కథ
“ఏమండీ!”
ఏదో భావజగత్తులో విహరిస్తున్న ఆ పెద్దాయన స్వప్నభంగమై కళ్ళు తెరిచాడు.
“మన వరాలు, వాళ్ళాయానా వచ్చారు”
“రమ్మను”
దంపతులిద్దరూ తాతయ్య వద్దకు వచ్చారు. ఎదురుగా కుందనపు బొమ్మలాంటి వధువు. పక్కనే స్ఫురద్రూపి అయిన వరుడు.
తాను ఎత్తుకుని ఆడించిన వరాలేనా ఇదీ! ఎంత ఎదిగిపోయింది? అప్పుడే పెళ్ళి కూడా అయిందీ!
ఒకప్పుడు విద్యానగరంలో తన ఇల్లు బంధుమిత్రులతో, కొడుకూ కోడళ్ళతో,మనవలతో ఎంత సందడిగా ఉండేది? రాయలవారు గతించిన తర్వాత విద్యానగరం – విద్య లోపించి వట్టి నగరమయ్యింది. ఆ నగరంలో ఉండలేక తాను వచ్చేశాడు. చరమదినాలలో ఈ జనపదంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. మనవరాలను చిన్నప్పుడు చూచిందే. ఆ పిల్లకు వరుణ్ణి చూచారని ఆ వరుడు – ఏదో సాధారణమైన వ్యక్తి అయినా, దేశదేశాలు తిరిగి సాంగోపాంగంగా వేదవేదాంగాలు అభ్యసించి వచ్చాడని వినడమే తప్ప తాను కల్పించుకొని విచారించింది లేదు. ఈ యువకుడేనా ఈతడు?
“ఏవండీ, చూస్తారేం ఆశీర్వదించండి” – ధర్మపత్ని మంగళాక్షతలు చేతికిచ్చింది.
“దీర్ఘసుమంగళీ భవ!”
“సరస్వతీకటాక్షప్రాప్తిరస్తు!”
పెద్దాయన ఆలూమగలను ఆశీర్వదించాడు.
అవునూ…అమ్మాయినైతే సరే, వరుణ్ణి ఏమని ఆశీర్వదించాడూ? “సరస్వతీకటాక్షప్రాప్తిరస్తు” అనా? అలా తన నోట అప్రయత్నంగా ఎలా వచ్చింది!
పెద్దాయన సామాన్యుడు కాదు. యౌవనంలో శఠకోపయతి వద్ద తర్కమీమాంస జ్యోతిష్యాది శాస్త్ర విద్యలు అభ్యసించినప్పటికీ, కవిత్వాన్ని మాత్రం అంతఃప్రేరణ చేత, రసజ్ఞతయే పెట్టుబడిగా నిర్వహించినవాడు. అందుచేతనే – రాయలవారి చేత “ఆంధ్రకవితాపితామహుడు” అనిపించుకున్నాడు. ఆయన కవిత్వాన్ని కృషి చేసి, కష్టపడి చెప్పడు. కవిత్వం తన ద్వారా జాలువారే సమయం కోసం, అదను కోసం తనను తాను సన్నద్ధపరచుకొని వేచిచూస్తాడు. పలుకుతేనెలతల్లి ఆయన రశనాగ్రనర్తకి. అద్భుతమైన భావపరంపరకు అనువైన, కోమలమైన శబ్దసంపద అందించటానికి ఎప్పుడూ ఆ తల్లి ఆలస్యం చెయ్యలేదు. ఆయన అనుకోవడమే తరువాయి, కవిత్వం అలా జాలువారేది. ఆయన మనస్సు కోమలం. ఆయన మాట మధురం. వెరసి ఆయన పలుకులు శిరీశకుసుమపేశలసుధామయోక్తులు.
ఆ పెద్దాయన – అల్లసాని పెద్దన.
ఆయన మాట ఊరికే అలా రాదు. శారద పలికిస్తేనే పలుకుతుంది. అందుకనే ఆయన ఆశ్చర్యపడ్డాడో నిముషం పాటు.
“ఏం చేస్తుంటావోయ్”
“భారతీకృపచేత రాఘవపాండవీయం అనే ద్వ్యర్థి కావ్య నిర్మాణం తలపెట్టాను తాతగారూ”
“రాఘవపాండవీయం – అనగా ద్వ్యర్థికావ్యమే! ఇది తెనుగున – ఇప్పటివరకూ లేని సంస్కృతకావ్యరీతి. పాండిత్యమూ, ప్రతిభా సమంగా ఉండాలి. కవిత్వంలో మంచి బిగువు, ఒడుపూ కావాలి. ఏదీ ఓ పద్యం చెప్పు విందాం”
యువకుడు గొంతు సవరించుకున్నాడు. “తలపం జొప్పడి యొప్పె నప్పుడు….”
“ఆరంభంలోనే నాలుగు విరుపులే!”
యువకుడు నిరాశపడలేదు. పద్యాన్ని కొనసాగించాడు.
“తలపం జొప్పడి యొప్పెనప్పుడు తదుద్యజ్జైత్ర యాత్రా సము త్కలికా రింఖదసంఖ్య సంఖ్య జయవత్కంఖాణ రింఖా విశృం ఖల సంఘాత ధరా పరాగ పటలాక్రాంతంబు మిన్నే ఱన ర్గళభేరీ రవనిర్దళద్గగన రేఖాలేపపంకాకృతిన్.”
“ఊ!
ఆ చక్రవర్తి జైత్రయాత్రలో ఉత్కంఠ చేత చరిస్తున్న, అసంఖ్యాకమైన, జయము సాధించు గుర్రాల గిట్టలతో విశృంఖలంగా రేగిన ధూళి మిన్నేఱు – గంగను కప్పివేసి ఆ నీటిని బురదగా మార్చింది. భేరీనాదాలతో పగిలిన ఆకాశం యొక్క చీలికలు – మిన్నేటి బురదను పులుముకున్నట్టు ఉన్నాయి.
