[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]
[రోజులు మామూలుగా సాగిపోతుంటాయి. ఢిల్లీలో జగన్నాథునికి తగినంత విరామం దొరుకుతుంది. లాహోరి పిలిచినప్పుడు వెళ్ళి తగిన సలాహాలు చెప్పి వస్తాడు. మిగిలిన సమయంలో దారా అనువదించిన భగవద్గీతను సరిచూస్తుంటాడు. ఢిల్లీకి వచ్చిన రాయముకుందుడు వృందావన్ ఆలయాల వ్యవహారంలో జగన్నాథుడినీ, దారాని అభినందిస్తాడు. అసఫ్‌ఖాన్‌కి కూడా కృతజ్ఞతలు తెలుపుతాడు. ఓ రోజు రాయముకుందుడు జగన్నాథుని ఇంటికి వస్తాడు. సంభాషణలో సాహిత్య విషయాలు దొర్లుతాయి. దారా భగవద్గీత, ఉపనిషత్తుల అనువాదాల గురించి వివరిస్తాడు జగన్నాథుడు. ఆయన జగన్నాథుని రచనల గురించి అడుగుతాడు. అక్కడికి వచ్చిన కామేశ్వరి తాను చేస్తున్న గ్రంథ విషయికమైన వివరాల్ని తెలుపుతుంది. కామేశ్వరి బాగా అలసిపోతున్నట్లుందని రాయముకుందుడు అంటాడు. అవునంటుంది సుభాషిణి. అసఫ్ఖాన్ పట్ల గౌరవసూచకంగా ఓ కావ్యం రచించమని జగన్నాథుడిని కోరుతాడు రాయముకుందుడు. శాస్త్రి, కామేశ్వరి ప్రోత్సహిస్తారు. అయితే గ్రంథాన్ని ఒకేసారి వ్రాసి పూర్తి చేయమని అడుగుతుంది కామేశ్వరి. గ్రంథనామం ‘అసఫ్ విలాసం’ అని మనసున తలుస్తాడు జగన్నాథుడు. ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న కట్టడాల స్థలాల దగ్గరికి రోజూ వెళ్లవలసి వస్తుంది జగన్నాథుడికి. అసఫ్ విలాసం గ్రంథ రచనపై దృష్టి పెట్టలేకపోతాడు. శాస్త్రికి సంగీతపాఠం చెప్పలేకపోతాడు. ఉన్నట్టుండి కామేశ్వరి అస్వస్థతకి గురవుతుంది. రాజవైద్యులని పిలిపించి వైద్యం చేయించినా ఫలితం ఉండదు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. భార్య అనారోగ్యం మీద నుంచి దృష్టి మళ్ళించటానికి, ‘అసఫ్ విలాసం’ని ‘ఆఖ్యాయిక’ ప్రక్రియలో వ్రాయటం మొదలుపెడతాడు జగన్నాథుడు. వారం రోజులు గడుస్తాయి. కామేశ్వరి పరిస్థితి మరీ దిగజారుతుంది. ఓ రాత్రి నిద్రలోనే అశువులు బాస్తుంది. ఇక చదవండి.]
అధ్యాయం-47
కామేశ్వరి మరణం జగన్నాథుని బాగా కుంగదీసింది.
శాస్ర్తీ, సుభాషిణీ పరిచర్యలూ, సానుభూతి పలుకులూ ఎంతమాత్రం ఉపశమనాన్నివ్వలేకపోతున్నై. రాయముకుందుడూ వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్లాడు.
దారా స్వయంగా తానే జగన్నాథుని ఇంటికి వచ్చి పలకరించి వెళ్లాడు. అప్పుడే తెలిసింది. పాదుషా అత్యవసరంగా రమ్మని కబురుచేస్తే అసఫ్ఖాన్ లాహోర్ వెళ్లినట్లు. నిజానికి రాజాజగత్ సింగ్ పటానియాతో యుద్ధం అనివార్య స్థితికి చేరిందిట. అందుకే ఈయన అవసరం పడింది.
జగన్నాథుని వద్ద సెలవు తీసుకుని, వెళ్తూ వెళ్తూ అన్నాడు దారా, “గురూజీ.. మీరు ప్రస్తుతం పనులేవీ పెట్టుకోకండి. నా భగవద్గీత అయినా, మీరు ప్రారంభించిన అసఫ్ విలాసమైనా -” అని.
‘అసఫ్ విలాసం’ సంగతి రాయముకుందుడు చెప్పి ఉంటాడని అర్థమైంది జగన్నాథుడికి. విని ‘అలాగే..’ అన్నాడు.
