“టౌన్ కొచ్చి ఇన్నేళ్లయినా నువ్వు మన ఊరిని, నీ పొలాన్ని మర్చిపోలేకపోతున్నావు, వెంకటప్పయ్యా.”
“ఎట్లా మర్చిపోతాను కృష్ణయ్యా! నేను కాస్తా కూస్తో చదువుకున్నా వ్యవసాయపు పనుల కోసం నాగలి పట్టాను. ఆ తర్వాత ట్రాక్టరూ ఎక్కి పొలం దున్నినవాణ్ణి. మన ఊళ్లో ఎక్కువ మెట్ట ప్రాంతం కావటాన ఎప్పుడూ ఏదో ఒక తోటను పెంచేవాళ్లం. అప్పట్లో నాకు తమలపాకు తోట వదిలి ఇంటికి రాబుద్దే అయ్యేది కాదు. నా ఊరు నా సర్వస్వం, నా పొలమే నా ఊపిరి అనుకునేవాణ్ణి. నా పొలంలో నుంచి, చిటికెడు మట్టి తీసుకుని నోట్లో వేసుకోవాలని తరచూ అన్పించేది. ఏం లాభం! నేను నమ్ముకున్న నా ఊరి ఆకాశం నుంచి దూరంగా జరిగిపోయాను. నాదనుకున్న నేల నాక్కూకుండా కదిలిపోయింది. చివరకు మా నాన్న పెంచిన వేప చెట్లను కూడా ఇంటి ఖర్చుల కోసం అమ్ముకున్నాను” అంటుంటే వెంకటప్పయ్య గొంతు భారమయింది.
“నువ్వూ నేనూ అనేదేముంది వెంకటప్పయ్యా! 1977 గాలి వానతో మన లాంటి సన్నకారు రైతులు మరీ ఘోరంగా నష్టపోయారు. ఇప్పటి వరకూ కోలుకున్నదే లేదు.”
“అవును కృష్ణయ్యా. ఆనాటి రాత్రిని ఇప్పటికీ మర్చిపోలేను. నా కొడుకు ఆర్నెల్ల పసివాడు. గాలి మోతకు నిద్ర పట్టక ఏడుస్తుంటే చెక్క ఉయ్యాలలో వేసి వాళ్లమ్మ ఊపసాగింది. వాడు కళ్లు పెద్దవి చేసుకుని భయం భయంగా ఇంటి కప్పు వంక చూస్తా, పడుకున్నాడు. నా ఇంటి వెన్నుగాడి బయటిగాలి వేగానికి ఊపిడవసాగింది. ఇంటి కప్పు కప్పంతా లేచిపోద్దేమోన్న భయం పుట్టింది.”
“నాగ్గూడా బాగా గుర్తుంది వెంకటప్పయ్యా. నీ ఇంటి గోడలు గజం మందాన కట్టిన వెనకటి రాతి గోడలు. పైగా పెంకుటింటికి మల్లే గోడల్లో దూలాలు బిగించి వున్నాయి. ఆ దూలాల మీద చండ్ర గుజ్జులు దిగగొట్టివున్నాయి. వాటి మీద మంచి చేవున్న తాటి వాసాలు కప్పు కింద తండు కోసం నిలువుగా అడ్డంగా అమర్చివున్నాయి. ఆ వాసాల మీద నేసిన రెల్లు గడ్డి కప్పు కావటాన అంత పెద్ద గాలివానా నీ ఇంటినేం చెయ్యలేకపోయిందని ఊళ్లో అందరూ అనుకున్నారు.”
“ఏదో భగవంతుడి దయ కృష్ణయ్యా. ఇంటిని కాపాడిన దేముడు పొలాన్ని కాపాడలేకపొయ్యాడు.”
“ఆ రోజు సముద్రంలో అలలేమన్నా సామాన్యంగా వచ్చినయ్యా వెంకటప్పయ్యా? తాడి ఎత్తున వచ్చాయని జనం చెప్పుకున్నారు. ఆ అలలే కృష్ణానది లోపలికంటా వచ్చాయి. మన ఊళ్ల చుట్టూ పారే కృష్ణా నీటిని ఉప్పుమయం చేసి పోయ్యాయి గదా.”
