[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
దాక్షారామ భీమేశ్వరాలయంలోని శాసనాలలో ప్రసక్తమైన మున్నూర్వురు సానులు:
ఈమె డాకరేమి పెదమున్నూంటిసాని.
పెద్దమున్నూటి సాని కొమ్మవ కూతురు కల్లవశంకరి. ఈ శంకరి అన్నది సానికి బదులుగా ప్రయుక్తమైంది. సాని కూతురు కల్లవ తక్కిన సానుల వలె వివాహితయై దేవాలయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండక, అవివాహితగా ఉండి భీమేశ్వరునికి అర్పితమై ఉంటుంది. తల్లి కొమ్మవ, కల్లవశంకరి కులోత్తుంగ చోడదేవర 38వ రాజ్య సంవత్సరంలో భీరమేశ్వరునికి అఖండదీపం దానం చేశారు.
పల్లవరాజు వర్ణాలచేరి ప్రభువుకు ప్రేయసి. పల్లవరాజ మానస సరోహంసి అని శాసనంలో ప్రయుక్తమైంది. ఈమె తన తల్లికి పుణ్యం కోసం దాక్షారామ భీమేశ్వరునికి అఖండదీపాన్ని, నరసింహ దేవునికి నానారత్నాలతో ఉన్న కాంచనమాలను అర్పించింది. ఈ సందర్భంలో వర్ణాలచేరి ప్రభువు నరసింహదేవునికి సబ్బనపల్లి గ్రామాన్ని సమర్పించాడు.
గుద్దవాదినాంటి పెద్దడాకిరేమి పెద్దమున్నూటిసాని అయిన జయమ చామరి. అంటే దేవునికి వింజామర వీచే స్త్రీ అని అర్థం. ఈమె తన కోడలు ప్రోలాసానికి ధర్మంగా భీమేశ్వర దేవరకు శక సం. 1034లో మూడువందల మాకుల తోటను దానంచేసి శిలాశాసనం వేయించింది.
ఈమెకు సంబంధించిన ఇంకొక శాసనం వల్ల జయమగుద్దవాదినాణ్ణి పెద్దిడాకిరేమి పెద్దమున్నూటి సమర మొదలి బేతినాయకుని కూతురు అని చక్రవర్తి కులోత్తుంగ చోడ దేవర అనుగు. అంటే భోగశ్రీ అని తెలుస్తుంది. ఈమె శక సం. 1006లో యమినీశ్వర మహాదేవుని సన్నిధానంలో ఉత్తరాయన సంక్రాంతినాడు సత్రానికి, సత్రంలో భోజనం చేసే ఇద్దరు బ్రాహ్మణులకు, పురోహితులకు, వండే బ్రాహ్మడికి, కర్రపనివారికి, వడ్లు బియ్యం దంచి ఎంగిళ్ళెత్తి నీళ్ళు తెచ్చే ఆడవారిద్దరికీ కూడా జీతాలు ఏర్పాటు చేసింది. ఈమె తరువాత ఆ ఆలయంలో చామరిగా పదవి నిర్వహించింది.
మండలేశ్వర బీరగొట్టమున సూరపరాజు దేవి సెజ్జమ. గండచిల్క ప్రియాంగనా అని సంబోధించడం వల్ల ఈమె సూరపరాజుకు ప్రేయసి అని తెలుస్తున్నది. ఈమె శక సం. 1034లో అఖండదీపం సమర్పించింది.
గుద్దవాదినాటి పెద్దడాకిరేమి ఊరిమాని మున్నూటి సాని.
గుద్దవాదినాటి మున్నూటిసాని కామాసుగ్గల కూతురు కొమరి. శక సం. 1043, దక్షిణాయన సంక్రాంతినాడు అఖండ దీపాన్ని (అఖండవర్తి లోహదండు దివ్వెను) సమర్పించింది.
ఈమె డాకరేమి పెద్దమున్నూటిసాని. ఉత్తరాయణ సంక్రాంతినాడు అఖండ దీపదానం చేసింది.