అశ్వాలయొక్క పదఘట్టనలను మత్తేభవిక్రీడితంలో నిమంత్రించావన్నమాట!
ఆకాశగంగలో భూమి యొక్క ధూళి ఆవరింపడం – అసాధ్యం. అ-యోగే గేయకల్పనమ్ – జరుగనిది జరిగినట్టు చెప్పడం సంబంధాతిశయోక్తి. బురద – ఆకాశాన్ని పులమటం – వస్తూత్ప్రేక్ష. అలంకారాలు రెండున్నూ తిలాతండులాల్లా కలిసి ఉన్నాయి కనుక సంకరం. తిలాతండులవత్ సంకరః; క్షీరనీరవత్ సంసృష్టిః. మిన్నేఱనే అచ్చతెనుగు శబ్దానికి సంస్కృతవిశేషణాలు కూర్చి గొప్పగా నడిపావు. పాండిత్యం గొప్పగా ఉన్నది. వీరరసస్పర్శ కన్నా అద్భుతం ఛాయామాత్రంగా కనిపిస్తున్నది.
బావుందోయ్!”
చిరునవ్వుతో చెప్పాడు పెద్దాయన. నాలుగు విరుపులా అని తను అన్నాడు కానీ ప్రవరుడు చూచిన హిమాలయాలను వర్ణించే క్రమంలో తను కూడా “అటజని కాంచె భూమిసురు” డంటూ విరుపులతో మొదలెట్టలేదూ!
మరో విశేషం కనిపిస్తోంది మనవడిలో. ఈ పద్యంలో “ఉద్యత్, రింఖత్, జయవత్, నిర్దళత్..” ఈ రూపాలు తన కవితలో సకృత్తుగా కనబడేవే. అందుకనే తన మనసెరిగి ఈ పద్యాన్ని చెప్పాడా మనవడు! ఘటికుడే!
“ఏమీ అనుకోకు. నీ పేరు మరిచాను!”
“పింగళి సూరన అంటారండి.” – ఆ యువకుడు గోత్రప్రవర చెప్పుకుని మరొకసారి సాగిలబడ్డాడు.
“నిఖిలసూరి లోకాంగీకార తరంగిత కవిత్వ చాతుర్య ధుర్యుడు కావలవు. లే నాయనా” తాతయ్య మనవడి తలను ఆప్యాయంగా స్పృశించాడు.
పైని తథాస్తు దేవతలు “వల్లె” యన్నారు.
అసలు కథ
కథ కంచికి.
ఆ కథ – ఓ చాటువుకు కథన రూపం. పింగళి సూరనామాత్యుడు అల్లసాని పెద్దన గారి మనమరాలిని వివాహం చేసుకున్నాడని, మొదట అపండితుడుగా ఉన్న సూరన వివాహమైన పిదప, భార్య ఇంట అవమానాలు భరించలేక శాస్త్రవిద్యలు నేర్చాడని, రాఘవపాండవీయంలో ఓ పద్యం చెప్పగానే తాత “మూడువిరుపులా” అని ఆక్షేపిస్తే, మిగిలిన పద్యాన్ని బిగువుగా నిర్మించాడని కథ.
అవడానికి ఇది చాటుకథే.
చాటుకథలు వాస్తవాలా? అవాస్తవాలా? అన్న మీమాంస మనకు ఆధునికకాలంలో వచ్చినంతగా ప్రాచీనకాలంలో లేవనుకోవచ్చు. కాళిదాసు – మేఘదూతంలో మేఘంతో అంటాడు – “ఓ మేఘమా! మా ఉజ్జయినికి వెళ్ళు. అక్కడ ఉదయన కథాకోవిదులైన పెద్దవాళ్ళందరూ చేరి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. వాటిని వినవచ్చు.” అలా చాటుకథలు చెప్పుకోవటం ఆనవాయితీ, సాంప్రదాయం కూడానూ అన్నట్టు కాళిదాసు ధ్వనింపజేశాడు. బృహత్కథ (కథాసరిత్సాగరం) అంతానూ ఈ జనపదాల్లో జరిగిన చాటుకథల నుండే పుట్టింది. ఈ కథల వెనుక ఒకప్పటి భారతదేశపు గుండెకాయే ఉందని చెప్పుకోవచ్చు. .
అలా అన్న కాళిదాసు గురించి ఎన్నో చాటువులు వచ్చాయి. చాటుకథలలో, చాటుకథలతో గ్రహించవలసినవి – వాస్తవాలో, అవాస్తవాలో కాదు. ధోరణులు, దృక్పథాలూనూ.
ఆంధ్రకవితరంగిణి లో మన చాటుకథను ప్రస్తావించి,ఇది ఒక కట్టుకథ అయి ఉండవచ్చునని చాగంటి శేషయ్యగారు చెబుతూ ఇలా అంటారు.
“యీ కథ విశ్వాసార్హమయినదిగాఁ గాన్పింపదు పెద్దనామాత్యుడు నందవరీక నియోగి బ్రాహ్మణుఁడు, సూరనార్యుడు ఆఱు వేల నియోగిబ్రాహ్మ ణుఁడు, ఈ రెండు శౌఖలవారికిని సంబంధబాంధవ్యములుచేసి కొను ఆచారముండెనా యని సంశయము కలుగుచున్నది.
