నేటి తుళు సినిమా కామెడీల మయమైంది. మసాలా జోకులతో నవ్వించడమే సినిమాగా మారింది. ఒకనాటి సీరియస్ వాస్తవిక సినిమాలు ఇప్పుడు లేవు. వరసగా ఎన్ని కామెడీలు వస్తున్నా విసుగు లేకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. కామెడీకి సస్పెన్స్ – యాక్షన్ కలిపి సినిమాలు తీసి సక్సెస్ అవుతున్న కె. సూరజ్ శెట్టి ఇప్పుడు డిమాండ్‌లో వున్న దర్శకుడు. గత రెండు సినిమాలూ ఇలాటివి తీశాక, ఈ సంవత్సరం జూన్‌లో ఇంకో థ్రిల్లర్ కామెడీ విడుదల చేశాడు. ఇదీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడింది. ఇందులో కుళ్ళు జోకులు, అసభ్య దృశ్యాలు లేవని ముందే ప్రచారం చేశాడు. ‘అమ్మర్ పోలీస్’ అని తీసిన ఈ కామెడీ థ్రిల్లర్‌కి ‘నో ప్లాయ్ ట్రిక్స్, ఓన్లీ ఫన్నీ ట్రిక్స్’ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు.
ఈ కథ చనిపోయిన ఓ వ్యక్తి కేసు చుట్టూ తిరుగుతుంది. అంత్యక్రియలతోనే సినిమా మొదలవుతుంది. ఎవరీ వ్యక్తి? ఎలా చనిపోయాడు? హత్యా, ఆత్మహత్యా? అన్న ప్రశ్నలతో మొదలవుతుంది. ఇవి కనుక్కోవడమే కథ.
పేరుకి ఇది కమర్షియల్ అయినా చూస్తే ప్రయోగాత్మకంగా తీసినట్టు అన్పిస్తుంది. ఇందులో కమర్షియల్ సినిమాల్లో వుండే రోమాన్స్ గానీ, ఫైట్స్ గానీ వుండవు. అసలు ఇళ్ళల్లో చావు సంభవించినప్పుడు ఎంత ఆందోళనా గందరగోళం వుంటాయో, అంత్యక్రియల తతంగాలు మొత్తం ఎంత హస్యాస్పదంగా జరుగుతూంటాయో తెలుసుకోవడానికి చావులు జరిగిన ఇళ్ల దగ్గర, స్మశానాల దగ్గరా మూడేళ్ళూ పరిశీలిస్తూ వుండిపోయాడు దర్శకుడు సూరజ్. ఇదంతా కామెడీ చేసి తీయడంతో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ప్రేక్షకుల సెంటిమెంట్లు దెబ్బతిని నెగెటివ్ రిపోర్టులు కూడా వచ్చాయి. కానీ రెండో వారంలో ఇవన్నీ తొలగిపోయి పుంజుకుంది సినిమా.
మొదటి సీనే చావుతో కామెడీ. ట్రైలర్ కూడా కేవలం ఈ చావు సీనుతోనే కామెడీగా విడుదల చేశాడు. ఎప్పుడు చూసినా సెట్స్‌లో నూటయాభై మంది కొత్త నటీనటుల్ని పోగేసి తీయడం కూడా కమర్షియల్ పరిధులు దాటిన ప్రయోగాత్మక ప్రయత్నమే. చనిపోయింది పోలీసు అధికారియేనా? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? …. ఇదంతా ఫన్నీ సీన్స్‌తో, డైలాగ్స్‌తో నడిపించాడు. కథాబలం కన్పించదు, కేవలం జోకులతోనే దృశ్యాలు వచ్చిపోతూంటాయి. ఈ లోపం వున్నప్పటికీ ఇది ఇప్పటి కామెడీల ట్రెండ్‌లో హిట్టయిపోయింది.
ఇప్పుడు తుళు సినిమాలు కథాపరమైన క్వాలిటీతో కంటే ఉత్త కామెడీతోనే విజయాలు సాధిస్తున్నాయి. విషయపరంగా నాణ్యత లేకపోయినా, దృశ్యపరంగా సాంకేతిక హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుత థ్రిల్లర్ కామెడీకూడా సాంకేతికంగా ఉన్నతంగా కన్పిస్తుంది. మూవీ ఏడాదిన్నర నిర్మాణంలోనే ఉండిపోయింది. ఎంత కమర్షియల్ అనుకుని తీసినా రెండు జిల్లాల మార్కెట్‌కి బడ్జెట్‌ని అరవై నుంచి ఎనభై లక్షలకే పరిమితం చేస్తున్నారు. ప్రస్తుత కామెడీ థ్రిల్లర్‌ని అరవై లక్షల్లోనే తీశారు. ఇది రెండు కోట్ల వరకూ వసూలు చేసింది. తుళు జనాభా పాతిక లక్షలే అయినా సినిమాల పరిస్థితి బావుంది. మల్టీ ప్లెక్సులొచ్చి సినిమా అలవాటుని ఇంకా పెంచాయి.
ఇందులో హీరో హీరోయిన్లుగా రూపేష్ శెట్టి, పూజా శెట్టిలు నటించారు. సందీప్ బల్లాల్ సంగీతం నిర్వహించాడు. సచిన్ శెట్టి ఛాయాగ్రహణం.
సికందర్ ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్. సినీరంగానికి చెందిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ఎన్నో పత్రికలలో భారతీయ, అంతర్జాతీయ సినిమాలను విశ్లేషిస్తుంటారు. వీరు నిర్వహించే “సినిమా స్క్రిప్ట్ అండ్ రివ్యూ” అనే బ్లాగు ప్రసిద్ధి చెందినది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™