[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘జీవామృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]


[ఉదయం నుంచి చందన మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. మొబైల్లో తనకి వచ్చిన ఓ మెసేజ్‌ని పదే పదే చదువుకుంటుంది. సాయంత్రం ఆరయ్యేసరికి ముస్తాబై, రాత్రి ఎనిమిది గంటలకి రైల్వే స్టేషన్‌కి బయల్దేరుతుంది. తనను ప్రేమించిన ప్రణవ్‌ని కలుసుకుని ఇద్దరూ మరో ఊరు పారిపోయి, అక్కడ కొత్త జీవితం ప్రారంభించాలన్నది వాళ్ళ ప్లాన్. ఆటో ఎక్కి స్టేషన్ చేరుతుంది. ఫ్లాట్ ఫాం నెంబరు-టు చేరేసరికి రైలు నెమ్మదిగా కదులుతూంటుంది. తానెక్కాల్సిన ఎ-1 బోగీ ఎక్కడుందో కనబడక, ఎదురుగా ఉన్న ఎస్-8 ఎక్కేస్తుంది. ఇంతలో టికెట్లు చెక్ చేస్తూ టిసి వస్తాడు. ఆమె ఓ క్షణం ప్లాట్‌ఫాంపై దృష్టి మళ్ళించి ఉంటే, బయటకు వెళ్ళిపోతున్న ఆమె ప్రేమికుడు ప్రణవ్ కనబడేవాడు. టిసి టికెట్ అడుగుతుంటే, తనది ఎ-1 బోగీ అనీ, బండి కదిలిపోతుంతే, గబుక్కున ఈ బోగీ ఎక్కేసానని చెబుతుంది. వచ్చే స్టేషన్లో దిగి ఆ బోగీకి వెళ్ళమంటాడు. తర్వాతి స్టేషన్లో దిగి, ఎ-1 బోగీ ఎక్కుతుంది. అక్కడ ప్రణవ్ ఉండాల్సిన సీటు ఖాళీగా కనబడుతుంది. పక్క సీటు ఆయన్ని అడిగితే, తాను భువనేశ్వర్ నుంచి వస్తున్నాననీ, ఆ సీట్ ఖాళీగానే ఉందని చెప్తాడు. ప్రణవ్ రాలేదని గ్రహిస్తుంది. టిసి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి, వైజాగ్ నుంచి అనకాపల్లి వరకు పెనాల్టీ సహా టికెట్ ఇవ్వమంటుంది. విషయం గ్రహించిన ఆయన టికెట్ ఇచ్చి, డబ్బు తీసుకోకుండానే జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని చెప్తాడు. అనకాపల్లిలో దిగిపోతుంది. ఆ ఊర్లో ఉన్న తన స్నేహితురాలు జానకిని గుర్తు చేసుకుని ఆమె ఇంటికి వెళ్ళాలనుకుంటుంది. నూకాలమ్మ గుడి దగ్గర వాళ్ళ ఇల్లని గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పుడు తన గుడి గురించి, నూకాలమ్మ గురించి జానకి చెప్పిన సంగతులు గుర్తొస్తాయి. గుడి దగ్గర జానకి గురించి విచారిస్తే, అక్కడి గుమాస్తా విసుక్కుంటాడు. అప్పుడో యువకుడు తనకి జానకి ఇల్లు తెలుసుననీ, చూపిస్తాననీ, చందని ఆటో ఎక్కిస్తాడు. కాసేపటికి, ఆ యువకుడు, ఆటో డ్రైవర్ తనని మోసం చేస్తున్నారని చందని గ్రహిస్తుంది. తెలివిగా, తన సామాన్లు కొన్ని స్టేషన్లో ఉండిపోయాయనీ, అవి తీసుకుని జానకి ఇంటికి వెళ్దామని నమ్మబలికి రైల్వే స్టేషన్ వైపు ఆటోని తిప్పిస్తుంది. వెళ్ళి లగేజ్ తెచ్చుకో అని చెబుతూ, జేబు లోంచి రుమాలు తీస్తాడా యువకుడు. గబగబా స్టేషన్ లోకి పరుగెత్తుతుంది చందన. తొందరలో కాలు జారి పడిపోతుంది. అక్కడున్న ప్రయాణీకులు కూలీలు, ఆమెను చుట్టుముట్టడంతో, ‘పిట్ట జారిపోయినట్టే!’ అనుకుంటూ ఆ యువకుడు ఆటోలో వెళ్ళిపోతాడు. కొందరు ఆమె ముఖం నీళ్ళు జల్లి తెలివి తెప్పిస్తారు. ఎదురుగా ఉన్న వ్యక్తి చేతుల్లోంచి మంచినీళ్ళ గ్లాసు తీసుకుని తాగుతుది. మళ్ళీ నేల మీద వాలిపోతుంది. అది చూసి అందరూ సాయం పట్టి వెయిటింగ్ రూమ్‌కి తీసుకువెళ్తారామెను. సాయంత్రం నుంచి పడుతున్న టెన్షన్‌కి, పరిగెడుతూ పడిపోయి, నుదుటికి తగిలిన దెబ్బ నొప్పి పెడుతూ ఉంటే మగతగా వాలిపోతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 3
ఏవేవో జ్ఞాపకాలు ఆమె మెదడు పొరలను చీల్చుకొని బయటకు వస్తున్నాయి.
