[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


పిల్లల్లో సృజనాత్మకత..!!
ఈ రోజుల్లో పిల్లలు పుట్టగానే, ఆ పిల్లలను ఎలాంటి స్కూళ్లల్లో, లేదా ఎలాంటి కాన్వెంట్లో వెయ్యాలి? అన్న ఆత్రుత పెరిగిపోతుంటుంది. అంతమాత్రమే కాదు, పసికందు వయసు నెలలవాడైనా, ఒక మంచి స్కూల్లో చదివించాలనే తపనతో, ఒక మంచి స్కూల్ కోసం వేట ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో, తల్లికి నచ్చిన స్కూల్, తండ్రికి నచ్చకపోవచ్చు. తండ్రికి నచ్చిన స్కూల్ తల్లికి నచ్చకపోవచ్చు. వీళ్లిద్దరికీ నచ్చిన స్కూల్, పిల్లల ‘గ్రాండ్ పేరెంట్స్’కు నచ్చకపోవచ్చు. వారి తర్జనభర్జనల అనంతరం ఒక స్కూల్ ఎన్నిక చేశారనుకుందాం. ఇక అప్పుడు మొదలవుతుంది. ప్రాథమిక దశలో పెద్ద ఒత్తిడి వుండదు గాని, తర్వాత.. తర్వాత, పిల్లల మీద ఒత్తిడి పడుతుంది. ఇది ప్రత్యక్షంగా పిల్లల మీద, పరోక్షంగా తల్లిదండ్రుల మీద/సంరక్షకుల మీద పడుతుంది. అది కూడా, పిల్లల ప్రోగ్రెస్, గ్రేడ్లు, ర్యాంకులను దృష్టిలో ఉంచుకుని జరుగుతుంది.


రచయిత మనవరాలు ఆన్షి.నల్లి
అయితే చదువు అంటే, పిల్లల గ్రేడ్లు ర్యాంకులేనా? పిల్లల్లోని వివిధ సృజనాత్మక అంశాలను బయటకు తీసుకు రావలసిన అవసరం లేదా? అంటే, ఉందనే చెప్పాలి. అయితే ఆధునికంగా ప్రారంభించబడుతున్న విద్యాసంస్థల్లో, చదువుతో పాటు, వారిలో నిబిడీకృతమై వున్న సృజనాత్మక అంశాలకు కూడా ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యత నీయడం బాధాకరం. ఇక ప్రభుత్వ విద్యాసంస్థల విషయానికొస్తే, ఇలాంటి అంశాలు విద్యాబోధనలో బహు తక్కువ అని చెప్పక తప్పదు.
పిల్లల్లోని సృజనాత్మకతను బయటకు తీయడానికి, పిల్లలను ప్రోత్సహించడానికి, కేవలం విద్యాసంస్థలు బాధ్యతను స్వీకరించలేవు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది.