సామంతాధిపతి మహాప్రచండ దండనాయకం, సాహసోత్తుంగం, అయ్యన సింహనామాది ప్రశస్తి సహిత మహా ప్రధాని బాణస పెగ్గడ పుత్రుడు పెగ్గడ దండనాయకునికి ద్వితీయ లక్ష్మీసమానురాలు. ఈమెను అనంతానంత పరమ కల్యాణాభ్యుదయ సహస్ర ఫలభోగ భాగినీ అని శాసనంలో వర్ణించారు. ఈమె శక సం. 1043 (త్రిభువన మల్లదేవర విజయరాజ్య సంవత్సరాలు 45) జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, వ్యతీపాత కాలంలో భీమనాథాలయ నందనవనానికి, జంగకాయలకు ఇరవై గంథహస్తిమాడలు సమర్పించింది.
గంగగొండ చోడవలనాటి, గుద్దవాదినాటి పెద్దడాకరేమి భీమేశ్వరునికి దేవదానమైన సాని ఈ బిజ్జవ శంకరి. (ఈమె వ్యతీపాత సమయంలో భీమేశ్వరునికి అఖండ దీపదానం చేసింది).
పెద్దమున్నూటి సాని నాగమ కుమార్తె రాజక. ఉత్తరాయణ సంక్రాంతి, వ్యతీపాత నిమిత్తం అఖండదీప దానం చేసింది.
ఈమె ఘంటశాలా పురకామిని, కామినీ విభూషణము, సుకుమార రూపవతి అని శాసనంలో ప్రస్తుతించబడింది. ఈమె తండ్రి పోతినాయకుడు, తల్లి ప్రోలమ. తల్లిదండ్రుల ధర్మార్థం శక సం. 1047 ఉత్తరాయణ సంక్రాంతినాడు తొండీశ్వర దేవరకు అఖండదీపం సమర్పించింది.
కందూరి చోడమహారాజు అయిన పెర్మాడి దేవని అనుంగు (భోగశ్రీ) అయిన రేకమదేవి కొమ్మూరి అగస్తీశ్వర మహాదేవునికి అఖండవర్తి దీపానికి 6 ఉత్తమ గండమాడలు సమర్పించింది.
ఈమె కులోత్తుంగ చోడదేవునికి అడుగులు వత్తే స్త్రీ.
పైన చెప్పిన నంగాండి కూతురు ఉయ్యమ.
ఈమె నంగాండి మనుమరాలు, ఉయ్యమ కూతురు. కోన రాజేంద్ర చోడయరాజుల అనుంగు (ప్రేయసి, భోగస్త్రీ) అయిన పెరియాణి ఉత్తరాయణ సంక్రాంతినాడు భీమేశ్వర దేవునికి అఖండదీపం సమర్పించినట్లు కాలం తెలుపని శాసనంలో చెప్పబడింది. మరొక శాసనంలో 17 శక సం. 1054, కార్తీక బహుళ పద్మైకాదశి శనివారం నాడు భీమేశ్వరునికి బంగారు దండం గల వింజామర ఒకటి, 30 గద్యానలు సమర్పించింది.
ఈమె దక్షిణాయన సంక్రాంతి నాడు తన తల్లిదండ్రుల ధర్మార్థం దాక్షారామ భీమేశ్వరునికి అఖండవర్తి దీపం సమర్పించింది.
ఈమె శక సం. 1059, చైత్రశుద్ధ ద్వితీయ సంక్రాంతి నాడు కొల్లూరి అనంతేశ్వర స్వామికి అఖండవర్తికై అయిదు రాజనారాయణ నిష్కాలను సమర్పించింది.
అమర నాయకువారి రాజాసాని కూతురు సత్యాసాని. భీమేశ్వరునికై నలభై వీసాల ఎత్తులోహదండు దివ్వె ఇచ్చి నేయికోసం 50 గోవులనర్పించింది.
పడాలు కాటని కుమార్తె సూరమకు బుద్ధనకు జన్మించిన పుత్రిక వెన్నమ మహాధర్మిష్ఠి అని శాసనంలో ప్రశంసించబడింది. శక సం. 1061, పౌష్యబహుళ సప్తమి ఆదివారం నాదిండ్ల మూలస్థాన మహాదేవునికి అఖండదీపాన్ని సమర్పించింది.