ఒక వేళ నట్టి యాచారమున్నను దీనినిబట్టి సూరనార్యుని కాలనిర్ణయము గావించుటకు వలనుపడదు. ఈ మనమరాలు పెద్దనకుఁ బౌత్రియో దౌహిత్రియో తెలియదు. ” (ఆంధ్రకవి తరంగిణి – పుట 115)
సూరన యొక్క కాలనిర్ణయం చేయడానికి ఈ చాటుకథ ఆధారముగా వలనుపడదని శేషయ్యగారన్నారు.
అయితే ఈ చాటు కథను కాలనిర్ణయ దృష్ట్యా కాక, పెద్దన, సూరనల కవితారీతుల తులన కోసం అనుశీలించవచ్చు. పెద్దన మహా రసజ్ఞుడైతే సూరన పాండిత్య, నవ్యకవితా ధోరణుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
పింగళిసూరన ఒక గొప్ప పండితుడు, ప్రతిభాశాలి అయిన కవి. ఈ మహాకవి పద్యశైలి అక్కడక్కడా మహా ప్రౌఢం. కొన్ని మార్లు బహుకోమలం. రసజ్ఞత విషయంలో ఒక్కపిసరు తక్కువైనా కావచ్చేమో కానీ, కథాకథనంలో ఈయనను మించిన ప్రబంధకవి లేడని కళాపూర్ణోదయం కావ్యాన్ని ఉదాహరిస్తూ పెద్దలంటారు.
ఈయన ప్రౌఢిమను సూచించటానికో, మరెందుకో పై చాటుకథ పుట్టి ఉండవచ్చు! అది వాస్తవమో, అవాస్తవమో ఏదైనా అయి ఉండవచ్చు గాక! అల్లసాని వారి మనవరాలిని సూరన వివాహం చేసుకోవడంలో ఉభయులనూ ప్రశంసించే ఉద్దేశ్యమే కనిపిస్తోంది తక్క, అందులో అవమానకరమైన విషయం ఏదీ లేదు! వయసు రీత్యా కూడా ఈ పండితుల మధ్య తాతామనవల అంతరం కనిపిస్తూ ఉంది. దురుద్దేశ్యాలు గట్రా కనిపించని పక్షాన – ఈ చాటుకథను నిరసించే అవసరం ఉండరాదు. అబద్ధమని తీర్మానించవలసిన అగత్యం కానరాదు. చాటుకథల ఉద్దేశ్యాన్ని కాలనిర్ణయం కోసం మాత్రమే ఉపయోగించటం వల్ల వచ్చిన చిక్కు యిది.
చాగంటి శేషయ్య గారు చెప్పిన కారణం కూడా సబబుగా లేదు. వైదిక-నియోగి శాఖల మధ్య వివాహసబంధాలు తక్కువగా తక్కువైనది నిజం కానీ రెండు నియోగి శాఖలమధ్య వివాహబాంధవ్యాలు లేకపోవటం అన్నది సబబైన కారణంగా లేదు. బహుశా చాగంటి శేషయ్య గారికి నందవరీకుల సంబంధం నచ్చినట్టు లేదు. కారణాలు వారికే తెలియాలి.
కవితాప్రౌఢిమ
ఆ కారణాలు అటు పెట్టి పింగళి సూరన గారి కవితాప్రౌఢిని పరికించవలసి ఉంది. పై కథ వెనుక ఊసును వినడానికి ప్రయత్నం చేయవలసి ఉంది.
కవిత్వంలో కథన చాతురిని, పాండిత్యాన్ని, ప్రబంధనిబంధననూ ఒక పాఠంలా నిర్వహించిన ప్రబంధకవి పింగళి సూరన. ఈయన రచించిన కావ్యాలలో నేడు మనకు మిగిలినవి – కళాపూర్ణోదయం, రాఘవపాండవీయం, ప్రభావతీప్రద్యుమ్నము అన్న మూడు కావ్యాలు.
పద్యంలో ఆరంభంలో నాలుగు విరుపులా! అని ఆ చాటు కథలో పేర్కొనడానికి ఒక కారణం రాఘవపాండవీయంలో కనబడుతుంది. సూరన కవిత్వంలో – బిగువైన సమాసాలు మెండు. ఈ ఆశ్వాసాంతం పరికించండి.
శా. క్రీడామాత్రకృత త్రిమూర్తి భరణాంగీకార చూడాపరి భ్రాడాదిత్య ధునీ పృషత్పుషిత పంపాశైత్య మరు ద్రాడా రాధిత పాద యంఘ్రి నఖచంద్ర ద్యోత సిద్ధ్యత్పరి వ్రాడా ఖండలమండలీ హృదయ జీవంజీవ సంజీవనా ! (రా.పా. 4.263) (పద్యం గొంతెత్తి చదువుకోవడానికి అనువుగా అక్కడక్కడా ఖాళీలు వదిలి వ్రాసినప్పటికీ, పద్యమంతానూ కలిపి చదువుకోవలసినది.)
ఈ పద్యం విరూపాక్షుని వర్ణన!
ఓ విరూపాక్షా! నీవు లీలామాత్రముగా బ్రహ్మవిష్ణుమహేశ్వరులైన త్రిమూర్తుల రూపములను ధరించినవాడవు. నీ శిఖయందు ఒప్పిదమైన గంగ యొక్క నీటి బిందువుల చేత – పోషింపబడిన పంపానది యొక్క చల్లందనమును తాల్చిన వాడవు! బ్రహ్మేంద్రాదులచేత ఆరాధింపబడిన పాదములు కలిగిన వాడవు. నీపాదముల యొక్క నఖములనెడి చంద్రుని ప్రకాశము చేత యతీశ్వరులకు, బ్రహ్మర్షి సమూహములయొక్క హృదయములనెడు చకోరములకు సంజీవము సిద్ధించును. అట్టి విరూపాక్షా!
