[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
![](http://sanchika.com/wp-content/uploads/2020/04/GnapakalaPandiriFI.png)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
ఫోను.. గ్రామఫోను..!!
సుమారు అరవై ఏళ్ళ క్రితం, ఫోను, గ్రామఫోనూ కూడా గ్రామాలలో చూసిన జ్ఞాపకాలు లేవు. ఫోను ధనవంతుల ఇళ్లల్లో సైతం ఉండేది కాదు! ఎవరో ఒకరికి ఉండేది కానీ అది సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండేది కాదు. అప్పటికి టెలిఫోన్ బంకుల సంస్కృతీ పల్లెటూళ్లకు చేరలేదు. ఎక్కువగా సమాచారం కోసం పోస్ట్ కార్డులనే వినియోగించుకునేవారు. కాస్త దగ్గరి ప్రదేశాలైతే మనుష్యులే కాలినడకన వెళ్లి సమాచారం అందించేవారు. అలా గ్రామాలలో టెలీఫోన్ అనేది గగన కుసుమం గానే ఉండేది. అందుచేత మా తరం పిల్లలు బాల్యంలో టెలిఫోన్ చూడడం గానీ, దానిని వినియోగించడం గాని జరగలేదు. సమాచార రంగంలో అప్పటికి అంత విస్తృతమైన అభివృద్ధి ఊపందుకోలేదు. ప్రధాన మంత్రులు స్వర్గీయ రాజీవ్ గాంధీ, పి.వి. నరసింహ రావు గార్ల హాయంలో ఈ సమాచార రంగం ఊహించని రీతిలో ఊపందుకుంది. ఫోను సంగతి అలా పక్కన ఉంచితే, ఫోను కంటే ముందు ‘గ్రామఫోను’ ముందుగా గ్రామాలలో ప్రవేశించిందని చెప్పక తప్పదు.
![](http://sanchika.com/wp-content/uploads/2023/10/GramphoneVividhaDasalu-1024x423.png)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
గ్రామఫోను.. వివిధ దశలు
అప్పట్లో గ్రామఫోను చూడగలగడం గొప్ప విజయంగా భావించేవాళ్లు. గ్రామఫోను రికార్డులు సున్నితంగా శుభ్రం చేయడం, శుభ్రం చేసి మెల్లగా ఊది ప్లేయర్ మీద పెట్టడం, అది తిరుగుతున్నప్పుడు రికార్డు మీద జాగ్రత్తగా రీప్రొడ్యూసర్ (సౌండ్ బాక్స్)లో అమర్చిన స్టయలస్స్ (పిన్ను లేదా నీడిల్) ను ఉంచేవారు. అప్పుడు పాట వినిపించేది. అది చూడడానికి, వినడానికి చాలా వింతగా ఉండేది.
![](http://sanchika.com/wp-content/uploads/2023/10/PrathamikaDasalloGramaphone.jpg)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
ప్రాథమిక దశల్లో గ్రామఫోను
దూరంగా వినిపించడానికి స్పీకర్లు అమర్చేవారు. తాలూకా కేంద్రం నుండి, గుర్రపు బండికి అమర్చిన మైక్‌లు కొత్త సినిమాల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చేవి. గ్రామఫోను ద్వారా పాటలు వేసి తర్వాత సినిమా ప్రకటనలు చేసేవారు. గుర్రపు బండిలోపల వుండి, గ్రామఫోను ద్వారా పాటలు వినిపించే వ్యక్తిని వింతగా చూసేవారు.
అలాంటప్పుడు, గ్రామఫోనును దగ్గరగా చూసే అవకాశం ఉండేది కాదు. దానిని దగ్గరగా చూడాలన్న తపన ఎక్కువగా ఉండేది. కానీ ఆ కాలంలో నాలాంటివారికి అది అందని ద్రాక్ష పండే అయింది.
