[శ్రీ అవధానుల మణిబాబు రచించిన – జీవన నైపుణ్యాలని మప్పే జె. పి. వైద్య ‘షికారీ కథలు’ – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]


డా. జె.పి. వైద్య ఒక బహుముఖ ప్రజ్ఞానిధి. వైద్యవిద్యను అభ్యసించి, ఆదిలాబాద్లో కొద్దికాలం క్లినిక్ నడిపి ఆ తర్వాత మహారాష్ట్రలో స్థిరపడ్డారు. సంగీతం, ముఖ్యంగా సినీసంగీతంతో అపార సాన్నిహిత్యం, సినీదర్శకులు, సంగీత దర్శకులు, గాయకులతో స్నేహం; బిలియర్డ్స్ క్రీడాకారునిగా వివిధదేశాల పర్యటన, పలు భాషలలో సాధికారిక అభినివేశం – ఇలా అనేక వ్యాసక్తులతో తలమునకలైన డా. జె.పి. వైద్య ‘నవ్య’ పత్రికకోసం ఓ రెండు దశాబ్దాల క్రితం వ్రాసినవే – ఈ “షికారి కథలు”.
కథకు సంబంధించిన సాంకేతిక అంశాలపరంగా వీటిని విశ్లేషిస్తూపోతే కొన్నిటిని కథలనో, కథానికలనో అనలేమేమో. దాదాపుగా ఇవన్నీ ఒక వేటగాడి అనుభవాలు, జ్ఞాపకాలు. కొన్ని ప్రత్యక్షమైనవి అయితే మరికొన్ని పరోక్షం. “మహారాష్ట్రలోని నాటి మాహోర్ సంస్థానానికి వారసుడు రాజే మధుకర్ దేశ్ముఖ్ తన 88వ ఏట చెబుతున్న అనుభవాలు ఇవి” అనే చిన్న ఉపోద్ఘాతంతో ఈ కథలను పత్రికలో ప్రచురించారు. ఐతే, కేవలం ఒక అనుభవాన్ని యధాతథంగా చెప్పి ఉంటే అన్ని వారాలపాటు ఈ శీర్షికకోసం పాఠకులు ఎదురుచూడడం, ఇన్నేళ్ళ తర్వాత మనం మాట్లాడుకోవడం జరిగేవి కావు. మరి ఏమిటి వీటి ప్రత్యేకత అంటే –
- ఇక్కడ కథ చెప్పేవాడికి వేట గురించి తెలుసు, వేటగాళ్ళ గురించి తెలుసు.
- ఆయుధం గురించి తెలుసు, దాని వినియోగం గురించి తెలుసు.
- ఆ ఆయుధం జంతువులో ఏమేరకు దిగుతుందో తెలుసు,
- అపుడు ఆ ప్రాణి పొందే బాధ తెలుసు.
- రక్తపు చిక్కదనం, వెచ్చదనం గురించి తెలుసు, ఆ మాంసపు రుచి తెలుసు.
- అడవి గురించి తెలుసు, అక్కడి ప్రజల గురించి తెలుసు –
అందుకే ఒక వేటగాడి సామాన్య అనుభవం కాస్తా అసాధారణ కథగా మారిపోయింది.
దేశవిదేశాలలో ఎన్నెన్నో అడవుల్లో తిరిగినవారీ వైద్య. మేటి వేటగాళ్ళుగా పేరొందిన సంస్థానాల వారసులు, జమీందారులు, వారి సహాయకుల నుండి స్వయంగా వేట విశేషాలను విన్నవారీయన. ఇక అనేక భాషల సాహిత్యానుభవం ఉండనే ఉంది. ఇన్ని మసాలాలు కలిపి వండాక ఆ వేటకూర ఘుమఘుమ ఎలా ఉంటుందో మీరు అంచనా వేయగలరు. వీరి సన్నిహిత మిత్రులైన సామల రాజవర్ధన్ గారు చెప్పిన ప్రకారం డా. వైద్య గొప్ప చిత్రకారుడు కూడా. ‘నవ్య’లో కథలకు వేసిన బొమ్మలన్నీ ఆయన స్వయంగా గీసినవే.