ఒక కందంలోనో, తేటగీతిలోనూ పద్యం మొత్తంగా ఏకసమాసం నిర్మించటం తెనుగుకవులకు అలవాటే కానీ శార్దూలంలో ఇంత బిగువుగా పద్యం చెప్పటం అరుదు. ఈ విధమైన ప్రౌఢిమ సూరన కవిత్వంలో కనిపిస్తుంది. ఇంత బిగువైన నడత కలిగిన పద్య సముచ్చయంలో విరుపులతో ఆరంభమైన పద్యాన్ని సూచించి, అలా విరుపులతో మొదలైనప్పటికీ, ప్రౌఢత్వంలో సూరన కవి ఏ మాత్రం తగ్గడని మన చాటుకథ సూచిస్తూ ఉంది.
కవుల కవిత్వధోరణిని సూచించే చాటువులు సంస్కృతంలోనూ, తెనుగులోనూ సకృత్తుగానే ఉన్నవి.
సంస్కృతసమాసం ఎంత వనరైనదని – ఆ సమాస నిర్మాణమూ, అందులోని అనుప్రాసలే చెబుతాయని ఆలంకారికులు చెబుతారు. శబ్దాలకు శ్లేష, ప్రసాద, సమత – ఇత్యాది పది శబ్దగుణాలు, పది అర్థగుణాలు ఉంటాయని ప్రతిపాదించిన ఆలంకారికులలో వామనుడు, జగన్నాథపండితరాయలు ముఖ్యులు.
“కఠినవర్ణఘటనారూప వికటత్వ లక్షణ ముదారతా”
ఉదారత – అంటే కఠినాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉండి, వికటత్వ లక్షణమును కలిగి ఉండుట.
వికటత్వం – అంటే అసాధారణం అని అర్థం. ఈ అసాధారణత లోనూ ఒక సొబగు, చిత్రం కద్దు,
కావ్యప్రకాశకారుడు మమ్మటుడు ఈ పది లక్షణాలను అంగీకరించక, ఈ ఉదారత అన్న శబ్దలక్షణం – ఓజస్సులో అంతర్గతమవుతుందని అంటాడు. కావ్యప్రకాశ వ్యాఖ్యాకారులు – శబ్దములు నృత్యం చేస్తున్నట్టు ఉండుట – ఉదారత్వం అని సూచించి, అది ఓజస్సులో అంతర్భాగంగా పరిణమిస్తుందని చెప్పడమే సూత్రకారుడి ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఏది ఏమైనా, శబ్దాల నృత్యవిన్యాసం, కఠినాక్షరాలు, “డ” ప్రాస, సంయోగాక్షరాలు – వీటిని దట్టించినా, పై పద్యానికి ఒక విభిన్నమైన సొబగును సూరన సాధించాడు. ఇట్టి పద్యాలు సూరనకవిత్వంలో కద్దు. “మాత్ర కృత, పృషత్ పుషిత పంపా, ఖండలమండలీ, జీవంజీవ సంజీవనా” – శబ్దాలలో ఆవృత్తి శబ్దనర్తనను సూచిస్తున్నవి. ఈ ఆవృత్తి మొదటి పద్యమైన “తలపం జొప్పడి…” లోనూ మనం గమనించవచ్చు.
ఈ కావ్యపు ఆశ్వాసాంతాలలో విరూపాక్షుని వర్ణించిన దాదాపు అన్ని పద్యాలున్నూ ఇదే విధంగా ఉండటం గమనార్హం. ఆశ్వాసాంతాలే కాక సుదీర్ఘసమాసయుక్తమైన పద్యాలు రాఘవపాండవీయంలో ఎడనెడ కానవస్తాయి.
“ప్రాలేయాంశు వతంస సన్నిహిత పంపావాత శైత్యౌచితీ….” (1.76) “మాహానాథవిహారవాహనకృపామాహాత్మ్య..” (2. 117) “పారేమాయవిజృంభమాణపరమబ్రహ్మాత్మ….”(3. 142)
నిజానికి పింగళి సూరన్న కవి రాఘవపాండవీయం కావ్యం యొక్క పాండిత్యం అసాధారణం. అటు రామాయణాన్ని, ఇటు భారతాన్ని కలిపి నిర్మీంచిన తొలి తెనుగు కావ్యం ఇది. సూరనకు మునుపు పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడనే కవి ద్వ్యర్థి కావ్యాన్ని రచించాడని, రాఘవపాండవీయకృతిపతి “ఆకువీటి పెదవేంకటాద్రి” ప్రభువు పేర్కొని, ఆ కావ్యం ఖిలం కనుక కొత్తగా అట్టి కావ్యాన్ని రచించమని సూరనను నిర్దేశించాడట.
భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయె కాని యందు నొం డేమియు నేయెడన్నిలుచు టెవ్వరు గాన రటుండనిమ్ము నా నామహిత ప్రబంధరచనాఘన విశ్రుతి నీకుఁ గల్గుటన్ నామదిఁ దద్ద్వయార్థకృతి నైపుణియుం గలదంచు నెంచెదన్. (రా.పా. 1.11)
ఆకువీటి ప్రభువు నిర్దేశాన సూరన కవి కావ్యాన్ని రచించి పంపావిరూపాక్షస్వామికి అంకితం చేశాడు. ఆశ్వాసాంత పద్యాలలో విరూపాక్ష వర్ణనకు కారణం అదే.
ఇట్టి ద్వ్యర్థి కావ్యం సూరన నాటికి తెనుగున లేకపోవచ్చు కానీ, సంస్కృతంలో ఇటువంటి కావ్యాలు అప్పటికే ఉన్నవని ఆరుద్ర గారు సమగ్రాంధ్రసాహిత్యంలో వివరించారు.