విశాఖపట్నంకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుతూరు ఒక కుగ్రామం. అక్కడే తాను పుట్టింది. తన తల్లిదండ్రులు, తాత ముత్తాతల జన్మస్థలమది. తను కూడా అక్కడే పుట్టింది. అక్కడే చదివింది.
వ్యవసాయ కుటుంబం. ఉడుపులు, వర్షానికి ఎదురుచూపులు, మందులు వేయడాలు, కోతలు, పండిన పంటని కుప్పలుగా చేర్చడం, కళ్ళాలలో ఎద్దులతో ధాన్యం మట్టించి, గాదెలలో పోసి, నట్టింట్లో ఉంచడం ఊరంతా ఎవరింట్లో ఏ కార్యం జరిగినా మన ఇంట్లోంచి సంభారాలు వెళ్ళవలసిందే!
అలాగే పాలికాపులందరూ వారి వారి కష్టసుఖాలను చెప్పుకుంటూ ఉంటే తాత, తండ్రి ఒకరిని మించి ఒకరు వారి కార్యాలకు సరిపడా ధనం, సామాగ్రి అందించడంలో పోటీపడేవారు. పాలికాపులు కూడా అయ్యగారి చేతికి ఎముక లేదు. ఎడమచేత్తో చేసే దానం కుడి చేతికి తెలియదు. కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియదు. అంత గుప్త దానాలు. అంటూ పొగుడుతూ ఉంటే ‘ఆహా! ఓహో!’ అని మీసాలు మెలివేసేవారు.
నాయనమ్మ అక్కలూ, చెల్లెళ్ళూ సంసారాలతో పాటుగా వచ్చి, నెలల తరబడి ఉండి వెళ్లేవారు. మళ్లీ కొద్ది రోజులకే నాన్న తరఫు అక్క చెల్లెళ్లు సంసారాలతో రావటం. ఇలా సంవత్సరమంతా సంక్రాంతి మొదలుకొని మళ్లీ సంక్రాంతి వరకు పెళ్లి వారిల్లులాగే ఉండేది.
ఆడవారంతా కలిపి కర్రల పొయ్యి మీద వంటలు వండడం. ఓ పాతికమంది పిల్లసజ్జు అందరికీ భోజనాలు వాకిట్లో పెట్టడం. పగలు పనులు, రాత్రులు అంతా వాకిట్లో చేరి కబుర్లు. తను బాల్యమంతా ఇవన్నీ చూస్తూనే పెరిగింది.
ఆ పల్లెలో స్కూలు అయిదవ తరగతితో సరి. తాను ఐదవ తరగతి పాసవగానే పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ అలాగే గడిపేసింది.
నాన్నగారికి భగవద్గీత అంటే చాలా ఇష్టం. బైండింగ్ పుస్తకం పెద్దది ‘గీతా మకరందం’ రోజూ ఒక 10 శ్లోకాలు రాగయుక్తంగా చదివి, అర్థంతో పాటుగా ప్రస్తుత జీవితానికి అన్వయింప చేస్తూ చెప్పేవారు.
“అమ్మా! నీహారికా! నువ్వు కూడా రామ్మా! భగవద్గీత వింటే చాలా మంచిది.” ప్రేమతో కూడిన తండ్రి పిలుపు ఊహలోకి రాగానే ఆమెకు సడన్‌గా తన పేరు చందన కాదు కదా! అనిపించింది.
ఆలోచనలలో కలో, నిజమో తెలియనట్లు ఆమె నిస్త్రాణగా కుర్చీలో ముడుచుకుని పడుకుంది.
సాయంత్రం పూట వీధిలో ఎత్తు అరుగు మీద కూర్చుని నాన్న అందరికీ భగవద్గీత వినిపిస్తూ ఉండేవారు. నాయనమ్మతో పాటుగా ఆడవాళ్ళందరూ ఒకవైపు, మగవాళ్లందరూ ఒకవైపు కూర్చుని ఎవరి వీలును బట్టి వాళ్ళు వచ్చి విని వెళ్లేవారు.
ఇలా నిత్యం ఆ వీధంతటికీ సందడి కరణం గారి ఇల్లే!
బంధువులందరూ వచ్చినపుడు ఎడ్లబళ్ళు కట్టించుకుని, సముద్రస్నానాలకు వెళ్ళేవారు. ఒకోసారి ‘గవ్వల కొండకు’ విహారయాత్రగా వెళ్లి, రోజంతా గడిపేవారు. పిల్లలు గవ్వలేరుకొని ఇంటికి తెచ్చి, వాటిని చూసుకోవడం ఎంత సరదాగా ఉండేది!
అలాగే కార్తీకమాసంలో పంచధారల వెళ్లి ఆ ధారలలో స్నానం చేసేవారు. అంత ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ నీటిని పట్టుకుని వెళ్లి ఈశ్వరునికి అభిషేకం చేసుకునేవారు. మెట్లు సరిగా లేక ఆ కొండదారి అంతా నడవలేక, నడవలేక చాలా కష్టపడేవారు. అయినా పురాతన ఆలయం కనుక తప్పకుండా దర్శించాలి కార్తీకమాసంలో అని అనుకునేవారు.
చిన్నపిల్లలందరి చేతులూ పట్టుకొని, నాన్నమ్మ ఆ ఈశ్వరుని కథలు చెబుతూ, అలసట లేకుండా పిల్లజట్టుని నడిపించేది. అక్కడే చెట్లకింద వండుకొని, ప్రసాదం తిని వచ్చేవారు. ఎందుకంటే అక్కడ వండినది దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాతే మా అందరికీ ఇచ్చేవారు.
