భారతదేశాన్ని పూర్తిగా గెలవాలంటే ముందుగా బలమైన భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నారు, మన దేశంలో సామ్రాజ్యం స్థాపించి స్థిరనివాసం ఏర్పరచుకోవాలని చూసిన విదేశీయులు. ముఖ్యంగా బ్రిటీష్ పాలకులు డివైడ్ అండ్ రూల్ పాలసీతో మెల్లమెల్లగా మన సంస్కృతీ సంప్రదాయాలను మరీ ముఖ్యంగా భారతీయ విద్యావిధానం, కుటుంబ వ్యవస్థ, నైతికవిలువలు మీద దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాతిపదికన ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేసారు ప్రత్యక్షంగా పరోక్షంగా. చివరికి స్వతంత్ర భారతాన్ని వీడి వెళ్తూవెళ్తూ కూడ బ్రిటీష్ వారు ఈ దేశంలో విషబీజాల్ని వెదజల్లి వెళ్లారు. మనవారి అమాయకత్వమో, అజ్ఞానమో కానీ, దూరదృష్టి లేకుండా చేసుకున్న చట్టాలు, విధివిధానాల వల్ల అనేక కష్టనష్టాలను చవిచూసాం.
ప్రపంచీకరణ పేరిట శరవేగంగా చొచ్చుకువస్తున్న సామ్రాజ్యవాద సంస్కృతి భారతదేశపు పట్టుగొమ్మలై నిలిచివున్న సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేసే ప్రక్రియ మొదలైంది. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనేదానికి ప్రపంచానికే తలమానికంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని సామ్రాజ్యవాద విష సంస్కృతి దెబ్బతీయాలని చాపక్రింద నీరులా ప్రయత్నిస్తోంది. నగరాల నుండి పల్లెలకి పాకిన విదేశీ సాంస్కృతిక జీవనశైలి భారతదేశ మూలాలను నాశనం చేయాలని చూస్తోంది. దానిలో భాగంగా ‘ ప్రపంచీకరణ’ (గ్లోబలైజేషన్) అనే పేరుతో ఒకానొక మత్తు మందును ఇంజెక్ట్ చేయడానికి పూనుకొంది. ఆకర్షణీయమైన ఆ రంగుల ప్రపంచాన్ని చూస్తూ, అది చిమ్ముతున్న విష కాలుష్యాన్ని గుర్తించక మన తరతరాల సాంస్కృతిక వారసత్వం, మన జీవనవిధానాలు విచ్ఛిన్నమైపోతున్నాయన్న విషయాన్ని గమనించలేక పోతున్నాం. జానపదుల బతుకులు, గ్రామీణ రైతాంగం, వస్తుఉత్పత్తి, కళలు భాషలు, ఆహారం, ఆహార్యం, ఆటలు పాటలు అన్నీ ‘ధనార్జనే ప్రధానమనే’ కార్పోరేట్ సంస్ధల మాయాజాలంలో చిక్కుకుని దాని పదఘట్టనల క్రింద నలిగిపోతున్నాయి. కేవలం వ్యాపార దృక్పథంతో జరుగుతున్న దోపిడితో వ్యవసాయం, చేతివృత్తులు ఛిద్రమైపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు అయోమయంతో దిక్కులు చూస్తున్నారు. కానీ ఈ ప్రమాదాన్ని కొంచెం ముందుగానే గ్రహించిన కవులు కన్నెర్ర చేసారు, కలాలను ఝళిపించారు.
జీవితాన్ని ప్రతిబింబించడం కవిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. వర్తమాన ప్రపంచ ధోరణిని కవిత్వీకరించాల్సిన బాధ్యత కవికి ఉంది. కనుకనే ప్రపంచీకరణ ప్రభావం సమాజం మీద, ప్రజా జీవనం మీద ఎలా వుందో ఆధునిక కవులు విశ్లేషిస్తున్నారు. అలాంటి కవిత్వాన్ని పరిశీలిద్దాం…!
ముందుగా “అన్నదాత, వస్త్రదాతల దీనావస్థ- ఆత్మహత్యలు” గురించి స్పందించిన కొందరు కవులు తమ ఆవేదన, ఆవేశం ఎలా వ్యక్తీకరించారో చూద్దాం!