“ఆ తర్వాత కృష్ణమ్మకు కొద్దిపాటి వరదలోచ్చినా మన నీళ్లలోని ఉప్పుశాతం ఏ మాత్రం తగ్గలేదు. పైగా మన చుట్టు పక్కల ఊళ్లలో నేలలోని నీటి శాతం తగ్గిపోయింది. పొలాల్లో కరెంటు మోటర్లు ఆడించినా నీరందకుండా పోయింది. కేవలం రైతుల కళ్లలో కన్నీటి ఊటలే ఊరాయిగా కృష్ణయ్యా.”
”ఆ సంగతులన్నీ నిన్నా మొన్నా జరిగినట్లుగా వున్నాయి వెంకటప్పయ్యా. గవర్నమెంటుకు మనమంతా కలిసి ఎన్ని అర్జీలు పంపాం? కేంద్ర ప్రభుత్వానికి రాస్తామన్న మాటే వాళ్లు చెప్పుకుంటూ వచ్చారు. చివరకు మన రైతులు ముఖ్యమంత్రుల కాళ్లు గూడా పట్టుకుని, కన్నీరు మున్నీరయ్యారు. ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్షలూ చేశారు.”
“ఎట్టకేలకు ప్రభుత్వం రైతుల గోడు ఆలకించింది. కృష్ణ నుంచి కాలువలు తవ్వించి మన పొలాలకు నీళ్లు మళ్లిస్తామని చెప్పింది. మన రైతులు కూడా ఒక సంఘంలాగా ఏర్పడ్డారు. తమ వంతు సహకారంగా ఎకరాకింతని కాలువల ఖర్చు భరిస్తామన్నారు. కాని మన రైతుల దురదృష్టం కృష్ణయ్యా. కాలువలు తవ్వే కాంట్రాక్టర్లు కక్కుర్తి పడ్డారు. ‘ఆక్విడట్’ బదులుగా రేవులో ‘సైఫన్’ కట్టారు. రోడ్డు క్రాసింగుల దగ్గర ‘కల్వర్టులు’ కాకుండా ‘తూములు’ వేసి మమ అనిపించారు. దీనికి తోడు మన రైతుల్లో కూడా పెత్తందారులైన వారి స్వార్థానికి తల ఒగ్గి ఆ ప్రాజెక్టులో పని చేసే అధికారులు కూడా కాలవల తవ్వకంలో విపరీత అదేశాలు ఇచ్చారు. ఇలా రైతుల్లో కొంత ఐకమత్యం లేకపోవటం కూడా మనలాంటి వారికి నష్టాన్నే మిగిల్చింది. అటు ప్రకృతీ, ఇటు పరిస్థితులూ కలిసి తవ్విన కుడి ఎడమ కాలవల్లో నీటి జాడే లేకుండా పోయింది. పొలాలకు ఆరుతడులు ఇద్దామనుకున్న గవర్నమెంటు ఆలోచన, ఆలోచనగానే మిగిలిపోయింది. పైగా దానికితోడు కృష్ణమ్మకు మరలా వరద వచ్చింది. ఆ వరదకు కాలువలు పూడిక వేసిపోయాయి. కాంట్రాక్టరుకు మాత్రం ప్రకృతి విపత్తు కింద గవర్నమెంటు నుండి నష్టపరిహారం వచ్చింది. మన పంట పొలాలూ, రైతుల ఆశలూ అడుగంటిపోయాయి గదా” అంటుంటే వెంకటప్పయ్య మాటల్లో ఆవేదన తొంగిచూసింది.
“ఆ సంగతులన్నీ ఎంత మర్చిపోదామన్నా నేను మర్చిపోలేకపోతున్నాను వెంకటప్పయ్యా. అప్పుడే మన రైతులు మళ్లీ నిరాహారదీక్షలు చేస్తిరిగా. గవర్నమెంటును అదే పనిగా ప్రాధేయపడ్డారు. దాంతో కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులలో ఈ సాగునీటి పథకాన్ని చేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ పథకం అమలులోకి రావటం కోసం ‘నాబార్డు’ కూడా నిధులిచ్చింది. మన రైతులు కూడా నీటి పారుదల అభివృద్ధి సంఘంలాగా ఏర్పడ్డారు. మన తరపు నుంచి కూడా శాయశక్తులా పాకులాడారు. సాగునీటి పథకం దిశగా పని జరుగుతుందని అందరం ఆశపడ్డాం. కాని ఆశలు అడియాసలే అయ్యాయి.”