నానమ్మ చెప్పింది. “ఇక్కడ ఉన్న ఈశ్వరుని ధర్మలింగేశ్వరస్వామి అని పిలుస్తారట. కొంతమంది మునులు తపస్సుచేసి ఈశ్వరుని మెప్పించినప్పుడు అతడు ‘ధర్మేశ్వరునిగా’ లింగరూపంలో ఇక్కడ అవతరించారట. అదే విధంగా యమధర్మరాజు కూడా ఇక్కడ తపస్సు చేసుకొని తన కుష్ఠు రోగాన్ని తొలగించుకున్నాడని తర్వాత ఒక లింగాన్ని ప్రతిష్ఠించారుట. దానిని ‘వర్ధమాన లింగం’ అంటారట.”
ఇక్కడ అతి ప్రాచీనమైన వినాయకుడి విగ్రహం ఉన్నది. దాని చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఎటువైపు తిరిగినా మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ చుట్టూ పచ్చనికొండలు, ప్రశాంతమైన నీలాకాశం ఎంతో బాగుంటుంది.
ఆ విధంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణానికి ప్రతిరూపంగా ఇల్లు ఉండేది.
ఇంతలో ఏదో జ్ఞాపకం మెరుపులా..
తను నీహారిక.. అందరూ తననిముద్దుగా నీహా అని పిలిచేవారు. నీహారికకు ఫంక్షన్ చేయాల్సి వచ్చింది.
మేనత్తలు వచ్చి కూర్చోబెట్టే వరకూ ఆమె కూర్చోరాదని పల్లెటూరి కట్టుబాటు. కొబ్బరాకులతో పందిరి వేసారు. ధాన్యం పరిచి దానిపై తాటియాకుల చాప. దానిపై తెల్లని దుప్పటి పరిచారు.
సన్నాయి మేళం వచ్చింది.
అదుగో! దూరంగా ఎడ్ల మెడలో కట్టిన మువ్వలు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మేనత్తలు వచ్చేసారు. వీధిలోనే కాళ్ళు కడుక్కుందికి నీళ్ళు పెట్టారు.
“ఏదీ! నా బంగారు కోడలు ఎక్కడుంది?” అంటూ చిన్నత్త సుమతి పట్టలేని ఆనందం మొహంలో ప్రతిఫలిస్తుండగా అడిగింది.
పెద్దత్త వెంటనే “నీకేనమ్మా! బంగారు కోడలు. నా దగ్గర దానికి వయసైన కొడుకులు ఉంటేగా. నీదేలే నీహారిక.” అంటూ మూతి తిప్పింది.
పల్లెటూరి హాస్యాలాడుతూ పెద్దగా నవ్వుతూ, అత్తలిద్దరూ నీహాతో పారాణిలో చేతులు ముంచి వెనక్కి తిరిగి చూడకుండా మూడుమార్లు గోడపై అంటించి, అప్పటికప్పుడు ముత్తైదువులందరూ రోట్లో వేసి దంచిన చిమ్మిలి చేతిలో వేసి తినిపించారు. నువ్వులనూనె తాగించారు. ముత్తైదువులంతా పాటలు పాడుతూ చాపపై కూర్చోబెట్టారు. ఆ మూడురోజుల ప్రహసనం నీహాకి విసుగ్గా అనిపించింది.
స్నానం అయ్యాక అమ్మ తయారుచేసింది. నీహారిక కొత్త అందాలతో మెరిసిపోతోంది.
అమ్మ, నాన్న బంగారు నెక్లెస్ పొడవాటిది చేయించారు. పెద్దత్త వెండి పట్టీలు, చిన్నత్త బంగారు గాజులు తెచ్చారు. అందరూ పట్టుబట్టలు కొన్నారు.
అట్లబంతి భోజనాలలో అందరూ నీహా పక్కన కూర్చుందుకే పోటీపడ్డారు. నీహా పక్కన కూర్చుందికి అవకాశం దొరకని కొంతమంది అలిగారు కూడా. అమ్మానాన్న తర్వాత వాళ్లని సముదాయించారు.
పది రోజుల తర్వాత ఎవరిళ్ళకి వాళ్లు తిరిగి ప్రయాణాలు అయ్యారు.
వెళ్లేముందు చిన్నత్త అమ్మ నాన్న దగ్గరకు వచ్చింది.
“అన్నయ్యా! నీ కూతుర్ని నా కొడుక్కి తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు. వాడు చదువుకుంటున్నాడు. నీ కూతుర్ని కూడా పట్నం పంపించి చదివించు. పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంచు.” అంటూ ఎన్నో ఉచిత సలహాలు పడేసింది.
అమ్మా నాన్నా అందరి మాటలకు అలాగే! అంటూ తల ఊపుతూ పంపించారు.
తరువాత విశాఖపట్నం పంపించి చిన్నమామ్మగారి ఇంట్లో ఉంచారు. వాళ్లు చాలా బాగా చూసుకునేవారు. తన చదువు కూడా చక్కగా సాగింది. 9వ తరగతిలో ఉండగానే మానిపించి, డైరెక్ట్‌గా మెట్రిక్ పరీక్షకు కట్టించారు. అప్పుడే తనకు జానకితో పరిచయం, మంచి స్నేహం కుదిరింది.
