[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


లైఫ్ సర్టిఫికెట్..!!
మనిషి సజీవంగా వున్నా, బ్రతికివున్నట్టు కొన్ని సందర్భాలలో నిరూపించుకోవాలి. నిరూపించుకోవడానికి అనేక మార్గాలు. భౌతికంగా మనిషి కంటికి కనిపిస్తున్నా, అధికారికంగా నిరూపించుకోవాల్సిన సందర్భాలు కొన్ని మనకు జీవితంలో ఎదురవుతాయి. మనిషి ఆరోగ్యంగా వుండి, జీవించే వున్నాడని, ప్రభుత్వ వైద్యుడు నిర్ధారణ ధ్రువపత్రం ఇవ్వాలి. దాని కోసం ఆయన చుట్టూ తిరగాలి. ఆయన కరుణించినప్పుడు ఆ పత్రం తీసుకోవాలి. ఉచితంగా పొందాలంటే తొంబై తొమ్మిది ప్రశ్నలు ఎదుర్కోవాలి. సమర్పణలు జరిగితే ధ్రువపత్రం క్షణాల్లో వెలుగు చూస్తుంది. అలా అని అందరూ అలా వున్నారని చెప్పలేము. ఒక బాధ్యతగల ప్రభుత్వ దంతవైద్యుడిగా నేను గమనించిన విషయం ఇది.
అదృష్టావశాత్తు, దంతవైద్యుడు, లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అర్హుడు కాదు. ఇకపోతే, ఉద్యోగ విరమణ జరిగిన తర్వాత, ఉద్యోగపర్వంలోని చివరి భాగం ‘పెన్షనర్’ పాత్రతో ప్రారంభం అవుతుంది. పదవీ విరమణ చేసిన ప్రతి ఉద్యోగి, ప్రతి నెల పెన్షన్ పొందాలంటే, సంవత్సరానికోసారి తప్పని సరిగా తాను బ్రతికి ఉన్నట్టు, ఋజువు పత్రం పత్రం సమర్పించాలి. మొదట్లో ఇది తప్పనిసరిగా బౌతికంగా సంబంధిత కార్యాలయంలో హాజరై, ప్రభుత్వ వైద్యుడు ధ్రువీకరించిన ఋజువు పత్రం సమర్పించవలసి ఉంటుంది. అది కొన్నాళ్ళు కొనసాగింది. తర్వాత ‘సెల్ఫ్ డిక్లేరేషన్’ పద్ధతి (స్వయంగా -బ్రతికి ఉన్నట్లు హామీ పత్రం ఇవ్వడం) కొనసాగింది. తర్వాత ఈ పద్ధతిని ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. అసలు వ్యక్తిగతంగా కార్యాలయంలో హాజరు కానక్కర లేకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, ఇంటి నుండే ధ్రువపత్రం సమర్పించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఇది సర్వహంగులు వున్న మొబైల్ ఫోన్ ఆవిష్కరణతో సుసాధ్యమయింది.
అయితే ఇది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోలేని సామాన్యులకు కాస్త ఇబ్బందిగానే మారింది. అలాంటి వారికి, ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రభుత్వం కలుగజేసింది. అయితే ఈ రోజున ఎక్కువ శాతం ప్రజలు మొబైల్ ఫోన్ వినియోగిస్తుండడం మూలాన వారికి కనీస సాంకేతిక పరిజ్ఞానం ఉండడం వల్ల లైఫ్ సరిఫికేట్ సమర్పించడం సులభతరమైంది. స్వయంగా ఎక్కువమంది ఈ పద్ధతిని వినియోగించుకుంటున్నారు.
తర్వాత పుట్టిన రోజుల గురించి కొంచెం చెప్పాలి. అదేంటి, ఈ లైఫ్ సర్టిఫికెట్‌కు సంబంధం ఏమిటని, చాలామందికి ఆశ్చర్యంతో కూడిన ప్రశ్న మనసులో ఉదయించవచ్చు. దానికి సరైన సమాధానం ఈ వ్యాసం చివరికంటూ చదివిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కాస్త సంయమనం పాటించండి మరి!
మా చిన్నప్పుడు, పుట్టిన రోజుకు ఈ రోజుల్లో ఉన్నంత హడావిడి ఉండేది కాదు. మహా అయితే కొత్త బట్టలు, తినడానికి పాయసం వగైరా. హంగులూ, హంగామాలు పట్టణాలకు మాత్రమే పరిమితం అయి ఉండేవి. ఇప్పుడు గ్రామాలలో సైతం వారి వారి స్థాయిని బట్టి, పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఘనంగా పుట్టిన రోజు పండుగలు జరుపుకోవడం మొదలుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు ఆర్భాటాలు అనుకరించడం మొదలు పెట్టారు. దీనికి తోడు గిఫ్టులు, రిటర్న్ గిఫ్టుల సంప్రదాయం ఒకటి ఈ మధ్య కాలంలో అంటువ్యాధిలా వ్యాపించింది.
నా మట్టుకు నాకు పెళ్ళై, నా శ్రీమతి నా జీవితంలోకి ప్రవేశించేవరకూ నా పుట్టినరోజుకు పెద్దగా ప్రాధాన్యత లేదు. తర్వాత, ప్రతి పుట్టినరోజుకు కొత్తబట్టలు, కేక్ కటింగులు, ప్రత్యేక భోజనాలూ తప్పనిసరి అయినాయి. నాకు ఇష్టం లేకపోయినా ఇంటి వాళ్ళ కోసం తలవంచక తప్పడం లేదు.
ఇక నా మనుమల స్థాయి వచ్చేసరికి సంబరాల స్థాయి పెరిగిపోయింది. నెలవారీ పుట్టినరోజులు కూడా మొదలు అయ్యాయి. ‘నలుగురితో నారాయణ’ అన్న పద్ధతిగా మారిపోయింది.
అయితే కరోనా కాలంలో నాలుగు గోడల మధ్య బంధింపబడిన అనుభవాల నేపథ్యంలో, ఏదో ఒక రూపంలో మనకు ఆత్మీయ కలయికలు అవసరం ఏమో అనిపిస్తున్నది. సందర్భం లేకుండా నలుగురూ ఒకచోట కలిసే అవకాశం లేదు కదా! ప్రస్తుత శుభకార్యాలన్నింటిని అలా సమర్ధించుకోక తప్పడం లేదు.
ఈ మధ్య (సెప్టెంబర్ 12, 2023) నా శ్రీమతి పుట్టిన రోజు, సికింద్రాబాద్ (సఫిల్ గూడ) లోని, నా కూతురు ఇంట్లో జరుపుకోవడం జరిగింది. హన్మకొండలో వుంటే మేమిద్దరమే ఉండేవాళ్ళం. ఇక్కడ, కూతురు, అల్లుడు, మనుమరాలు, మనుమడు ఉండడం వల్ల మాకు చాలా సంతోషంగానే గడిచింది. మేము ఒంటరిగా లేము అన్న భరోసా ఏర్పడింది.


శ్రీమతి అరుణ పుట్టినరోజు సంబరం


రచయిత లైఫ్ సర్టిఫికెట్
ఎట్లాగూ అబ్బాయి అమెరికాలో (బోస్టన్) మాకు దూరంగా ఉంటున్నాడు. కనీసం కూతురి సంరక్షణలో గడపగలుగుతున్నామన్న తృప్తి మిగులుతున్నది. నా శ్రీమతి పుట్టినరోజు హడావుడి ముగిసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే, ఈ వయస్సులో పుట్టిన రోజు పండుగ తప్పనిసరిగా జరుపుకోవాలి. మన కోసం కాకపోయినా, మన రక్త సంబంధీకుల కోసం, బంధు మిత్రుల కోసం. ప్రతి సంవత్సరం వీళ్ళందరికీ మన లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినట్లుగా ఉండాలి. మేము ఇంకా బ్రతికే వున్నాం అని చెప్పినట్టు ఉండాలి, అందుకే పుట్టినరోజు పండుగ తప్పక జరుపుకోవాలి!


