[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘జీవామృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]


[గతం జ్ఞాపకాలను, అందులోని బాధని వదిలించుకుని, తండ్రి రాసిన ఉత్తరం లోని సూచనల ప్రకారం తానేం చేయాలో నిర్ణయించుకుంటుంది నీహారిక. భగవద్గీత చదువుకుని మార్గదర్శనం పొందుతుంది. తమ భూమినంతా, భూమి లేని పేద రైతులకు పంచి, అందరూ కలిసి ఉమ్మడి వ్యవసాయం చేయాలని నిశ్చయించుకుంటుంది. తన ఆలోచనని తల్లికి చెప్పి, ఆమె ఆమోదం పొందుతుంది. పాలేర్లను పిలిపించి, తాన ఆలోచనలు వాళ్ళతో పంచుకుని, వారికి తన ప్రణాళిక వివరిస్తుంది. వాళ్ళు సరేనంటారు.- ఇక చదవండి.]
అధ్యాయం 10
మర్నాడు ఉదయం చింతచెట్టు కింద చాపలు పరిచి అందర్నీ కూర్చోబెట్టింది. తను కూడా వాళ్ళ మధ్యలోనే కూర్చుంది.
“మా కుటుంబం తరతరాలుగా ఈ ఊరికి కరణాలుగా, రైతులుగా, ఊరి పెద్దలుగా ఉండి పని చేశారు. నాన్నగారికి ఉన్న ఏకైక కుమార్తెగా పరిస్థితుల వలన కొన్ని కష్టాలు మేము అనుభవించవలసి వచ్చింది. అన్నింటినీ ఎదుర్కోగలిగే ధైర్యాన్ని నాన్నగారు నాకు అందించారు.
అందువలన నేను కొన్ని విషయాలు మీతో పంచుకుందామని మిమ్మల్ని పిలిచాను.
మన ఊరిలో చాలా భూమి ఖాళీగా ఉన్నది. మనం పంట మార్పిడి పద్ధతులు వేస్తూ, సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ, నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంచుదాం. అందుకు అవసరమైన పద్ధతులు నేను చెప్తాను. వాటిని మీరంతా ఆచరణలో పెట్టండి. ‘ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ’ అన్న పేరు నిలబెట్టే విధంగా మనం మన ఊరిని తీర్చిదిద్దుదాము.”
అమాయకులైన ఆ పల్లె రైతులు నీహారిక మాటలు వింటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.
“నిజమా! మన ఊరికి మంచి రోజులు వచ్చాయా?” అని ఆశ్చర్యపోతూ ‘చిన్నమ్మగారికి జై!’ అంటూ నినాదాలు చేశారు.
ఇంక అక్కడి నుంచి పనులు మొదలుపెట్టారు. ముందుగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కరణంగారి ఇంటిని వాసయోగ్యంగా చేయటానికి అవసరమైన తాటివాసలు తెప్పించి, తాటి కమ్మలతో నేయించి, ఇంటికి పూర్వవైభవాన్ని తీసుకువచ్చారు. ఇంటికి మామిడి తోరణాలు, ఇంటి ముందు రంగవల్లులు. పండుగ వాతావరణం ఏర్పడింది.
అదే విధంగా నెల రోజుల్లో రాబోతున్న గ్రామదేవత పరదేశమ్మ పండుగ చేయటానికి ఆలయాన్ని కూడా అదే విధంగా చక్కగా తీర్చిదిద్దారు. ఈ పనులు అన్నింటిలో ఊరంతా పాలుపంచుకున్నారు.
వేరొక ప్రక్క పొలం అంతా కొలతలు తీయించి సరిహద్దులు పెట్టారు. 50 ఎకరాల విస్తీర్ణం గల ఆ పంట భూములు 50 మందికి చెందినవిగా రాయించారు.
ఏ పంట ఎప్పుడు వేయాలో, ఏవి అంతర పంటలు వేయాలో, ఎప్పుడు ఏ ఎరువులు వేయాలో అన్ని నీహారిక చెప్పిన విధంగా చేస్తూ అందరూ ముందుకు నడుస్తున్నారు. ఊరంతా ఒక తాటిపై ఉన్నట్టుగా ఉంది. ఊరిలో అందరికీ భూమి ఉంది. కామందు, పాలేరు వ్యవస్థ నిర్మూలించబడింది.