మెట్రిక్ పాస్ అవగానే తనను మళ్ళీ పల్లెటూరికి తీసుకుపోయారు. అక్కడ చిన్నత్త మాటలకు కాదనలేక వారి అబ్బాయి వేణుతో వివాహానికి ముహూర్తాలు నిశ్చయించేశారు.
తను నాన్న దగ్గర ఏడ్చింది. “నాన్నా! నా స్నేహితురాలు టీచర్ ట్రైనింగ్‌కి వెళ్తోంది. నన్ను కూడా పంపించు నాన్నా! ఒక్క ఏడాది అయిపోతే అప్పుడు నేను మీరెలా చెప్తే అలా చేస్తాను. నా కాళ్ళ మీద నేను నిలబడగలను.” అంటూ ఏడ్చింది.
కానీ నాన్న తన చెల్లెలు ఏడుపుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు.
నీహాకి ఏం చేయాలో తోచలేదు వేణునే అడిగితే అనుకుంది. ఒక కొత్త పెన్ బాక్స్ కొన్నది. అందులో అడుగున కాగితం క్రింద ఒక ఉత్తరం రాసి పెట్టింది.
“బావా! ఒక్క ఏడాది పెళ్లి ఆపించవా? నేను టీచర్ ట్రైనింగ్ అవుతాను. ప్లీజ్.”
అది బయటకు మామూలుగా పెన్ను బాక్స్‌గా ఒక గిఫ్ట్ గా ఉంది. చిన్నత్త చేతికి అందిస్తూ “బావకి ఈ పెన్ను పెట్టి అందించవా! అత్తా!” అని ఇచ్చింది.
“బావ అంటే నీకు ఎంత ప్రేమే!” అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ అత్త ఆ గిఫ్ట్ తీసి పెట్టిలో పెట్టింది.
వాళ్లు వెళ్లిపోయారు గానీ నీహాకు ప్రతిక్షణం టెన్షన్. బావ చూశాడో? లేదో? అతని మాట విని పెళ్లి ఆపుతారో? లేదో?
తన ఇంట్లోనే తన మాట వినలేదు. అక్కడ మాత్రం అతని మాట వింటారా? అతనికి 20 తనకు 16 ఈ వయసులో వివాహం ఏమిటి?
మనసుకు ఇష్టం లేకున్నా కాలం ఆగదు. అనుకున్న ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. ఇరువైపులా పెళ్లి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
నీహారికకు అర్థమైంది. తన రాసిన ఉత్తరము బావ చూసి ఉండడేమో అని.
సంఘర్షణల నడుమ వివాహం ప్రారంభమైంది. అమ్మానాన్న ఆడపెళ్ళి వారిగా వారు అడిగినవన్నీ క్షణాల్లో అందిస్తున్నారు.
పల్లెటూరిలో పెళ్లి సంప్రదాయం పాటించాలంటూ అత్త ఒక ప్రపోజల్ పట్టుకొచ్చింది. ‘తోట సంబరాలు నిజంగానే మామిడి తోటలో దిగాలని పెళ్ళికొడుకుని పెళ్లికూతురుని పల్లకిలో తీసుకురావాలని’.
“చెల్లాయి సుమతీ! ఈ రోజుల్లో ఇంకా ఇవన్నీ అవసరమా? పిల్లలు చదువుకుంటున్నారు కదా!” అన్నాడు నాన్న.
అయినా చిన్నత్త అడిగింది అంటే క్షణాల్లో కోరిక తీర్చడమే తప్ప ఇంకొక దారి లేదు.
పూవులదండలతో అలంకరించి, పట్టుపరుపు పరచిన పల్లకిని బోయీలు మోస్తూ ఉంటే నీహా, వేణూ ఎదురెదురుగా కూర్చున్నారు. వేణు చుట్టుపక్కల చూస్తూ ఆనందిస్తూ పల్లకి వెనకాతల వచ్చే పిల్లకారుతో, బంధువులతో మాట్లాడుతున్నాడు.
నీహారిక సిగ్గుతో తల ఎత్త లేకపోయింది.
“నీహా! మాట్లాడు నా దగ్గర సిగ్గెందుకు?” అన్నాడు.
నీహా తలదించుకుని బుర్ర అడ్డంగా ఊపింది. ఆమెకు మాట్లాడాలని లేదు. వేణు మాట్లాడాడు.
“నువ్వు పంపించిన పెన్ను గిఫ్ట్ చాలా బాగుంది. అందులో ఉంచిన ఉత్తరం కూడా.” నెమ్మదిగా అన్నాడు.
వింటున్న నీహారిక ఉలిక్కిపడి తల ఎత్తి అతన్ని చూసింది. అందమైన ఆమె కళ్ళు చూస్తూ ‘ఎంత బాగున్నావో’ అన్నాడు.
చూస్తే.. మరి.. అంటూ ఎన్నో అడగాలనుకుని మౌనం వహించింది.
పెళ్లి వేడుకలు అన్ని సంప్రదాయబద్ధంగా జరిగిపోయాయి. నాన్న ఎవరికి ఏ లోటు లేకుండా చాలా చక్కగా చూసుకున్నారు.
