నా.. దంత సంరక్షకులు..!!
నా జీవితం మలుపు తిరిగింది నా అనారోగ్యంతోనే. వూహించని విధంగా నేను దంత వైద్యుడిని కావడమే ఆ మలుపు. నాకు హై స్కూల్ స్థాయిలో అనారోగ్యం కలిగి ఉండకపోతే, నా భవిష్యత్తు మరో రూపంలో ఎదురు వచ్చి ఉండేది. వైద్యుడిని కావడం మూలానే, నా ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా, మంచి వైద్య సహాయం పొందే అవకాశం కలిగింది. ఇవి జరిగాక ‘అంతయూ మన మేలుకొరకే’ అన్నసూక్తిని నమ్మక తప్పడం లేదు. ఒక డాక్టరు, మరో డాక్టర్‌కు వైద్యం చేయవలసినప్పుడు, ఆర్థికపరంగా కొంత వెసులుబాటు కలగడమే గాక, ప్రత్యేక శ్రద్ధ తప్పక ఉంటుండన్నది జగమెరిగిన సత్యమే! ఇలాంటి సదుపాయాలన్నీ నాకు కలిసొచ్చిన అదృష్టమే.
ఈరోజుల్లో, నిజాయితీగల ఒక వైద్యుడు దొరకడం అదృష్టమే. వైద్యపరంగా, ఆర్థికపరంగా, నిజాయితీని శంకించే పరిస్థితులు దాపురించాయి ఇప్పుడు. అందుకే తెలిసినవారి ద్వారానే ఇలాంటి పనులు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు చాలామంది. వైద్యరంగం వ్యాపారరంగం అయిపొయింది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కరలేదనుకుంటాను. వైద్యరంగంలో ఉండడం వల్ల, నాకే కాదు నా బంధు మిత్రులకు సైతం మంచి వైద్యం అందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది వాస్తవం, నా అనుభవం, అంత మాత్రమే కాక నాకు ఒకసారి పరిచయం అయితే మరచిపోవడం అంటూ ఉండదు.


ఆ స్నేహాన్ని అలా కొనసాగిస్తూనే వుంటాను, అవసరం వచ్చినప్పుడే కాదు, అవసరం లేనప్పుడు కూడా పలకరిసుంటాను. ఈ మనస్తత్వం, అలవాటు నాకు ఎంతగానో మేలుచేసింది, చేస్తున్నది కూడా! అయితే, దీనికి అభిరుచి, అభిరుచికి ఓర్పు జత ఉండాలి. ఇవి రెండూ లేనివారికి, ఇది ఎంతమాత్రమూ సాధ్యం కాదు. ఇది నేను తెచ్చిపెట్టుకున్న అలవాటు కాదు. అంతర్గతంగా నా నరనరానా జీర్ణించుకుని వున్న లక్షణం.
నేను బి.డి.ఎస్.లో చేరేవరకూ దంతసంరక్షణకు సంబందించిన అంశాలలో అంతగా అవగాహన ఉండేది కాదు. నేను రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు దంత-సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడడం జరిగింది. ఒక దంతానికి పిప్పి వచ్చినట్టుగా సీనియర్లు తేల్చారు. అప్పుడు ఓ.డి.ఎస్ (ఆపరేటివ్ డెంటల్-సర్జరీ) విభాగంలో డా.యాదగిరి అనే డాక్టరుగారు హౌస్ సర్జన్‌గా చేస్తుండేవారు. డిపార్ట్మెంట్ హెడ్‌గా ప్రొ.సి.ఎస్.మూర్తి గారు ఉండేవారు. ఈ విభాగంలో పిప్పి పన్నుకు, సిమెంట్ ఫిల్లింగ్ చేయడం, మూలచికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్), పంటి తొడుగులు ( కేప్స్ లేదా క్రౌన్లు) చేయడం వంటి చికిత్సా విధానాలు ఇక్కడ జరుగుతాయి.