![](http://sanchika.com/wp-content/uploads/2023/10/GramphoneDesignerDeveloper.png)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
గ్రామఫోను కనిపెట్టి అభివృద్ది చేసినవారు: ఎమిలీ బెర్లినర్* థామస్ ఆల్వా ఎడిసన్
తర్వాత అప్పట్లో, ఎంత పెద్దవారైనా, ఇళ్ళల్లో జరిగే పెళ్లిళ్లకు మైక్ సెట్లు పెట్టేవారు. అది పెట్టకపోతే మరీ తక్కువ స్థాయి కుటుంబాలుగా లెక్కగట్టేవారు. అలాంటి చోట దగ్గరగా గ్రామఫోను చూసే అవకాశం ఉండేది. అలాగే వాళ్ళు రికార్డులు వేయడం, అప్పుడప్పుడు పిన్నులు మార్చడం వింతగా చూసేవాళ్ళు. పనికి రాని పిన్నులు పారవేస్తే, పిల్లలు వాటిని సేకరించి దాచుకునేవారు, గొప్పగా చెప్పుకునేవారు. పెళ్లిళ్లకు, గ్రామఫోను, మైక్ సెట్ వచ్చిందంటే, పెద్దవాళ్ళు పద్యాలు వినిపించడం మానేవారు. పద్యాల రికార్డులు తేకుంటే అసలు ఊరుకునే వారు కాదు. అలా గ్రామాలలో గ్రామఫోను ప్రవేశించిందని చెప్పక తప్పదు.
![](http://sanchika.com/wp-content/uploads/2023/10/GramphoneRecords.png)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
గ్రామఫోను రికార్డులు
అలాగే గ్రామాలలో, పండుగలకు, ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఔత్సాహిక యువతీయువకులు నాటకాలు ప్రదర్శించేవారు. అలాంటప్పుడు కూడా గ్రామానికి, గ్రామఫోను, మైకు సెట్లు వచ్చేవి. తర్వాత గ్రామఫోను లోనే కాదు, గ్రామఫోను రికార్డుల్లో కూడా అనేక మార్పులు రావడం, క్రమంగా ఆధునిక సదుపాయాలు అవతరించడంతో, గ్రామఫోను – గ్రామఫోను రికార్డులు, కాలగర్భంలో కలిసిపోయాయి. ఔత్సాహికులైన పాతతరం ఇళ్లల్లో ఇప్పటికీ గ్రామఫోను బ్రతికే వుంది. ఇప్పటి తరానికి అది మరుగున పడ్డ మాణిక్యాం లాంటిదే! ఇప్పటి తరం పిల్లలు, బొమ్మను చూసి సరిపెట్టుకోవడమే గాని స్వయంగా గ్రామఫోనును చూసే అవకాశం లేదు. అయితే పాతతరం గ్రామఫోను ప్రేమికులు, వందలు, వేల సంఖ్యలో రికార్డులు సేకరించి, లైబ్రరీలను ఏర్పరచుకున్నారు. ఆకాశవాణి అన్ని కేంద్రాలలో ఇప్పటికీ, వాళ్ళ లైబ్రరీ లలో, వేల సంఖ్యలో గ్రామఫోను రికార్డులు భద్రపరచబడి వున్నాయి. రాబోయే తరాలకు అదొక చరిత్ర.
మా నాయన గారి క్రమశిక్షణలో భయంకొద్దీ, నాకు అలా గ్రామఫోను దగ్గరికి వెళ్లి చూసే అవకాశం ఉండేది కాదు. దూరంగా వుండి పాటలు వినడం తప్ప, ఇల్లు విడిచి పెట్టి వెళ్లి అవన్నీ చూసే అవకాశం ఉండేది కాదు. అలా కొంత నిరుత్సాహం మనసులో చోటు చేసుకునేది. అయితే, నాకు హై స్కూల్‌కు వెళ్లే వయసు వచ్చాక ఎలా ప్రారంభమైందో గానీ, రికార్డింగు డాన్సుల హవా మొదలయింది. మాకంటే పెద్దవాళ్ళు, అంటే మా చిన్నన్న వయసు వాళ్ళు, మా గ్రామంలోనే ప్రాక్టీస్ (రిహార్సల్స్) చేసేవారు. ఆ బృందానికి మా చిన్నన్నయ్య దర్శకుడిగా వ్యవహరించేవాడు (చాలా మట్టుకు మా నాయనకు తెలియకుండా). ఈ నేపథ్యంలో, మా తాలూకా కేంద్రమైన రాజోలు నుండి ‘గ్రామఫోను’ అద్దెకు తెచ్చేవారు. రాత్రిపూట ఎక్కడో తెలియని చోట ఈ రిహార్సల్స్ జరిగేవి. రిహార్సల్స్ అప్పుడు, రికార్డింగ్ డాన్సు అమ్మాయి కూడా వచ్చేది. ఇక చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా రిహార్సల్స్ జరిగే ఇంటి చుట్టూ జనం గుమిగూడేవారు.