“రిహార్సల్స్” అనే కవితలో గౌతమ్ –
“ప్రతి శబ్దంలో రైతు శోకపు జీరే వినొస్తుంది సంతోషము లేదు, సంగీతము లేదు వాడి (ప్రపంచ బ్యాంక్) పళ్ళగాట్ల పెద్దదేశాలన్నీ యిప్పుడు తమని తాము తగులబెట్టుకొంటున్నై బొలీవియా రైతు దుఃఖము సోమాలియా ఆక్రోశము…”
ప్రపంచీకరణ జ్వరం సోకిన చోటల్లా ‘రైతులు’ రుద్ధకంఠంలో జీరబోయిన స్వరం కన్నీటిలా జారిపడుతోంది.
ఆదేదన చెందిన రైతుల కళ్ళు వరదలైతే, వొళ్ళు హూనమైతే, ఇళ్ళు చీకటి మళ్ళైనాయి. వడ్డీలు ముళ్ళైనాయి –
“పాడిపంటలతో తులతూగే పంట కాపుల ఇళ్ళు విషపు రసాయనాలు పంచిన వడ్డీమూటల్ల మధ్య చీకట్లు వాంతి చేసుకునే జైళ్ళ గదుల్లా మారాయి”
అని అంటూ తల్లి వాసనేసే పల్లెమట్టిని ‘రైతుకవిత’లో పెరుగు రామకృష్ణ గుండె తరుక్కుని పోయేలా వర్ణించారు –
“ఈ దేశ ఆహార సారధులం మేమే అన్న ధీమా వుట్టిపడేలా నాగలి భుజాల పై పెట్టి ఠీవిగా నడిచే రైతన్నలు…..”
ఇప్పుడు చప్పబడి, చేవచచ్చి ఈ ప్రపంచీకరణ అనే ‘వాయురేచక’ యంత్రం మనిషిలోని ప్రాణవాయువుల్ని తోడేస్తుంది. అందుకే అవసానదశలో రైతులు –
“కోమాలో నడుస్తున్న కొత్త ప్రాణుల్లా వున్నారు… …పల్లెల్లో ఇప్పుడు మనోహర దృశ్యాలన్నీ చెదిరి మరకలు పడిన ఒకనాటి అద్భుత పెయింటింగ్ లా”
మారిపోయిందని గతాన్ని వర్తమానంతో పోల్చుకుని ఆ గతాన్ని తల్చుకుని రామకృష్ణ రైతు ఆవేదనని వెల్లడించారు.
చివరకు రైతు వ్యవసాయం చెయ్యాలంటే ‘ఏరువాక’ నుండి ‘కోతపండుగ’ వరకు పెట్టుబడుల వెట్టిచాకిరి తప్పదు. అప్పులిచ్చిన వారు అడుగడుగునా –
“ఋణాలిచ్చి తనతోనే గోతులు తవ్వించి అతని కష్టాన్ని పాతర వేస్తున్నారు”
అంటూ ‘రైతు కవిత’ సంకలనంలో ‘బహు(ళ) దాహం’ అనే మేలి కవితలో నందిని సిధారెడ్డి రైతు అనుభవిస్తున్న సంఘర్షణతో సంఘీభావం తెలిపారు. వసీరా తన ‘మొలక’ అనే కవితలో రైతుకు వచ్చే లాభనష్టాల్ని బేరీజువేసి ఇలా అంటున్నారు –
“ఈ ఏడాది నువ్వెన్ని పూటలు పస్తుండాలో దుక్కిదున్నక మునుపే ఎత్తేసిన సబ్సిడీల మీదే అమ్మబోయే విత్తనాల మీదే, చల్లబోయే ఎరువుల మీదే వచ్చే తెగుళ్ళ మీదే, వాటికి కొట్టే మందుల మీదే రాసి వుంది పంట వెల…..”
ఇన్నీ పోను మిగిలేది, దినదినాభివృద్ధిగ వర్ధిల్లుతున్న వడ్డీ ఒక్కటే. అసలు, వడ్డీ కలిసి మోపెడై రైతు నడ్డి విరుస్తుంది. ఇక రైతు జీవితం హళ్ళికి హళ్ళి. అందుకే రైతుకు ఇచ్చే సబ్సిడీలను రద్దు చేయమన్న ప్రపంచీకరణ మారణాస్త్రాన్ని ననుమాసస్వామి (శతాబ్దాన్ని పేరడీ చేసి) ‘హతాబ్దం’లో ఇలా అన్నారు-
“గాట్ట్ ప్రసవించిన మృతశిశువు డంకెల్ డ్రాఫ్ట్ పిశాచి కంపోస్టు ఎరువులపై రాయితీలు ‘మాయ’ గానే..