ఢిల్లీలో అంతకుముందు పరిచయమైన హిందీ సంస్కృత పారశీక పండితులూ, కవులూ కూడా కొందరు వచ్చి పరామర్శించి వెళ్లారు.
ఒకరోజు, సాయంత్రం కవీంద్రాచార్య సరస్వతి వారు స్వయంగా వచ్చాడు. పరామర్శలు అయిన తర్వాత “తమరిలా శ్రమ తీసుకోవటం చాలా బాధ కలిగిస్తోంది-స్వామీ” అని నొచ్చుకున్నాడు జగన్నాథుడు.
కవీంద్రుల వారు జగన్నాథునికి ధైర్యం చెబుతూ కూర్చున్నారు. చివరికి “నీవు మళ్లీ నీ కార్యక్రమాల్లోకి నడు. మనుషుల్లో పడు. కొంత ఉపశమనం కలుగుతుంది” – అని ‘యోగస్థ కురు కర్మాణి, సంగత్యక్త్వా ధనుంజయ; సిద్ధస్సా ధ్యాస్సమో భూత్వా సమత్వ యోగ ఉచ్యతే’ అన్నాడు కదా భగవానుడు! మనం అలా నడవటమే.. అయినా-నీకు చెప్పవలసినదేముంది?” అన్నారు.
కొద్దిసేపు మాటల తర్వాత ఆయన వెళ్లారు.
ఆ రాత్రి శాస్త్రి జగన్నాథుని దగ్గర చాలా సేపు కూర్చున్నాడు. కారణం-కవీంద్రాచార్యుల వారు చెప్పి వెళ్లిన తర్వాత, జగన్నాథుడికి కామేశ్వరి స్మరణ ఇంకా ఎక్కువయింది.
“లావణ్య ముజ్జ్వలమపాస్త తులం చ శీలం/లోకోత్తరం వినయమర్థమయం నయంచ ఏతాద్గుణావశ రణానథ మాంచ హిత్వా/హా హన్త మన్దరి కథం త్రిదివం గతాసి”
(ఉజ్వలమైన లావణ్యం, శీలం, లోకోత్తరమైన వినయం వంటి సుగుణాలు లోకంలో ఒక్కచోటనే ఉండటం దుర్లభం. అవన్నీ నీకు అమరిఉన్నై, వానినీ, నన్నూ ఈ ప్రపంచంలో త్రోసి నీవు వెళ్లిపోయావు)
-శాస్త్రికి జగన్నాథుని విషాదంలోంచీ, విచారంలోంచీ వెలువడుతున్న శ్లోకాల తాత్పర్యం మనసును పట్టుకుంటూనే ఉన్నది.
‘మనసా నీకు కావలసిన బంధురత్నం జారిపోయింది’. ‘దైవమే దయ చూపటంలేదు. నీ గోడుని ఎవరితో విన్నవించుకుంటావు..’ ‘ఆమె నా మనోభిరామారామ. నా కవిత్వమే ఆమె. వెళ్లిపోయిందా? లేదు. మనసును నిండి ఉండనే ఉంది’, ‘నిత్య మంగళమయి, గృహదేవత నా కామేశ్వరి.. నా గుండె నిండి వుంది. ఎక్కడికీ పోలేదు..’ ఇలా.. ఇలా..
ఉన్నట్టుండి, శాస్త్రి వైపు దీనంగా చూస్తూ, “శాస్త్రీ.. కాశీ వెళ్లిపోదామయ్యా. నా కామేశ్వరిని యమున కర్పించాను. నన్ను నేను ఆ పావన దివ్య గంగానదికి అంకితం చేసుకుని తరిస్తాను..” అన్నాడు వేడికోలుగా. శాస్త్రికి హృదయం ఆర్ద్రమైంది. ఇదంతా చూస్తూ, వింటున్న సుభాషిణి మనసు కలవరం చెందింది.
శాస్త్రి చప్పున తెలివితెచ్చుకుని, కవీంద్రుల మాటల్నే పునశ్చరణ చేస్తూ, ఈ ఆలోచనలన్నీ మాని గ్రంథ రచనలోకి పునఃప్రవేశించమని జగన్నాథుని కోరాడు. “ముందు ‘అసఫ్ విలాసం’ కానీయండి గురువుగారూ. దారా వారి భగవద్గీతని తర్వాత చూడవచ్చు” అని ఆ రచనకే ప్రేరణనిచ్చాడు.