ఒక రోజు డా.యాదగిరి గారు నా పిప్పి పన్నుకు తాత్కాలిక ఫిల్లింగ్ చేశారు. అయినా అది చాలా సంవత్సరాల వరకూ చెక్కు చెదరలేదు. ఆ రకంగా ఆయన గుర్తుండిపోయారు. తరువాత, క్రింది దవడ లోని ఒక జ్ఞాన దంతం తీసివేయాల్సి వచ్చింది. నిజానికి పన్ను పరిస్థితిని బట్టి దానిని తీయడానికి, రెండు చికిత్సా విభాగాలు ఉంటాయి. కేవలం పళ్ళు తీయడానికి (extraction) ఒక విభాగం ఉంటుంది. దీనిని శాస్త్రీయ పరిభాషలో ‘Department of Exodontia’ అంటారు. ఇక్కడ ఏ ఇతర చికిత్సలు చేయరు. మరొకటి ‘Department of oral surgery’ అనబడే చికిత్సా విభాగము. కష్టమైన పళ్ళను శాస్త్ర చికిత్స ద్వారా తీయడం, దవడలకు – చికిత్సలు, వగైరా చికిత్సలు ఇక్కడ చేస్తారు. అప్పుడు ఈ విభాగానికి అధిపతిగా డా.తజమ్మల్ హుస్సేన్ ఉండేవారు. జాతీయ స్థాయిలో ఆయనకు చాలా గొప్ప పేరు ఉండేది.


ఆయనకు ఇద్దరు సహాయకులు ఉండేవారు. ఒకరు డా. రాములు గారు, రెండవవారు, డా. హరనాథ్ గారు. ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో డా. హరనాథ్ గారు నాకు పన్ను తీశారు. ఇదొక గొప్ప అనుభవం. ఇప్పుడు ఈ విభాగాన్ని, ‘Department of maxillofacial surgery’ అంటున్నారు.


ఆధునిక దంత చికిత్సా విధానాల్లో దీని ప్రాముఖ్యత గొప్పది. తరువాత, కొంతకాలానికి, పన్ను అరిగి జివ్వున గుంజడం మొదలైంది. అప్పుడు మా ప్రొఫెసర్ బి. శ్రీరామమూర్తి గారిని కలవడం జరిగింది. ఆయన ఆ పంటికి ఒక తొడుగు (క్రౌన్) వేయాలన్నారు. ఆ సదుపాయం హాస్పిటల్లో లేనందున చికిత్స నిమిత్తం డా. శ్రీరామమూర్తి గారి క్లినిక్‌కు వెళ్లాను. ఆయన క్లినిక్ అబిడ్స్ తాజ్ హోటల్‌కు దగ్గరలో ఉండేది. అక్కడ, ప్రొఫెసర్ గారి చేత క్రోన్ వేయించుకున్నాను. ప్రొఫెసర్ శ్రీరామమూర్తి గారు, ‘Department of Prosthodontics’కు హెడ్‌గా ఉండేవారు. ఆయనకు సాహిత్య సాంస్కృతిక అంశాల పట్ల మంచి అభిరుచి ఉండేది. ఈ రంగాలలో, విద్యార్థులను ఆయన బాగా ప్రోత్సహించేవారు.


తర్వాత చాలా కాలం వరకూ ఎలాంటి దంత సమస్య నాకు రాలేదు. దంత సంరక్షణ పట్ల కొంత అవగాహన వుండడడం అది సాధ్యమై ఉండవచ్చు. తర్వాత హన్మకొండకు వచ్చేవరకూ, ఎలాంటి దంతసమస్యనూ ఎదుర్కొనలేదు. ఇతరులకు దంతచికిత్సలు చేయడంలో నిమగ్నమైన నాకు, నా దంతసమస్యలు నన్ను పలకరించలేదు. కానీ 2013 తర్వాత, మళ్ళీ సమస్య మొదలయింది. చల్లటి పానీయాలు తాగినా, చల్లని పదార్థాలు తిన్నా పళ్ళు ‘జివ్వు’మని గుంజడం మొదలుపెట్టాయి. వాటిని భరిస్తూ చాలాకాలం నిర్లక్ష్యం చేస్తూ గడిపేశాను. ఒకసారి, మా అమ్మాయిని చూడడానికి హైదరాబాద్ (సఫిల్ గూడ) వెళ్ళినప్పుడు మొత్తం పళ్ళన్నీ జివ్వుమని గుంజడం, నొప్పిపెట్టడం మొదలై, ఆ తర్వాత ఉధృతమై భరించరాని పరిస్థితి ఏర్పడింది. మందులకు తాత్కాలిక ఉపశమనము తప్ప పరిస్థితి తీవ్రతలో మార్పులు రాలేదు. ఇక డాక్టరుకు చూపించుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.