సబ్సిడీలను ఎత్తివేసి లాభించే రాయితీలను రైతులకు పూర్తిగ అందుతున్నాయా! ప్రపంచ విపణిలో దేశాల ప్రణాళికలు ప్రగతి పథాలు చక్రాలు విరిగిన రథాలైనాయి. ఈ విషయాన్ని ‘స్వాహతంత్రం’ అనే కవితాతంత్రంలో దార్ల రామచంద్ర ఎండగట్టారు –
“ప్రపంచమార్కెట్లో దేశ ప్రణాళికల సబ్సిడీలు బుష్ బుసకొట్టి బుస్సుమనిపిస్తున్నాడు…. మన శతాబ్దం ప్రగతంతా ఆర్.టి.సి. బస్సులో ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్’ అంత నిజం”
డొల్లతనాన్ని ఆలంకారికంగా చెప్పినా ఆవేదన కొట్టవచ్చినట్లుంది. బాక్స్ మాత్రం వుంటుంది. అందులో అవసరమైన మందులు మాత్రం వుండవు. రైతులు మిగిలివున్న ఏ కొద్ది భూమినో కబ్జాదారుల నుండి రక్షించుకుంటే , చివరకు ప్రభుత్వం లోనే
“పంట పొలాల్ని ఫిల్మ్ సిటీలకు పబ్లిక్ పార్క్ లోకి, విమానాశ్రయాలకు తార్చే ప్రభువులు”
పుట్టుకొచ్చారని హతాబ్దంలో ననుమాస్వామి అంటారు.
అన్నపూర్ణగా పేరొందిన ఈ నేల ఏ విధంగా ‘వరల్డ్ ట్రేడ్’ వలల్లో చిక్కి శల్యమైందో ‘గ్లోబల్ హైమా’ కవితలో టి.యమ్.ఆర్. రమణారెడ్డి వర్ణిస్తూ –
“సన్నకారు రైతుల వులన్ ఉరితాడు విశ్వవిపణి.. ….వరల్డ్ ట్రేడ్ వుచ్చులకు వ్రేలాడే బొమ్మ అన్నపూర్ణమ్మ”
చిత్తయిపోయిందని, ఐ.యమ్.యఫ్. లోగిట్లో అడుక్కునే స్థాయికి చేరిన వర్ధమాన దేశాల అవమానకరమైన పరిస్థితికి వాపోయాడు. ‘ప్రపంచీకరణ’ అమలులో తలమునకలైన రాజకీయ తాబేదార్లకు ‘మా సమాధులపై’ అన్న కవితలో మంచికంటి వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు –
“రైతు భుజాలపై సేతులేసి పేపర్ల నిండా ఫొటోలై దిగినారే ‘రైతే’ దేశానికి వెన్నెముకనే నినాదం మర్చిపోకండేం”.
ఇన్ని విధాల రైతు విలవిల్లాడుతూ ఉంటే పొలాలకు ‘విత్తనాలు’ మరో సమస్యగా మారింది. ఇది వరకు రైతులు రాబోయే పంటల కాలానికి విత్తనాన్నితానే తయారుచేసుకునే వాడు. కాని టెర్మినేటర్ వల విసిరింది. విత్తనం అపురూపమై పోయింది. అర్ధంకాని కొత్తరూపంలో, అరకొరగా, అందీ అందకుండా దోబూచులాడుతోంది. బి.వి.ఏ.రామారావు –
“మాయమైన మాచేతి లోని విత్తనం ‘జీన్ బేంకు’ల్లోని విత్తనమైంది…”
అంటూ ఆ బ్యాంక్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన నిస్సహాయతకు ఆక్రోశించారు. అలాగే రైతు గత వైభవాన్ని తలుచుకొంటూ అద్దేపల్లి రామ్మోహనరావు ‘మట్టి ఉప్పెన’ కవితలో –
“గింజలో బతుకు పొలాల్ని దాచుకొన్న వాళ్ళం మేం మట్టి చాళ్ళ మీద జీవనాడుల్ని నాటుకున్న వాళ్ళం”
అని సహజమైన విత్తనాలతో పునరుజ్జీవన శక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత తొలకరి వచ్చింది. చినుకు పలకరించింది. రైతు దేహం పులకరించింది. కానీ, విత్తనం ఏది?