కూతురు, మనుమలతో శ్రీమతి అరుణ
ఇది లైఫ్ సర్టిఫికెట్తో సమానమే కదా! అది అధికారుల కోసం, ఇది మన ఆత్మీయుల కోసం. ప్రస్తుతం వయసు మళ్లినవారి పుట్టినరోజుకు, లైఫ్ సర్టిఫికెట్‌కు వున్న సంబంధం ఇదే..!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
18 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఇప్పటికీ నాచేత జ్ఞాపకాల పందిరి 180 ఎపిసోడ్లు రాయించిన,సంచిక సంపాదక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు.
—–డా కె.ఎల్.వి.ప్రసాద్.
sagar
మీరు మొదలే చెప్పినట్లుగ చివరివరకు వేచిచూశాక వచ్చిన ముగింపు చాలా అద్భుతం. జీవితంలో అష్టైశ్వర్యాలు అనుభవిస్తేనే ఆనందం కాదు. మన వెసులుబాటును బట్టి మనం బ్రతకడం కూడా అవసరం. అందులో బాగమే ఈ పుట్టినరోజు వేడుకలు లాంటివి. ఇక మీరన్నట్లు లైఫ్ సర్టిఫికెట్ కూడా. అరుణమేడంగారికి మరోసారి శుభాకాంక్షలు. మంచిఐవ్యాసం అందించిన మీకు ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీకు కృత జ్ఞత లు
Shyamkumar Chagal
పుట్టినరోజు జరుపుకోవడం అన్నది చాలా ఆనందకరమైన సంఘటనగా నేను భావిస్తాను.
నిజానికి మనం ఏ రోజు పుట్టాము, ఎప్పుడు పుట్టాము మనకు తెలియదు. మన తల్లిదండ్రులు చెప్పిందాన్ని బట్టి అది మన అందరికీ తెలుస్తుంది.
మనిషికి స్వయంగా మరణం సంభవించే సమయంలో తాను మరణిస్తున్నాడని విషయం అర్థం అవుతుందేమో కానీ జన్మించే సమయంలో ఆ విషయం ఎవరికీ తెలియదు.
చిన్నతనంలో పుట్టినరోజు సంబరాల గురించి ఎన్నో రోజులు ఎదురు చూసే వాళ్ళం. వివాహం జరిగిన తర్వాత మ్యారేజ్ డే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల బర్త్ డేలు వగైరాలతో మన కాలం గడిచిపోయింది.
నా బావమరిది తన పుట్టినరోజు నాడు కొత్త చెప్పులతో సహా అన్ని కొత్తవి ధరించేవాడు.
ఇక మా బావగారు అయితే తన పుట్టినరోజు నాడు తప్పనిసరిగా తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవారు.
కొందరు వృద్ధాశ్రమాలకు వెళ్లి స్వీట్లు, గిఫ్ట్‌లు ఇచ్చి వస్తుంటారు. మరికొందరేమో తమకు నచ్చిన గుళ్ళకు వెళ్లి పూజలు చేస్తుంటారు.
ఇంకా కొందరేమో ఆ రోజుకి సరిగ్గా తమకు నచ్చిన ప్రదేశంలో గడపడానికి వెళ్ళిపోతుంటారు.
మనలో చాలామంది వాళ్లకు తోచినట్లుగా పుట్టిన రోజు జరుపుకోవడం చూస్తున్నాం.
పుట్టినరోజుని తాను జన్మించిన సొంత ఊరిలో, ఆ ఇంటిలో తల్లిదండ్రుల చెంత పిల్లలతో కలిసి గడపడం అన్నది చాలా బాగుంటుంది.
ఇక ఈ లైఫి సర్టిఫికెట్ అనే ప్రహసనం ప్రభుత్వ ఉద్యోగులందరికీ చిరపరిచయమే. దానిలో ఉండే సాధకబాదకాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. పదవీ విరమణ తర్వాత కలిగే ఎన్నో కష్టాలలో ఇబ్బందులలో అది కూడా ఒకటి. ఏం చేద్దాం తప్పదు మరి.
ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా నమస్సులు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు
మిత్రమా…..!!
