఆదర్శంగా ఉండేటట్టు మలచుకోవాలి . లేని పక్షంలో దాని ఫలితం వృద్ధాప్యంలో కనిపిస్తుందన్న మాట నిజమే ! సందేహపడాల్సిన అవసరమేలేదు .. చక్కని సూచనలతో మంచి వ్యాసం అందించారు డాక్టర్ గారూ ! అభినందనలు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
గురువు గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
Shyam kumar chagal
ఆ రోజుల్లో, ఉద్యోగం సంపాదించు కోవటమే జీవితపు ముఖ్య ఉద్దేశంగా ఉండేది. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అంటే మరీను.
ఉద్యోగపర్వంలో మనము ఎదుర్కొనే ప్రతి విషయాన్ని రచయిత గారు చాలా జాగ్రత్తగా ఎత్తిచూపారు. భావోద్వేగాలు రాగద్వేషాలు కోపాలు తాపాలు అలకలు న్యాయ అన్యాయాలు సుఖదుఃఖాలు ఓటమి విజయాలు అన్నిటినీ ఎదుర్కొంటూ చివరకు పదవీ విరమణ అన్నది బాధాకరమైన సంఘటన అని చెప్పాలి. ఉద్యోగ విరమణ తర్వాత అసలు జీవితం అన్నది మనకు మొదలవుతుందని వ్యక్తిగత అనుభవంతో తెలుసుకున్నాను.
సరైన ప్రణాళిక ఉన్నవాళ్లు పదవీ విరమణ తర్వాత సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు అనేది చేదు నిజం. ఆ సమయంలో కన్నపిల్లలతో, మనుమలు మనుమరాండ్లతో బంధుమిత్రులతో గడపడం అదృష్టంగా భావిస్తాను.
డాక్టర్. కి ఎల్వి ప్రసాద్ గారు అన్నట్లుగా కొందరు పదవీ విరమణ తర్వాత వృద్ధాశ్రమంలో గడపడం దురదృష్టకరం.
సాహితీ ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత ఏ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్లినా దాదాపుగా అందరూ పదవీ విరమణ చేసిన వారు లేదా ఆ వయసు వారు మాత్రమే కనబడుతున్నారు.
పదవి విరమణ అన్నది ప్రభుత్వం వారు ఏర్పరిచిన ఒక మైలురాయి మాత్రమే. సంతోషాలకి అది విరమణ కాదు.
మంచి విషయాన్ని మన మధ్య ప్రస్తావన కు తెచ్చిన
డాక్టర్ కె ఎల్ బి ప్రసాద్ గారికి నా యొక్క ధన్యవాదములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమా చాలా గొప్పగా స్పండించావు.
ధన్యవాదాలు.
sunianu6688@gmail.com
చదువుతున్నంతసేపూ చాలా హాయిగా అనిపించింది మనసుకి sir. ఆత్మీయుల మధ్యలో రిటైర్మెంట్ అవ్వడం కన్నా ఆనందదాయకం ఏమి ఉంటుంది. పదవీ విరమణ రోజు కొంచెం భాధ గా వున్నా ప్రస్తుతకాలంలో బ్యాంక్ ఉద్యోగులలో అధిక పనీ ఒత్తిడి కారణంగా అనందం గానే రిటైర్మెంట్ అవుతున్నారు అనిపిస్తుంది. మీ మరదలు గారికి మా పాఠకుల తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేయండి. రచయత శ్రీ Dr KLV ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు


డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా మీకు
కృత జ్ఞత లు.
Bhujanga rao
ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఉద్యోగంలో చేరిన ప్రతి వారికి విరమణ తప్పదు.మీరన్నట్టు ప్రతి ఒక్కరూ ఉద్యోగం అధికారం అనే భావన కాకుండా,బాధ్యతను గుర్తించి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రణాళికాబద్దంగా పూర్తిస్థాయిలో చేసుకోగలిగితే పదవి విరమణ తరువాత జీవితం సుఖమయమవుతుంది. చివరగా మంచి మాట చెప్పారు సర్.మన జీవన శైలి,పిల్లలను పెంచే విధానంలో మంచైనా, చడైన పిల్లల మీద తప్పక ప్రభావం పడుతుంది.అదే చివరి రోజుల్లో మన మీద ప్రభావం పడుతుంది. చాలా మంది బంధువులు మరియు స్నేహితుల పదవి విరమణ కార్యక్రమాన్ని చూడడమే కాకుండా కొన్ని సందర్భాలలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఆనందించిన మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
ప్రతి ఉద్యోగికి జీవితంలో మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు ఉంటాయి. మీకు అన్ని మధుర జ్ఞాపకాలే ఉన్నట్టున్నాయి.
నాకు ఉద్యోగం ప్రయత్నించకుండానే దొరికింది. కాని నేను ఆ ఉద్యోగం వదిలి పెట్టి విశ్వవిద్యాలయంలో ఉద్యోగం సంపాదించడానికి మాత్రం కొంచెం కష్టపడ్డాను.