అంబేడ్కర్ వేషంలో ఆన్షి.నల్లి.
కార్పొరేట్ విద్యాసంస్థలు వెలుగులోనికి రాక మునుపు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైతం చదువుతో పాటు, డ్రాయింగ్, తోటపని, క్రాఫ్ట్, క్రీడలు, సంగీతం క్లాసులు అదనంగా ఉండవి (ఇప్పుడు కూడా కొన్నిచోట్ల వుండి ఉండవచ్చు). అలాగే, లైబ్రరీ పిరియడ్ కూడా ఉండేది.
పిల్లలు ఈ పిరియడ్‌లో, తమ సిలబస్‌కు భిన్నమైన పుస్తకాలు చదివేవారు. తద్వారా వ్యాసరచనలో ప్రావీణ్యం సంపాదించేవారు. డిబేట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉండేది. చాలా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ పిరియడ్ రద్దు అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా లైబ్రేరియన్లు లేక, గ్రంథాలయాలు పూర్తిగా మూతపడినాయి. కొన్ని చోట్ల, ఉపాధ్యాయులే ఆ బాధ్యతను తీసుకుని పని చేస్తున్న విషయాన్ని కూడా కాదనలేము. క్రాఫ్ట్ పిరియడ్‌లో బుక్ బైండింగ్, నవారు నేయడం, బొమ్మలు తయారుచేయడం వంటి మెదడుకు మేత పెట్టే పనులు చేయించేవారు.
తోటపనిలో మొక్కలు పెంచడం, కూరగాయలు-ఆకుకూరలు, పండ్లు పండించడం నేర్పేవారు. ఇంచుమించుగా ఇప్పుడు వీటన్నటికి తిలోదకాలు పలికి, కేవలం చదువుకే ప్రాధాన్యత నిస్తున్నట్టు, దీనికోసం అధికారులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి ఆంక్షల వల్ల చాలామంది పిల్లలు క్రీడల వైపు కన్నెత్తి చూడని ఉదంతాలు వింటూనే వున్నాం. ఇది నేటి విద్యాసంస్థల దుస్థితి.
అయితే, కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు, పుష్టికరమైన చదువును అందించడమే కాక, ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యత నిస్తున్నారు. వారంలో అన్ని అంశాలకు ప్రాముఖ్యతను కలిగిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు అలాంటి విషయాల్లో తమ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటూనే వున్నారు.
కార్పొరేట్ విద్య అందరికీ సాధ్యం కాదు. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పరీక్షలు – వాటి ఫలితాలకు ప్రాధాన్యం ఇస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి పూర్తి స్థాయిలో విద్యను అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి పిల్లల్లోని సృజనాత్మకత, అంతర్గతంగానే అడుగంటి పోతున్నది. నేను పాఠశాల స్థాయిలో వున్నప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల, క్రీడలు, డ్రాయింగ్, డిబేటింగ్ వంటి అంశాలను సద్వినియోగం చేసుకోలేక పోయాను.
నా పిల్లలిద్దరూ కూడా, చదువుకు తప్ప ఇతర అంశాలకు ప్రాధాన్యత నివ్వలేదు. ఇక్కడ తల్లిదండ్రులుగా అది మా లోపమనే చెప్పాలి. నేను, నా శ్రీమతి ఉద్యోగస్థులం కావడం మూలాన మేము అశ్రద్ధ చేశామనే చెప్పాలి.
ఇప్పుడు మూడో తరం మనవరాలు ఆన్షితో ప్రారంభం అయింది. ఆమె తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, తానూ బాల్యంలో ఏమి కోల్పోయిందో, వాటి మీద కూతురు విషయంలో శ్రద్ధ పెట్టింది. చదువుకు ఏమాత్రం ఆటంకం కలగకుండా తన అభిరుచుల మేరకు ‘ఇతరేతర వ్యాపకాల’కు (Extra curricular activities) ప్రాధాన్యతనిస్తూ, ప్రోత్సహిస్తూ వస్తున్నది.


విచిత్ర వేషాలలో ఆన్షి.నల్లి
అలా నా మనవరాలు చదువులోనూ, ఇతరేతర వ్యాపకాలలోనూ చక్కగా రాణిస్తున్నది. ఆమె ఇలా రాణించడానికి ముఖ్య కారణాలు 1) స్వయంగా ఇష్టపడడం 2) తల్లిదండ్రుల ప్రోత్సాహం 3) పాఠశాల ఉపాధ్యాయుల/ఉపాధ్యాయినుల బాధతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన చదువు, ఇతరేతర వ్యాపకాలపై ప్రత్యేక దృష్టి. ఈ అంశాలు అన్నీ కలిపి పిల్లల భవిష్యత్తుకు పుష్టికరమైన పునాది.


విచిత్ర వేషాలలో ఆన్షి.నల్లి
బడిలో చదువుకు మొదటి ప్రాధాన్యత. తరువాతనే, ఇతర వ్యాపకాలు. సమయపాలన, క్రమశిక్షణ, పిల్లల రక్షణ ఇలాంటి సదుపాయాలు వున్న పాఠశాలలనే, తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఎంచుకోవడానికి తాపత్రయ పడుతుంటారు. భరించలేని ఫీజులు వున్నా భయపడరు. కేవలం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతుంటారు.
జంటనగరాలలో వున్నా కొన్ని మంచి స్కూళ్లల్లో ఒకటైన ‘ గీతాంజలి పబ్లిక్ స్కూల్’ (బేగంపేట్)ను, నా మనవరాలి కోసం ఎంచుకోవడం జరిగింది. ఆ బడిలో చదువు గురించి విన్నాను కానీ, అక్కడ తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని వినలేదు. ఈ విషయం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. తెలుగు సాహిత్యపరంగా నాకు ‘నా మనవరాలే- వారసురాలు’ అన్న ఆశ పుట్టింది.