“జీవాన్ని నిర్జీవంగా మార్చే విజ్ఞానం మృత్యువును శ్వాసించే లక్షణం వాడొక ‘టెర్మినేటర్ అండ్ ట్రైటర్’ మృత్యు బీజాల్ని టోపీల్నిండా కుక్కుకొని జీవనం కోసం తపించే ముఖక్షేత్రాల్లో వాటిని చల్లుకుంటూపోతాడు ప్రతి బీజం మీద మరణ శాసనాల క్రింద వ్యాపార సంతకాలుంటై నేలలో నాటుకున్న ప్రతి జీవం ప్రసవించి ప్రసవించి చచ్చిపోతుంది…”
ఇక ఆ విత్తనంలో మళ్ళీ జీవం చివురించదు. మళ్ళీ రైతు మరో ‘సీజన్’లో ఆ ‘టెర్మినేటర్’ విత్తనాల కోసమే పడిగాపులు తప్పదు. ఇదో మృత్యుతంతు. వర్ధమానదేశాలను తన గుప్పిట్లో పెట్టుకునే బలవర్ధకమైన కుట్ర. ‘విత్తనాల’ కృత్రిమత్వం వలన కలిగే హానిని గుర్తించి W.H.O. ప్రపంచ వ్యాపార సంస్ధ నుండి వ్యవసాయాన్ని మినహాయించాలని ఎందరో మేధావులు సూచించారు. ప్రజల ఆహారభద్రత ముఖ్యమని, ఆహార స్వయం సమృద్దిని దెబ్బతీసే దిగుమతుల్ని నియంత్రించాలన్నారు. టెర్మినేటర్ విత్తనాలను, దాని గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకించారు.
“జాగ్రత్త సుమా, వాడు టెర్మినేటర్ విత్తనం ఒక్కసారి నాటుకొన్నామా, వాడు తప్ప ఇక మనం మొలవనే మొలవము..”
అంటూ కోసూరి రవికుమార్ హెచ్చరించారు. విత్తనాలు, పురుగు మందులు, భూమి, నీరు, టెక్నాలజీ నియంత్రణ అన్నీ రైతుల చేతుల్లోనే ఉండాలని, ఆర్థిక రంగానికి మూలస్ధంభం వ్యవసాయంగా గుర్తించాలని ఆర్థికవేత్తలు కూడ అభిప్రాయపడ్డారు. కానీ, బహుళ జాతులు పన్నిన వలల్లో చిక్కుకున్న రైతుల పంటలన్నీ అప్పు చెల్లించడానికే అమ్ముడవుతున్నాయి.
“ఒకప్పుడు నా దేశం ఒప్పులకుప్ప వయ్యారి భామ ఈనాడు నా దేశం అప్పులకుప్ప అయ్యో రామా”
అంటూ రైతు దయనీయ దారుణ పరిస్ధితికి ఎ.జి. ఆఫీసు వారి ‘రంజనీ’ సంస్ధ ఉగాది సంచికలో రాయప్రోలు రామచంద్రమూర్తి మూర్తికల్పన చేసారు. అప్పుల పాలైన రైతుకు మరి వ్యవసాయం చేయడానికి ‘భూమి’ లేదు. అప్పిచ్చిన పెద్దమనిషి ఖాతాలో జమ అయింది. మరో బహుళజాతి పరిశ్రమ నిర్మాణానికి ధారాదత్తమైపోయింది. ఒకవేళ భూమి ఉన్నా సకాలంలో వర్షాలు రావాలి. ఏరువాక సాగాలి. ఎడ్లు సాగే సత్తా లేని రైతులకు ‘ట్రాక్టర్లు’ అద్దెకు దొరుకుతాయి. అయినా, వాటి ‘పెట్రోలు, డీజిల్’ దాహం తీరనిది. రైతు తీర్చలేనిది.