వెలనాటి కులోత్తుంగ చోడ గొంకరాజు ఇష్టభృత్యుడైన ప్రాంబఱ్తి ప్రోలయకు కూతురు. ఈమె తన తల్లిదండ్రుల ధర్మార్థం నాదిండ్ల మూలస్థాన మహాదేవునికి శక సం. 1072, ఉత్తరాయణ సంక్రాంతినాడు అఖండదీపాన్ని సమర్పించింది.
ఈమె గొసనాసాని కూతురు. కొల్లూరి అనంతీశ్వర దేవాలయ శాసనంలో ఇందులసాని పెడుదమ అనడంవల్ల ఆమె ఆ దేవాలయంలోని సాని అనీ, తల్లి కొసనాసాని కూడా ఆ ఆలయంలో సాని అని ఊహించవచ్చును. పెడుదమ భాద్రపద శు. పంచమి సోమవారం దక్షిణాయన సంక్రాంతి నిమిత్తం అఖండదీపానికై 5 రాజనారాయణ గద్యాణాలు సమర్పించింది.
డుత్తిక (జుత్తిగ) వాసుకి రవి సోమేశ్వరాలయంలోని శాసనంలో “ఈ ఊరిసాని వృత్తి కర్త్యయైన మాదమ కూతురైన చెంగమ కూతురు ప్రోలిపావ అనడం” వల్ల పైన చెప్పిన దేవాలయంలో వృత్తికర్త అయిన మాదమ నుండి ఆ వృత్తి కూతురు చెంగమకు ఆమెనుండి కూతురు ప్రోలమకు చెంది ఉండవచ్చు. ఈ ప్రోలిపావను “సకలార్థ కల్పలతికా శృంగార కల్లోలినీ” అని శాసనంలో ప్రశంసించారు. ఈమె వాసుకి రవి సోమేశ్వర దేవరకు అఖండవర్తి దీపాన్ని సమర్పించింది.
కులోత్తుంగ చోడగొంకరాజుల మఱది దండనాయక చోడపనాయకుని తల్లి. కులోత్తుంగ చోడగొంకరాజులు ప్రియవల్లభ గుణాన్విత అయిన స్త్రీ (భోగస్త్రీ) కావచ్చును. పేరు లేదు. ఈ కొమ్మసాని తల్లి. ఈమె దాక్షారామ భీమేశ్వరునికి ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం అఖండదీపం సమర్పించింది. దాక్షారామంలోని ఇంకొక శాసనంలో కులోత్తుంగ చోడగొంక రాజుల మామ దండనాయక పండినాయకుడని, అతడు చోడపనాయకుని తండ్రి అని ఉండటం వల్ల పై కొమ్మసాని అన్న దేవాలయ సాని పండినాయకుని భార్య అని తెలుస్తుంది.
ఈమె పెద్ద డాకిరేమి కొండిక మున్నూటి పెర్మడి నాయకుని కూతురు. మల్లమహీపతికి ప్రియతమ. ఈమె కొండిక మున్నూటి సానులలో ఒకరై మల్లమహీపతికి భోగస్త్రీ అయి ఉంటుంది. ఈమె ఉత్తరాయణ సంక్రాంతినాడు భీమేశ్వరునికి అఖండదీపం దానంచేసింది. ఈమెను మనోహరిణీ అని శాసనంలో ప్రశంసించారు.
లక్ష్మీదేవి వంటి రమణీయమైన రూపంగలది, మహోదార, ధర్మగౌరవ కులనిస్తార అనబడే సూరమ దామమకు వరపుత్రి. బుద్దన సూరమ అని శాసనంలో చెప్పడం వల్ల ఈమె బుద్ధనకు జన్మించినదని తెలుస్తుంది. ఈమె దానగుణం కలదని, పండితులను ఆదరించేదని ప్రియభాషిణి అనీ బుధాధార, ప్రియవచోరమ్య వంటి విశేషణాలవల్ల తెలుస్తున్నది.
పైన చెప్పిన బుద్ధన సూరమ తల్లి దానమ. అమిత గుణాభిరామ సుగుణాభరణాభిరామ అని శాసనంలో ప్రశంసించారు.
మండలేశ్వర బీరగొట్టమున బయ్యరాజుల ద్వితీయలక్ష్మీ సమానమైన లక్ష్మీ మహాదేవి శక సం. 1079, ఫాల్గుణమాసం శ్రీ భీమేశ్వర మహాదేవుని కళ్యాణోత్సవం నిమిత్తం అఖండదీపాన్ని సమర్పించింది.
ఈమెను మన్మచోడ్రాజుల అనవరత కల్యాణాభ్యుదయ సహస్రఫలభోగభాగిణి అని ఆమె మన్మచోడ్రాజుల భోగస్త్రీ అనీ, ద్వితీయలక్ష్మీ సమానురాలని చెప్పడం వల్ల తమ యేలికలగుచున్న క్రాంజ కళ్యాణ కేశవదేవర అనటం వల్ల ఈ పిన్నమజియ్య క్రాంజ కల్యాణ కేశవ దేవర ఆలయంలో నాట్యకత్తె గానీ, దేవాలయ భోగంవారిలో ఒకరు గానీ కావచ్చుననీ చెప్పవచ్చును. ఈమె శక సంవత్సరం 1086లో ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం కేశవ దేవర అర్చన అముదుపడులకు, అంగరంగ భోగాలకు మాగాణి చేను, తోట సమర్పించింది.
వేల్పునూరి ప్రోలమ అనడం వల్ల ఈమె వేల్పూరి రామేశ్వర దేవాలయంలోని సాని అని గ్రహించవచ్చును. ఈమె తన తల్లిదండ్రులకు ధర్మార్థంగా విషుసంక్రాంతినాడు రామేశ్వర దేవునికి అఖండదీపం సమర్పించింది.
కొండ్రూరిలోని శ్రీరాజరాజేశ్వర దేవర గుడిసాని కొమరమ మేలునాయని కూతురు.
ఈమె కూడ కొండ్రూరి (కొండూరి) శ్రీరాజరాజేశ్వర దేవర గుడిసానులలో ఒకతె. ఈమె డాకరేమి మాహిమ కూతురు.
వేల్పూరి మల్లెనాయకుని కూతురు. తల్లి దారాసాని. ప్రోలాసాని తన తల్లిదండ్రులకు, తనకు ధర్మార్థం ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం వేల్పూరి రామేశ్వర దేవరకు అఖండదీపం సమర్పించింది.
ఈమె సుగ్గలాంబకు అమ్మాండియమ్మాపెర్మలు అనే శంభుని వరప్రసాదం వల్ల జన్మించింది. భీమనాథుని చరణాలను కొలిచేది. భీమనాథపుర స్త్రీ అని, స్వర్గలోకకపు స్త్రీలవంటి సౌందర్యం కలదని శాసనంలో ప్రశంసించారు. దాన్నిబట్టి ఆమె భీమనాథ దేవాలయానికి చెందిన సాని అని చెప్పవచ్చును. ఆమె వెలనాటి గొంకభూపతి కొడుకు రాజేంద్ర చోడయ మహారాజుల దేవి అనగా భోగస్త్రీ అని చెప్పవచ్చును.
చోడగంగదేవరకు ద్వితీయలక్ష్మి అయిన మలయ మహాదేవి తన తల్లి భిమ్మమకు, తండ్రి శివపాదశేఖరునికి ధర్మార్థం భీమేశ్వరునికి అఖండ దీపం సమర్పించింది. (ఈ శాసనకాలం కులోత్తుంగ చోడదేవర విజయరాజ్య సంవత్సరములు 46).
ఈమె కాజదాసి. ఈమె భర్త కాడిదాసి భీమాండారనకు ధర్మార్థం శ్రీ భీమేశ్వరునికి అఖండదీపాన్ని అర్పించింది.
మల్లపరాజు తనయుడు, మన్యసింహమనే ఖ్యాతి పొందిన వేంగి గొంకమహీపతి ప్రియతమ అయిన వల్యమను శ్రీరత్నమని పొగిడారు. ఈమె శక సం. 1118లో దాక్షారామ భీమేశ్వరునికి అఖండదీపాన్ని అర్పించింది.
ఈమె కోటకేతరాజుల భోగశ్రీ. ఈమె తల్లి అమరసాని. శక సం. 1131 చైత్రబహుళ విదియ, విష్ణుసంక్రాంతి నాడు సూరమదేవి తన తల్లి ధర్మార్థం వేల్పూరి రామేశ్వర దేవరకు అఖండవర్తి దీపాన్ని సమర్పించింది. కసది సూరమదేవి, తల్లి అమరసాని బహుశా వేల్పూరి రామేశ్వరాలయంలో వంశపారంపర్యంగా ఉంటున్న సానులు కావచ్చు.