“అప్పుడేగా కృష్ణయ్య చేసేదేం లేక నా మనసును బండరాయి చేసుకున్నాను. కళ్ల నుంచి కారే నీటిని అదిమిపెట్టుకుని నాకున్న నాలుగెకరాల తోట పొలాన్ని ఇటుకల తయారీదార్లకు అమ్ముకున్నాను. పచ్చని మొక్కలతో వుండాల్సిన పొలం మట్టి గుట్టలు, ఇటుక ముక్కలుగా మారిపోబోతుంది. పెళ్లాం పిల్లల్ని తీసుకుని కడుపు చేత బట్టుకుని ఇక్కడి కొచ్చి పడ్డాను. తినీ తినకా రోజులు గడిపాం. రెక్కలు ముక్కలు చేసుకున్నాం. పిల్లలు కష్టపడి చదువుకున్నారు. అక్కర కొచ్చారు. ఏదో ఇలా గడిచిపోతుంది. కాని మన ఊరంటే మమకారం మాత్రం తగ్గట్లేదు. ఇక్కడి కొచ్చిన కొత్తల్లో తెగ ఆశగా ఎదురు చూసేవాణ్ణి. మన సాగు నీటి పథకం కాస్తా ఎత్తిపోతల పథకంగా మారింది గదా. ఏమైనా మార్పు వచ్చుద్దేమో? మళ్లీ ఊళ్లోకి వెళ్లొచ్చు అని ఆశ పడ్డాను.”
“ఈనాటి వరకూ ఏ మార్పూ లేదు వెంకటప్పయ్యా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నది. దాంతో పాటు కరెంటు కోత సమస్య, డ్రైనేజీ సమస్య కూడా తోడయినాయి. ఇప్పుడు రైతు గాలిలో దీపం పెట్టి దాని వంక చూస్తూ నేల వంకా, నింగి వంకా చూడటమే. రోజులు భారంగానే గడుస్తున్నాయి. నీ పనే రైటని మేమంతా అనుకుంటాం. ఇవ్వాళ అనుకోకుండా ఈ కల్యాణ మంటపంలో నువ్వు కనపడి ఇలా మీ ఇంటికి తీసుకొచ్చావు. మనిధ్దరం పాత సంగతులన్నీ దేవుకున్నాం.”
“ఇన్నేళ్లయినా నాకు ప్రాణం మన ఊరి మీదకే లాగుద్ది కృష్ణయ్యా. మరలా, ఆ రోజులు తిరిగి వచ్చి నేను మనూళ్లో వుండగలిగితే ఎంత బావుండును? నా పొలంలో నిలబడి ఆ నేల వాసన పీల్చగలిగితే, ఆ మట్టిని నా దోసిట్లో నింపుకోగలిగితే, ఈ బతుక్కు ఇంకేం అక్కర్లేదు అన్పిస్తుంది. కానీ ఇప్పుడా పొలం నాది కాదు. ఆ పొలంలో ఇటుకల మట్టి కోసం పెట్టిన గోతులు వుండి వుంటాయి. నా ఇల్లు ఏనాడో చివికిపోయింది. ఫలానా ఊరి వాడినని చెప్పుకోవటం మాత్రమే మిగిలింది. ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నానా అని నాకే నవ్వు వస్తుంది. కాని నీలాంటి వాళ్లు ఎవరైనా కనపడితే మాత్రం నా దుఃఖం కృష్ణమ్మ ప్రవాహంలా ఎగదన్నుకొస్తుంది.” అన్నాడు వెంకటప్పయ్య.
***
అప్పటి దాకా లాప్టాప్లో ఏదో చూసుకుంటున్న వెంకటప్పయ్య కొడుకు హర్షవర్ధన్ వీళ్ల దగ్గరకొచ్చాడు.
“బాగున్నారా కృష్ణయ్య బాబయ్!”
“బాగానే వున్నాం రా అబ్బాయి! నిన్ను చూసి చానా ఏళ్లయింది. ఎక్కడుంటున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎమ్మెస్సీ చదివావని ఆ తర్వాత ఏదో ఉద్యోగం చేస్తున్నావని లోగడ విన్నాను.”
“అవును బాబయ్. అది చాలా సంవత్సరాల క్రిందటి మాట. ఎమ్మెస్సీ ఫిజిక్స్ తర్వాత సోలార్ ఎనర్జీ మీద పి.హెచ్.డి చేశాను. సోలార్ ఎనర్జీ ఫీల్డ్ లోనే కొన్నాళ్లు, ఉద్యోగం చేశాను. ఐదేళ్ల కిందట అదీ మానేసి సొంతంగా వ్యాపారం పెట్టాను. సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ను దేశ విదేశాలకు కూడా సప్లై చేయగలుగుతున్నాం. దేముడి దయవలన, మీలాంటి వారి ఆశీస్సుల వలన వ్యాపారం బాగానే వున్నది. అమ్మా నాన్నల్ని చూద్దామని నిన్నే ఇక్కడికి వచ్చాను.”
హర్షవర్ధన్ చేసేదేంటో కృష్ణయ్యకు పూర్తిగా అర్థం కాకపోయినా అతనేదో సోలార్‌తో పని చేసే వస్తువులను సంబంధించిన వ్యాపారం చేస్తున్నాడని మాత్రం అర్థమయింది.
“బాబాయ్! మన ఊరిని మా నాన్న ఇంతగా కలవరిస్తున్నాడని నాకు తెలియదు. అమ్మ కూడా ఎప్పుడూ ఏం చెప్పలేదు. ఇప్పుడు ఓ నాలుగెకరాల పొలం బేరానికొస్తే చెప్పండి. దాంతో బాటు ఇటుకల బట్టిల కోసం నాన్న అమ్మేసిన పొలమూ మరలా అమ్మూతారేమో కాస్త ఓపిగ్గా కనుక్కోండి. వీటిని కొని వెంటనే రిజిస్టేషన్ కూడా పెట్టుకుందాం. నా చదువు, ఉద్యోగం, ఆ తర్వాత వ్యాపారంలో పడిపోయాను. తమ్ముడిక్కూడా ఈ సంగతులేమీ తెలియవనుకుంటాను. ఇంట్లో అమ్మనాన్నల్ని సుఖపెడుతున్నాను, వాళ్లకే లోటు లేకుండా చూస్తున్నాననుకున్నాను. కాని నాన్న ఆలోచలన్నీ పసికట్టలేకపోయాను. ఇంకో మాట మా పాత ఇంటి స్థానంలో కొత్త ఇల్లు కట్టించే ఏర్పాట్లు కూడా చేస్తాను. త్వరలో నేను మనూరు వస్తాను. ఊరి కోసమూ, ఏదైనా చేస్తాను” అన్నాడు భావోద్వేగంతో.
కృష్ణయ్య నవ్వి వూరుకున్నాడు. అప్పుడు గవర్నమెంటు వారు మాలాంటి వాళ్లకు హామీలిచ్చారు, ఇప్పుడు హర్షవర్థన్ ఏదేదో చెప్తున్నాడునుకున్నాడు.
ఇప్పుడు మాట్లాడింది తన కొడుకు హర్షవర్ధనా? లేక తనేదైనా భ్రమ పడుతున్నాడా అని వెంకటప్పయ్య కాస్త నివ్వెరపోయాడు. ఇవ్వన్నీ తాత్కాలికంగా తన ఓదార్పు కోసం చెప్పే మాటలు, తన వేదన తగ్గించటానికి ఊరడింపు తప్పితే మరేంకాదని మనసులో అనుకున్నాడు.
కృష్ణయ్య ఇక వెళతానని లేచాడు. హర్షవర్ధన్ డ్రైవర్ని పిలిచి బస్టాండ్‌లో దింపి రమ్మని పంపించాడు. వెళ్లే ముందు కూడా కృష్ణయ్యకు పొలం సంగతి మరో మారు గుర్తు చేశాడు.
“వెంకటప్పయ్యకిప్పుడు డెబ్భై ఏళ్లు దాటి వుంటాయి. ఇక వ్యవసాయం పనులు చేయలేడు. ఆయన కొడుక్కు కూడా వ్యవసాయం చేయటం, అందులోనూ మన పొలాల్లో తోటలవీ పెంచటం ఏం తెలుస్తుంది? అచ్చంగా కూలీల మీదే ఆధారపడాలి. వ్యాపారాలు చేసుకునే వాడికి మొక్కలూ, నేలా అనుపానులు అంతుబడతాయా? అలాంటప్పుడు ఇక్కడ పొలం కొని ఏం చేసుకుంటాడు? గబగబా రేట్లు పెరిగి ఆస్తులు కూడటానికి ఇదమన్నా టౌను కాదుగా?” అని ఒకరన్నారు.
“డబ్బు బాగా సంపాదించి వుంటాడు. ఇదీ ఒక రకం పెట్టుబడి కింద వుంటుందనిపించి వుటుంది. అందుకే ఇల్లు కట్టి పొలం కొనాలనుకోవటం. తండ్రి ఇంకా ఊరిని కలవరిస్తున్నాడు అంటున్నారుగా. అటు తండ్రి కోరికా తీర్చిన వాడవుతాడు ఇటు ఆస్తీ పోగవుతుందిలే” అని మరొకరు అన్నారు.
ఇలా ఎవరికితోనట్లు వారు అనసాగారు. వారి ఆలోచనల మధ్యే హర్షవర్ధన్ తమ పాత ఇంటి స్థలాన్ని బాగు చేయించి కొత్త ఇంటి పనుల కోసం సిమెంటూ, ఇసుకా, ఇనుమూ లాంటి వాటిని ఊరికి చేర్పిస్తున్నాడు. తాపీ వాళ్లు కూడా వచ్చి పనులు మొదలు పెట్టారు.
“ఇదసలే చలికాలం. నీకీ మధ్య ఆయాసం ఎక్కువగా వస్తున్నది. ఆ దుమ్ము ధూళిలోకి నువు రావద్దు. నువ్వీ వయస్సులో అటూ ఇటూ తిరగొద్దు. శంఖుస్థాపన అంటూ నువ్వేం హైరానా పడకు. నేనంతా ఏర్పాటు చేశాను. కాంట్రాక్టరు కప్పగించాను. అతను నమ్మకస్థుడే. ఇల్లంతా అయ్యాక అమ్మా మీరూ వచ్చి చూద్దురు గాని. పొలం కొనే సంగతి కూడా నేను మర్చిపోలేదు, అన్నీ సజావుగానే జరుగుతాయి.”
కొడుకు మాటలకు వెంకటప్పయ్య పెదవులపై చిరునవ్వులు పూశాయి. ఆయాసంతో పట్టేసిన ఛాతీ ఇప్పుడు తేలిగ్గా హాయిగా వున్నదినిపించింది. తన ఊర్లో తను చివరి వరకూ వుండి అక్కడి మట్టిలో కలిసిపోతే చాలనిపించింది.
తీరిక చూసుకొని హర్షవర్ధన్ ఊరికి వచ్చాడు. అక్కడి వారితో మాట్లాడాడు. అంతా కలసి పొలాల వైపుకు వెళ్లారు. ఆ గుంటలు పెట్టిందే మీ పొలం అని చూపించారు. దాంట్లో ఒకప్పుడు ఏ తమలపాకు తోటో ఏపుగా వుండి వుండేదనుకున్నాడు. ఆ దగ్గర్లోనే కొద్దిగా జామ చెట్లు, కొబ్బరి చెట్లూ వున్న తోటను అమ్ముతామన్నారు.
“సరే నండీ. దీంతో పాటు మా పొలాన్నీ అమ్ముతారేమో కాస్త కనుక్కోండి. రేటు పెచ్చైనా ఫర్వాలేదండీ.” హర్షవర్ధన్ పట్టుదల గానే అడిగడు.
అక్కడొక మోటర్ షెడ్ వుండే దాని దగ్గర అందరూ కూర్చున్నారు.
“ఎందుకయ్యా! నీకిప్పుడు తోటలూ, దోడ్లూ, ఊళ్లో ఇల్లూ? ఏం చేసుకుంటావు? కడుపులో నీళ్లు కదలకుండా చల్లగా వుండక? నీ వ్యాపారం బాగున్నది. మంచి సంపాదనా వున్నది. ఈ వ్యవసాయం మీద ఏమీ మిగలదు. శ్రమ పడటమే అవుతుంది.”
“కాదులే మావయ్యా. ఇక్కడి కష్టాలన్నీ లోగడే కృష్ణయ్య బాబాయి చెప్పాడు. తనిప్పుడు మా ఇల్లు కట్టే చోట వుండి మేస్త్రీతో మాట్లాడుతున్నాడు. సంపాదన ఒక్కటే, మనకు ముఖ్యం కాదు. మనసుకు నచ్చినట్లు వుండటం కూడా ముఖ్యమే. నాన్నకిక్కడ వుండటం ఇష్టం. ఈ పొలాల్లో తిరగటం మరీ ఇష్టం. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు. నాకిప్పుడు ఆయన కోర్కె తీర్చే అవకాశమున్నది. మాకు మీ అందరి ప్రేమా, సహకారం ఇక్కడ దొరుకుతుంది. పొలాల్లో నీళ్ల మోటర్లకు చాలినంత కరెంటు లేక తోటలు సరిగా తడవటం లేదంటున్నారు. వేసవి వస్తే పల్లెటూళ్లలో ఒకటే కరెంటు కోత వుంటున్నది. ఆ ఇబ్బంది ఇక్కడ మనకూ వున్నది. దానికి నేను కొంత సదుపాయం చేయగలను. నేను సోలార్ ఎనర్జీ మెటీరియల్‌ను కొంత మనూరికి పంపిస్తాను. ఊరిలోని వారు నామ మాత్రపు ఖర్చులు పెట్టుకుంటే చాలు. సోలార్ పలకలు, బ్యాటరీలను బిగించటానికి నేనే మనుష్యుల్ని కూడా మాట్లాడతాను.”
“అంటే ఏంటయ్యా? నువ్వు చెప్పే దాంతో మాకేంటి ఉపయోగం? ”
“మీ ఇళ్లలో మేం పెట్టే పరికరాల వలన లైట్లు వెలుగుతాయి, ఫాన్లు తిరుగుతాయి. నీళ్లను తోడే మోటర్లు పని చేస్తాయి. కరెంటు లాగే పని చేస్తుంది. సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి విద్యుత్‌గా మార్చే పరికరాలన్న మాట. విదేశాల్లో సోలార్ శక్తితో కార్లు కూడా నడుపుతున్నారు. మన పొలాలకు కూడా కరెంటు పోతే నీళ్లకు మోటరు ఆడదన్న దిగులు వుండదు. దాంతో ఊరికి ఉపయోగం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. ఈ మాట వింటే మా నాన్న కూడా బాగా సంతోషిస్తారు” అన్నాడు హర్షవర్ధన్ వినయంగా.
కాసేపు ఆ పెద్దాయినకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అర్ధమయిం తర్వాత పట్టరాని ఆనందం కలిగింది.
“ఈ విషయం ఇంకా నలుగురికీ చెబ్దాం. మంచి ఆలోచన చేస్తన్నావబ్బాయ్. నువ్వూ, నీ కుటుంబం నూరేళ్ల పాటు సుఖంగా వుండండి నాయినా. మీ అమ్మా నాన్నలది మహార్జాతకం. నీలాంటి ప్రయోజకుణ్ణి కన్నారు.” అన్నాడు నిండు మనస్సుతో.
ఇంటి పని ఒక పక్క సాగుతూ వున్నది. ఊర్లోని వారి సహకారంతో హర్షవర్ధన్ ఊరంతాకూ పొలాలలోనూ సోలార్ పలకలూ, బ్యాటరీలు పెట్టించాడు. నామ మాత్రపు ఖర్చులు పెట్టుకోనటానికి కూడా కొందరు వాయిదా పద్ధతిలో చెల్లిస్తామన్నారు. సరే ఇవ్వగలిగితేనే ఇవ్వండి లేకుంటే లేదన్నాడు.
విపరీతమైన ఆయాసంతో శరీరం సహకరించక వెంకటప్పయ్య మనసులో ఎంత కోరిక ఎగదంతున్నా తన ఊరికి రాలేకపోయాడు. ఇప్పుడు కాస్త నెమ్మదించింది. ఈ ఆయాసంతో ఊరి కెళ్లకుండానే చనిపోతానేమోనని ఈ మధ్య తరచూ భయపడ్డాడు. ఊర్లో ‘వెంకటప్పయ్య నిలయం’ కట్టడం పూర్తయింది. ఆ రోజు కొడుకులూ, కోడళ్లతో వెంకటప్పయ్య దంపతులు ఊర్లో కడుగు పెట్టారు. తమ ఇంట్లో కాలు పెట్టగానే తన చిన్నప్పుడు తల్లి తన తనువంతా చల్లగా నిమిరినట్లు అనిపించి ఒళ్లు ఝల్లుమన్నది. పోయిన సంతోషమేదో తిరిగి వచ్చినట్లుగా పులకరింపు కలిగింది.
వీళ్లను పలకరించటానికని పది మందీ వచ్చారు.
“అదృష్టవంతుడవయ్యా వెంకటప్పయ్య. ఊరి కుపకారం చేసే కొడుకును కన్నావు. మీ ఇంటితో పాటు మా ఇళ్లలోనూ నీ కొడుకు చీకట్లు లేకుండా చేస్తున్నాడు. వీలున్నంత వరకైనా పొలాల్లో మోటర్లు ఆడి నీరు పారుతుంది.”
ఒకరేమిటి? పది మందీ అదే మాట. ఇదంతా కలా! నిజమా! అని వెంకటప్పయ్య ఉబ్బితబ్బివవుతున్నాడు. భార్య పరిస్థితీ అలాగే వున్నది. కొడుకు కొన్న పొలం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నాడు. వాళ్లు వీళ్లూ మాట్లాడుతుంటే తెముల్చుకుని వెళ్లటానికి కాస్త ఆలస్యమయింది. ఆలస్యమయ్యే కొందికీ ఆరాటం పెరిగి పోసాగింది. ఈ ఊళ్లో తానెరుగని తోటా, దొడ్డీ పొలం పుట్రా లేవు. కాని తనదంటూ వున్న స్వంత పొలాన్ని తానే పోగొట్టుకున్నాడు. ఇన్నాళ్లకు మళ్లీ కొడుకు స్వంత ఊరిలో ఇల్లూ, పొలమూ ఏర్పరిచాడు. ఇక ఇక్కడే నిశ్చింతగా వుండిపోవచ్చు అనుకున్నాడు. ఈ జన్మకిది చాలు అనుకుంటూ రెండు చేతులూ పైకెత్తి ఆకాశం వైపుకు తిరిగి దణ్ణం పెట్టుకున్నాడు. బంధువుల్ని, పరిచయస్థులను తెముల్చుకుని పొలం వైపుకు వెళ్లాడు. కొత్త ఉత్సాహం ఓపిక వచ్చినట్లుగా వున్నాయి.
అక్కడ వీచే చల్లని గాలి రారమ్మని పిలుస్తున్నట్లుగా వున్నది. చేనంతా పచ్చని మొక్కలూ, చెట్లూ నిండి కనువిందు చేస్తున్నట్లుగా కళ్ల ముందు ఊహలు కదలాడుతున్నాయి. ఆనందం పట్టలేకపోతున్నాడు. అంగలు గబగబా పడుతున్నాయి. ఇప్పుడిది తమ పొలం. దీంట్లో తను ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటూ పొలమంతా కలియ తిరగసాగాడు. గుప్పెడు నిండా మట్టిని తీసుకున్నాడు. ఇదేగా తనుకోరున్నది. తన కోర్కెను కొడుకు తీర్చాడు అనుకుంటుంటే కలిగే సంతోషాన్ని తన చిన్న గుండె మోయలేనంటున్నది. ఊర్లో అందరూ తన అదృష్టాన్ని గురించీ, కొడుకు మంచితనాన్ని గురించి చెప్పిన మాటలు చెవుల్లో గింగురు మంటున్నాయి. ఇప్పుడు వెంకటప్పయ్య మనసును ఆనందపు వరద ముంచెత్తుతున్నది. బరువెక్కిన గుండెతో, సంతోషం నిండిన మనసుతో, గుప్పెట మట్టితో పొలంలో నేల తల్లి ఒడిలో వాలిపోయ్యాడు. ఆ నేల తల్లి జోకొడుతూ వుండివుంటుంది. వెంకటప్పయ్య కన్నులు మూత పడ్డాయి.
శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి. వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మనసు రసాయనం
అమ్మ కడుపు చల్లగా-52
ఇది నా కలం-22 : అనిల సందీప్
అలనాటి అపురూపాలు-89
తెలుగుజాతికి ‘భూషణాలు’-4
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 72: ముగింపు
దివినుంచి భువికి దిగిన దేవతలు 9
అక్షరాల కుప్పలు!
అభావక్షేత్రంలో
భీమవరం భీమరాజు
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
చక్కటి ఇంటర్యూ. యువ రచయిత్రికి అభినందనలు
All rights reserved - Sanchika®