[సుధారాణి తన తండ్రితో కలసి తనని ఒత్తిడి చేస్తోందని అనుకుంటాడు సత్యం. మానసికంగా నలిగిపోతుంటాడు సత్యం. పిల్లల పరీక్షలయిపోయాకా, విజయవాడలో ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్ళిపోవాలంటుంది సుధారాణి. ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా ఉంటోంది. అవతలి వారు ఎంతగా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని తమ కార్యకర్తలకి చెప్పాడు జగత్మోహన్. ఎన్నికల ఖర్చులు విపరీతంగా అవుతుంటాయి. ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలని గ్రహిస్తాడు జగత్. తాను గెలిస్తే, వాళ్ళ సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని నిర్ణయించుకుంటాడు. కొన్ని రోజులకి విజయవాడకి మారిపోతుంది సత్యం కుటుంబం. సత్తెనపల్లిలో లావాదేవీలు ముగించుకోమని, పూర్తిగా విజయవాడకే పరిమితమవమని సత్యాన్ని ఒత్తిడి చేస్తుంటాడు అతని మావగారు. కొత్త స్నేహితులతో కలిసి కులూ మనాలీ వెళ్తుంది సుధారాణి. – ఇక చదవండి]
ఎలక్షన్స్ జరిగాయి. ఇరవై రోజుల్లో ఫలితాలు వచ్చాయి. మంచి మెజార్టీతో జగత్ మోహన్ గెలిచాడు. ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సత్యానిక్కూడా బాగా సంతోషం కలిగింది. ఈ సమయంలో తను తండ్రికి చేదోడు వాదోడుగా వుంటే ఎంత బావుండేది? అవసరమైన సమయంలో తను తన కుటుంబాన్ని వదిలి విజయవాడ వచ్చేశాడు. ‘మా స్వార్థం మేము చూసుకున్నానమని ఇంట్లో అందరూ ఎంత బాధపడుతున్నారో’ అని ఆలోచించాడు. ఎలక్షన్ ఫలితాలు తెలియగానే సత్తెనపల్లి వెళ్లాడు. జగత్ మోహన్‌ను మనసారా ఆలింగనం చేసుకుని అభినందించాడు. సత్యాన్ని చూసి ఇంట్లో అందరూ సంతోషించారు. సుధనీ పిల్లల్నీ కూడా తీసుకురావాల్సింది అన్నారు. తనే ఎక్కవ సిగ్గుపడుతున్నాడు కాని ఇంట్లో వాళ్లెవరూ తనను తప్పు పట్టడం లేదు. వాళ్ల ఆప్యాయతలో కాని, ఆభిమానంలో కాని ఏ మార్పు లేదు. తల్లీ వదినా కొసరి కొసరి వడ్డించారు.
“అన్నయ్యకిక పెద్దగా తీరికుండదు. చాలా వరకు లీజ్ లకిచ్చేద్దామనుకుంటున్నాము. అక్కడ నీ పనులెలా సాగుతున్నాయి? దగ్గరుండి కట్టించండి. అంతా మీ బావమరిది మీద వదిలెయ్యకు. నువ్వే చూసుకో” అని హితవు చెప్పాడు రామారావు.
“అతని మీద నేను వదిలెయ్యటం కాదు. అతనే నా మీద వదిలేసి వేరే పెత్తనాలు చేస్తాడు. ఒక దాంట్లో కాదు, పది రకాలలో కాళ్లు పెడతారు తండ్రీ కొడుకులు. ఇద్దరికిద్దరే ఆరాటమూ, ఆర్భాటమూ ఎక్కువ.”
సత్తెనపల్లిలో బ్రహ్మండమైన ఊరేగింపు జరిపారు. ప్రమాణస్వీకారానికి వెళ్లేటప్పుడు తను కూడా వస్తానని చెప్పి సత్యం విజయవాడ వచ్చేశాడు.
“పెదబాబూ! గెలిచావు. బాగానే వున్నది. ‘చాలా ఖర్చు పెట్టాను. ఇంత కింతా రాబట్టుకోవాల’ని తాపత్రయ పడిపోకు. నియోజక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకో. ప్రజల కోర్కెలు తీరుస్తానన్నావు. మర్చిపోకు. కబ్జాల జోలికి అసలు పోకు. నువ్వు చేసే ప్రతి పనీ జనానికి ఉపయోగకరంగానూ, పదికాలాల పాటు గుర్తు పెట్టుకునేటట్లుగాను వుండాలి. కార్యకర్తలు కాని, పార్టీ పెద్దలుగాని రకరకాల ప్రలోభాల గురించి చెప్తూ వుంటారు. త్వరగా దేనికీ లొంగొద్దు. యార్డ్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ లాంటి పదవులకు కొన్నింటికి నువ్వు సపోర్ట్ చెయ్యాల్సి వుంటుంది. నిష్పక్షపాతంగా వుండు. మన కులం వాళ్లనే అందలం ఎక్కించాలని ఆలోచించకు. అన్ని మండలాల బాగును దృష్టిలో పెట్టుకో” అంటూ తనకు తోచిన కొన్ని అభిప్రాయాలను చెప్పాడు రామారావు.