డా కె.ఎల్.వి.ప్రసాద్
పుట్టినరోజు వేడుకకు , లైఫ్ సర్టిఫికెట్ కి లింక్ పెట్టి డాక్టర్ కే ఎల్ వి గారు ఈ వారం అందించిన జ్ఞాపకాల శీర్షికలోని ఈ భాగం సర్వసాధారణ విషయమే అయినప్పటికిని, కొంచెం ఆసక్తికరంగా ఉంది. మీరన్నట్లు మనవళ్లు ,మనుమరాండ్ల పుట్టిన రోజు సందర్భంగా వారితోనే కేక్ కట్ చేయించే మనమే , ఆ పనిని మన చేతుల మీదుగా చేసి… ‘హ్యాపీ బర్త్‌డే టూ యు డాడీ.. మమ్మీ” అని చెప్పించుకొనే సందర్భం ,ముఖ్యంగా మన తరం వారికి కొంచెం ఇబ్బందికరమైనప్పటికిని, మరువలేని ఒక మధురానుభూతి.
ఆధునిక సమాచార వ్యవస్థ విరివిగా లభించే ఈ రోజులలో ,ఎక్కడెక్కడో ఉంటున్న బంధు మిత్రులందరికీ ఈ సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం , పరామర్శించే సౌలోభ్యం ఉండటం వలన ఇటువంటి ఆర్భాటాలకు ఈ మధ్యకాలంలో కొదువ లేదనుకోండి .
మ్యారేజ్ సర్టిఫికెట్ కి తాళి కట్టే సన్నివేశం యొక్క ఫోటో ఎలా ఆధారమవుతుందో, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు , రాయితీలు పొందే వ్యక్తులందరికీ ,కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో చేసుకునే పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా ఒక ప్రామాణికము క్రింద పరిగణించినా , ఆశ్చర్య పడవలసిన పనిలేదేమో!
—-బి.రామకృష్ణా రెడ్డి
సికిందరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు రెడ్డి గారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజమే సర్ …. పుట్టిన రోజు లైఫ్ సర్టిఫికెట్ లాంటిదేనేమో!
అందుకే అడిగాను ఏంటి స్పెషల్ అని 12-9-2023 తేదీ చూసి…. మేడం అరుణ గారికి శుభాకాంక్షలు తెలియజేయండి సర్! ఆలస్యంగా అయినా సరే!
—-సుగుణ.అళ్లాణి
హైద్రాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మేడం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రెండు లైఫ్ సర్టిఫికెట్లు బాగుంది, జ్ఞాపకాల పందిరి వ్యాపకాల పందిరి లాగా. ధన్యవాదాలు సార్.
—–శ్రీ భక్తవత్సల రెడ్డి
తిరుపతి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
పుట్టిన రోజును పండుగ లాగ జరుపుకోవడం అంటే ఆరోగ్యాన్ని పెంచుకోవడమే. ఆనందం ఆరోగ్యాన్ని పెంచుతుంది.
—–ప్రొ.జనార్ధన రావు
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యొస్మీ సర్
N.Bhujanaga Rao
పెన్షన్ పథకాల ప్రయోజనాన్ని పొందుతున్నట్లైతే, ఆ ప్రయోజనం పొందడానికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం చాలా ముఖ్యం. పుట్టినరోజుకు లైఫ్ సర్టిఫికెట్ కి లింక్ పెట్టి డాక్టర్ గారు ఈ వారం అందించిన జ్ఞాపకాల పందిరి 180 వ సంచిక చాలా ఆసక్తికరంగా ఉంది. అరుణా మేడం గారికి పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలుపుతూ,మంచి విషయాలు అందించిన డాక్టర్ గారికి అభినందనలు మరియు ధన్యవాదములు,
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు
భుజంగరావు గారూ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Birthday celebration and life certificate guruchi chakkaga chepparu annaya garu .
—mrs.Jaya Alexander
Safilguda.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా…
కృత జ్ఞత లు మీకు.
Jogeswararao Pallempaati
అద్భుతంగా చెప్పారు, డాక్టర్ గారూ, పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలో! అర్థవంతంగా అనిపించింది, మీ ఆలోచన! నేను ఫేస్బుక్ లో “మీ ఇంటి గొప్ప పండుగ … మీ పుట్టినరోజు పండుగ” అనే దీవిస్తాను!
మీ జీవిత భాగస్వామికి మా అందరి తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు, డాక్టర్ గారూ!