![](http://sanchika.com/wp-content/uploads/2023/10/SholeyGramphoneRecord-711x1024.jpg)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
షోలే… సినీమా రికార్డు
అలాంటప్పుడు నాకు లోపలికి వెళ్లిచూసే పర్మిషన్ ఉండేది. అలా గ్రామఫోను, అది పనిచేసే విధానం, పనిచేయించే విధానం దగ్గరగా వుండి చూడగలిగాను. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుచేసుకోక తప్పదు. ఒకరోజు మా పెద్ద మేనత్త ఈ రికార్డింగ్ డాన్స్ రిహార్సల్స్ చూడ్డానికి వచ్చింది. నూరుశాతం నిరక్షురాస్యురాలు. గ్రామఫోను గురించి అసలు అవగానే లేని వ్యక్తి. రికార్డ్ ప్లే చేసినప్పుడు, ఆ పాట విని “ఒరేయ్.. అంత చిన్నాడబ్బాలో మనిషి కూర్చుని ఎలా పాడుతున్నాడు?” అని అడిగింది. ఆవిడ అమాయకపు మాటలు నేను ఎప్పటికీ మరచిపోలేను.
చిన్నన్నయ్య డా. మధుసూదన్, నా కూతురు నీహార కానేటి ఆకాశవాణిలో ఉద్యోగులు కావడం వల్ల, ఇప్పటికీ గ్రామఫోను – రికార్డులు ఏదో రూపంలో నా కళ్లబడుతూనే వున్నాయి. అంతమాత్రమే కాదు,ఈ మధ్య నా మిత్రులు శ్యామ్ కుమార్ – లీల గార్ల ఇంటికి నిజామాబాద్‌కు వెళ్ళినప్పుడు, భద్రంగా భద్రపరచిన గ్రామఫోను, గ్రామఫోను రికార్డులు చూసి ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయి. బహుశా మిత్రుడు, తన బాల్యంలో అనుభవించలేకపోయిన ఒక వినోద ప్రక్రియని, ఇప్పడు గ్రామఫోను సేకరించి ఆనందిస్తూ తృప్తి పడుతున్నాడేమో అనిపించింది.
![](http://sanchika.com/wp-content/uploads/2023/10/ShyamCouplewithGramphone-1024x512.jpg)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
ఇప్పటికీ గ్రామఫోనుతో సంగీతాన్ని ఆస్వాదిస్తున్న రచయిత శ్యాం కుమార్ దంపతులు (నిజామాబాద్)
కాలగమనంలో ఎన్నోమార్పులు వచ్చేయి. తూనికలు – కొలతలు, అప్పటివి ఇప్పుడు లేవు. అతి ముఖ్యమైన సమాచార సాధనం టెలిగ్రామ్ ఇప్పుడు లేదు! అప్పుడు వాడిన నాణాలు, కరెన్సీ ఇప్పుడు లేవు. అలా ఎన్నో కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
అందులో గ్రామఫోను కూడా ఒకటి. టెలిఫోన్ మాత్రం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతోంది. మొబైల్ దానిని అధః పాతాళానికి తొక్కిపారేసింది. ఇవన్నీ భవిష్యత్ తరాలకు చారిత్రిక అంశాలుగా మిగిలిపోతాయి. ఇప్పుడు పాట వినడానికి గ్రామఫోను, టేప్ రికార్డర్ అవసరం లేదు! స్మార్టుఫోన్ ఒకటి ఉంటే చాలు, అన్నీ అందులోనే దొరుకుతాయి!!