హన్మకొండలో, నాకు తెలిసిన, నమ్మకమైన, పనిమంతుడైన దంతవైద్యుడు నాకు మిత్రుడు. దంతవైద్య కళాశాలలో నాకు జూనియర్. నన్ను గౌరవించి, మర్యాదగా వుండే దంతవైద్యుడు, డా. వై. మల్లేశ్వర్‌కు చూపించాను. అప్పుడు ఆయన ఎం.జి.ఎం ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ప్రైవేట్ ప్రాక్టీస్, హన్మకొండ చౌరస్తాలో ఉండేది (ప్రస్తుతం కాళోజి హెల్త్ యూనివర్సిటీలో, పరీక్షల నియంత్రణాధికారి, తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల చరిత్రలో ఆ స్థాయికి ఎదిగిన మొదటి దంత వైద్యుడు ఈయనే!). నా దంతాలన్నీ అరిగిపోవడం వల్లనే సమస్య వచ్చింది కనుక అన్నింటికీ, పంటి తొడుగులు (crowns) వేయాలన్నారు. సుమారు పదిహేను రోజులపాటు ఈ చికిత్సా కార్యక్రమం జరిగింది.


తర్వాత సమస్యలు రాలేదు. తృప్తిగా భోజనం నమిలి తినేవాడిని. గట్టి పదార్థాలు కూడా సులభంగా నమిలేవాడిని. ఆ తర్వాత వాటిని గురించి అసలు ఆలోచించలేదు. తర్వాత 2020 మధ్య కాలంనుండి, కుడివైపు పైన క్రింద, దంతాలు జివ్వుమని గుంజడం మొదలు పెట్టాయి. తాత్కాలిక మందుల ఉపశమనంతో మళ్ళీ నా దంతాలు నిర్లక్ష్యానికి గురిఅయినాయి. అలా 2021 వరకూ గడిపేశాను. కరోనా కాస్త తగ్గు ముఖం పడుతున్న రోజులు. మళ్ళీ భరించలేని పంటినొప్పి మొదలయింది. నా శిష్యురాలు అనదగ్గ, సహృదయిని, డా. కవితా రెడ్డికి ఫోన్ చేసి నా సమస్య వివరించాను. ఆ అమ్మాయి (నాకంటే చాలా చిన్నది) వెంటనే క్లినిక్‌కు రమ్మన్నది.


డా. కవితారెడ్డి నాకు పెద్దకూతురు లాంటిది. నాకు అమితమైన గౌరవం ఇస్తుంది. ప్రస్తుతం వరంగల్‌లో నైపుణ్యం గల దంతవైద్యుల్లో ముందువరుసలో, మొదటి స్థానంలో వుంది ఆమె. నేను డెంటల్ ప్రాక్టీసుకు దూరంగా ఉండడంతో, నాకు తెలిసిన వారందరికీ, డా. కవితారెడ్డి కుటుంబ దంతవైద్యురాలైంది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో చక్కని దంత వైద్య సేవలు అందిస్తున్నది. నా సమస్యకు అతి తక్కువ సమయంలో పరిష్కారమార్గం చూపించింది. ఇప్పుడు నాకు ఎలాంటి దంత సమస్యలూ లేవు. భవిష్యత్తు సంగతి చెప్పలేను.
నిన్నమొన్నటి వరకూ నేను అనేకమందికి దంత వైద్య సేవలు అందించాను. అవసరమైన ముందస్తు సూచనలు చేసాను. పాఠశాలలు, కళాశాలలు, దర్శించి దంత వైద్య అవగాహన కార్యక్రమాలు, దంతవైద్య శిబిరాలు నిర్వహించాను. నన్ను ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారో నాకు తెలీదు కానీ, నా దంతసంరక్షకులను మాత్రం నేనెన్నడూ మరచిపోలేను. వారి సేవలను నిత్యం గుర్తుంచుకుంటాను. ఈ అవకాశం అందించిన ‘సంచిక’ పత్రికకు ఎల్లప్పుడూ ఋణపడి వుంటాను.
‘ఆరోగ్యమైన దంతాలు – ఆనందానికి సంకేతాలు’.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
18 Comments
Dr.Harika
Good morning sir,
It’s a rare and great thing that having gratitude towards the people for the help that we got from them.
Good to hear that you are relieved from your discomfort sir & thanks to the doctors and are really inspirable.