ఈమె మహామండలేశ్వర కోటకేతరాజుల భోగస్త్రీ. ఈమె కూడ వేల్పూరి రామేశ్వరాలయంలో సాని కావచ్చు. ఈమె తన తల్లికి తనకు ధర్మార్థం శక సం. 1131 ఉత్తరాయణ సంక్రాంతినాడు అఖండవర్తి దీపాన్ని సమర్పించింది.
వీరిద్దరూ మహామండలేశ్వర కోట కేతరాజుల భోగస్త్రీలు. వీరి తండ్రి ఎఱ్ఱమనాయకుడు. తమ నేలిన స్వామి (కోట కేతరాజు) ధర్మంగా ఉండవెల్లి స్థానానికి శక సం. 1135, వైశాఖ శుద్ధ దదశమి సోమవారంనాడు ఉత్సవ విగ్రహాన్ని చేయించి ఆ దేవరకు నైవేద్యానికై కామలకోటి ఉత్తరాన పొలము సమర్పించారు.
దాక్షారామం పెద్ద డాకరేమిలోని కొండిక మున్నూంటిసాని సంకరమ కూతురు ఈ సంకరమ. ఈమె శక సం. 1151, కార్తీక శుక్లపక్ష త్రయోదశి ఆదివారం నాడు భీమేశ్వరునికి కనకదండం గల వింజామరకై ఇరవై అయిదు గద్యాణాలు అర్పించింది.
ఈమె పెద్దమున్నూటి సాని.
ఈమె ఎఱ్ఱమ నాయకుని కూతురు. ఈమె కూడ దాక్షారామంలోని సానియే.
ఈమె తాపర్తి ఉపేంద్ర దేవని మహాదేవి. ఈమె కూడా మున్నూర్వురు సానులలో ఒకరు కావచ్చు. వీరు ముగ్గురూ శక సం. 1185 ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం, తాడి తోంటోత్సవానికి దాక్షారామ భీమేశ్వు నికి అంగరంగ భోగ నివేద్యాలకై విశ్వనాథపట్నము అనే ఊరును ఆచంద్రార్కం దానం చేశారు.
ఈమె దాక్షారామ కొండిక మున్నూటి ఆట్య గడియపసెట్టి వీరపనేని కూతురు. ఒడ్డవాది మత్స్యకుల తిలకుడు అయిన అర్జున దేవరాజు దేవి (భోగస్త్రీ). ఈమె శక సం. 1209, చైత్రశుద్ధ దశమినాడు దాక్షారామ భీమేశ్వర దేవుని చైత్ర దవన పున్నమడోలోత్సవం నాటి హవి బలి అర్చనలకై ఒడ్డాదిలోని మఱువాడి అనే ఊరు ఆచంద్రార్కంగా అర్పించారు. భీమేశ్వరదేవునికి, పరమేశ్వరికి బంగారు తొడుగు సమర్పించారు. (మేనాదేవీ విషాదం శమయతు మనిశం మత్స్యవంశార్జునేశః) ఈమెను మరొక శాసనంలో అక్కాసాని అని చెప్పారు. ఆమె శక సం. 1197, దవన పున్నమి డోలోత్సవం నాటి హవిర్బల్యర్చలకు ఒడ్డాదిలోని మఱువాడ అనే ఊరిని అర్జునదేవుని నుండి పొందిందని ఆ శాసనంలో ఉన్నది. ఈ గ్రామాన్ని పొందిన 12 ఏళ్ళకు ఆమె మత్స్యరాజు అర్జునదేవుని మరణం తరువాత భీమేశ్వరునికి అర్పించి ఉంటుంది.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రా… దసరా
జీవన రమణీయం-30
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-10
పింగళి సూరన కవితాప్రౌఢిమ
సంచిక – పద ప్రతిభ – 98
దంతవైద్య లహరి-5
సంచిక – పద ప్రతిభ – 119
పాదచారి-3
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-13
జగన్నాథ పండితరాయలు-13
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®