శబ్దశ్లేష, అర్థశ్లేష ఇత్యాదులతో రెండర్థాల పద్యాన్ని నిర్మించటమే ఒక యెత్తైతే, ఒక కావ్యాన్ని నిర్మించిన సూరన పాండిత్యం అనుపమానం, అసాధారణమూనూ! ఈ కావ్యాన్ని అర్థం చేసుకొని ఆనందించాలంటే – పాండిత్యంపై ఆసక్తి ఉండితీరాలి.
ఈ కావ్యం సూరన గారి పాండిత్యానికి గొప్ప ఋజువు. అయితే పాండిత్యానికి రసజ్ఞతకూ సాధారణంగా చుక్కెదురు. కావ్యప్రపంచంలో రసవత్కావ్య నిర్మాణమే ఘంటాపథం అని సహృదయుల తీర్పు. ఈ విషయంలోనే అల్లసాని పెద్దన – పితామహుడు. ఆయన – శబ్దనిర్మాణవిషయంలో సరస్వతికే లావణ్యం నేర్పగల దిట్ట. సూరన ఇంత ఘనమైన పాండిత్యప్రతిభ చూపినా, తరువాతి కాలంలో ఆయన శృంగారప్రబంధ నిర్మాణానికి రాక తప్పలేదు.
శబ్ద స్వారస్యం
రాఘవపాండవీయం పాండిత్యదురంధరమని చెప్పుకున్నాం. పాండిత్యభరమైన ఈ కావ్యంలో శబ్దస్వారస్యం సహృదయులను ఆకర్షింపకమానదు. పింగళి సూరన – తన కావ్యాలలో అక్కడక్కడా కవిత్వలక్షణాలను ప్రస్తావించాడు. ప్రభావతీ ప్రద్యుమ్నం లో అలాంటి పద్యం ఒకటి ఉంది. ఆ పద్యంలో శబ్దస్వారస్యాన్ని గురించి ఓ మూడు ముక్కలు చెప్పుకోవడం ధర్మం.
“శబ్దసంస్కార మెచ్చటను జారగనీక పదమైత్రి యర్థసంపదలఁ బొదలఁ దలపెల్ల నక్లిష్టతనుప్రదీపితముగా …..“
శబ్దసంస్కారము, పదమైత్రి, అర్థసంపద, భావము క్లేశరహితంగా యుండుట అను లక్షణములతో…..
శబ్దసంస్కారము – అంటే వ్యాకరణ యుక్తమైన శబ్దములతో అని అర్థం చెప్పారు. శబ్దం వ్యాకరణయుక్తంగా లేకపోతే అది చ్యుతసంస్కారమనే వ్యాకరణ దోషం. అయితే కేవలం వ్యాకరణయుక్తంగా ఉంటే శబ్దసంస్కారమని చెప్పవీలు లేదు. ఆ శబ్దములు రసభరితంగానూ ఉండవలె.
ఈ లక్షణాలు సూరన ఊరికే చూచాయగా చెప్పలేదు. అడుగడుగునా తన కావ్యంలో ఆచరించి చెప్పినట్టు తెలుస్తూంది. గమనించాలే కానీ రాఘవపాండవీయంలో ఈ లక్షణాలు అన్ని చోట్లా కనిపిస్తాయి.
శబ్దానికి చెందిన ఈ లక్షణాలను కలిపి శబ్దస్వారస్యం అని చెప్పుకుందాం – మన అనుకూలతకోసం. ఈ శబ్దస్వారస్యం గురించి ఒక ఉదాహరణ స్థాలీపులీకంగా ఒక్కటి.
రాఘవపాండవీయద్వ్యర్థి కావ్యంలో దాదాపు ప్రతి పద్యానికి రెండు అర్థాలు. (ఆ అవసరం లేని పద్యాలు ఉన్నాయి.) ఒక అర్థం రామాయణ విషయాన్ని చెబితే, మరొకటి భారతాన్ని చెబుతుంది. వెరసి ఇదొక ప్రౌఢ కావ్యం. అదృష్టవశాత్తూ ఈ ప్రౌఢకావ్యానికి ముద్దరాజుగణపయామాత్య కృతమైన సమగ్రమైన వ్యాఖ్యానం ఉన్నది.
ఈ క్రింది ఉత్పలమాల పద్యం చూడండి.
ఉ. హారి మృగవ్య నవ్య విహితాదరుఁడా ధరణీతలేశుఁ డ ధ్వార చిత్రశ్రమా కలితుఁడై కడు మెచ్చె సురాపగా జలా సార సమాగమార్హ తమసార ససార ససార సౌరభో దీరణ కారణంబు నతిధీర సమీర కిశోర వారమున్. (రా.పా 1.19)
పద్యం నడతను చూడండి. ముఖ్యంగా మూడవపాదం! సురాపగాజలాసార సమాగమార్హ తమసార ససార ససార సౌరభోదీరణ కారణంబు. ఈ సమాసాన్ని ఓ మారు గొంతెత్తి చదువుకోవడం మరువకండి.ఈ పద్యార్థమూ, ఈ సమాసపు సౌరభోదీరణ కారణాన్ని చూద్దాం.
పద్యానికి తాత్పర్యాలు ఇవి.
రామాయణార్థంలోః హారములు ధరించి వేటకు వెళ్ళిన దశరథుడు గంగాప్రవాహానికి సమమై, యాత్రాయోగ్యమైన తమసానదీజలములలోని తామరల యొక్క ఉత్కృష్టమైన సౌరభములు వ్యాపించుటకు కారణమైన మందమారుత సమూహములను మెచ్చెను.
మహాభారతార్థంలోః ఒప్పుచున్న వేటయందు నూతనమైన ఆదరమును పొందిన ఆ పాండురాజు మార్గమందు బడలికచేత అలసినవాడై గంగాజలప్రవాహములందు పరస్పరసాంగత్యమునకు అర్హమైన హంసలు, తామరలు కలిగి, ఉత్కృష్టమైన సౌరభములు వ్యాపించుటకు కారణమైన మందమారుత సమూహములను మెచ్చెను.
సురాపగాజలాసారసమాగమార్హతమసారససారససారసౌరభోదీరణ కారణంబు – ఈ సమాసంలో గల సభంగశబ్దశ్లేష ఒక యెత్తైతే; యమకం, అనుప్రాసల సౌందర్యం మరొక యెత్తు. ఈ సమాసానికి గల రెండు అర్థాలు ఇలా ఉన్నవి.
రామాయణార్థం: సురాపగాజలాసార-సమ; ఆగమార్హ; తమసా-రస; సారస; సార-సౌరభోదీరణ కారణంబు; సురాపగాజలాసార సమ = గంగాప్రవాహానికి సమమై; ఆగమార్హ = యాత్రకు అనువై; తమసా రస = తమసానదీప్రవాహముల; సారస = పద్మముల; సార = ఘనమైన; సౌరభ ఉదీరణ కారణంబు = పరిమళములు వ్యాపించుటకు గల హేతువు.
మహాభారతార్థం: సురాపగాజలాసార; సమాగమార్హతమ; సారస; సారస; సార-సౌరభోదీరణ కారణంబు సురాపగాజలాసార = సురనదీ ప్రవాహములందు; సమాగమ అర్హతమ =పరస్పరసాంగత్యమునకు మిక్కిలి అర్హమైన; సారస = పద్మములు, సారస = హంసలయొక్క; సార = ఘనమైన; సౌరభ ఉదీరణ కారణంబు = పరిమళములు వ్యాపించుటకు గల హేతువు.
సారస-సారస :
సారస శబ్దానికి బెగ్గురుపక్షి (హంస) అని, పద్మమని అర్థాలు ఉన్నాయి. ఈ సారసాల్లో ఒక సారస స్థానంలో అబ్జము/కంజము/పుండ్రము ఇత్యాది శబ్దాలు ఉపయోగించినా అర్థమూ, ఛందస్సు మారదు. అయితే సారస శబ్దావృత్తి చేయడం ద్వారా శబ్దసంస్కారాన్ని, శబ్దమైత్రిని, శ్రవణసుభగత్వాన్ని, అర్థమైత్రిని కవి అనాయాసంగా సాధించాడు.
పై పద్యాన్ని రచించినప్పుడు సూరనకు పోతన ఆవేశించాడా? పద్యం చదివేప్పుడు సహృదయులకు పోతనామాత్యుని “శారద నీరదేందు ఘనసార పటీర…” అన్న పద్యం గుర్తుకు రావచ్చు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=1
సార-సౌరభోదీరణమైన పద్యం అలా ఉంటే, రామాయణ, భారతాల కథలను సవ్యసాచిలా ఈ పద్యంలో ఎంత మధురంగా నిర్వహించాడో చూడండి.
తలపెల్ల నక్లిష్టతనుప్రదీపితముగా …..అని ఇందాక చదువుకున్నాం. కవి భావాలు రామాయణమహాభారతాలకు అన్వయిస్తూ జమిలిగా అల్లుకొనేట్టు ఉన్నా, ఏ ప్రకరణానికి తగినట్టు ఆ అర్థం వచ్చేట్టు ఎంత క్లేశరహితంగా వ్రాశాడో ఈ క్రింది పద్యంలో తెలుస్తుంది.
రామాయణంలో శివధనుర్భంగఘట్టం కవులకెందరకో ప్రీతిపాత్రమైన ఘట్టం. కవులు ఈ ఘట్టంలో పలుపోకడలు పోయినది నిజం.
రాఘవపాండవీయంలో ఈ శివధనుర్భంగ ఘట్టాన్ని, మహాభారత కథలో మత్స్యయంత్రభేదఘట్టంతో సమన్వయించి సూరన ఒక వినూత్న సృష్టి చేశాడు.
చం|| అనుపమ దివ్యవిక్రమసమగ్రుఁడు రామవిభుండు జిష్ణుఁ డా యనితరభేద్య రౌద్రధను వశ్రమ భంగిగ వంచి బాహులీ ల నెరపె నభ్రగా నిమిష లక్ష హృదంబకవృత్తి నుర్విరా ట్జనహృదయాక్షి వర్తనముఁ జాలఁగ నద్భుతవార్ధి ముంచుచున్. (రా.పా 2.56)
(మూడవపాదంలో హృదంబకవృత్తి నుర్వరా జన – అని వావిళ్ళవారి ప్రతిలో పాఠం. ఆ శబ్దానికి అర్థం బోధపడలేదు. అందుకని హృదంబకవృత్తి నుర్విరాట్ జన – అన్న పాఠ్యాంతరాన్ని స్వీకరించడమైనది)
అనుపమ దివ్య విక్రమ సమగ్రుడు = సాటిలేని పరాక్రమసంపన్నుడు; జిష్ణుడు = అపజయము లేని వాడు; (అయిన) రామవిభుండు = శ్రీరామచంద్రుడు; అనితరభేద్య = ఎవ్వరిచే ఎక్కుపెట్టబడని; రౌద్ర = ఈశ్వరుని; ధనువు = ధనువును; అశ్రమ = అనాయాసంగా ; భంగిగ = భంగము కలదానినిగా; వంచి = విఱిచి;
ఉర్వి రాట్ జన = వివిధ భూపాలుర యొక్క; హృదయ అక్షి వర్తనమున్ = మనస్సు, కనులు రెంటి నడత; చాలఁగ = నిండుగా అగునట్లు;
అభ్రగ = నింగిని చలించు; (అభ్రం గచ్ఛంతీతి అభ్రగాః); అనిమిష = రెప్పలు లేని వారైన దేవతల; లక్ష = అసంఖ్యాకములైన; హృత్+అంబక = హృదయములు; కనుల యొక్క; వృత్తిన్ = వ్యాపారమును;
అద్భుతవార్ధి = ఆశ్చర్యమను కడలిలో; ముంచుచున్; బాహులీల నెరపెను
రామాయణార్థంలో తాత్పర్యంః సాటిలేని పరాక్రమంతో, ఎప్పుడూ విజయంతో శోభిల్లే రామభద్రుడు, ఎవరిచేతా ఎక్కుపెట్టుటకు వీలుపడని శివధనువును అవలీలగా భంగమయ్యేట్టు విరిచి, భువిపై మహారాజులు, దివిపై దేవతల సమూహముల హృదయములు, కనులు – ఆశ్చర్యంలో మునిగేట్టు తన బాహులీల చూపెట్టాడు.