“అలాగే నాన్నగారూ! మీ పేరు ఇప్పటికీ సత్తెనపల్లి నియోజక ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. ఆ పేరు మాత్రం చెడగొట్టను” అన్నాడు జగన్.
ప్రమాణస్వీకారం అయిపోయింది. కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ ఏర్పాటూ జరిగింది. నియోజిక వర్గ కేటగిరీలో జగత్‌కు మంత్రివర్గంలోనూ చోటు దక్కింది. ఇది ఎవ్వరూ ఊహించలేదు. రామారావు కుటుంబమంతా ఆనందంతో తల మునకలైంది. శశిరేఖ తల్లిదండ్రుల సంతోషానిక్కూడా అంతు లేదు. ఇల్లంతా సందడితో నిండిపోయింది. వచ్చేపోయేవారితో ఊపిరి ఆడనట్లైంది. సత్యమూ ఇక్కడే వున్నాడు. సుధారాణికీ, ఆమె తండ్రికీ పచ్చి వెలక్కాయ గొంతు కడ్డు పడినట్లు అయిపోయింది. “మంత్రి పదవి రావటమంటే మాటలా? ముఖ్యమంత్రికి ఎన్ని మూటలు సమర్పించుకున్నాడో? అయినా బావగారి దగ్గర ఆట్టే డబ్బు లేదే” అన్నది సుధ.
“డబ్బు ఇవ్వటమనే కాదులే సుధా! కుల సమీకరణను బట్టీ, నియోజకవర్గ సమీకరణను బట్టీ ఇవ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా జాతకుడు. మన పనులకు ఏ పర్మిషన్లు కావాలసి వచ్చినా, కొత్త వాటివి, శాంక్షన్ చేయించుకోవాలన్నా ఈయన రికమండేషన్ బాగా ఉపయోగపడుతుంది.” అంటూ అల్లుడి అన్నను కొత్తగా పర్యాటక మంత్రి అయిన జగత్ మోహన్‌ను ఎలా ఉపయోగించుకోవాలా అన్న ప్లానులు వేయటంలో మునిగిపోయాడు సుధారాణి తండ్రి సత్యనారాయణ.
‘ఈ శశిరేఖ పేద ఇంట్లో పుడితే మాత్రమేం, పెద్ద ఇంటి కోడలయ్యింది. కావాలని చేసుకున్న జగత్ మోహన్‌కు ముద్దుల పెళ్లామయ్యింది. ఇప్పుడేమో ఏకంగా మంత్రిగారి భార్య అయ్యింది. దాని జాతకం వెలిగిపోతుంది. అందరి దగ్గరా వినయంగా వున్నట్లు ఎంత నటిస్తుంది.’ అనుకున్నది అక్కసుతో సుధ. ఆమె ఆలోచనలను చెదరగొడుతూ “సుధా! నువ్వు అల్లుడితో కలసి పిల్లల్ని కూడా తీసుకుని సత్తెవపల్లి వెళ్లిరా. మీ తోటికోడల్నీ, అత్తమామల్నీ, పొగడ్తలతో ముంచెత్తు. పిల్లల్ని తీసుకుని ఒకసారి విజయవాడ రమ్మని చెప్పిరా” అన్నాడు తండ్రి సత్యనారాయణ.
“తప్పదుగా, అలాగే వెళ్తానులే నాన్నా.”
మర్నాడు సాయంకాలం కొంతమంది స్నేహితురాండ్రతో కలసి వాకింగ్ చేస్తున్నది సుధారాణి. తనతో పాటు నడుస్తున్న సుజాత, సుధారాణి చేయి పట్టుకుని అర చేతిలో నొక్కుతూ “కాస్సేపు ఆగండి. మనం నెమ్మదిగా నడుద్దాం. ఈ రోజు నా కాలు నొప్పిగా వుంది. అయినా మీరందరూ కనపడతారని వచ్చాను.” అన్నది.
“అలాగే నండి. నెమ్మదిగానే నడుద్దాం” అంటూ సుధారాణి కూడా తన నడక వేగాన్ని తగ్గించింది. మిగతావాళ్లు ముందుకెళ్లారు.
తమ మాటలు ఎవరికీ వినపడవు అనుకున్నాక సుజాత మాటలు మొదలు పెట్టింది.