కవితా గానానికి మొదటి బహుమతి పొందిన ఆన్షి.నల్లి
నా మనవరాలు ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంగా రెండవ తరగతి చదువుతున్నది. ఈ వయసులోనే మహాకవి శ్రీశ్రీ కవిత ‘వర్షీయసి’ చూడకుండా, చక్కగా వినిపించి బహుమతి పొందడమే కాదు, టీచర్ల ప్రశంశలు కూడా పొందింది. సందర్భాన్ని బట్టి విచిత్ర వేషాలు వేసి,ఆ పాత్రకు న్యాయం చేకూరుస్తుంది. పాఠశాలలో జరిగే వివిధ సందర్భాలలో నృత్య కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చిత్రలేఖనం,చార్ట్ తయారీ పోటీలలో పాల్గొని బహుమతులు పొందుతుంది. బడిలో నేర్పించే సంగీతం, కరాటే, క్రీడలు, డ్రిల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇదంతా, తనలో ఉత్సాహం వున్నా తల్లిదండ్రుల, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం వల్లనే సాధ్యం అవుతున్నది. ఇలా రాస్తుంటే నేను నా మనవరాలి గొప్పలు చెబుతున్నానని పాఠకులు అనుకోవడంలో తప్పులేదు కానీ, ఇందులో నా స్వార్థం కొంత వున్నా, పిల్లలు అందరికీ ఉపయోగపడాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.
కేవలం చదువును మాత్రమే దృష్టిలో ఉంచుకుని, పిల్లల్లోని సృజనాత్మక శక్తిని నిర్దాక్షిణ్యంగా అణగదొక్కే తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఇదంతా చెప్పడం. ఇలా చదువుతో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొనే పిల్లలు మంచి విద్యావంతులు కాగలరు. మంచి ఉపన్యాసకులు, మంచి రచయితలు, మంచి చిత్రకారులు, మంచి నృత్యకారులు, మంచి నటులు కాగలరు. మంచి దృఢసంకల్పంతో ఎంతటి పనినైనా సులభంగా చేయగల నేర్పరులవుతారు. ఉన్నత స్థానాలకు చేరగలుగుతారు. జీవితం, కుటుంబం, మంచి-మర్యాద వంటి ముఖ్యమైన విషయాలను అవగాహన చేసుకోగల సమర్థులవుతారు. తమ పిల్లలు ఇలాంటి భావిభారత పౌరులు కావాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోకుండా వుంటారు! అందుకే పిల్లల భవిష్యత్తును విద్య సంస్థలకే వదిలేయడం సరికాదు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం.
పిల్లల కోసం కొంత శ్రమ, కొంత ఓపిక, కొంత సమయం కేటాయించడం తల్లిదండ్రులకు తప్పనిసరి. నా మనవరాలు ‘సండే స్కూల్’ (చర్చి) లో సైతం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు పొందుతుంది. ఆమెకు ఎప్పుడు ఎలాంటి బహుమతి వచ్చినా, ప్రోత్సాహంగా క్యాష్ రూపంలో నా వంతు అదనపు బహుమతిని ఇస్తుంటాను. మన ప్రోత్సాహం ఏ రూపంలో వున్నా, వారు ఉత్సాహంగా ముందుకు సాగడానికి, అది ‘ఉత్ప్రేరకం’గా పని చేస్తుందని చెప్పక తప్పదు.
~
చదువంటే
మార్కులు – ర్యాంకులు
మాత్రమే కాదు..!
జీవితానికి అవసరమైన
సంస్కారం
మంచి – మర్యాద
ప్రేమ – దయ
అన్నీ ఉండాలి,
అప్పుడే – కదా!
చదువుకు సార్థకత
బ్రతుక్కి భరోసా..!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
18 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
sagar
చాలా మంచి వ్యాసమే కాదు. నేటి పరిస్ధితులకు అద్దంపట్టే విధంగా వ్రాశారు సర్. నిజమే, చదువు ర్యాంకులు తప్ప మరో వ్యాపకానికి తావులేని వ్యవస్ధ రాజ్యమేలుతున్న రోజులివి. అలాంటి చక్రబంధంనుంచి పిల్లలను బయటకు తీసుకురావడంలో తల్లితండ్రుల పాత్ర చాలా ముఖ్యం.ఈ విషయంలో రాణిస్తున్న ఆన్షికి శుభాశీస్సులు సర్. అలాగే తాను కోల్పోయిన అపురూపాన్ని కుమార్తెకు కల్పించిన నీహార గారికి అభినందనలు. మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు సర్ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందనకు ధన్యవాదాలు .
సుగుణ అల్లాణి
పిల్లల విషయం మీరు సూచించిన ప్రతి విషయం అక్షరసత్యం సర్… ఒక అధ్యాపకురాలిగా నా జీవితం లో సగం కన్నా ఎక్కువ భాగం విద్యార్థులతో గడిపాను. పాఠాలలోని ప్రతివిషయం జీవితానికి అన్వయించడం చేసేదాన్ని … పిల్లల లోని ఆసక్తిని గమనించి వారికి ఊతం ఇస్తే తీగలాగా అల్లుకు పోతారు…. చక్కని వ్యాసానికి అభినందనలు