అప్పగింతల వేళ అమ్మానాన్న కన్నీరు మున్నీరు అవుతూ చిన్నత్త మావయ్య తరఫు బంధువులందరికీ పాలల్లో తన చేతులుంచి వారికి అప్పగించారు. వేణు బావ చేతికి తన చేతిని అప్పగిస్తూ నాన్న
“తల్లి నీహా! బావ పెళ్లి తర్వాత నిన్ను టీచర్ ట్రైనింగ్ చదివించిన తర్వాతే కాపురానికి పంపించమని చెప్పాడమ్మా! అదే తనకు మేము ఇచ్చే కట్నంగా భావించమన్నాడు. ఇంత మంచి మనసున్న బావని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం” అన్నాడు.
వింటున్న నీహారిక సంభ్రమంతో వేణువైపు ఆరాధనగా చూసింది.
తన చేతిని పట్టుకొని ఉన్న అతని చేతిని వెంటనే సంకోచించకుండా తన బుగ్గలకు ఆనించుకుంది.
శుభలగ్నం అయిన తరువాత సప్తపదులు నడిచి, అరుంధతిని దర్శించి, వచ్చిన ఆ నవజంట లక్ష్మీనారాయణులుగా భాసిస్తూ ఉంటే అందరి కళ్ళలో ఆనంద సంబరాలు.
అధ్యాయం 4
నూతన దంపతులు లక్ష్మీనారాయణులుగా భాసిస్తున్నారు. ఆదిదంపతులు అర్ధనారీశ్వరులు కావడానికి 9 నెలల గడువుంది. నీహారిక చదువు వారిరువురి మధ్య కనిపించని గోడగా నిలచింది.
వేణు చాలా హుందాగా ఉన్నాడు. ఎవరేమడిగినా చిరునవ్వే!
“ఏరా! వేణూ! మూడు నిద్దర్లకు మన ఊరు తీసుకురావా?”
“వస్తుందిలే పెద్దమ్మా!” అన్నాడు చిరునవ్వుతో
“కాదురా! నువ్వు ఇక్కడే ఉంటావా? మూడు నిద్దర్లకి..” మెల్లిగా స్వరం తగ్గించి అడిగింది.
“అవును” అన్నాడు అంతే మెల్లిగా.
“మనకు మన ఇంట్లో ఆచారం కదరా!”
“అవును వీళ్లకు వీళ్ళింట్లో ఆచారంట!”
ఈ సమాధానాలన్ని తిక్కగా తోచాయేమో!
“మీ అమ్మని అడుగుతానుండు” అంటూ రివ్వున వెనుతిరిగింది.
తను అమ్మానాన్నతో అన్నీ మాట్లాడాకే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అవి వీళ్ళకు తెలియదు అనుకుంటూ మొహం పైకెత్తి పలువరస కనిపించేలా నవ్వుకున్నాడు.
“ఆహా! ఏమందమూ..” అంటూ చిన్నగా కూని రాగం తీస్తూ వచ్చింది నీహారిక.
“పెద్దమ్మ ఏమన్నాదో విన్నావా? బంగారూ!” అని చిలిపిగా అడిగాడు.
“ఊహూ.. నిన్నే చూస్తూ వచ్చాను. మీకు అంత సంతోషాన్ని కలిగించిన విషయం ఏమిటా అని.”
“చెబుతాను ఇలా రా!” అంటూ ఆమెను దగ్గరగా తీసుకుని చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు.
సిగ్గుతో నీహా అరచేతిలో మొహం దాచుకుంది. వేళ్ళసందులో నుండి చూసేటప్పటికీ వేణు మాయం.
సాయంత్రం పెరట్లో ఉన్న పెద్ద గట్టుమీద ఇద్దరూ కూర్చున్నారు. అందం అమాయకత్వం కలబోసిన పదహారేళ్ల పల్లెపడుచు కొత్త పెళ్లికూతురు అలంకరణలో ముగ్ధమోహనంగా ఉంది.
కొత్త పెళ్ళికొడుకు వేణు రూపు దాల్చిన మన్మథునిలాగా మెరిసిపోతున్నాడు. అతని వదనంలోని చిరునవ్వు కాంతులీనుతూ పరిసరాలకు ప్రశాంతతను చేకూరుస్తోంది.
“నీహా! ‘వివాహం విద్య నాశాయ’ అని పెద్దల నానుడి మనం నిజం చేయకూడదు. అది తప్పని మనం ఆచరణలో చూపించాలి. నీ చదువు నా చదువు నిరాటంకంగా సాగాలి అంటే మనం ఇద్దరం ఒక అవగాహన కలిగి ఉండాలి. సరేనా!” తలవంచుకొని వింటున్న నీహారిక సరే! అన్నట్లు తల ఊపింది.
“కానీ.. చాలా కష్టం అవుతుంది.” అంది.
ఆమె అన్న తీరుకి మోహావేశం చుట్టుముట్టగా వంచిన ఆమె తల పైకెత్తి ఆమె పెదవులను సున్నితంగా స్పృశించాడు.
“బావా! ఆమె గొంతులో మైమరపు.
వెంటనే వేణు ఆమెను వదిలేస్తూ
“ఏయ్! మా నీహా బంగారు కొండ! అనుకున్నాను. ఇంత అల్లరిపిల్లా! మా ఇంటికి నువ్వు వస్తే ఇక్కడికంటే పెద్ద పల్లెటూరు అది. ఆవలించకుండానే పేగులు లెక్కెట్టేస్తారు. అందువలన ముందు మనిద్దరి చదువులు అయ్యేంతవరకు పెద్దలకు తెలియనివ్వవద్దు.” అన్నాడు.