ఇక వ్యవసాయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని ‘యజమానే’ హత్య చేయబడ్డాడు. ఈ రైతుల్లో ప్రత్తి రైతుల్ని, వారి దీనావస్థను కొందరు కవులు గమనించారు. పెరిగిపోయిన ఋణాల్ని తీర్చుకోడానికి ‘నూకల్లో కాక రూకల్లో’ కొల్చుకోవాలని వ్యాపార పంట ప్రత్తిని వేసారు. కానీ పురుగులకు తెచ్చిన మందు పురుగులకు కాక ప్రత్తి రైతులకు మృత్యుమార్గాలయ్యాయి.
“విత్తినప్పటి నుండి గిట్టుబాటు కాటా దాకా మోసిన కలలన్నీ విరిగిన మగ్గాలై, మూసిన మిల్లులై…”
రైతుల, నేతగాళ్ళ జీవికకు, జీవితాలకు గండ్లు పడ్డాయి. ‘ఎక్స్ గ్రేషియా’ లాగా మిగిలారు. దండ తగిలించుకొని గోడమీద పటాలై నిర్లిప్తంగానిలిచిపోయారు – అంటూ వఝల శివకుమార్ ‘పిడికెడు విశ్వాసం’ అనే కవితావేదనలో మధనపడ్డారు. కలువగుంట రామమూర్తి ‘గ్లోబలైజేషన్‌కు బలైపోకు’ కవితలో దిగుమతౌతున్న పారిశ్రామిక వస్త్రాల, వస్తువుల ముందు ‘చేనేత, హస్తకళలు’ వెలవెల పోతున్నాయి. దేశమంతా వలవల ఏడుస్తోంది.
“ఏ చేతులైతే కులవృత్తిలో కొలువు తీరాయో ఆ చేతులే మొండిగోడలిప్పుడు వాటికి వ్రేళ్ళు లేవిప్పుడు ప్రపంచీకరణ మయసభలో నేలమీద నెత్తురు చిందకుండా ఒకోటి అదృశ్యమై పోవడం వండర్ కదూ!”
‘ఆలోచించు’ అనే కవితలో పై విధంగా స్పందించారు’రసరాజు’. అలాగే జి.వి.కృష్ణ ‘తెగినపోగులు’లో నేతగాని వ్యథ వినిపించారు.
“నేతలు మారినా నేతగాని తలరాతల మారలేదు…. …ఉరికొయ్యో పురుగుమందో. ప్రపంచీకరణ మహమ్మారి ఊపిరాడని బలవంతపు కౌగిట్లో ఏదైతేనేం – వాడు గిలగిలా కొట్టుకుని చనిపోయాడు… వాడు నేసిన తెల్లని వస్త్రం వాడి శవం మీదే కప్పడం పెద్ద విషాదం”
ఈ విధంగా రైతులు భంగపడిన బ్రతుకుల్ని స్మరించుకొంటూ (ప్రపంచీకరణ – కవిత్వం – ప్రజాజీవితం) అనే రచనలో ‘ఎండ్లూరి సుధాకర్’ ఇలా అన్నాడని పాపినేని శివశంకర్ ప్రకృతి సాహితిలో రాసాడు –
“తెల్లటి మెతుకులు కెలుకుతుంటే పత్తి రైతుల క్షుభిత క్షుధాత్మలే వేళ్ళకు తగులుతున్నాయి…”
ఎందరో అన్నదాతలు ‘అలో లక్ష్మణా’ అంటూ అలమటిస్తున్నారు. ‘వస్త్ర దాతలు’ దిగంబరులై ప్రేతాలైపోతున్నారు. సంప్రదాయ వృత్తులన్నింటికీ గొడ్డలివేటు లాంటి చిత్రమైన సంస్కరణలు తెస్తూ ‘గోరుముద్దలు పెడుతున్నామ’నడం ఇంకా విచిత్రం. కులవృత్తులు, చేతివృత్తులు చతికిలబడ్డాయనడం నమ్మవలసిన నిజం.