Thank you sir for sharing your experiences and it in turn reminds us to be like that.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you Dr.Harika
For your wonderful words
Bhujanga rao
ఆరోగ్య పరిరక్షణ విషయంలో ,మీరు మహబూబాబాద్ తొలి పరిచయం ఐనప్పటినుండి ఈ రోజు వరకు,మీ సూచనను,సలహాలను తీసుకొని ఎందరో డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది.మీవద్ద డెంటల్ ట్రేటిమెంట్ తీసుకున్నాము.నిజాయితీ గల వైద్యుడు మాకు పరిచయం అవడం మా అదృష్టం. మీకు ఎల్లప్పుడూ మేము ఋణపడి ఉంటాము.మీ ప్రతి కష్టాలు, సుఖాలు జ్ఞాపకాల పందిరి ద్వారా మాకు అందిస్తున్నందుకు హృదయపూర్వక నమస్కారములు సర్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
భుజంగరావు గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
ఎన్.వి.ఎన్.చారి
ఊగేపంటికింద రాయి పడ్డట్లు అని ఒక సామెత
తగిలిన దెబ్బకే మళ్ళీ మళ్ళీ దెబ్బలు తగలడం యాధృచ్చికం
దేహమున్నవారికెల్లా సందేహాలున్నట్లే
దంతాలున్న వారికెల్లా దంతసమస్యలుంటాయి
దంతవైద్యునికి కూడా.
పళ్ళు బాగాలేకపోతే గట్టిగా నవ్వలేరు . మనసువిప్పి ప్రక్కవారితో మాట్లాడలేరు అమ్మోదుర్వాసన ఏ రోగానికైనా తలుపులు తెరిచేవి నోరు ముకు
అని ముక్కమూసుకొని నోరు కుట్టుకొని మరీ చెపుతున్నారిప్పుడు. దంతాలకూ గుండెకూ కూడా సంబంధముందని ఏదో వ్యాసచదివాను ఎప్పుడో
మీ వ్యాసం నా కండ్లు తెరిపించింది ముందు డాక్టరువద్దకు వెడతాను మంచి ప్రేరణ ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అవునా
మీ స్పందన కు ధన్యవాదాలండీ
చారిగారూ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
స్వయంగా వైద్యుడై నా తన ఆరోగ్య విషయంలో ఇతర వైద్యులపై ఆధార పడాల్సిందే నని చెబుతూ.. మీకు వైద్యం చేసినవారి సేవ ల గురించి రాసిన విషయాలు ఆసక్తికరoగా ఉన్నాయి..
—-వెంకట్రామ నర్సయ్య
జర్నలిస్టు
మహబూబాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమా
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
60వ సంచిక చదివిన సర్. మీరన్నట్టు వైద్యులు పరిచయం ఉన్న వారైతే. చికిత్స పట్ల విశ్వైసం ఎక్కువగా ఉంటది ఏచికిత్సలొ నైనా విశ్వాసం గొప్ప పాత్ర పొషిస్తుందనేది నా నమ్మకం. అందులొనూనఒకే వృత్తివారైతే చెప్పే పనేలేదు .చాలా సార్లుఅటువంటి వారు లభించటం. కష్టం .అట్లా విశ్సించదగ్గవారులభిస్తే ప్లాసిబొ ఎఫెక్ట్ తొనైనా బాగుపడుతరు. మీ రు అదృష్టవంతులు అటివంటి వైద్యమ్త్రులువలభించినారు మీకు.యాదృచ్ఛికమే కావచ్చు ఇది టైప్ చేస్తుంటే మీ శిష్యురాలన్నారే శ్రీమతి కవితా రెడ్జిని మీ అమ్మాయి చేసిన ఇంటర్ వ్యూ ఆకాశ వాణిలొ ప్రసార మౌతున్నది.
సంతోషం సర్
——-నాగిళ్ళ రామశాస్త్రి
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
వైద్యులకే వైద్యం అన్న సూక్తికి అద్దంపడుతుంది సర్ మీ రచన. ఇన్నిరోజుల తరువాత కూడ మొదటినుంచి చికిత్సచేసిన పాత క్రొత్త తరాలను గుర్తుచేసుకోవడంలో మీ గొప్పదనం ఉట్టిపడుతుంది. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్
———సాగర్ రెడ్డి
చెన్నై.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఏదైనా ఒక ఆరోగ్య సమస్య నుండి బయట పడాలంటే సరైన సమయంలో సరైన వైద్యుని కలవాలి అన్న… మీ అనుభవ సలహా మాకు చాలా బాగా నచ్చింది. అలా కాక ఏదో ఒక వైద్యుని తాత్కాలికంగా సంప్రదించడం వల్ల కలిగే ఇబ్బందులు….స్వీయ అనుభవంలో వచ్చిన పాత జ్ఞాపకం ఒకటి గుర్తుకు వస్తుంది.