“అదెలా? అమ్మ అన్నీ అడుగుతుంది మరి! అదే కదా కష్టం అంటున్నది.” అంది మెల్లగా
“ఇప్పుడు ఇక్కడ మూడు రోజులు నేను ఉంటాను. తరువాత కాకినాడ వెళ్ళిపోతానుగా! నా కాలేజీలు పరీక్షలు..” వేణు చెప్తూనే ఉన్నాడు.
వస్తున్న నవ్వుని ఆపుకుందికి ప్రయత్నిస్తూ విఫలురాలై పకపకా నవ్వేసింది నీహారిక.
“బావా! 16 రోజుల పండుగ అయ్యేంతవరకు మనమిద్దరం కలిసే ఉండాలి. వేరే ఏదన్నా మాట్లాడితే మా అమ్మా, మీ అమ్మా వీపు వాయగొడతారు. ఇందాక అమ్మ ఎవరితోనో అంటూ ఉంటే విన్నాను. ముందు ఇక్కడ మూడు రోజులు అయ్యాక మీ ఊరు వెళ్లాలిట. 16 రోజుల్లో అన్నీ మంచి రోజులేనట తర్వాత మళ్లీ ఇక్కడికి..”
“అవునా!” వేణు తన ప్లాను తుస్సుమనేసరికి డీలా పడిపోయాడు.
“ఇంకా మనిద్దరమూ మధుపర్కాలతో నడిచి కొండెక్కి వెంకన్నబాబుని దర్శించుకోవాలట. తెలుసా?”
“అవన్నీ ఏడాదిలోగా చేస్తామని మా అమ్మకి చెప్తానులే! మీ అమ్మని నువ్వు ఒప్పించుకో!”
“సరే! వెళ్తున్నా!” లేస్తున్న నీహారిక నిజంగా వెళ్ళిపోతుందనుకుని,
“కాసేపు కూర్చో! మాట్లాడుకుందాం. ఎన్ని కబుర్లున్నాయో తెలుసా!”
“సరే! చెప్పు. చెప్పు” ఉత్సాహంగా అంది.
ఇద్దరూ మాటల్లో అలా అలా.. చీకటి పడిందే తెలియలేదు.
ఆ చీకటిలో సుదూరంగా ఒక వ్యక్తి ఏదో ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నది వీళ్ళ దృష్టికి రాలేదు. ప్రసాదరావుగారి మనసులో గీతామృతం మెదులుతోంది.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కర్మ యోగంలో ఈ విధంగా చెప్పాడు.
“లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్//” (3-3)
సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము అను రెండు విధానములైన అనుష్ఠానములు శ్రీకృష్ణుడు మనకు అందించారు.
ఈ రెండు మార్గములందు కూడా ‘కర్మలను త్యజించినంత మాత్రమున మోక్షము లభించదు.’ అని స్పష్టంగా ఉంది. అందువలన చేయవలసినది చేయక తప్పదు.
మూడు రోజులు కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోయాయి. వేణు తల్లి పట్టు పట్టడంతో అక్కడికి వెళ్లారు. 16 రోజుల పండుగ అయింది. మెడలో మంగళసూత్రాలను రెండుగా ఉన్నవి ఒకటి చేయటం, నల్లపూసలు కూడా గుచ్చి వేయటం, బంధువులను పిలిచి, తీపి వంటకాలతో భోజనాలు పెట్టారు.
నీహారిక ట్రైనింగ్ కోర్సులో చేరే టైం అయింది. వేణు కూడా కాకినాడ ప్రయాణం ఒకేసారి మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకున్నారు.
కొత్తజంటకు ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సమయం సరిపోవటం లేదు.
“నీహా! నేను రోజుకొకటి చొప్పున వారం రోజులు నీకు ఉత్తరాలు వ్రాసి శనివారం కవర్లో పెట్టి పోస్ట్ చేస్తాను. చదివాక నువ్వు కూడా రోజుకో ఉత్తరం చొప్పున రాసి అలాగే పంపించు నీ సందేశాన్ని.”
“ఓహో! ప్రేమలేఖలా! పెళ్లి అయ్యాక మనం ప్రేమించుకుంటాం అన్నమాట! చిలకనో, హంసనో పెంచుకుంటే బాగుండేది. మన ప్రేమ సందేశాలకు రాయబారులుగా.” చిలకలాగా, హంసలాగా చేతులు తిప్పి నటిస్తున్న నీహారికని చూసి పకపకా నవ్వాడు.
ఎన్నెన్నో కబుర్లు భవిష్యత్తుపై కలలు చెప్పుకుంటూనే చెరొక ఊరు బయలుదేరే రోజు వచ్చేసింది.
అసలు కథ మొదలైంది ఇరు జీవితాలలో అప్పుడే!
విధిలీల???
నీహారిక తండ్రి ఆలోచనలో ఉండడం, పరాకుగా ఉండడం చూసిన భార్య కూతురిని వదల్లేని బెంగ కాబోలు అనుకుంది. దగ్గరగా వచ్చి,
“ఏమండీ! ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రులకు ఎదుర్కోక తప్పని సన్నివేశం ఇది. పిల్లలు వాళ్ళ సంసారంలో పడగానే మనము మరుపుకి వస్తాము. మనం కూడా మన నిత్యజీవిత పనిపాటల్లో పడితే బెంగ తీవ్రత కొంత తగ్గుతుంది.” భార్య చెప్పే మాట వింటున్న కరణంగారి మనసు ఒక్క క్షణం భార్యతో చెబుదామా? తన మనసులోని ఆరాటం దేనికో? అనిపించింది.
కొన్ని విషయాలలో వ్యక్తి కంటే కుటుంబం, కుటుంబం కంటే గ్రామం, గ్రామం కంటే ప్రాంతం, ప్రాంతం కంటే దేశం ప్రాధాన్యతా క్రమంలో వస్తాయి.
తాను ఊరిపెద్దగా ఎన్నో విషయాలను సునాయాసంగా పరిష్కరించేవాడు. ఆ రచ్చబండ మీద కూర్చుంటే అది విక్రమార్కుని గద్దెగానే భావించేవాడు.
చిన్నప్పుడు చదువుకున్న చిన్నకథ జ్ఞాపకం వచ్చింది. ఒక పశువుల కాపరి ఊరవతల మైదానాలలోకి స్నేహితులతో కలిసి పశువులను తోలుకుని వెళ్లేవాడట. అక్కడ ఎత్తుగా ఉన్న ఒక రాయి మీద కూర్చునేసరికి అతనికి విపరీతమైన జ్ఞానంతో ఇతర కాపరుల మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించే నైపుణ్యం అలవడటం, అవి నిష్పాక్షికంగా ఉండడం గమనించి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి, తమ తగవులను కూడా తీర్చమని అడిగేవారట.
ఆ విధంగా ఆ వార్త భోజమహారాజుని చేరింది. ఆ విశేషమేదో చూద్దామని స్వయంగా విచ్చేసాడట మారువేషంలో. బాలుని చాతుర్యం, అతనిలో తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడట. ఆ రాయి మీద నుంచి క్రిందికి దిగేసరికి మళ్ళీ మామూలు పశువుల కాపరిలాగే అతని ప్రవర్తన ఉండేదట. ఇది తెలుసుకున్న రాజు ఈ ప్రభావం అంతా ఈ కుర్రవాడిది కాదు వాడు కూర్చున్న రాయిలో ఉంది అని ఊహించాడు.
ఆ రాయిని త్రవ్వి చూసేసరికి అడుగున విక్రమార్కుడు ఎక్కిన సింహాసనం 32 సాలభంజికలతో కూడినది వెలువడింది. దానిని శుభ్రపరచి రాజధానికి తరలించాడు. ఉదయాన్నే శుచిస్నాతుడై వేదమంత్రాల మధ్య తాను సింహాసనం అధిష్టించాలని అనుకుని మొదటి మెట్టుపై అడుగుపెట్టేసరికి ఒకటో సాలభంజిక విక్రమాదిత్యుని గుణగణాలు వర్ణిస్తూ ఒక కథ చెప్పి “రాజా! నీలో ఆ గుణాలు ఉంటే నిరభ్యంతరంగా సింహాసనం ఎక్కవచ్చు.” అని ఆ సాలభంజిక చెప్పేసరికి భోజరాజు సిగ్గుపడి తిరిగి భవనానికి వెళ్లిపోతాడు. అలా ప్రతిరోజూ రాజుగారికి ఒక్కో సాలభంజిక కథలు వినిపిస్తూ వచ్చాయి.
అలాగే తాను కూడా గ్రామపెద్దగా కరణంగానే కాక జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేద, వైద్యపరమైన పెద్దల నుండి వచ్చిన జ్ఞానంతో చాలా సులువుగా పరిష్కారమార్గాలు తనకు తోచినవి చెప్పేవాడు. అవి వినగానే సమస్య తొలగిపోయినంత ఆనందభరితులై వారు ఇంటికి వెళ్లిపోయేవారు.
ఆ విధంగా తాను గ్రామపెద్దగా పదుగురి మన్ననలు పొందాడు. కానీ కుటుంబ పెద్దగా తన చెల్లి కొడుకుని అల్లుడుగా చేసుకునేటప్పుడు జాతకాలు చూసి, అవి ఏమాత్రం నప్పలేదని చెప్పలేకపోయాడు. నప్పకపోవడమే కాదు అతనికి మృత్యుగండం ఉందని చూసి కూడా చెప్పలేని అసహాయుడయ్యాడు.
తానే గ్రామపెద్ద. అలాంటప్పుడు మరొకరికి ఎలా చూపించగలడు? ఒక ఏడాది పెళ్లి వాయిదా వేయించాలని రకరకాల కారణాలు చెప్పాడు.
కూతురు చదువుకోవాలని, ఇంటిపనులు అవ్వాలని తాను చెపుతున్న ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తూ ఎంతో ఉత్సాహపడుతున్న కుటుంబ సభ్యులను చూసి సరే! అనేసాడు.
కానీ ఇంకెవరితోనూ పంచుకోలేని విషయం ఆ గండం దాటితే వాళ్ళు చాలా బాగుంటారు. తిరుగులేదు. అందుకే ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని చూశాడు. ఒక ఏడాది వారిరువురిని కలవనీయకుండా చేయడం ఎలాగా? అనుకున్నాడు.
అదే సమయంలో ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా వేణు స్వయంగా వచ్చి అడిగాడు.