అరసవిల్లి కృష్ణ ‘బట్టలు కుట్టే దర్జీవాని’ జీవనం ప్రపంచీకరణ లోని సరళీకరణ విధానానికి ఎలా కకావికలై పోయిందో ‘దర్జీవాడు’ అనే కవితలో ఇలా అంటాడు –
“మౌనంగా మృత్యువును అందుకుంటూనే ఉన్నాడు ముఖమల్ జాకెట్ల మధ్య పీటర్ ఇంగ్లడ్ సాకుల మధ్య అమెరికా టౌజర్స్ మధ్య , జీవిక అర్థంకాని ఫజిల్ భోరున కురుస్తున్న అధునాతన దుస్తుల ముందు ఆకలి కేకలతో నిలబడ్డాడు సుందరీమణుల డ్రెస్ డిజైనర్ల కలల సౌధం దగ్గర సరళీకరణ మంత్రాన్ని ద్వేషిస్తూ…”
తనేం తింటాడు, తన కుటుంబానికి ఏం పెడతాడు? విశ్వకరణ శరవేగాన్ని ఏ సమ్మోహనాస్త్రంతో నియంత్రిస్తాడు? ఎంత సహనంతో నియంత్రిస్తాడు? ఈ విశ్వవిపణి క్రౌర్యంతో బలైపోవడం తప్ప మరో మార్గం లేదు.
“బహుళ జాతుల కరచాలనాల్లో నా జాతి చెయ్యి జారిపోయింది ప్రపంచ వ్యాపార వైకుంఠపాళిలో నా దేశ పటాన్ని పాముకాటు వేస్తుంది”
అని అద్దేపల్లి రామమోహనరావు ‘ఈ దారి ఎక్కడికి పోతుంది’ అనే కవితలో ఆవేదన వినిపిస్తాడు. ఇంకో తెలివైన కుట్ర పేటెంట్ హక్కు. పేదరైతుని మరింత వేదనకు గురి చేసి, అయోమయంలో పడేసింది.
“చెమట చుక్కలు తుడుచుకుంటూ వేపచెట్టు నీడన చేరిన నేను కూర్చోడానికి అనుమతి వుందా! ‘వేపచెట్టు పెటెంట్ చేయబడెను”
అంటాడు యస్.ముని సుందరం. సూక్ష్మంగా చెప్పాలంటే… ఇవి మావి, ఇవి మాకు చెందినవి అని ‘ప్రపంచ విపణి’ చే వేయించుకునే ముద్ర ‘పేటెంట్ హక్కు’. ఇంకెవరికీ వాటిమీద ఎటువంటి హక్కు భుక్తాలు లేవని ప్రకటించడమే. ఇదో రకమైన దోపిడికి దొంగ మార్గం.
“వేపచెట్టు, పసుపు మొక్క చివరకు బక్కరైతు, గో మూత్రం హక్కులు కోల్పోయి వైట్ హౌసులో బంధింపబడ్డాయి ప్రపంచ బ్యాంకు పడగనీడన మనం బతుకుతున్నాం…”
అంటూ కోట్ల వెంకటేశ్వరరెడ్డి నిరసన తెలిపారు. మనవైన వాటి పేటెంట్ హక్కులు కోల్పోతూ క్రమక్రమంగా మనల్ని మనం కోల్పోతున్నాం. ఇలా అన్నదాతల, వస్త్రదాతల దీనావస్ధను కవులు కవిత్వీకరణ గావించారు. వాస్తవాన్ని గమనిస్తే కొన్ని సంపన్న దేశాల ఎత్తుగడలు, మోసాలు వర్ధమాన దేశాలలో ప్రజల జీవన విధానంలో ఊహించనంత మార్పుల్ని తెచ్చాయి. దయనీయమైన జీవిత చిత్రాలు మనసుని కలచివేస్తాయి.
ఇటువంటి దైన్యాన్ని, హైన్యాన్ని తమ కలాల ద్వారా తీవ్రంగా నిరసనను వ్యక్తం చేసారు కవులు.
(మరో రంగంపై ఎటువంటి దుష్పరిణామాన్ని చూపిందో వెల్లడించిన కవితల్ని మరోవారం చూద్దాం).
డా. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో పనిచేసి, ప్రిన్సిపాల్‌గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్‌గా, ఎడిటర్‌గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ ల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు. విద్యార్థినులు చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం తన కెరీర్లో ఆమెకిష్టమైన పనులు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం సంతృప్తి కలిగించిందంటారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™