(మళ్ళీ కలుద్దాం)
![](http://sanchika.com/wp-content/uploads/2022/04/DrPrasadKLV1.jpg)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
23 Comments
Shyamkumar Chagal. Nizamabad
రచయిత శ్రీ డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మా చిన్నతనంలో మా ఇంట్లో గ్రామ ఫోన్ ఉండేది. దాని పక్కగా ఉండే హ్యాండిల్ ను ఒక 20 సార్లు తిప్పితే నాలుగైదు రికార్డుల వరకు అది తిరిగేది. సన్నని మొనదేలున్న పిన్నును రికార్డు మీద ఉంచినట్లయితే దానికున్న చిన్న స్పీకర్ ద్వారా ఆ పాట మనకు వినిపించేది.
మనకు నచ్చిన పాటలను పదేపదే అందులో వినడం చాలా అద్భుతంగా అనిపించేది. ఎందుకంటే రేడియోలో ఆ సౌకర్యం ఉండదు కదా.
స్కూలుకు సెలవు ఉన్న రోజులలో మాత్రమే నాకు దాన్ని పెట్టుకోవడానికి అనుమతి లభించేది.
ఏమాత్రం అజాగ్రత్త చేసి రికార్డులను జారవిడిస్తే
మాత్రం అవి కిందపడి విరిగిపోయేవి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఎన్నో సంగీత పరికరాలు వచ్చినప్పటికీ గ్రాం ఫోన్ రికార్డుతో విన్న అనుభూతి కలగడం లేదు. ఇప్పటికీ గ్రామ్ ఫోన్ లు మార్కెట్లో రకరకాల ధరలతో లభ్యమవుతూనే ఉన్నాయి. వాటి రికార్డు ప్లేట్స్ మాత్రం చాలా కొద్ది చోట్ల మాత్రమే దొరుకుతాయి. ఢిల్లీలో రెడ్ఫోర్ట్ ఎదురువైపు పరిసరాల్లో కొన్ని దుకాణాలలో ఇప్పటికీ పాత రికార్డ్స్ దొరుకుతూ ఉన్నాయి.
ఏది ఏమైనా గ్రాంఫాన్ రికార్డు వింటుంటే వచ్చే
మాధుర్యం నేటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కలగడం లేదు.
కాలగర్భంలో కలిసిపోయిన పాత తరం మనుషుల్లాగానే ఇవి కూడా త్వరలోనే మాయమై పోతాయి అనటంలో సందేహం లేదు.
టైపింగ్ మిషన్, గంటలు కొట్టే గడియారం, ల్యాండ్ ఫోను ,క్లిక్ త్రీ కెమెరా , చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ట్రాన్సిస్టర్రేడియోలు, రాగి నీటి బాయిలర్లు లాంటివి ఎన్నో మన జీవితంలోంచి కనుమరుగైపోయాయి.
జ్ఞాపకాల పందిరి అనే పేరుకు తగ్గట్లుగా కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో ఆనందపు జ్ఞాపకాలను వాటి గుర్తులను బయటకు తీసి మన ముందుంచి మన అందరిని మన చిన్నతనంలోకి తీసుకెళుతున్న రచయిత డాక్టర్ ఏ ఎల్ వి ప్రసాద్ గారికి మరొక్కసారి నా మన పూర్వక జోహార్లు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమా
నీ హృడయ పూర్వక వ్యాస స్పందనకు
కృత జ్ఞత లు.
sagar
ఎంత సాంకేతిక విప్లవం కాలరెగరేసినా, ఆనాటి పాత మధురాలలో ఉన్న నాణ్యత ఇక భావితరాలకు ఎండమావి అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆ ధ్వనిలో ఉన్న నాణ్యత ఇప్పుడు అసలు కనిపించదు. అలాగే మీరన్నట్లు కొన ఊపిరితో ఉన్న టెలిపోన్ సౌండ్ ఇప్పటి సాంకేతికతకు ఎంతో దూరం. అన్ని రకాలను సౌలభ్యాలను ఆస్వాదించి మాకు పంచుతున్న మీకు హృధయపూర్వక ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందనకు ధన్యవాదాలు .
అల్లూరి Gouri Lakshmi
గ్రామ ఫోన్ గురించి భలే గుర్తు చేశారు.గుళ్ళో పూజలు ఉన్నప్పుడు ముందుగా పాటలు వేసేవారు.గ్రామ ఫోన్ వంక చూస్తుంటే అద్భుతంగా ఉండేది. మమ్మల్ని దగ్గరికి కూడా వెళ్ళి చూడనివ్వకపోయేవారు.అప్పుడప్పుడూ ముల్లు అరిగిపోతే అక్కడి పదాలు రిపీట్ అయ్యినప్పుడు అందరం నవ్వి నవ్వి చచ్చేవాళ్ళం.ధన్యవాదాలు ప్రసాద్ గారూ.మీ పందిరిలో మేమూ కూర్చున్నాం ఇవాళ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మేడం గారూ
ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మంచి అంశాన్ని ఎంచుకున్నారు.
సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోతున్నాయి.
పక్షి జాతులు వృక్షజాతులు కనుమరుగవుతున్నాయి.
అంతేకాదు సాంకేతిక ప్రగతిలో
చాలా పరికరాలు కూడా
కనిపించకుండా పోతున్నాయి.
అయితే… వాటి స్థానంలో మెరుగైన, మరింత ప్రయోజనకరమైన పరికరాలు/ టెక్నాలజీ/ సాంకేతికత అందుబాటులోకి వస్తున్న కారణంగా …ఈ విషయాన్ని అంతగా మనం పట్టించుకోవడం లేదు.
రేపటి తరాలకు ఇవి ఆంటిక్ పీసెస్.
అయితే ఈరోజు మనం చూస్తున్న డీ.జే నృత్య సంప్రదాయానికి …
ఆ రోజుల్లో మరోరకమైన మూలాలు ఉన్నాయి అని తెలుస్తుంది
ఎ.వి.అనీల్ ప్రసాద్
ఆకాశవాణి..వరంగల్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అలనాటి వస్తువులు ఇప్పుడు చూపరులకు వింతగా ఉంటాయి.
నాకు ఇప్పటికి Land phone ఉంది.
మంచి వస్తువును పరిచయం చేశారు వైద్యవర్య.
—-ప్రొ.జనార్ధన రావు
కాజీపేట
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
ప్రొఫెసర్ గారూ…
డా కె.ఎల్.వి.ప్రసాద్
అనీల్ జి
ధన్యవాదాలు.
నంద్యాల సుధామణి
గ్రామఫోన్ మా ఇంట్లో కూడా వుండేది. బాలరాజు వంటి సినిమా పాటలను వినేవాళ్లం! అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులతో వాల్ హాంగింగ్స్ తయారుచేసే విధానం అప్పటి పత్రికలలో చూశాక…మా రికార్డులన్నింటికీ అదే గతి పట్టించాము. ఇప్పుడు బాధేస్తుంది.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ అనుభవం మాతో
పంచుకున్నండుకు
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 185 లో గ్రామఫోను గురించి తెలిపారు. నా చిన్నతనంలో మా ఇంటి పక్కన వుండే వారికి గ్రామఫోన్ వుండేది. గ్రామఫోన్ రికార్డు పాటలు వినడం ఒక మధురానుభూతి. సాంకేతిక విప్లవంతో గ్రామఫోన్ కాలగర్భంలో కలిసిపోయింది. నేను రిటైర్ అయ్యాక ఫోన్ వాడాను. చక్కటి కథనం. అభినందనలు.
—-జి శ్రీనివాసాచారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరిలో గ్రామఫోన్ గురించి చాలా విషయాలు చెప్పారు ప్రసాద్ గారూ! ఆ జ్ఞాపకాలు నాకు కూడా అనుభవైకవేద్యమే !……కొన్నాళ్ల క్రితం రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఒకాయన ఇంటికి వెళ్లటం జరిగింది. ఆయన దగ్గర గ్రామ్ ఫోన్ ప్లేయర్, రికార్డు లు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ ప్లే అవుతున్నాయి. ఆయన ప్లే చేసి చూపించారు. వాటితో పాటు టేప్ రికార్డర్, క్యాసెట్లు, CD లు, DVD లు కూడా ఉన్నాయి………..మీరు చెప్పిన మాటలు ఇప్పటి తరం వారు కూడా తెలుసుకో వలసినవి.
—గొనుగుంట మురళీ కృష్ణ
తెనాలి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మురళీ కృష్ణ గారు
ధన్యవాదాలు.