మా పిల్లలు అందరు నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నారు. కాబట్టి పదవీ విరమణ తర్వాత నాకెలాంటి సమస్యలు లేవు.
మీ అనభవం బాగుంది.
శుభం ఆశాసే.
జనార్దనరావు
రసాయన శాస్త్రము
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవనం అందంగా తీర్చి దిద్దుకోవడానికి ఉద్యోగ జీవితంలో ఒక ప్రణాళిక అవసరం.మీరన్నట్టు ఎన్నో రకాల జీవితాలు పదవీ విరమణ తర్వాత అనేక విధాలుగా ఉంటాయి.స్వీయ క్రమశిక్షణ తో మీలా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వారికి ఆ కాలమంతా నల్లేరు మీద నడకే.ఇతరుల పదవీ విరమణ చూసి ఆనందించే సమయం దక్కడం కొంత భగవంతుని దయ అయితే చాలా వరకూ చక్కని జీవనవిధానాన్ని ,నిత్య నూతన వ్యాపకాలను పెట్టుకోవడం,నిర్మల మనస్సుతో ఉండడం,అన్నింటికీ మించి ఆరోగ్యాన్ని కాపాడుకొని పిల్లలకు బలంగా మారడం అనేవి ముఖ్యమని వివరించిన మీ జ్ఞాపకం చాలా బావుంది సర్.శ్రీమతి హేమలత గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు సర్



—నాగ జ్యొతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా…ధన్యవాదాలు
Rajendra Prasad
Job or business being a lively hood is an important part in life. You explained it with your experience that reminded us of our own sir!
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you prasad garu.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఉద్యోగంలో చేరినరోజే మనం ఎప్పుడు విరమణ చేస్తమో తెలుస్తుంది.జాతస్యహి ధృవో మృత్యుః వలె.
ముక్కుసూటిగా ఉద్యోగంచేసిన వారికి ఉద్యోగవిరమణ విచారాన్నివ్వదు అనుకుంటున్న. అయ్యో ఇఅంకో నెలో రెన్నెల్లో వుంటే మరింత డబ్బు సంపాదించుకుని వుండేవాడినికదా అను కునేవారికే ఉద్యోగవిరమణ దుఃఖాన్ని కలుగచేస్తుంది. మీవృత్తిచాలా పవిత్రమైన వృత్తి.మీతో సేవలపొందిన వారు మిమ్మల్ని బాగావగుర్తు పెట్టుకుంటారు . .public contact ఉండే ఏఉద్యోగంలో సేవాభావంథో పనిచేసేవారిని జనం గుర్తుంచుకుంటరు అని నా భావన. అట్లా నా ఉద్యోగంలో 36న్నర ఏండ్లు ఉద్యోగించిన. కాని ఎక్కడా నాబాధ్యతనుమరవకుండా నిర్వర్తించే అవకాశమే నాకు కలిగింది.నేను ఎలక్ట్రిసటే రెన్యూ విభాగంలో పనిచేసేటప్పుడు ప్రజలతో సంబంధాలుండేవి.చాలామంది వినియోగదారులు వారి సర్వీస్ నంబర్లతో గుర్తుండేవారు.
ఉద్యోగి పదవీ విరమణచేస్తుంటే ఆ ఉద్యోగంతో సంబంధంఉన్న ప్రజలువిచారిస్తే వాడు మంచి ఉద్యోగి అనే నేను భావిస్త.మీ అదృష్టవశాత్తూవమీరు అట్ల పదవీ విరమణ చేయగలిగినారు అభినందనలు.నేనువపదవీ విరమణ చేసి 25 ఏండ్లయింది..అయినా కొంత మంది ఇంకా గుర్తుంచుకొని మాట్లాడతుంటరు. మనం విరమణ చేసినాక అరే ఆయన రిటైరయినాడా అని అనుకోవాలె కాని వాడా మంచిదయింది రిటైరయిండు అనుకోకూడదు.
మరొకమారు అభినందనలతో
—రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు ధన్యవాదాలండీ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 170 లో… ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరేటప్పుడు ఎంతో సంతోషపడతాడు. ఉద్యోగ నిర్వహణలో ఎన్నో కష్టాలు పడతాడు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, సహ ఉద్యోగులు సృష్టించే అనవసరమైన సమస్యలు..ఇలా ఎన్నో బాధలు. మీరు చెప్పినట్టుగా ఏ చిక్కులు చికాకులు, ఆరోగ్య సమస్యలు లేకుండా పదవీవిరమణ చేయడం భగవంతుడు ఇచ్చిన వరమే. సింగరేణిలో ఎందరో రిటైరైన కార్మికులు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ డబ్బులు పిల్లలు బలవంతంగా లాక్కుని, వీధుల పాల్జేస్తున్నారు. దయనీయమైన పరిస్థితి. చక్కటి కథనం. అభినందనలు.
——జి శ్రీనివాసాచారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు .