[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]
[తమ ఇంటి ముందు పడిపోయిన ఓ బిచ్చగత్తె లాంటి యువతికి పరిచర్యలు చేస్తుంది కామేశ్వరి. ఆమెకి ఆహారం ఇస్తుంది. ఆమె కాస్త సేద తీరాకా, తన పేరు ఫరీదా అనీ చెప్తుంది. రాత్రివేళ ఆమె భర్త, అత్తమ్మ గొడవ చేస్తూ వస్తారు. జగన్నాథుడు వారిని ఎదుర్కుంటాడు. విషయాన్ని ఖాజీ వద్దకు తీసుకువెళ్తాననగానే, గుంపులోని కొందరు జడిసి వెళ్ళిపోతారు. కొందరు ఫరీదా భర్త, అత్తగార్ని తప్పు పడతారు. గొడవ సద్దుమణిగి వారు తమ ఇంటికి బయల్దేరుతారు. వారి చిరునామా రాసుకుని ఫరీదాని భర్తతో పంపుతుంది కామేశ్వరి. జగన్నాథుడు శాస్త్రచర్చల్లో దిట్ట అనీ, భాషా వైశారద్యంలో ఏకసంథాగ్రాహి అనీ కవి పండిత వర్గానికి క్రమేపీ అర్థం అవుతుంది. ఆ సమయంలో రామాపురంలో జాతర వస్తుంది. తాము చెప్పాల్సింది చెప్పామని, నిర్ణయం ఊరి వారికే వదిలేద్దమని జగన్నాథుడు అక్కడికి వెళ్ళడు. కామేశ్వరికి కొడుకు పుడతాడు. జాతర ఉద్రేకాలతో జరుగుతుంది. జంతుబలి కూడా జరుగుతుంది. ఓ వర్గానికి చెందిన యువకుడు పొలిని తీసుకుని గ్రామం బయటకు పరిగెత్తుతాడు. అది అశుభమని అంతా భావిస్తారు. ఇక చదవండి.]
అధ్యాయం-14
కాశీ వాతావరణమంతా, హఠాత్తుగా అవ్యక్తమైన భయం గుప్పిట్లో చిక్కుకుంది. కొందరు మత పరమైన ఘర్షణల్నీ రగుల్కొల్పారు. ఎవరికి వారు – ఎవర్ని ఏమంటే ఏమవుతుందో అనే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎడమకన్ను కుడికన్నుని నమ్మలేనంతగా అనుమానం వ్యాపించింది. పాలకులు ముస్లిములు కావడంతో వారి ప్రాబల్యం ఎక్కువగానే వున్నది. జనజీవనంలోనూ దీని ప్రతిఫలనం కనిపిస్తోంది. వీటన్నిటికీ అసలు కారణాలు రాజకీయమైనవి.
ఆగ్రాలో పరిస్థితులు త్వరత్వరగా మారుతున్నాయి. నూర్జహాన్ పరిపాలన. జహంగీర్ ఆమె సౌందర్యానికి దాసుడై, సర్వాధికారాల్ని ఆమెకిచ్చేశాడు. నామమాత్రంగా మహారాజు అతను. మద్యపాన నిషేధాన్ని తన పాలనలోని ముఖ్య విప్లవాత్మక చర్యగా అభినందించుకుని, ఫర్మానాలు జారీచేసిన మహారాజు తాను మాత్రం మద్యానికి బానిసైనాడు.
నూర్జహానికి ఆశలూ, కోరికలూ కూడా ఎక్కువే. మేవార్ సంధిని సాధించింది. పట్టుపట్టి కాంగ్రా విజయాన్నీ సాధించింది. సహజంగా ఈ విజయగర్వం ఆమెలోని పేరాశనీ, దురాశనీ కూడా ప్రోత్సాహించింది. జహంగీర్ బలహీనతలని తనకు అనుకూలంగా మలచుకొని కొన్ని దుస్సాహసాలూ చేసిందామె.
జహంగీర్ నలుగురు కొడుకుల్లో ఒకడు ఖుర్రం. ఇతనే షాజహాన్. అత్యంత గొప్ప యుద్ధనిపుణుడు. గొప్ప వ్యూహకర్త, ఇతనే జహంగీర్ రాజ్యానికి వారసుడు అనే అభిప్రాయం సుబేదారుల్లో, సైనిక అధికారుల్లో బలంగా వ్యాపించి వుంది.
షాజహాన్కి అతనికి పిల్లనిచ్చిన మామ శక్తివంతుడైన మన్సబ్దార్ అసఫ్ ఖాన్ వత్తాసు కూడా వుంది. అది గమనించిన నూర్జహాన్ తన అల్లుడైన షరియార్కి జహంగీర్ తర్వాత రాజ్యాధికారం కట్టబెట్టాలనే ఉద్దేశంతో – షాజహాన్ని అనేక విధాలుగా అవమానపరచసాగింది. తగినంత సహకారాన్నివ్వకుండా దండయాత్రలకి పురికొల్పి, ‘గెలిస్తే నా గొప్ప, ఓడిపోతే నీ పనికిరానితనం’ అనే ధోరణిలో, అదే భావనతో-బయటికి పంపింది. అలాంటి వాటిలో ఖాందహార్ దండయాత్ర ఒకటి. అక్కడ దారుణమైన ఓటమి ఎదురైంది. దాని ప్రభావం పాలనపై పడింది.
సహజంగా విజయానికి ఎందరు కారణమైనా ఆ లక్ష్యసిద్ధి, ఫలం, ఫలితం – నాయకుని ఖాతాలోకి జమ అయిపోతాయి. అపజయం అలా కాదు – నాయకుడు. తాను చేతులు దులుపుకుని, జరిగిన విధ్వంసానికంతా తన కింది వారూ, ఇతరులూ కారణమని దూషిస్తాడు. ప్రచారమూ చేస్తాడు. సరిగ్గా నూర్జహాన్ ఇదే స్వభావాన్నీ, కార్యాచరణనీ బహిర్గతం చేసింది.
ఖుర్రం, మహబత్‌ఖాన్ వంటి రాజ్యాభిలాష కలిగినవారు పరిస్థితిని తమకు అనుకూలంగా తిప్పుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. అంతర్గత కుమ్ములాటలు కుమ్మపొగగా వ్యాపించాయి.
రాజ్యంలో కల్లోలం ప్రారంభమైంది. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో అవాంఛనీయ ఘటనల వలన ప్రజల్లో అశాంతి రేగింది. అలజడులు పెరిగాయి. ఢిల్లీ, ఆగ్రాలనుంచీ వివిధ అధికారులు రాకపోకలు, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటం – అగ్నికి ఆజ్యంలా తయారైనాయి.
కాశీలో కొత్తగా రంగంలోకి మౌల్వీలు ప్రవేశించారు. హిందూ పండితుల్నీ, కవుల్నీ వాగ్వాదాలతో రెచ్చగొడుతున్నారు. మతపరమైన ప్రమేయాల్ని కల్పిస్తున్నారు. పంచాయతీ పెద్దలైన ముఖద్దంలు కూడా చిన్నచిన్న తగవుల్లోని అభిప్రాయ భేదాల్లో వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు మౌల్వీలు కాశీ అంతటా రెండు ముఖ్యమైన (అప)వాదాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
ఒకటి: ప్రసిద్ధమైన సంస్కృత భాష అరబ్బీ బాష నుండి పుట్టింది.
రెండు: పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియ జాతిని వరసపెట్టి చంపాడు. కనుక, ప్రస్తుతం లోకంలో క్షత్రియజాతి అనేది లేదు. ఇప్పుడు క్షత్రియులం, రాజపుత్రులం అని చెప్పుకుంటున్నవారు ఆ జాతికి చెందిన వారే కాదు.
కాశీ పండితుల్లో కొందరు ఇక్కడి ఈ పరిస్థితుల్ని జయపురం పాలకుడైన మొదటి సవాయీ రాజా జయసింహునికి తెలిపి తమ బాధల్ని వివరించుకున్నారు.
ఢిల్లీ నుంచీ ఉన్నత రాజోద్యోగులు కాశీ వచ్చినప్పుడల్లా మౌల్వీల పక్షాన నిలిచి, పండితుల మీద విసుర్లు రువ్వుతున్నారు. కవి పండిత వర్గాన్నీ, ప్రజల్నీ భయభ్రాంతుల్ని చేయసాగారు. ఇది అంతా జయసింహుని మనసుని కలచివేసింది.
ఈ తరుణంలో జయసింహునికి జగన్నాథుడి పేరు వినిపించింది. భట్టోజీని అతను ఎదుర్కొంటున్న తీరూ, జగన్నాథుని ప్రతిభా, ప్రజ్ఞా, మానవీయమైన విలువల పాటింపూ, సంస్కరణాభిలాషా, సమన్వయ విధానం, సమయజ్ఞత అన్నీ తెలిసినై.
జయసింహుడు-ఉదయపురం రాణా జగత్సింహునికి ఈ ఉదంతాలన్నీ తెలియజేశాడు. రాణా కూడా సామాజికంగా అభ్యుదయ కాంక్షి. అప్పటి మొగలాయీ ప్రభువుల హిందూ వ్యతిరేక చర్యల్ని నిరసించి, ఎదిరించి నిలిచిన మేవార్ మహారాజు మహారాణా ప్రతాప్ మనుమడు, అమర్ సింగ్ కొడుకు. అతను, అమర్ సింగ్ మరణం తర్వాత, అప్పుడప్పుడే రాజ్యాధికారాన్ని స్వీకరించి పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ఉన్నాడు. సిసోడియా వంశానికి ఆభిజాత్యమూ, సాహసమూ, హిందువులపట్ల ప్రేమ సహజాతాలు. వాటన్నిటినీ పుణికిపుచ్చుకున్న వీరుడు. జయసింహుడు-అంబర్ రాజ్యాధిపతి మార్వార్ పాలకుడైన రాజా గజసింహునికీ మిత్రుడు. ఇటు మేవార్ ప్రభువు జగత్సింహుడు, జయసింహుడు, గజసింహుడు- ముగ్గురి మధ్యా మంచి సఖ్యత ఉంది.
ముగ్గురూ కాశీ గురించి మౌల్వీల గురించీ మంతనాలు జరిపారు. జగన్నాథుడు మాత్రమే వారికి సరియైన సమాధానం చెప్పగలడని నిర్ణయించుకున్నారు.
అధ్యాయం-15
జాతర పర్యవసానంగా అనంతపురం, రామాపురం గ్రామాల్లో మనుషుల మధ్య తీవ్రమైన కక్షలూ కార్పణ్యాలూ పెరిగి, కల్లోలం చెలరేగింది. పరశురాముని వర్గమే కావాలని ‘పొలి’ని పొలిమేర దాటించే ఏర్పాటు చేసిందనేది ఎదిరి పక్షానికి అవకాశంగా దొరికింది. పొలిని పట్టుకుని పారిపోయిన యువకుడు ఏమయ్యాడో, ఎక్కడికి పోయాడో ఎవరికీ అంతుపట్టలేదు. వాడికి తన వారనే ముఖ్యులు ఎవ్వరూ లేకపోవటంతో వాడి సంగతి ఎవరికీ పట్టలేదు.
రోజులు గడుస్తున్నై.
పక్క ఊళ్లల్లోనూ అంతోఇంతో అలజడి రగిలే వుంది.
మనుషుల మనసుల్లో భయం అనేది ప్రవేశిస్తే దాని పరిస్థితి – గాలీ, ఎండా, నీరూ, ఎరువూ అన్నీ పుష్కలంగా అందుతున్న మొక్క పరిస్థితే. ఏపుగా పెరుగుతుంది. ఇక్కడా అదే జరిగింది. ఏ దేవత కోపం ఎవరి మీద ఎక్కడ, ఏ రూపంలో విరుచుకు పడుతుందోనన్న భయం అది.
శేషవీరేశ్వరుడికీ, జగన్నాథుడికీ, శిష్యులందరికీ ఈ పరిస్థితులు అప్పటికే తెలిసి ఉన్నై. తాము వాంఛించిన దానికి భిన్నంగా జరిగిపోయింది ఘటన. జంతుబలి జరగనే జరిగింది.
పైగా జనంలోని విశ్వాసానికి తగినట్లే ‘పొలి’ పొలిమేర దాటటం వలన వ్యుత్పన్నం కాబోయే దైవాగ్రహం గురించిన భీతి పలు రీతుల్లో జనాల్లో పరిభ్రమిస్తోంది. జనజీవనం మీద కూడా దాని ప్రభావమేమీ చిన్నది కాదు. మనుషులు ఎదురైతే, పరస్పరం పండ్లు కొరుక్కుని గుప్పిళ్లు బిగించుకునే స్థితిని కల్పించింది ఆ వాతావరణం. ‘మాయరోగమదేమొ గానీ, మనిషి మనిషికి కుదరదు’ అన్న తీరున ఉంది ఊరు. ప్రజలంతా కూటములు కూటములుగా మారి బహువిధాల చర్చించు కుంటున్నారు.
ఈ కోపతాపాలూ, భయసందేహాలూ, తర్జన భర్జనలూ మధ్యన అనంతపురంలో ఒక పదిహేనేళ్ల పిల్లకి జ్వరం వచ్చి తీవ్రమై వాంతులూ, విరేచనాలూ, అయి ఒక్కరోజు లోనే బిళ్లబీటుగా రాత్రికి రాత్రి చనిపోయింది.
ఊళ్లో ఏదో గత్తర ప్రవేశించిందనే ప్రచారం జరిగింది.
ఆ మర్నాడు ఇలాంటిదే మరో ఘటన రామాపురంలో జరిగింది. ఒక నడివయస్సు పురుషుడూ ఇలాగే చనిపోయాడు.
తెల్లవారేసరికి – ఊళ్లు ఊళ్లు ఊళ్లన్నీ కోళ్ళెకూసినై. కొందరు అది అమ్మోరు అనీ, మరికొందరు ‘కాదు కాదు, అది పేరు లేని రోగం’ అనీ వదంతుల్ని వ్యాపింప చేయసాగారు.
నిండా రెండు రోజులు గడవలేదు. అర్జునపురంలోనూ ఈ రోగం వచ్చిందన్నారు. ఆ మర్నాడు కాశీలో గత్తర ప్రబలుతోందని ఒకటే జనవదంతి!
అయోధ్యాపురం, బాబత్పురా, బలిపురం, భగవాన్‌పురం.. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు చనిపోతున్నారని వార్తలు వచ్చేశాయి. వైద్యశాలల్లో ప్రభుత్వ అధికారుల లెక్కల్లో ఇలాంటి లక్షణాలతో చేరిన రోగుల సంఖ్య పెరుగుతోంది.
ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలైంది. జగన్నాథుడి హయగ్రీవోపాసన, అనుష్ఠానం అయినై. బయట శిష్యులు వేచి ఉన్నారు.
కామేశ్వరి స్నానం చేయిద్దామని పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుంటే, ఒళ్లు కాలిపోతోంది. జ్వరం.. ఆ వెంటనే పెద్దగా వాంతి అయింది. వెంటనే జగన్నాథుడికి చెప్పింది. పర్వతవర్థనిని పిలిచింది. ఆవిడ వచ్చి పిల్లవాడిని చూసి శేషవీరేశ్వరుడిని పిలిచింది. ఆయనా, జగన్నాథుడు సంప్రదించుకుని వెంటనే పిల్లవాడిని వైద్యాలయానికి తీసుకుని వెళ్లారు. వెంటనే వైద్య సదుపాయం జరిగింది. కానీ, వాంతులూ, బేదులూ ఎక్కువై వ్యాధి ముందుకు పోతోంది. ఒక రాత్రి వేళ పిల్లవాడు ఆఖరిశ్వాస వదిలాడు! ఇంట్లో అందరూ దుఃఖంలో మునిగారు. శిష్యగణమంతా విచారగ్రస్తులైనారు. ఇంక-తల్లిగా కామేశ్వరికి కలిగిన గర్భశోకాన్ని ఎవరైనా ఎలా ఉపశమింపజేయగలరు?
అత్తా, తల్లీ, అక్కా, చెల్లీ అన్నీ తానే అయి కామేశ్వరి దుఃఖాన్ని ఉపశమింపజేయడానికి పర్వతవర్థని శతథా ప్రయత్నించింది. భర్తగా జగన్నాథుని అనునయమూ ఆమెని నిదానంగా కోలుకునేలా చేసింది. ఆమె మళ్లీ మనుషుల్లో పడేలా చేసింది.
కాశీలో ప్రబలిన వ్యాధి చాలామందిని పొట్టనపెట్టుకున్నది. స్వయంగా నూర్జహాన్ పర్యవేక్షణలో ప్రజలకు అనేక విధాల వైద్యసదుపాయాలూ, సహాయం అందినా ఆ మహమ్మారికి బలియైన వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు.
నెలలు జరుగుతున్నై. ప్రజల సాంఘిక జీవనంలో పరిస్థితులు చక్కబడుతున్నై. నెమ్మదిగా శాంతి వాతావరణం నెలకొంటోంది.
కానీ, భాషా సాహిత్య శాస్త్ర రంగాల్లో మౌల్వీలు పండితుల మధ్య స్పర్థలు మాత్రం మరింతగా విజృంభించాయి.
భట్టోజీ గోడమీది పిల్లివాటంగా మౌల్వీలు ఎదురై గట్టిగా మాట్లాడితే – ఔనౌననటం, వారి పరోక్షంగా వైరిదూషణ చేయటం! ప్రజలు నిజనిర్ధారణకు రాలేని పరిస్థితిని కావాలనే కల్పిస్తున్నాడు. అంతేగాక, మౌల్వీలు ఇలా రెచ్చిపోవడానికి జగన్నాథుడి దూకుడు తత్త్వం, చర్యలే కారణమనీ ప్రచారం సాగిస్తున్నాడు.
ఈ పరిస్థితి జగన్నాథుడినీ, శేషవీరేశ్వరుడినీ బాగా కలచివేస్తోంది.
అధ్యాయం-16
ఆవేళ-సాయం సమయం.
శిష్యులకి పాఠాల బోధన అయిపోయింది. శేషవీరేశ్వరుడూ, జగన్నాథుడూ రావిచెట్టు తెమ్మెరలో సేదదీరి ఉన్నారు.
అప్పుడు – నలుగురు ఆశ్వికులు వచ్చి వీరిద్దరికీ అభివాదం చేశారు. జయపురం మహారాజావారి దూతలు వాళ్లు. రాజావారి నుండీ తెచ్చిన లేఖని అందించారు. శేషవీరేశ్వరుడు చదువుకుని, జగన్నాథునికి ఇచ్చాడు. చదివి శేషవీరేశ్వరుని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఏం చేద్దాం అన్నట్లు. ఆయన మొహంలోనూ అదే భావం ద్యోతకమైంది.
శేషవీరేశ్వరుడే చొరవ తీసుకుని ముందు ఆ దూతలకు బస ఏర్పాటు చేసి, వారికి ఆతిథ్యం వగైరాలు సమకూర్చాడు. గుఱ్ఱాల్ని నిలపటానికి చోటు చూపించాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి రాజుగారి లేఖలోని విషయాన్ని ఆడవాళ్ళిద్దరికీ వివరించారు. జగన్నాథుడు మౌల్వీలతో ప్రత్యక్షంగా చర్చకు దిగాలి. సమావేశ స్థలం కాశీయే. ఆ ఏర్పాట్లన్నీ జయసింహుని రాజప్రతినిధులే చేస్తారు. జగన్నాథుడు అంగీకరించాలి. సిద్ధం కావాలి. సభా సమావేశం ఏర్పాటు ఏ రోజుకి చేయవచ్చో సమయసూచన చేయాలి. జగన్నాథుడి భాషాభ్యాసానికి కావలసిన ధనసహాయం వెంటనే అందుతుంది.
ఇదీ ముఖ్య విషయం.
మరోలోకంలో ఉన్న దానిలా కూర్చుని ఆలోచనలో పడింది కామేశ్వరి. ఆమె తన చూపుని ఎక్కడా నిలపలేకపోతోంది.
జగన్నాథుడు – అరబ్బీ, పారశీకం, ఉర్దూ భాషల్లో ఇంకా తగిన పాండిత్యం సంపాదించలేదు. మౌల్వీలను ఎదిరించాలంటే ప్రధాన సంభాషణా భాషామాధ్యమం – అరబ్బీ. అందువలన తన భర్త తప్పకుండా ఏదో ఒక పట్టణానికి వెళ్తానంటాడు. కాశీలో ఆ సౌకర్యం ఉన్నా, ఇక్కడి మౌల్వీలు దుష్టతంత్రాల వలన ఇక్కడే ఆ భాషల్ని నేర్వటానికి జగన్నాథుడు మొగ్గు చూపడు.
ఇంత చింతన సుడిలో ఉన్నది ఆమె మేధ. జగన్నాథుడి మనసులో ఆలోచన కూడా సరిగ్గా ఇలాగే వున్నది. ఆలోచనా ధోరణిలో, కార్యనిర్ణయ విధానంలో భవిష్యదాశయాల రూపకల్పనలో ఆ ‘దంపతుల’కి సీతారామ సామ్యం నప్పుతుంది. మనస్తాత్విక శాస్త్రరీత్యా నిజానికి మనసులు కలవటమంటే ఇదే!
చిత్రంగా శేషవీరేశ్వరుడు కూడా ఈ విధమైన ఆలోచనలోనే ఉన్నాడు. పర్వతవర్థనికి భర్త ఫణితీ, విషయనిర్ణయశక్తి తెలుసు. ఆయన నిదానపు మనిషిలా కనిపిస్తాడు కానీ, ఇలాంటి అవసర సమయాల్లో స్థితప్రజ్ఞ, అనుద్వేగకరమైన నిశ్చయ రీతీ ఉన్నై. నిర్దిష్టమైన కార్యాచరణనిస్తాడు. ఇప్పుడు ఆమె ఇలాంటి భావలహరిలో ఉన్నది.
మొత్తానికి నలుగురూ తలపుల మునుకలోనే వున్నారు.
చాలా సమయం గడిచింది.
ముందుగా శేషవీరేశ్వరుడు తెప్పరిల్లి “ఆజ్మీరు వెళ్లడమే ఉత్తమం” అన్నాడు. ఆయన ముందున్న ఆడవాళ్ళిద్దరూ నివ్వెరపోయారు.
జగన్నాథుడేమీ ఆశ్చర్యపోలేదు. ఎలాంటి తత్తరపాటూ లేకుండా శేషవీరేశ్వరుడి వైపు చూస్తూండిపోయాడు. ఆయన తన అభిప్రాయానికి వివరణనిస్తూ, “ఇప్పుడు కాశీలో ఉన్న వాతావరణంలో అభ్యాస, అభ్యసనాల్లో మేధ కేంద్రీకరించటానికి అవకాశం లేదు. కొత్త వాతావరణంలో అంతేవాసికి, ఉపాధ్యాయులకీ కూడా మనస్సు ప్రశాంతంగా స్వచ్ఛంగా వుంటుంది. జ్ఞానార్జన మీద స్థిరంగానూ మనసులగ్న మవుతుంది.”
అప్పుడు మాట కలిపాడు జగన్నాథుడు, “మీరు చెప్పే భావనే నాకూ కలిగింది. ఆజ్మీరే సరైన స్థలం”
కామేశ్వరి సంభ్రమంతో సంచలించింది. ఆమె కళ్లే ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. జగన్నాథుడు గమనించాడు. పక్కనే ఉన్న పర్వతవర్థనికి సాభిప్రాయంగా సైగ చేశాడు. ఆ సైగ అర్థం అందరికీ తెలిసిందే. ‘కామేశ్వరిని కంటిపాపలా చూసుకునేందుకు పర్వతవర్థని ఉన్నది కదా’ అనే!
ఉస్సురంటూ నిట్టూర్చింది కామేశ్వరి.
“ఏం ఫర్వాలేదు. మన జగన్నాథుడు మూడు భాషలూ నేర్వటానికి – కాదు – పాండిత్యం గడించటానికి మూడు నెలలు చాలు. ఏకసంథాగ్రాహి కదా! అంతకంటే అవసరంలేదు”. శేషవీరేశ్వరుని మాటలు విన్న కామేశ్వరి మరింత కలత పడింది. పలుకాడలేని స్థితి. తలవంచుకుంది. ఆమె పక్కనే వున్న పర్వతవర్థని ధైర్యప్రసరణం చేస్తూ ఆమె భుజం తట్టింది. కామేశ్వరి తలవంచుకునే ఉన్నా ఆమె కళ్లల్లో ఉబికిన నీరు స్పష్టంగానే పొటమరించింది.
“అవును. మూడు నెలలలోపే విద్య ముగించుకుని వచ్చేస్తాను” అన్నాడు జగన్నాథుడు.
విషయాలన్నీ చెప్పకయే చెప్పినట్లు అర్థమైపోయాయి.
మర్నాడు –
జయసింహుని దూతలు కాశీ వచ్చివెళ్లటాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. జయపురం వారికి కాశీలో కార్యనిర్వహణ అవసరాలున్నాయి. కాశీ విద్యాపీఠమూ వారిదే. వారి రాకపోకలు తరచుగా జరుగుతూ ఉంటాయి. వచ్చిన దూతల ద్వారా ఈ వర్తమానాన్ని జయసింహ మహారాజుకి తెలియజేశారు.
తర్వాత, ఆ రాత్రే జగన్నాథుడూ వాళ్లు చేసిన మొదటి నిర్ణయం – శిష్యుల కెవ్వరికీ కూడా ఈ వార్త తెలియనీయకూడదని. జగన్నాథుడు కాశీ నుండీ ఎక్కడికి వెళ్లాడో, ఎందుకు వెళ్లాడో చెప్పకూడదు. అంతగా చెప్పాల్సివస్తే – తన స్వస్థలానికి వెళ్లాడనే చెప్పాలి.
ఆ మర్నాడు – పాఠశాల కార్యక్రమాలు మామూలుగా యథావిధిగా జరిగాయి. ఆరోజు రాత్రే బయలుదేరి అజ్మీరు వెళ్లిపోయాడు జగన్నాథుడు.
జయపురం వారి ఏర్పాట్లు ఎప్పుడూ నియమ బద్ధంగానూ, సక్రమంగానూ, సత్వరంగానూ జరిగిపోతాయి! అది రాజపుత్ర సంస్కృతి!
(సశేషం)

విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.
8 Comments
కొల్లూరి సోమ శంకర్
జగన్నాథ పండిత రాయల పదవ అధ్యాయం పూర్తిగా చదివాను.
నూర్జహాన్, జహంగీర్ల పరిపాలన విశేషాలు బాగున్నాయి. జగన్నాథుడు ఆజమీర్ మూఁడు నెలలకోసం వెళ్ళడం సంపూర్ణగా నవల గొప్పగా నడుస్తోంది..రచయిత విహరి గారి కి శుభాకాంక్షలు. అభినందనలు.
వఝ సీతారామ శర్మ
కొల్లూరి సోమ శంకర్
You are very great. This episode make me the events
in it are happening now. Hats off.
P.G.K.MURTHY
కొల్లూరి సోమ శంకర్
10 వ అధ్యాయం చాల గొప్పగా వుంది. కామేశ్వరి జగన్నాధులు పుత్రుడిని కోల్పోవడం బాధ అన్పించింది. చరిత్ర అంటే ఇష్టమయిన నాకు చరిత్రతో కూడిన ఈ నవల చదవడానికి చాలా కుతూహలంగా వుంది.
తురగా జయ శ్యామల, ముంబయి
పుట్టి. నాగలక్ష్మి
రాజకీయ పరిపాలనా వ్యవహారాలలో దాపరికం చాలా అవసరమనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేశారు. మొఘలుల పరిపాలనలో రాజపుత్రులు జాగ్రత్తలు తీసుకునే విషయంలో పండితులు నిర్వహించ వలసిన పాత్రని, ఇంకా అనేక చారిత్రక విషయాలని విశ్లేషిస్తూ విచారించి గారు అందిస్తున్న నవల ఆపకుండా చదివింపజేస్తుంది.. విహారిగారికి అభినందనలు

కొల్లూరి సోమ శంకర్
బిళ్లబిట్టుగా(=ఉన్నదున్నట్లుగా) అనే కొత్త మాండలిక పదం ఈ భాగం ద్వారా తెలుసుకున్నాను. జహంగీర్ నూర్జహానుల పరిపాలన విషయాలు కూడా నాకు కొత్తగా తెలిసాయి. ధన్యవాదాలు
పతంజలి
కొల్లూరి సోమ శంకర్
అప్పుడే పదోభాగంలోకి వచ్చేసింది, నవలారచనలోని వేగం ఆ విషయాన్నే మరచిపోయేట్టు చేసింది.. మొగల్ రాజాంతఃపురాల్లోని కుట్రలు, కుతంత్రాలు ఎట్లా ఉండేవో నూర్జహాన్ ఆలోచనలు సాక్ష్యమిస్తున్నాయి..
తెలుగు పలకుబడుల పరిమళం రచనను మరింత పరిమళింపజేసింది.. రాబోయే ఆదివారం కొరకు ఎదురు చూస్తూ, ఆభినందనలతో..
గిరిజా మనోహర బాబు
Dr.Trinadha Rudraraju
జాతి విశిష్టత, ఔన్నత్యాన్ని ప్రదీపింప చేసిన గొప్ప పండితుని చరిత్ర అందించే మీకు నమస్సుమాంజలి
కొల్లూరి సోమ శంకర్
అద్భుతమైన చిత్రణ సార్.
వి. నిత్యానంద రావు