రామవిభుండు = అందమైన యువకులలో శ్రేష్ఠుడు; అనుపమ దివ్య విక్రమ సమగ్రుడు = సాటిలేని పరాక్రమసంపన్నుడు; జిష్ణుడు = అపజయము లేని వాడు అయిన విజయుడు; (విజయుడు అని అర్జునునికి ఒక పేరు కలదు) అనితరభేద్య రౌద్ర = ఎవ్వరిచే ఎక్కుపెట్టబడజాలని ఉగ్రమైన; ధనువు = ధనువును; అశ్రమభంగిగ = అనాయాసమైన విధంగా; వంచి = నేలవైపుకు త్రిప్పి; (క్రింద ఉన్న నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఉన్న మత్స్య యంత్రాన్ని భేదిస్తున్నాడు)
అభ్రగ = ఆకాశమున చరించుచున్న; అనిమిష = రెప్పలు లేని దైన చేపను; లక్ష = గుఱిని; హృత్ = హరింపునట్లుగా; అంబక = శరము యొక్క; వృత్తిన్ = వర్తన చేత;
మహాభారతార్థంలో తాత్పర్యంః చక్కని వాడు, గొప్ప పరాక్రమశీలి అయిన విజయుడు మత్స్యయంత్రాన్ని భేదిస్తున్నాడు. స్వయంవరానికి వచ్చిన రాజన్యులు కళ్ళు, మనసు ఆప్పగించి చూస్తుండగా – ఇతరులకు దుస్సహమైన తన ధనువును పైకి ఎక్కుపెట్టి తల వంచి – పైన నింగిని చరించే చేప యొక్క ప్రతిబింబాన్ని, క్రింద ఉన్న నీటిలో చూస్తూ, కొట్టాడు.
అంబకం నేత్రశరయోః – అంబక శబ్దానికి కనులు, శరములు అని రెండు అర్థాలు. అలాగే అనిమిష – అంటే రెప్పపాటు లేని వారు (లేనిది). దేవతలు లేదా మత్స్యము. “సురమత్స్యావనిమిషౌ” . ఈ అంబక శబ్దాన్ని సూరనయే కాక, ఆయన సమకాలీనుడు, కవిత్వంలో మరొక గట్టిపిండం – భట్టుమూర్తి వసుచరిత్రలో ఓ చోట ఎంతో హృదయంగమంగా వాడుకున్నాడు. http://vaakili.com/patrika/?p=11174
అర్థశ్లేషలో రూపొందిన పై పద్యం కూడా ఎంత హృదయంగమంగా ఉందో సహృదయులు ఊహింపగలరు. ఒక్క “అనిమిష” శబ్దంతో క్లిష్టతను పరిహరించి అర్థద్వయాన్ని అవలీలగా నడపడం – అపూర్వం.
ఈ పద్యంలో కవి సూచించిన శబ్దసంస్కార, అర్థవ్యక్తి ఇత్యాదులతో బాటు రీతి కి కూడా ఉదాహరణ. యథార్థక్రమనిర్వాహే రీతిరిత్యభిరుచ్యతే – పద్యం నడిచే క్రమంలో అర్థమూ నడవటం. దీనికి అద్భుతమైన ఆధునిక పద్య ఉదాహరణ – “నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి…” అన్న పద్యం.
మరొక విశేషం. సూరన కవి పండితుడు. ఇది తెలిసినదే. అయితే కేవలం శబ్దజ్ఞానపూర్వక పాండిత్యమే కాదు, చక్కని ప్రతిభకు పాండిత్యం జమిలిగా తోడు కావటం ఈ పద్యంలో కనుగొనవచ్చు.
ఇప్పుడు పాండిత్యం నుండి సరళమైన భావసౌందర్యానికి.
అనుస్వారంతో కూడి వసంతాన్ని వర్ణించే ఈ ఉత్పలమాలను ఎంత అందంగా అల్లాడో చూడండి. ఋతువర్ణన కనుక ఈ పద్యానికి అర్థం ఒక్కటే. రెండు అర్థాలు లేవు.
ఉ. అంత వసంతమొప్పెఁ జరమాగ్రిమభాగ చరాఖిలర్తు సా మంత మనంతజాలక సమంజస రంజిత కుంజ కుంజరో ద్వాంత నితాంత సాంద్ర మధుదాన విజృంభిత బంభరస్వనా త్యంత నిరంతరీకృత దిగంత మతాంత లతాంత కుంతమై. (రా.పా 2.04)
అటుపై పూర్వపశ్చిమభాగములలో అన్ని ఋతువులు సామంతులుగా కలిగినది; అసంఖ్యాకమైన పూమొగ్గలచేత యుక్తమై రంజిల్లు పొదలనే మదపుటేనుగుల నుండి వెలువడుతున్న బాగా చిక్కనైన మకరందములు స్రవింపబడి, అందు మూగిన తుమ్మెదల స్వనముచేత వ్యాపింపబడిన దిగంతములు కలిగినది; అలుపు లేని కుసుమాయుధుని వంటిదైన వసంతము ఒప్పినది.