అది 1884 ,86 మధ్యకాలం. అప్పుడు నేను మెహబూబాబాద్ దగ్గర ఉన్నటువంటి గార్ల అనే రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని .అప్పుడు మా మామగారు హైదరాబాదులోనే ఆర్కె నగర్ ప్రాంతంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చే వారం. అప్పుడు మా ఆవిడ తీవ్రమైన పంటి నొప్పి తో బాధపడుతూ ఉండేది .ఆ కాలంలో సరైన దంతవైద్యులు మల్కాజ్గిరి ప్రాంతంలో ఉండేవారు కాదు. నేను ఒకసారి మల్కాజ్గిరి బస్టాండ్ దగ్గర దంత వైద్యశాల అనే బోర్డుతో ఒక చిన్న డిస్పెన్సరీ ఒకటి కనిపించింది. అక్కడికి వెళ్ళి విచారించగా అందులో ఒక వయో వృద్ధుడైన డాక్టర్ కనిపించారు. ఆయన పూర్వము మిలిటరీ హాస్పిటల్ లో దంతవైద్యుని గా పనిచేసి రిటైర్డ్ అయు తను ఒక్కరే ఆ డిస్పెన్సరీ నడిపిస్తున్నారు .నేను గమనించిన విషయం ఏంటంటే ఆయన దగ్గర రోగిని అనువుగా పరీక్షించడానికి కావలసిన రిలాక్స్డ్ చైర్ కానీ, సరైన వైద్య పరికరాలు కానీ కనిపించలేదు. వచ్చిన పేషంట్లని ఒక పొడవాటి చెక్క బల్ల పై పడుకోబెట్టి ఈయన వైద్యం చేస్తూ ఉన్నారు .ఆప్రాంతంలో సరైన వైద్యుడు మరొకరు లేరు కనుక నేను మరుసటి రోజు మా ఆవిడని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను.సమస్య ఏమిటంటే.. పంటి నొప్పి అని చెప్పటంతో ఆయన అదే బెంచి మీద పడుకోబెట్టి ఆ పంటి చుట్టూ చిగురుకు మత్తు ఇంజక్షన్ ఒకటిచ్చి ఒక పట్టకారు లాంటి సాధనంతో ఆ పంటిని పీకడం మొదలు పెట్టారు. ఎంత ప్రయత్నించినా అది ఊడి రావడం లేదు. ఈవిడ విపరీతమైన నొప్పి అని చెప్పటంతో తిరిగి రెండు ఇంజెక్షన్లు ఇచ్చి పక్కన పది నిమిషాలు ఆగు అని చెప్పి తిరిగి అదే పని చేసినా ఆ పండు తీయడం వీలుగాక మూడవ రోజు రమ్మన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత దవడ మొత్తము వాచి పోవటంతో భోజనం చేయడానికి కూడా వీలు కాలేదు .
ఈ విషయం తెలుసుకున్న మా మామగారు మరుసటి రోజు ఆయన ఆఫీసులో పనిచేస్తున్న ఒక వ్యక్తి ద్వారా సరైన డాక్టర్ అడ్రస్ కనుగొని ప్యారడైజ్ సర్కిల్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మెహతా అనే వైద్యుడు ఎక్స్‌రే ద్వారా పంటి మూలమును గమనించి చాలా సులువుగా పిప్పిపన్ను తీయగలిగారు .ఏవో సాధారణమైన మందుల ద్వారా రెండు రోజుల్లోనే బాధ తగ్గిపోయింది
దంతవైద్యులైన మీరే మీ సమస్యను ఎన్నో రోజుల నుండి ఎదుర్కొంటున్నారంటే సాధారణ ప్రజల అవస్థ వర్ణనాతీతం.
——బి.ఎన్. కె.రెడ్డి.
సఫిల్ గూడ
సికింద్రాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రెడ్డి గారూ
ధన్యవాదాలు మీకు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Sir namasthe andi.
Jnapakala pandiri lo mee dental anubhavalu.ninnane chadivi reply sagam type cheseppatiki ph kavadam tho destrub ayi poindi.
Vishayam yedaina meeru cheppe vidhanam bagane chadivimpa chesthundi.
Dental samasya ni teerchina andari perlatho saha jnapakam undadam goppa vishayam.
Jnapaka sakthi tho batu rachana asakthi great.
—–శ్రీమతి సుజన పంత్,
భీమారం.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మేడం
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శుభోదయం.. జ్ఞాపకాల పందిరి 60 లో దంతవైద్యంలోని రకరకాల విభాగాలను తెలియచేసి మాకు అవగాహన కల్పించారు.
–జి.శ్రీనివాసా చారి
కాజీపేట.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చారిగారూ
ధన్యవాదాలు.