N.Bhujanaga Rao
గ్రాంఫోన్ గురించి ఈ సంచికలో చాలా విషయాలు తెలిపారు.మా గ్రామం బేతోల్ మహబూబాబాద్ జిల్లాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.మా ఇంటి పక్కనే కరణం గారి ఇల్లు ఉంది.వారి ఇంట్లో అప్పట్లో లాండ్ ఫోన్ మరియు గ్రాంఫోన్ ఉండేది.వారి కుమారుడు నా క్లాస్ మేట్ అయినందున నాకు వాటిని చూడడమే కాకుండా రికార్డ్ వేసుకుని వారితో పాటు నేను కూడా పాటలు వినే అవకాశం ఉండేది,పాటలు కూడా వినసొంపుగా ఉండేవి.ఇప్పుడున్న సమాజానికి తెలియని మంచి విషయాలు అందిస్తున్న మీకు నమస్కారములు సిర్![🙏](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f64f.svg)
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
గ్రామ ఫోన్ గూర్చి మీ గత అనుభవాల జ్ఞాపకాలను జోడించి ఈ తరానికి పాత తరపు మధుర స్మృతుల్ని దర్శింపచేసినందుకు ధన్యవాదాలు సర్![💐](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f490.svg)
![🙏](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f64f.svg)
—-నాగజ్యోతి శేఖర్
కాకినాడ
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మా వూళ్లో ప్రతిరోజూ తెల్లవారుఝామున 5గంటలకు గుళ్లో సుప్రభాతం, ఇతర భక్తి పాటలూ రికార్డులు వేసేవారు. నేను చాలా కాలం ఆ సేవ చేశాను. మొదట్లో ముళ్లు మార్చినా తర్వాత ఆ అవసరం లేని ఏర్పాటుగల ప్లేయరు వచ్చింది. అలాగే పెద్ద ప్లేట్ల స్థానంలో మిని రికార్డులు వచ్చాయి. అరిగిపోయిన రికార్డులను పారేస్తుంటే తీసుకుని వాటిమీద దృశ్యాలు పెయింట్ చేసి బహుమతులుగా ఇచ్చాను. రికార్డు మధ్యలో చిల్లులో మేకు దూర్చి గోడకు వేళ్లాడదీయవచ్చు. మనకందరకూ గ్రామఫోను అనేది ఒక తీపి జ్ఞాపకం.
—-సరసి
ఇంగ్లాండ్
డా కె.ఎల్.వి.ప్రసాద్
మంచి సమాచారం అందించారు హృదయపూర్వక ధన్యవాదాలు యి
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీరు ప్రస్తావించిన గ్రామఫోన్ రికార్డులకు సంబంధించిన వివరాలు, విశేషాలు చాలా బాగున్నాయి. నా స్నేహితురాలి ఇంట్లో గ్రామఫోను రికార్డులు వినేవాళ్ళం. ఎక్కువ హిందీ సినిమా పాటలు, యం. యస్. సుబ్బులక్ష్మి గారి భవనాలు వినేవాళ్ళం. ఖాళీ సమయంలో వాళ్ళింట్లో చేరిపోయేవాళ్ళం. ‘మధుమతి ‘ పాటలు మాత్రమే గుర్తు. మిగిలిన సినిమాలు గుర్తు లేవు. ఇప్పటికీ మధుమతి పాటలు ఎక్కడైనా వినబడితే ఆ రికార్డులు గుర్తొస్తాయి.![🌹](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f339.svg)
![💐](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f490.svg)
చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరెళితే పంచాయతీ ఆఫీసులో తెల్లవారుఝామునుంచీ పాటలు వినిపించేవారు.
నేను బి. యెడ్. పూర్తవగానే ఒక గ్రామంలో టీచర్ గా జాయినయ్యాను.మా స్కూల్ కి దేశభక్తి గేయాలు గ్రామఫోన్ రికార్డులు ఇచ్చారు. ఆ ఊరి గుడిలో తెల్లవారు జామున భక్తి పాటలు వినిపించేవారు.(స్కూలుకి గ్రామఫోన్ లేదు కాబట్టి..గుడి వారికి అందించి) వీటి తర్వాత దేశభక్తి రికార్డులు ఊరంతటికీ వినిపించేవాళ్ళం. అవన్నీ గుర్తొచ్చాయి.మీకు దన్యవాదాలు, అభినందనలు
—–పుట్టి నాగలక్ష్మి
గుడివాడ.