‘కాలో జగత్ భక్షకః’-రాత్రి జాముల్ని మింగుతోంది. ఎప్పటికో జగన్నాథుడు కించిత్ స్వస్థుడైనాడు. ఆలోచించి, ఆలోచించి, “అలాగేలే. మీరు పడుకోండి” అన్నాడు.
– మర్నాటి నుంచీ ‘అసఫ్ విలాసం’ రచన సాగింది.
ఐదవ రోజునే దాన్ని ముగించాడు-జగన్నాథుడు.
“ఆఖ్యాయిక కదా. అది మీకెంత?” అని సంతోషించాడు శాస్త్రి రెండు రోజుల తర్వాత దారా భగవద్గీతని తీశాడు. ‘అక్షరపరబ్రహ్మయోగం’ పరిశీలన ప్రారంభించాడు. తెల్లవారుతూనే-ఏకంగా అశ్వశకటం పంపి వెంటనే రమ్మని కబురు చేశాడు దారా.
‘నిత్యం’ చేసుకుని బయలుదేరి వెళ్లాడు.
ఢిల్లీ నుంచీ లాహెూర్ చేరుకున్న అసఫ్ఖాన్ని పాదుషా వెంటనే ససైన్యంగా రాజా జగత్సింగ్ పటానియా మొదలెట్టిన సమరం కోసం యుద్ధరంగానికి పంపించేశాడు. రాజా జగత్సింగ్ అప్రతిహత వీరుడు, రాజనీతి చతురుడు; అప్పటికే ఆయన మాన్, నూరూర్, తారాఘర్ కోటల్ని అమేయంగా కట్టుదిట్టం చేసి వున్నాడు. అయినా, షాజహాన్ వ్యూహం వలన జగత్సింగ్ ప్రత్యర్థులైన గులేర్, ఛంబా పాలకుల సైన్యాల్ని మొగలాయీ సైన్యానికి దన్నుగా రప్పించాడు. దీనివలన మాల్, నూర్పూర్ కోటల్ని గెలవగలిగారు. కానీ, ఖుస్రూబేగ్ వంటి మొగలాయీ యోధాను యోధుల్ని యుద్ధరంగంలో కోల్పోయారు. తారాఘర్ని సాధించటానికి అసఫ్ఖాన్ని పంపించాడు. అక్షరాలా తన ప్రాణాలొడ్డి తారాఘర్ కోటని జయించి అల్లుడికి ఇచ్చి తాను నిహతుడైనాడు అసఫ్ఖాన్!
విషణ్ణ వదనంతో, గద్గద స్వరంతో దారా ఈ వృత్తాంతమంతా చెప్పి, తాతగారి దేహ త్యాగానికి విలపించాడు. జగన్నాథుని మనసు కలచినట్లయింది. ‘తారాగడమున గడమేమొ దక్కెగాని మొగల్ సాహసాకాశాన ఒక తార రాలిపోయె’ అనిపించింది. అదే మాట దారాకు తన సానుభూతి వాక్యంగా పలికాడు.
మందిరాంతర కక్ష్య నుండీ జహనారా విలాపాన్నీ విని, తన సానుభూతి మాటలతో, అసఫ్ఖాన్ గుణగణాల పునశ్చరణతో ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేశాడు. ఇంతలో ద్వారపాలకుడు వచ్చి సాదుల్లాఖాన్ వేచివున్నట్టు చెప్పి, దారా దర్శనానికి అనుమతి కోరాడు. ఆగమని సైగచేశాడు దారా.
జగన్నాథుడిని ఉద్దేశించి, “గురువుగారూ! మీరు శ్రమ అనుకోకుంటే ‘అసఫ్ విలాసం’ని పూర్తి చేసి వుంచండి. పాదుషా వారు రాగానే తాతగారి సంస్మరణ సమావేశం ఏర్పాటు చేయిద్దాం. ఆ సందర్భంలో ఆ గ్రంథాన్ని ఆవిష్కరిద్దాం” అని, “తాతగారి నిర్యాణం గురించి తెలిపి, గ్రంథం విషయం కోరాలనే మిమ్మల్ని రావించాను” చెప్పాడు. “అలాగే. ఆఖ్యాయిక సిద్ధమయ్యే వుంది” అని లేచాడు జగన్నాథుడు.
ద్వారం దాకా వచ్చి గురువుగారికి వీడ్కోలు పలికాడు దారా. అక్కడే వున్న సాదుల్లాఖాన్కు నమస్కరించి బయటికి వచ్చేశాడు జగన్నాథుడు. భగవద్గీత సంగతి దారా ప్రస్తావించలేదు. జగన్నాథుడూ దాని ప్రసక్తి తేలేదు.
(సశేషం)

విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.