పట్టణ నాగరికతకు సుదూరంగా ఉన్న ఆ పల్లెటూరిలో ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రైతు విప్లవం ప్రకృతి వ్యవసాయంగా రూపుదిద్దుకుంది.
ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆలోచనలతో చేస్తున్న మార్పులు ఊహించని రీతిలో ఫలసాయాన్ని అందిస్తున్నాయి.
గత ఐదు సంవత్సరాలలో వీరు చేసిన నూతన పద్ధతులలో వ్యవసాయం ఆ గ్రామంలోని మిగిలిన రైతులను కూడా ఆకర్షింప చేసింది.
వారికి వేరే శిక్షణ అవసరం లేకపోయింది. ఎందుకంటే వీరంతా ఏ విధంగా దిగుబడిని పెంచుతున్నారో అదే విధంగా మిగిలిన రైతులంతా కూడా వారి పొలాలలో అదే పద్ధతిని అనుసరించి అధిక దిగుబడిని పొందుతున్నారు.
ప్రతి ఒక్కరికీ చిన్న, పెద్ద, స్త్రీలు, పురుషులు అందరికీ తమ గ్రామంలో వ్యవసాయంలో చేసే పద్ధతులు తెలుసు.
అంతా పారదర్శకమే! ఈరోజు గ్రామమంతటా ఒకే మాట ఒకే బాట.
2000 మంది జనాభా లేని ఆ గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. దానికి కారణం అత్యంత దిగుబడి సాధించిన పంచాయితీ గ్రామంగా ఆ ఊరి పేరు వార్తలలోకి ఎక్కింది. ఎవ్వరు నమ్మలేని రీతిగా ఎకరాకు పదిరెట్లు దిగుబడి పెరగడం అనేది ఎక్కడా వినలేదు.
మీడియా వారంతా కూడా ఆ గ్రామానికి వచ్చారు. మైకులు పట్టుకుని పొలాలలో తిరుగుతున్నారు. అవి పొలాల లాగా లేవు చూస్తే చిన్నపాటి అడవుల్లాగా తుప్పలు తుప్పలుగా కనిపిస్తున్న ఆ పొలాలలో ఏమిటి పండిస్తున్నారు? అర్థం కాలేదు మీడియా వారికి. అందుకే కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆపి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వారంతా కూడా కూడా తాము చేసే వ్యవసాయం గురించి మాట్లాడేవారే!
‘ప్రకృతి వ్యవసాయం చేయడం అంటే ప్రాచీన విధానాన్ని నూతనంగా అవలంబించడం వలన పంట దిగుబడి పెంచవచ్చు’ అని చెప్తారు ఒకరు.
‘రసాయనిక ఎరువులూ, పురుగుల మందులూ బయట నుంచి ఏమీ తేకుండా వాటి అవసరమే లేకుండా పండించడం ఎలాగో చెప్తారు’ మరి ఒకరు.
“మీ పొలం అంతా తుప్పల తోటి అడవిలాగా ఉంది కదా! ఇందులో ఎలా పండించగలరు?” అని అడిగితే
“పొలం శుభ్రంగా ఉంటే సహజ పోషకాలు అందక పంట దిగుబడి తగ్గిపోతుంది. అందువలన మేము మా పొలాలలో పచ్చిరొట్ట పెంచుకొని దానితో పంట పండిస్తే దిగుబడి అధికమవుతుంది. తుప్పలుగా కనిపిస్తున్న ఈ పచ్చి రొట్ట ఎలా వస్తుందంటే ఖాళీ పొలంలో ఈ విత్తనాలు జల్లుతాము.
వాన చినుకుకి అవి అయిదారు అడుగుల ఎత్తు వరకు లేస్తాయి. వాటిని కత్తిరించి పొలంలో వేయడం వలన వేరే ఏ రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేదు.
అదే విధంగా భూమి కిందకు వేర్లు వ్యాపించడం వలన భూమి బోలుగా ఉండి, గుల్లబారి ప్రధాన పంటకు అవసరమైన పోషకాలు అందుతాయి. వీటి యొక్క వేరులను తింటూ వానపాములు వీటి మీద ఆధారపడతాయి. ఇతర కీటకాలు విషపురుగులు మన పంటను తినకుండా కాపలా కాస్తాయి.