డా కె.ఎల్.వి.ప్రసాద్
మీరు చాలా అదృష్టవంతులు
మీకు కృత జ్ఞత లు.
J Mohan Rao
ప్రస్తుత విద్యాలయములు కేవలము rank
సంపాదనకు పరిమితము అయ్యాయి. ముఖ్యంగా
Extra curricular విషయములలో విద్యార్ధులు
Focus పెట్టగలిగే విధంగా వసతులు లేవు.
Parents కూడ కేవలము మంచి rank వస్తే
గొప్పగా చెప్పు కోవటానికే priority యిస్తున్నారు
మార్పు అందరిలో రావాలి
మంచి వ్యాసం.
నమస్తే. ధన్యవాదములు. అందరికీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Neelima
డాక్టర్ గారూ
నమస్కారములు
మీ ఈ వ్యాసంలో extra curricular activities కోసం చాలా బాగా చెప్పారు..
వాటి అవసరం ఎంత అన్నది కూడా మీరు చెప్పినది చాలా కరెక్ట్..
ఆఖరున రాసిన పంక్తులు..
“చదువంటే మార్కులు కాదు……
……”
అన్నవి అక్షర సత్యాలు..
ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
అంకుల్ చాలా బాగుంది ఈ రైట్ అప్ నిజంగా ఎడ్యుకేషన్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టం బాగా ఎండా వేశారు నిజంగా ఒక గ్రాండ్ పేరెంట్ గా ఒక పేరంటగా ఒక ఒక సొసైటీ లో responsible citizen ga చాలా బాగుంది..
–డా.సునీల్ హరిసన్
హైదరాబాద్
డా కె.ఎల్.వి.ప్రసాద్
బాబూ…ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మంచి మార్గం ద్వారా చక్కని సృజనాత్మకతను వెలికి తీసి నడిపించడానికి తలిదండ్రులు ఓపిక చూపించాలి..చాలా బాగుంది మెసేజ్ ప్రసాద్ గారు..
—-డా.ఝాన్సీ నిర్మల
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు డాక్టర్ గారు
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఎంత మంచి వ్యాసం అందించారు సర్.ఆన్సీ ప్రతిభ చూస్తే కడుపు నిండిపోయింది. మీకు తగిన వారసురాలు తనే. నేను టీచర్ గా ,తల్లి గా పిల్లల్లో చూడాలని నిత్యం కోరుకునే అంశం ఈ సృజనాత్మక తే. అది జీవితాన్ని పరిపుష్టం చేస్తుంది.హృదయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యం గా,ఆహ్లాదంగా ఉంచుతుంది. మొఖంలో తేజస్సును,ఆత్మవిశ్వాసం ను పెంచుతుంది. ఇతరుల నుండి ప్రత్యేకతను ఇస్తుంది అన్నింటికీ మించి మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది.మీ మనుమరాలు ఆ దిశగా పయనించడం ఎంతో ముదావహం. ఈ వ్యాసం ద్వారా చదువే ముఖ్యం అనుకుంటున్న తల్లితండ్రులకు మంచి సందేశం అందుతుంది.చదువుని మించిన ఆత్మ తృప్తిని ఎదుగుదలని ఇచ్చే ప్రేరకాలు చాలా ఉంటాయని తెలుస్తోంది. చాలా విలువైన అంశం స్పృశించారు సర్.ధన్యవాదాలు


—నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు.
పుట్టి నాగలక్ష్మి
మంచి అంశం తీసుకున్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విద్యేతర విషయాలు తోడ్పడతాయి. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఆసక్తి ఉండడం అనే విషయాన్నీ ప్రస్తావించడం బావుంది. నేను సుదీర్ఘ కాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి ఈ విషయం గురించి చాలావరకు అవగాహన ఉంది.



మేము పిల్లలని వివిధ అంశాల కోసం తయారు చేసిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి అడ్డుపుల్లలు వేసేవారు. మళ్లీ కొత్తవారిని సెలెక్ట్ చేసుకుని ప్రోగ్రామ్ కి తయారుచేయడం ఎంత కష్టమో అనుభవించిన వారికే తెలుస్తుంది.
మీ మనవరాలికి ఆశీస్సులు. మీకు, మీకుటుంబ సభ్యులకు అభినందనలు.
Shyamkumar... Nizamabad
రచయిత డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు ఎన్నుకున్న ఈ అంశం గురించి ఎంత ఎంత ఎక్కువ రాసినప్పటికీ అది తక్కువే.
ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద స్కూల్లలో ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా విద్యార్థులకు చేర్పించారు. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే వీటికి సమయం కేటాయించటం లేదు. కాకపోతే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు వారి మీద ఎక్కువగా ప్రెషర్ ఉండకపోవడం మూలాన స్కూల్ బయట దొరికే సమయంలో పిల్లలు వాటిని వినియోగించుకుంటున్నారు.
మా సమయంలో స్కూల్ నుంచి నాలుగున్నర గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత మిగతా సమయం అంతా ఆటలకి పాటలకి వివిధ రకాల మానసిక ఉల్లాసానికి వినియోగించేవాళ్ళం.
అఫ్కోర్స్ అప్పుడు సెల్ ఫోన్లు టీవీలు లేవు అనుకోండి.
ఆలోచనలను పెంపొందింపజేసే మంచి మంచి విషయాలను మన దృష్టికి శీర్షిక ద్వారా మనకు అందజేస్తున్న డాక్టర్ కే.ఎల్ వీ ప్రసాద్ గారికి శుభాభివందనములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఈవారం జ్ఞాపకాల పందిరిలో – ర్యాంకుల పరుగుపందెంలో దాదాపు అందరూ (ఉపాధ్యాయుల తో సహా) మర్చిపోయిన సహపాఠ్య కార్యక్రమాలను గుర్తు చేశారు…సంపూర్ణ మనోవికాసానికి ఇలాంటివి చాలా అవసరం….మన బాల్యంలో హోమ్ వర్కులే ఉండేవి కాదు. పదవ తరగతి వరకూ ఆడుతూ పాడుతూ చదివేవాళ్ళo..అయినా ఏం లోటు వచ్చింది? ……..మంచి విషయాలు ప్రస్తావించారు
—-గోనుగుంట మురళీ కృష్ణ
తెనాలి
N.Bhujanaga Rao
సృజనాత్మకత అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం.పిల్లల్లో సృజనాత్మకత పెంచడం చాలా కష్టం అనుకుంటారు కానీ అది నిజం కాదు మరియు పుట్టుకతో వచ్చేది కాదు. తల్లిదండ్రులు/ఉపాధ్యాయుల సరియైన బోధనా పద్ధతుల ద్వారా పిల్లలలో సృజనాత్మకతను తీసుకరాగలరు. ఏ సమస్యనైనా పరిష్కారించే ప్రశ్నలు పిల్లలు అదిగేటట్లు ప్రోత్సహించడమే కాకుండా వారికి అర్ధమయ్యే రీతిలో చెప్పాలని,పెద్దవాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని తెలిపిన మీకు నమస్కారములు సిర్