&&&
చాలా కథల్లో పాత్రలు భావూ సాహెబ్, బల్వంత్రావు, తాత్యాగురూ, జయరామ్ భోపీ, రాజా షికారీ, భూక్యా, రంగాసింగ్ వీళ్ళే. అన్ని కథల్లో ఈ పేర్లు చదవి, చదివి వీరంతా మనకు బాగా తెల్సినవాళ్ళలా అనిపిస్తారు. ఇక వాతావరణ కల్పనలో ఈ రచయిత చేయితిరిగినతనం కనిపిస్తుంది. అందుకే ఇంట్లో కుర్చీలో కూర్చుని హాయిగా కథ చదువుతున్న మనకు, కథలో వేటగాళ్ళంతా ప్రణాళికలు వేస్తుంటే మనమూ అక్కడే దర్బార్ హాల్లో సెట్టీ (సోఫా)ల మీద కూర్చుని వింటూన్నట్టు ఉంటుంది. వాళ్ళు షికార్ కు సిద్ధమవుతూ ఉంటే మనమూ ఎక్కడికో బయలుదేరుతున్నట్టు హడావుడి పడిపోతాం. గంటల తరబడి వాళ్ళు చింకారాలతో తిప్పలు పడుతుంటే మనమూ పేజీలు తిప్పుతూ అపసోపాలు పడతాం. మన చుట్టూ పరిసరాలన్నీ మాయమై ఒక్కసారిగా మనం ‘రమణీ జంగల్’లోనో , ‘పాండవ్ లేణీ’లోనో ఉంటాం.
ఒక్కోసారి, కాస్త కథాగమనం పక్కదారిపట్టి అదనపు సమాచారంలోకి వెళ్ళిపోతోంది అన్నపుడు, నమిలి నమిలి చప్పబడిన కిళ్ళీకి పాందాన్ లోంచి ఓ లవంగాన్ని తీసి నోట్లో పడేసి మళ్ళీ రుచి పెంచినట్లు ఏదో రసవత్తర ఘట్టం జోడించి, కథను మలుపుతిప్పి మన మనస్సును గంభీరంగా మార్చేస్తారు, వైద్య.
ఈ రచయిత దృష్టిలో వేట కేవలం ఆటవిడుపో, సరదానో కాదు. వందశాతం వ్యసనమే. కథలో కొన్నిమాటల తీవ్రతను బట్టి ఈ విషయం పాఠకుడికి అర్థమవుతుంది. ఉదాహరణకు “అవసరం వస్తే మా నోట భోజనం లేకున్నా తుపాకీల కడుపులు కార్తూస్ (తూటా/ తుపాకీ గుండు)లతో నిండుగా నింపుతాం” అంటాడు. మరో కథలో – షికారీ(వేటగాడు)లకు అసలు సిసలు పండుగ వేటే. అదే మా ఆనందాల తురుపుముక్క. అదే మా చిరునవ్వుల కలికితురాయి. అదే మా ఆనంద చిద్విలాస గీతిక” అని బల్లగుద్ది చెబుతాడు.
ఓ కథలో, పులి తన చెయ్యిని తినేస్తుంటే విదిలించుకుని మరో చేతితో తుపాకీ పేల్చి చంపిన “టెహెల్ సింగ్” వర్షిస్తూ కూడా అభిమానంతో, షికార్ పొగరుతో మెల్లగా నవ్వుతూన్న తన కళ్ళతో గర్వంగా చూస్తూ యజమానితో అంటాడు – “మాలక్ తుపాకీ పట్టలేక పోతేనేం. నా నజర్ షికార్ చేయదంటారా?” అని. ఇంతలా వీళ్ళు విజయమో, వీరస్వర్గమో అన్నట్టు తేల్చుకుని వస్తారని తెలుసు గనుకనే, తుపాకీలు తీసుకుని షికార్ కు బయలుదేరగానే ఊరిలో వారంతా మసాలాలు నూరుకుని సిద్ధంగా ఉంచుకునేవారుట. ఇది వేటకు బయలుదేరిన వాడి ట్రాక్ రికార్డ్ ను బట్టి వారు ఏర్పరుచుకున్న నమ్మకం. షికార్ కొందరికి విలాసం కావచ్చుగానీ మరికొందరికి “పాపీ పేట్ కా సవాల్ హై బాబూ” అంటారు, వైద్య.
&&&


డా. జె.పి. వైద్య
కథలో భాగంగా కొన్నిచోట్ల విస్తృత సమాచారమిస్తారు, వైద్య. ఉదాహరణకు – “గావియా” లేదా “గావా” అని మరాఠీలో పిలిచే “బైసన్” లేదా “గౌర్”కు, జంగలీ “బైంస్”కు తేడా ఉంటుందనీ; హిందీలో దీనిని “గౌర్ గాయ్” అంటారనీ “అడవిదున్న” గురించి చెప్తారు. ఈ తేడాలు మామూలు మనుషులకు తెలీదు కానీ షికారీలు ఇట్టే కనిపెడతారుట. “ఏనుగు తర్వాత అత్యంత శక్తివంతమైన వన్యప్రాణుల్లో బైసన్ ఒకటి. చెవులూ, కళ్ళూ అంత గొప్పగా పని చెయ్యకపోయినా – వాటి ముక్కు చాలా పవర్ పుల్. రెండు మీటర్ల ఎత్తు, క్వింటాల్ బరువు తూగే బైసన్ అవసరం వస్తే పులిని కూడా ఛాలెంజ్ చెయ్యగలుగుతుంది” – ఇదంతా కథకాక మనకు లభించే అడవి దున్న గురించిన అదనపు సమాచారం.
మరో కథలో, పులి గురించిన విషయాలు చెప్తారు. పూర్తిగా ఎదిగిన మగ పులి 180-230 కిలోలు ఉంటే ఆడపులి 135-185 కిలోలు వరకు బరువు ఉంటుంది. కాని, వాటికి రెట్టింపు బరువున్న జంతువుని సునాయాసంగా ఎత్తుకుని మైళ్ళకు మైళ్ళు సంచరించగలుగుతాయిట. మరో కథలో బాగా ఆకలిగా ఉంటే పులి 30 నుంచి 40 కేజీల మాంసం సునాయాసంగా తింటుందని చెప్తారు. తినగా మిగిలిన మాంసాన్ని రెండోరోజుకి దాచుకుని అది కాస్త కుళ్ళి, ఎముకల నుంచి విడిపోయినా పులి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా తినేస్తుందిట. మరో సంగతి, పులి అసలు పులితనం అది దెబ్బతిని భయంకరంగా అడవి అంతా దద్దరిల్లి పోయేలా అరచినపుడే తెలుస్తుంది.
ఐతే, ఈ బరువు ఎత్తు మొదలైన కొలతలన్నీ కథలో అవసరమా? అంటే అపరాధం మాత్రం కాదు. కావ్య నాయికానాయకుల రంగు, వాసన, పొడవు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ వీలైనంత వర్ణించాకే మన పూర్వకవులు అసలు కథలోకి వెళ్ళేవారు కదా! మరి ఈ షికారీ కథల్లో అడవుదున్నలు, పులులే ముఖ్య పాత్రలు. అందుకే ఈ వివరాలన్నీ మనకు అవసరంగానే తోస్తాయ్. ఐనా అవి ఎంత బలమైనవో తెలిసినప్పుడే కదా, వాటితో తలబడడానికి సిద్ధమైన షికారీ సత్తా, సాహసం మనకు అర్థమయ్యేది. మరికొన్ని కథల్లో, ఒక జంతువు మాంసాన్ని ఏ ప్రాంతంలో, భాషలో ఏఏ పేర్లతో పిలుస్తారో వ్రాస్తారు. మొక్కల శాస్త్రీయనామాలు, వాటి ఔషధగుణాలు పాత్రలతో చెప్పిస్తారు. “సీతమ్మ పాదాలు” కథలో ఇలాంటి ఉదాహరణలు ఎక్కువగా కనిపిస్తాయ్.
&&&
ఇక “చరిత్ర పుటల్లో కొన్ని పేజీలు” అనే కథ కాస్త ప్రత్యేకంగా అనిపిస్తుంది. “నరగా, మోతీ” అనే పులుల జంట కథ. ఈ కథలో పులుల దెబ్బకి ఎదురుతిరిగిన మేకపోతు ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక ఉర్దూ షేర్ మనతో పంచుకుంటారు. దాని భావం ఇది –
జీవించాలంటే ఏదో చెయ్యాలి.. బ్రతికిన వాళ్ళల్లా..!
మరీ శవాల్లాగ జీవించం అదో జీవితమా!
ఈ కథలో ఓసారి రెండు పులులకీ సఖ్యత చెడుతుంది, మగపులి ఆడపులిని చంపేస్తుంది. ఒంటరితనం భరించలేక బెంగపడి కొన్నాళ్ళకు అదీ తిండి మానేసి చనిపోతుంది. ఇక్కడ, “మనసున్న మానవమాత్రులు చేసే పొరపాట్లే పులులూ చేయగల్గుతాయ్” అంటాడు రచయిత. ఇదిగో, వేటనిష్టపడే ఒక రచయితగా కాక రచయితలో ఉన్న వైద్యుడు మాట్లాడించే మాటలివి. డా. అద్దేపల్లి రామమోహనరావుగారు ఎవరైనా కవితలో “అత్యాచారం చేసిన మగాణ్ణి ఉద్దేశించి మృగాడు” అని వ్రాస్తే అలా వ్రాయవద్దనేవారు. ఎందుకంటే, ఏ మృగమూ అంగీకారం లేకుండా అలా ప్రవర్తించదు. అలా జె.పి. వైద్య ఈ కథల్లో జంతువులు మనుషుల్లానే ప్రవర్తిస్తూన్నాయ్ అనడంలో వాటిని మనకన్నా ఒకమెట్టు పైనే నిలిపారు. వైద్య కథల్లో మరో ప్రత్యేకత – ముగింపు. “జ్ఞాన సిద్ధి: భూయాత్” అనే కథ చివర్లో మానవత అడుగంటి పోతున్న తీరాల్లో నిల్చున్న మనం ఇప్పటికైనా అనాలేమో “జ్ఞాన సిద్ధి: భూయాత్” అని అంటారు. ఒక మాట చెప్పుకోవాలి – ఇవన్నీ ప్రాణాలు తీసేసిన కథలైనా రచయిత ఇచ్చిన ముగింపులు కథలకు ప్రాణంగా నిలుస్తాయ్.
&&&
పెద్దపులికే అడవిపంది ఛాలెంజ్. ఏకాకి అడవి పందులను ‘ఎకలగ్గా’ అంటారు. అంటే ఇవి వానప్రస్థంలో ఉన్నవన్నమాట. పులులు కూడా ఇవంటే పడి చచ్చిపోతాయిట. వీటిని వైద్య “తాత వరాహాలు” అంటాడు. వన్యప్రాణుల మాంసంతో కబాబ్ ల తయారీ ఒక కథలో వర్ణిస్తే, మరో కథలో ‘గారా’ గురించి చెబుతారు. పులి ఒక జంతువుని చంపి, సగం తిని మిగతా సగాన్ని జాగ్రత్తగా ఆకులు, కొమ్మలతో దాచి వెళ్తుంది. ఆ మిగిలిన శరీరం ‘గారా’. ఆ వాసనబట్టి మనం అక్కడ కాపుకాస్తే, పులిని వేటాడవచ్చు. ఈ క్రమంలో చుట్టుపక్కల ఎత్తైన చెట్లపై ఎత్తుగా మనం ఎదురు చూస్తూ కాల్చేందుకు అనువైన వీలుతో కట్టుకునేది మచాన్. చిన్న మంచాన్ని గట్టి కొమ్మలున్న చెట్టు మీద కడతారు. ఆకులు, కొమ్మలతో కప్పేస్తారు. పులి స్పష్టంగా కనిపించాలి. కానీ పులికి మనం కనిపిస్తే అంతే సంగతులు.
ఇక మాట్ అంటే నేలమీద మచాన్. నేలమీద గోతి తవ్వి, దాన్ని ఆకులతో, కొమ్మలతో కప్పి లోపల తుపాకీతో కూర్చుంటాడు షికారీ. కదిలే జాగా ఉండదు. ఎంత సేపయినా ఎదురుచూడాలి. చీమలో, పాములో ఆ గోతిలో దూరితే అంతే సంగతులు. పని పూర్తయ్యాక కూడా షికారీ పులిచచ్చింది అని గట్టిగా అరిస్తే, అందరూ వచ్చి ఈ కొమ్మలూ ఆకులూ తొలగిస్తే అపుడుగానీ బయట పడడానికి ఉండదు. అందుకే, గారా కనబడగానే, మాలాక్ “మాట్ తవ్వాల్నా ..? మచాన్ కట్టాల్నా ..? అని సహాయకులు ఉత్సాహంగా అడుగుతారుట.
&&&
“మర్లా షురైనయి ‘షికార్’లు” అనే కథలో అలనాటి మాహోర్ వైభవాన్ని తలచుకుంటారు. ఇప్పుడు మాహోర్ లో మ్యూజియం ఉన్నచోట పీల్ ఖానా ఉండేదిట. సంస్థానం ఏనుగులు ఆ రోజుల్లో చెరుగ్గడలు నములుతూ, మెడలో వెండి గంటలూపుతూ, అంతకన్నా ముద్దుగా తొండాలూపుతూ కవాతు చేసినట్టు శరీరాన్ని లయబద్ధంగా వూపుతూ కులాసా కాలక్షేపం చేసేవిట. అలాగే, “హింగాష్టకం” కథలో – ఇప్పుడు అంతరించిపోయి ఎండేజర్డ్ స్పీసీస్ గా రక్షింపబడుతున్న కృష్ణజింకలు మా చిన్నప్పుడు మాహోర్ చుట్టూరా ఉన్న గడ్డిమైదానాల్లో కుప్పలు తెప్పలుగా ఉండేవంటారు. ఈ సంస్థానంలో కొన్ని అడుగుల దూరం తేడాతో మరుగుతున్న వేడినీళ్ళ ఊటలు, వేళ్ళు కొంకర్లు తిరిగే చన్నీటి ఊటలూ ఉండేవిట. వేటలో షికార్ అయిన జంతువు మాంసం కొట్టానికో, దేవడీకో, హవేలీకో చేరాక జరిగే దావత్ ల గురించీ డజన్ల కొద్దీ నోరూరించే ఐటమ్స్ గురించీ “జమాబందీ – సిరాబుడ్డీ లెక్కలు” కథలో వ్రాస్తారు. ఈ కథలోనే నిజాం నవాబు వేటకు వచ్చినపుడు ఆయన క్యాంప్ హంగూ. ఆర్భాటం వర్ణిస్తారు. ఈ వివరాలన్నీ “రాజే మధుకర్ దేశముఖ్” చెప్పినవే కావచ్చు. వాటిని అందమైన కథలో పొందికగా పొదిగి మనవరకూ చేర్చిన రచయిత ప్రతిభ అసామాన్యం. ఈ పాత సంగతుల మధ్యలోనే చాలా కథల్లో ఒక తాత్త్వికత, ఒక హెచ్చరిక, ఒక మేల్కొలుపు కనిపిస్తాయ్. ఉదాహరణకు ఈ మాటలు చదవండి – అడుగులు వేసేటప్పుడు నలువైపులా పరికించి చూడాల్సి వస్తుంది. ముండ్లుంటాయ్, బురదగుంటలూ ఉంటాయ్. ముల్లును పిరికిపిరికిగా ముట్టుకుంటే అది గుచ్చుకుంటుంది. ధైర్యంతో పీకేస్తే దాని వాడి తల వాల్చేస్తుంది. జీవితమూ అంతే. అందుకే కాబోలు ఉర్దూ కవి అంటాడు –
“ముష్కిలే హై రాహే – హస్తీ మే మగర్,
ముష్కిలోం మే గున్గునానా సీఖియే –
జిందగీ కా లుల్ఫ్ లేనే కేలియే
జిందగీర్ ముస్కురానా సీఖియే”
(జీవిత మార్గంలో ఎన్నో కష్టనష్టాలుంటాయ్, కష్టాల్లో సైతం కూనిరాగాలు తీయడం నేర్చుకోవాలి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించి, ఆనందించాలంటే – జీవితం అంతా నవ్వుతూ గడపడమే నేర్చుకోవాలి).
&&&
ఇక భాష విషయానికి వస్తే, వారికి తెలిసిన అన్ని భాషల పదాలను, జాతీయాలను హాయిగా వాడేసుకున్నారు. కథలకు “సారీ.. యూ లేట్ కమ్మర్స్..; కేషాంచిత్ విషయే; లాఖోంమే ఏక్; మా భేమ మా శ్రమిష్మ; జానేదో సాబ్; అజ్ గర్ మియా అజ్ గర్ ఆయా; ది టైగ్రీనా రైట్ హ్యాండ్; ప్చ్ పుంజూ పాయా మేకా పాయా..; ప్రాణ్ జాయే పర్ చింకారా న జాయే; షికార్ కర్నేకో ఆయే షికార్ హోకే చలే; గతే శోకేన కర్తవ్యో..” ఇలా వేర్వేరు భాషలలో పేర్లు పెట్టారు. మనం మరచిపోతున్న అరుదైన తెలుగు పదాలూ ప్రయోగించారు. గాజు కళ్ళతో ఆర్ పార్ చూడడం (across/ through and through) అరబ్బీ గుర్రాలను నిగరానీ (Supervision) చేయడం; కదంతాల్ (పద ధ్వని); ఇషారా (సిగ్నల్) – ఇలా పదాలు, పంక్తులతో పాటు, కర్త కర్మ క్రియా మూడూ మూడు భాషల పదాలుగా ఉన్నవీ గమ్మత్తుగా ఎదురౌతాయ్. ‘శత్ పావలీ’ వంటి పదాలు నిఘంటువులు, google search లకు పనిచెబుతాయ్. (ఒక మరాఠీ పదం. వంద అడుగులు – taking a stroll after a meal). అందుకే వీటిని మామూలు కథల్లా అలా పేజీలు తిప్పడం కుదిరే పనికాదు. ప్రతి వాక్యం ప్రత్యేక శ్రద్ధతో చదువుకోవాలి.
వీరి బహుభాషా ప్రావీణ్యం తెలియాలంటే, “జ్ఞాన సిద్ధి: భూయాత్..!” కథ చదవితీరాలి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, వ్యంగ్యం అంతా సంస్కృతంలో వ్రాసి కథను రెగ్యులర్ భాషలో వ్రాయడం. శీర్షిక కూడా సంస్కృతమే. ఉదాహరణకు, ఓచోట తుపాకీ వాడకంలో షికారీ ఎంత హుషారుగా ఉండాలో చెప్తూ –“భార్మార్తో ఒక్క ఫైర్ అయ్యాక వెంటనే మరో ఫైర్ చేయరాదు, చెయ్యలేం. తుపాకీగొట్టం గుండా 3 వేళ్ళ మందం బారూద్ (గన్ పౌడర్) నింపి పూల్ (తూటా) నింపాలి. అప్పుడది ఫైరింగ్కి సిద్ధం అన్నమాట. ఇదంతా క్షణాల్లో జరగాలి. లేకపోతే – బారూద్ నింపేలోపల ఎదురుగా ఏ వన్యప్రాణో వచ్చి “కృపయా ఆగచ్ఛత..! త్వం కథమపి..?” (దయచేసి రండి, మీరెలా ఉన్నారూ.. అని యోగ క్షేమాలు కనుక్కుంటూ నిలబడవు కదా!) అని చమత్కారంగా రాస్తారు.
ఓ కథకు ‘కమాన్ షూట్ అజ్’ అని పేరు. టైటిల్ చూసి, ఇదేంటి అవి కవ్విస్తున్నాయా? అనుకుంటాం. కథ చివర్లో అంటారు – రైఫిల్స్ తూటాల కన్నా కెమెరాలతో షూట్ చేస్తే ఇంకా బావుంటుంది. “యస్! వ్వై నాట్ టు షూట్ దెమ్ విత్ ఏ క్యామెరా అండ్ విత్ లవ్” – అప్పుడు ఆ జంతువులు కూడా నవ్వుతూ అంటాయి – యస్ కమాన్ షూట్ అజ్ అని ముగిస్తారు.
&&&
ప్రతి కథా మనకేదో విషయం నేర్పుతుంది, కదా! మరి ఈ వేటకథలు మనకు నేర్పేదేమిటి? అనే సందేహం రావచ్చు. నిజానికి బ్రతుకంతా వేటే. శరీరంతోనో, మనసుతోనో, సాటి మనిషితోనో. అందుకే, ఈ కథలు మనల్ని సిద్ధం చేసి ఎన్నెన్నో జీవన నైపుణ్యాలను నేర్పుతాయ్. సాధుజంతువుల వేటలోనే ఒకరికి చెలగాటం మరొకరికి ప్రాణ సంకటం గానీ క్రూర జంతువుతో వేట అయితే ఇద్దరికీ ప్రాణ సంకటమే. తెగించి దూకడానికి, అవసరమైతే తప్పించుకుపోడానికీ ఎంత ఎంత ఓరిమి కావాలి? ఎంత నైపుణ్యం కావాలి? ఎంత గుండెనిబ్బరం కావాలి? ఏమరుపాటుగా ఉంటే అంతే సంగతులు. ఎన్నో విజయాలు పొందిన షికారీ ఒక్కసారి తప్పు చేస్తే, అప్పటివరకూ పదిలపరచుకున్న “మధురమైన జ్ఞాపకాల స్థానంలో మరుపురాని బాధలే మనసులో నిలిచిపోతాయ్”. కొన్ని కథల్లో పెంపుడు జంతువులతో మనిషికి ఏర్పడే అవ్యాజమైన ప్రేమను వర్ణిస్తారు. “పులులతో మనుష్యులు, మనుష్యులతో పులులు ఆడుకున్న బొమ్మలాటలను తలచుకుంటూ క్రూరత్వం మచ్చుకైనా కనిపించని జంతువత, మానవతల అపూర్వ సమ్మేళనం” అంటారు. మనిషి సాటి మనిషినే ప్రేమించలేని కాలంలో మూగ జీవులతో ఇంతటి సఖ్యత మనం ఊహించగలమా!
తక్కువ ఉపకరణాలతో అపరిమిత సాహసంతో వేటాడేవాడే నిజమైన మొనగాడు. అందుకే అసలు సిసలు షికారీ భర్మార్ బందూక్ వాడే అంటాడు, రచయిత. వాడి,వేడి,గురి,కాపలత్వం అన్నిటికీ పుల్ మార్కులు పడాల్సిందే. టెలిస్కోపిక్ లెన్స్లున్న రైఫిల్ తో వెనుక కాళ్ళను బద్దలు చేయడం షికారీతనం కాదు, అంటాడు. “క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే” గుర్తొస్తుంది పై మాటలు చదివినపుడు.
చివరిగా ఒక మాట, ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అన్నపుడు అవసరమైతే నాలుగు మెట్లు దిగాలి, ఒక్కోసారి నాలుగు మెట్లు ఎక్కాలి. అంటే మనకూ “ఎపుడు మాట్ తవ్వాలి? ఎపుడు మచాన్ కట్టాలి?” తెలిసుండాలి. మనకు ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు గుర్తెరిగి, నాలుగువైపులా పరికించి అడుగు ముందుకు వెయ్యాలి. శ్రద్ధగా చదివితే ఈ నైపుణ్యాలన్నిటినీ ఈ ‘షికారీ కథలు’ మప్పుతాయ్.

అవధానుల మణిబాబు కవి, విశ్లేషకులు, వ్యాసకర్త.
1982 జనవరి 29న పుట్టిన మణిబాబు ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం), బి.ఇడి., పూర్తి చేశారు. 2004 నుంచీ రహదారులు మరియు భవనముల శాఖలో పనిచేస్తున్నారు. కాకినాడలో నివాసం.
బాటే తన బ్రతుకంతా.. (కవితా సంపుటి, 2013), అన్నవి.. అనుకొన్నవి.. (సాహిత్య వ్యాసాలు, 2015), అందినంత చందమామ (డా. ఆవంత్స సోమసుందర్ సాహిత్యంపై సమీక్షా వ్యాసాల సంపుటి, 2016), స్ఫురణ.. స్మరణ.. (సాహిత్య వ్యాసాలు, 2017), నాన్న.. పాప.. (కవితా సంపుటి, 2018), నేనిలా.. తానలా.. (దీర్ఘ కవిత, 2019), పరమమ్ (మధునాపంతుల పరమయ్యగారి సాహిత్యజీవితంపై దీర్ఘవ్యాసం, 2020), లోనారసి (సాహిత్య వ్యాసాలు, 2022), నింగికి దూరంగా… నేలకు దగ్గరగా (కవితా సంపుటి, 2023) వంటి పుస్తకాలు ప్రచురించారు. ‘మధుశ్రీలు చదివాకా’ వీరి తాజా పుస్తకం.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ (పిఠాపురం) పురస్కారం, అద్దేపల్లి రామ్మోహనరావు కవితా పురస్కారం (విజయవాడ), సోమనాథ కళాపీఠం (పాలకుర్తి, తెలంగాణ) పురస్కారం, డా. ఎన్. రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం (ప్రొద్దుటూరు), దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం (బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ – విశిష్ట సాహిత్య పురస్కారం (2024) అందుకున్నారు.