మేము వేసిన ఏ పంటకు శత్రుపురుగులు రాకుండా మంచి పంట దిగుబడి వస్తుంది. పురుగుల మందులు జల్లవలసిన అవసరం కూడా ఉండదు.”
“ఈ పచ్చిరొట్ట మీరు ఎలా తయారు చేస్తారు?”
“ఇవి కూడా మనకు అవసరమైన పంటలే! జనుము, అలసంద, జీలుగు, పెసర, నువ్వులు, పిల్లి పెసర, ఆవాలు మొదలైనటువంటి విత్తనాలు జల్లి వీటిని మేము పెంచుతాము. ఒక మొక్కకు 10 లేదా 15 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరాకు 20 కేజీలు చల్లడం వలన వేరే ఏ రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం ఉండదు.”
“అధిక వర్షాలు పడినప్పుడు మీ పంట భూములలో పండిన పంటలు నష్టపోతాయేమో?” ఒకరు అడిగిన ప్రశ్నకు వెంటనే ఒక 12 సంవత్సరాల బాలుడు ఇలా చెప్పాడు.
“మేము వేసిన ఈ పచ్చిరొట్ట మొక్కలు మోచేతి సైజులో భూమిలోకి వేళ్ళు తన్నుతాయి. ఈ మొక్కలు గట్టిగా ఉన్న భూమిని గుల్లబరుస్తాయి. అందువలన వర్షం పడితే నీరు డైరెక్ట్‌గా భూమిలోకి ఇంకి, మన పంటకు అవసరమైన నీటిని అందిస్తాయి.”
“ప్రధాన పంటతో మీరు అంతర పంటలుగా ఏవి వేస్తుంటారు?”
“అరటి, పసుపు, కర్పూరం మొదలైనవి వేస్తాము.”
“ఎప్పటినుండి మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? ఇంతకుముందు వ్యవసాయంలోకి ఏవి వాడేవారు? దానికి దీనికి తేడా ఏమైనా ఉందా?”
“ఇంతకుముందు మేము కృత్రిమ ఎరువులు కొని వాడేవాళ్ళము. కానీ గత ఆరు సంవత్సరాలుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మీదనే ఆధారపడ్డాము. సేంద్రియ ఎరువులు, జీవామృతం తయారుచేయడం వలన కలుపు మొక్కలు తీయటానికి కూలీలను పెట్టుకోవలసిన అవసరము, ఎరువులకు ఖర్చులు మొదలైనవన్ని కూడా ఇంచుమించుగా లేనట్లే! అందువలన ఖర్చులు తగ్గినప్పుడు ఆ మేరకు ఆదాయం పెరిగినట్లే కదా!”
వింటున్న మీడియా మిత్రులందరి మొహాలలో ఆనందం, విస్మయం కలగలిపి ఉన్నాయి. వారు ఇటువంటి ఇంటర్వ్యూలు ఎప్పుడు చేయలేదు. తమ పొలాలలోకి, తమ దగ్గరకు వచ్చి అడుగుతున్న అన్నిటికీ ఆనందంగా రైతులు జవాబులు ఇవ్వడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆఖరి ప్రశ్న “మీకు ఇవన్నీ నేర్పిన వాళ్ళు ఎవరు?”
“మా కరణం గారి అమ్మాయి. పట్నంలో ఇవన్నీ నేర్చుకుని వచ్చి, మా అందరి జీవితాలను మార్చింది. ఇప్పుడు మాలో ప్రతి ఒక్కరికి సొంత భూమి ఉంది. పండించుకునే భూమి ఉండడం వలన మా కుటుంబం నిర్భయంగా ఉంటున్నది. రేపన్న భయం లేదు.”
“మీ అమ్మాయి గారిని మేము ఇంటర్వ్యూ చేయవచ్చునా?” అడిగారు వాళ్ళు.
“అదిగో! చూడండి ఆ పశువులపాక దగ్గర ఉంటారు.” అంటూ సుదూరంగా చూపించారు.
వీరంతా ఆమెను కలిసారు.
వయసుకు మించిన గాంభీర్యాన్ని సూచించే విధంగా ఉన్న ఆమె అలంకరణ నేతన్నలకు గౌరవాన్ని పెంచేటట్లుగా కట్టుకున్న చేనేతచీర చూడగానే నమస్కరించాలని గౌరవభావం కలిగింది వారికి.
దగ్గరలో గల కొబ్బరిచెట్ల నుండి కాయలను దింపించి అందరికీ తాగడానికి ఇప్పించింది నీహారిక.
ఎంతో స్నేహపూరిత వాతావరణంలో ఇంటర్వ్యూ సాగింది.
“ఇంత ఎక్కువగా మీకు ఫలసాయం వచ్చి ఎకరాకి టన్నులకొద్దీ మీరు లాభాన్ని పొందుతుంటే మీరు దీనిని ఏం చేస్తున్నారు? మీ భవిష్యత్తు ప్రణాళికను తెలియజేయండి?”
“వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేస్తున్నాము. గ్రామాలు దేశానికి వెన్నెముకలు అని చిన్నప్పుడు చదువుకున్నాను.
ఆ గ్రామాలకు వెన్నెముకలు రైతులు అని నమ్మిన మేము మా గ్రామానికి అంతటికి సరిపడిన పాడి మాకు ఉండగా డైరీ ఫార్మ్‌కి కూడా మేము పంపించగలుగుతున్నాము.
అదే విధంగా అంతరపంటలు కింద మేము కూరగాయలు పండించుకుంటాము.
ముఖ్యంగా పండ్లు, కూరగాయలు అధికంగా పండించడం వలన అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. కనుక మేము స్టోరేజ్ కోసం అవసరమైన మిషనరీ తెప్పించుకున్నాము. అందువలన మాకు ఆ విషయంలో కూడా బాగానే ఉంది. అదే విధంగా వరి, మిరపకాయలు మొదలైనవి ఎక్కువ పండినప్పుడు గిడ్డంగులు ఏర్పాటు చేసుకొని గత రెండు సంవత్సరాలుగా మేము వాటిని సక్రమంగా దాచుకోగలుగుతున్నాము.”
నిండా 40 సంవత్సరాలు లేని ఈ పల్లెటూరి మహిళ భవిష్యత్ భారతీయ స్త్రీకి నకలుగా కనిపిస్తోంది వారి కళ్ళకి.
అన్ని పత్రికల్లో, టి.వి. ఛానెల్స్‌లో మడుతూరు గ్రామం ప్రకృతి వ్యవసాయానికి మోడల్‌గా నిలిచింది.
ఆ గ్రామస్థులు ఒక్కొక్కరు చెప్పిన జవాబులు వైరల్ అవుతున్నాయి. వ్యవసాయం ఇంత సులువా? ఇంత చక్కగా దిగుబడి వస్తే ప్రపంచానికి అంతటికి ఆహారాన్ని అందించవచ్చు. ప్రతి రైతు వ్యవసాయం చేయడానికి ముందుకి వస్తున్నారు.
స్వాతంత్రదినోత్సవం నాడు ‘ఉత్తమ రైతు’గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నది నీహారిక.
భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ‘పద్మశ్రీ’ అవార్డు కోసం ఆ ఊరివాళ్లే ఏక మాటగా ఆమె పేరును ప్రతిపాదించారు.
భారతరాజధాని ఢిల్లీలో గౌరవనీయులైన రాష్ట్రపతిగారి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నది నీహారిక. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న సకల భారతావనిని ఉద్దేశిస్తూ ఆమె పలికింది ఇలా..
“భగవంతుడిచ్చిన ఈ శరీరానికి మంచి ఆహారం, మనసుకు గీతామృతమును ఏ విధంగా అందించి మనం శారీరక, మానసిక ఆరోగ్యం పెంచుకుంటామో అదే విధంగా మనకు అన్నం పెట్టే బంగారం లాంటి భూమికి కూడా మేలైన విత్తనాలు నాటి, ప్రకృతి నుండి సేకరించిన సహజ ఎరువు అనే జీవామృతమును అందించి అధిక దిగుబడిని పొందుదాము అన్నది మా గ్రామం యొక్క నినాదం. ఈ రైతులూ, ఈ గ్రామమూ ఎందరికో స్ఫూర్తి.
‘కెరటం నా ఆదర్శం
పడి లేచినందుకు కాదు
పడినా లేచినందుకు.’”
(సమాప్తం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచిట అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం వెలువరించారు.