ఈ వసంతంలోని నాలుగవపాదం – భట్టుమూర్తి “అతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంత రణతాంత సుతనుకాంత”మైన వసంతాన్ని కొంత స్పర్శిస్తోంది.
https://www.sanchika.com/prabandha-sahityamlo-salamulu/
సంస్కృత కవీంద్రుడు భట్టబాణుని స్పర్శ కూడా ఇక్కడ తగలకపోలేదు. “దిగంత మతాంత లతాంత..” – ఉత్పలమాల చివరి పాదాన జగణాల ఆవృతి కూడా అపురూపమే!
తెనుగు సొబగు
వసంతవర్ణనలో భాగంగా పై పద్యం తర్వాత అచ్చతెనుగులో సుదీర్ఘమైన రగడ – ఇలా మొదలవుతుంది.
“పొలిచె మధులక్ష్మి సురపొన్నలను బొన్నలను దెలిసిపడి పుప్పొడుల తిన్నెలను జిన్నెలను రంగుగఁ దనర్చు నారంగముల సంగములఁ బింగళత చెందె సురభృంగముల యంగములఁ …. …”
ఈ నడత సూరనదే అయినా తాత పెద్దన గారి మనుచరిత్రలోనూ పుష్పాపచయఘట్టాన రగడ కనిపిస్తుంది. తెనుగు శబ్దాల స్వారస్యంలో తాతామనవలు ధీటుగా కనిపిస్తారు. అయితే తాతగారి వర్ణన – వరూధిని చెలికత్తెల క్రీడలో భాగం. అందుచేత అది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. సూరన రగడ – వసంతవర్ణన కాబట్టి శ్రవ్యం. చదువుకోవలసినది.
ముగింపు.
ప్రబంధయుగం. అందునా రాయల వారి కాలం. కన్నడరాజ్యరమారమణుని నేతృత్వాన దక్షిణభారతం సర్వతోముఖాభివృద్ధిని చూస్తున్న రోజులు. సాహిత్యంలో, అందునా కవిత్వంలోనూ నవ్యత తప్పనిసరి. ఏదో విధంగా కావ్యం వ్రాస్తే సరిపోదు. ఇతర కవులు చూపని కొత్తదనాన్ని చూపాలి. అదీనూ అసాధారణంగా ఉండాలి. రసపరిపుష్టంగా ఉండాలి.
పింగళి సూరన కావ్యరచన తలపెట్టినప్పటికి కృష్ణదేవరాయడు బహుశా గతించి ఉండవచ్చు. కావ్యాల్లో రసస్పర్శ క్రమంగా మరుగై, శ్లేష, పాండిత్యం, నవ్యత – ఇత్యాది చమత్కారభరిత ప్రక్రియలు క్రమంగా పాదుకుంటున్న రోజులు.
ఈ నేపథ్యాన, పండితుడైన పింగళి సూరన “పాండిత్యం” ప్రధాన ప్రాతిపదికగా ద్వ్యర్థి కావ్యాన్ని రచించ తలపెట్టాడు. సూరన మొదటగా గరుడపురాణాన్ని “ఉదంచద్వైఖరి”ని తెనిగించానని చెప్పుకున్నాడు. అది ఇప్పుడు ఖిలమై పోయింది. గరుడపురాణాన్ని తెనిగించాలన్న ప్రయత్నమే ఒక “ఉదంచత్” వైఖరి. ఆ పురాణాన్ని ప్రత్యేక సందర్భాలలో తక్క ఇతర సమయాలలో సాధారణంగా పఠించరు.
సూరన – ఆపై పాండిత్యం ప్రాతిపదికన రాఘవపాండవీయం కావ్యాన్ని రచించాడు. పిమ్మట కళాపూర్ణోదయ సృష్టి చేశాడు. సూరన కళాపూర్ణోదయం కథాకథనంలో అపురూపమైన పద్ధతులు అనుసరించిన కావ్యం. అటుపై సూరన శృంగారప్రబంధంగా ప్రభావతీప్రద్యుమ్న కావ్యాన్ని రచించాడు.
ఇది కొంత విచిత్రం. సాధారణంగా మహాకవులు యౌవనంలో శృంగారప్రబంధాన్ని, ఆపై వయసు మీరిన తర్వాత పాండిత్యప్రకర్షను చేపట్టడం సహజం. సహజ కవి పోతన – భోగినీదండకం రచించిన తర్వాతే కదా మహాభాగవతాన్ని తెనిగించినది. అన్నమయ్య కూడా యౌవనంలో శృంగార పదాలే రచించి అటుపై వైరాగ్యాన్ని ఆశ్రయించి ఉండాలి. సూరనది రివర్సు.
అల్లసాని పెద్దన కవిత్వం మహామధురం. పెద్దనను తదుపరి కవులు కొంత మేరకు అనుసరించారని చెప్పుకోవడంలో ఆ కవులకు వచ్చిన అపకీర్తి ఏదీ లేదు. సూరనపై కూడా పెద్దన ప్రభావం ఉండి ఉండాలి.
అయితే కథన రీతులు, పాండిత్యానికి సంబంధించిన కొన్ని విషయాల్లో సూరన – తాత (అల్లసానిపెద్దన)కు దగ్గులు నేర్పాడనే ఒప్పుకోవాలి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™