“మామయ్యా! నీహారిక చదువుకుంటానంటోంది.. ఈ ఒక్క ఏడాది తన చదువు అయ్యేవరకు మేము దూరంగా ఉంటాము. అమ్మ సరదా కోసం వివాహం మాత్రం ఇప్పుడే జరిపించండి. పరీక్ష అయిన తర్వాతే కాపురానికి పంపించు. ఈలోగా నా చదువు కూడా పూర్తవుతుంది ‘లా’ పట్టా చేతిలో పెట్టుకొని ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు.” అని వేణు చెప్పినది వినగానే,
అమ్మయ్య! అనుకున్నాడే గానీ ఈ ఏడాది దాటాకే పెళ్లి చేస్తాను అని తను ఒక్క మాట అనవచ్చును కదా! కానీ ఎందుకు? అని చెల్లి అడిగితే తాను నిజం చెప్పలేడు. అందుకే వివాహానికి అంగీకరించాడు.
ముహూర్తం పెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. అన్ని గ్రహాల స్థానాలు చూసి, గణిస్తూ ఏవేవి వక్రీస్తాయో, ఏవేవి శుభఫలితాలనిస్తాయో చూసుకొని కూతురుని సుమంగళిగా ఉంచే మంచి ముహూర్తం పెట్టాడు.
ముహూర్తం పెడుతూ ఉండగా జ్యోతిశ్శాస్త్రంలో లిఖించబడిన ప్రతి జ్యోతిష్యవేత్త చదివే ఆ కథ గుర్తుకొచ్చింది. ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త భాస్కరాచార్యుడు తన కుమార్తె లీలావతికి వైధవ్యం ఉంటుంది అని తెలిసి తప్పించాలని చేసిన ప్రయత్నం తాను కూడా ఎన్నోసార్లు ఎంతమందికో చెప్పాడు ఈ కథను.
నమామి భాస్కరాచార్యం, శాస్త్రకార శిరోమణిం/
యే నేదం గణితాకాశం ప్రదీప్తం విశ్వతోముఖమ్//
గణితాకాశంలో భాస్కరుడుగా అద్వితీయుడై వెలుగొందిన ఆచార్యుడు, ఖండ ఖండాంతరాల్లో భరతభూమి వైశిష్ట్యం చాటి, అఖండఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహనీయుడు. ప్రాచీన భారతీయ గణితగ్రంథాల్లో చూడామణి అనదగిన ‘సిద్ధాంత శిరోమణి’ గ్రంథం వ్రాసిన ఆచార్య ద్వితీయ భాస్కరుడు. ఈ గ్రంథము ఆనాటికీ ఈనాటికీ ఏనాటికీ గణిత జిజ్ఞాసువులందరికీ వెలుగు చూపే దిక్సూచి.
జ్యోతిశ్శాస్త్రం పట్ల పరిచయం ఉన్నవాళ్లందరూ ఈ కథను తప్పనిసరిగా చెప్పుకుంటారు. భాస్కరాచార్యునికి గల జ్యోతిశ్శాస్త్ర పరిజ్ఞానం వలన తన కుమార్తె లీలావతికి సుమంగళీయోగ్యత లేదని గుర్తించి కూడా ముహూర్తబలంతో ఆ విధివ్రాతని అతిక్రమించాలని, ఒక మంచి పెండ్లి ముహూర్తం నిశ్చయించి, కాలనిర్ణయం కోసం ఆచార్యుడు ఒక ‘జలఘటికా యంత్రం’ ఏర్పాటుచేశాడు. బాల్యచాపల్యం వల్ల లీలావతి వింతగా ఆ యంత్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఆభరణాల్లోని ఒక ముత్యపుపూస జారి దానిలో పడింది. రంధ్రానికి అవరోధం ఏర్పడడం వలన జలయంత్రం వేళ తప్పింది. ఈ విధంగా ఆమెకు విధి వక్రించి జీవితమంతా వైధవ్యం పాలయింది. ఆచార్యుడు ఆమె ఆనందం కోసం, మనసు మరల్చడం కోసం తన బిడ్డకు గణితశాస్త్రంలో అభిరుచి కల్పించి, బోధించాడు.
“అమ్మా! నీ పేరిట ఒక గ్రంథం రాస్తాను. ఇది అమరకావ్యంగా నిలిచిపోతుంది.” అని ప్రతిజ్ఞ చేశాడు.
అదే విధంగా ‘లీలావతి’ అని పేరుతో భాస్కరుడు రచించిన గ్రంథం సాంస్కృతిక చరిత్రలో నిజంగానే ఎప్పటికీ ఒక అమరకావ్యంగానే మిగిలిపోతుంది.
ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ కొన్ని మన చేతిలో ఉండవు కదా? అని గ్రహించుకున్నవాడై పెళ్లి ముహూర్తాలు పెట్టడం, అంగరంగ వైభవంగా వివాహం జరిపించడం జరిగింది.
వివాహం నిర్విఘ్నంగా జరిగింది. కానీ ఆ రోజులలో ఇంటి పెద్దలు కొన్ని విషయాలను చాలా రహస్యంగా ఉంచేవారు. ఒకటి వారి హుందాతనం అయితే మరియొకటి తెలుసుకొని అందరూ బాధపడడం తప్ప ఏం చేయగలం? అని భావన కావచ్చు.
(సశేషం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచిట అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం వెలువరించారు.
2 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది నవలా రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారి స్పందన: *చాలా ఉత్కంఠ భరితంగా ఉంది జీవామృతం!



*
కొల్లూరి సోమ శంకర్
ఇది విజయప్రభ గారి స్పందన: *అక్కా ఇప్పుడే జీవామృతం సంచిక చదివాను చాలాబాగుంది ఇంట్రెస్టింగ్ గా వుంది. విజయప్రభ, విజయనగరం*