“సుధ గారూ! మీవారు ఏదో బిజినెస్ మొదలు పెట్టారన్నారు గదా? నేను మీకింకో రకంగా వచ్చే మార్గం కూడా చెప్తాను. చెప్పమంటారా?”
“అయ్యో చెప్పండి దాన్దేమంది?”
“ఏం లేదు. మా క్కొంచెం డబ్బు అవసరమయ్యింది. ఏడాది లోపే అసలు, కావాలంటే నాలుగు నెలల్లోనే, తిరిగి, ఇచ్చేస్తాం. మూడు రూపాయల వడ్డీ తీసుకుందురుగాని. మీ వారికి ఒకేసారి డబ్బంతా అవసరం వుండదు కదా? బ్యాంక్‌లో వేసి వుంచుతారు. అంతే కదా? ఇలా మాకిస్తే బోలెడు వడ్డీతో కలిపి అంతకు అంతా వస్తుంది. నా గురించి మీకు బాగా తెలుసుగా, ఎప్పుడూ మేమే ఒకరికి ఇచ్చే స్థితిలో వుంటాం. ఈ సారే కాస్త డబ్బు అవసరమైంది. ఒక పాతిక లక్షలు చాలు. ఈ విషయం బయట ఎక్కడా అనవద్దు. మీవారూ, మీరూ ఆలోచించుకోండి. తేలిగ్గా వచ్చే సంపాదనని కాదనుకోకండి. ఇక్కడికి కొత్తగా వచ్చారు. త్వరలో బాగా డెవలప్ అవ్వాలని కోరుకునే వాళ్లలో నేను మొదటి దానిని. అది గుర్తు పెట్టుకోండి” అన్నది ఆత్మీయురాలిలాగా.
సుధారాణికి ఒక్కసారిగా ఏ మాట్లాడాలో అర్థం కాలేదు. పాతిక లక్షలంటే మరీ చిన్న మొత్తమేం కాదు. సత్యం అసలు ఒప్పుకోకపోవచ్చు. తనే మాటల్లో తమ దగ్గర బోలెడు డబ్బుందని నోరు జారింది. ఇప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని సుజాత అప్పు అడుగుతున్నది. “అలోచిద్దాం లెండి” అంటూ మాట దాట వేసింది.
“అలాగే ఆలోచించుకోండి. నేను చెప్పిన విషయం మంచిదని మీకూ అర్థమవుతుంది. మీవారు బిజినెస్‌లో సంపాదిస్తుంటే మీరు మీ తెలివితేటల్తో ఇంట్లో వుండే డబ్బు కూడబెట్టుకోవచ్చు.” అంటూ సుధారాణికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.
“మావారితో మాట్లాడి చెప్తానులే” చెప్పింది.
ఇంటికొచ్చిన తర్వాత సత్యానికి ఈ విషయం చెప్పింది.
“మనం చేయబోయే పనులకు ఎక్కడెక్కడి డబ్బూ మనకే చాలదు. వేరే వాళ్లకు ఎక్కడ తెచ్చిఇస్తాం? వద్దు. పైగా వీళ్లంతా నీకు కొత్తగా పరిచయమైనవాళ్లు. అంతగా తెలియని వాళ్లతో డబ్బు లావాదేవీలు పెట్టుకోవటం మంచిది కాదు. నువ్వీ విషయం మర్చిపో” అన్నాడు.
“బిజినెస్ కోసం పెట్టుబడి అంతా మనమే పెట్టం కదా? మా నాన్న సగభాగం పెట్టుకుంటాడు. మన దగ్గర ఇంకా డబ్బు మిగిలే వుంటుంది. బ్యాంక్‌లో అలా ఊరికే పడుండే దాని కన్నా ఇలాంటి వాళ్లకిస్తే వడ్డీ వస్తుంది. త్వరలోనే దాదాపు రెట్టింపు అవుతుంది. సుజాత మాజీ యమ్.పి.గారి మేనకోడలు. బాగా వున్న కుటుంబం. మన డబ్బు ఎక్కడికీ పోదు.” అన్నది నమ్మకంగా.
“నేను చెప్పేది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నా మాటలు ఎప్పుడు విన్నావు కనుక? ఇప్పుడు వినటానికి?” అంటూ సత్యం విసుక్కున్నాడు.
సుధారాణికి సుజాత చెప్పిన మూడు రూపాయల వడ్డీయే మనసులో మెదులుతున్నది. ఈ విషయం తండ్రిలో కూడా చెప్పదల్చుకోలేదు. చెప్తే తప్పకుండా భయపడతాడు. సుజాత ఎవరితో అనవద్దంది. పాపం బాగా వున్న కుటుంబాలు కదా? బయటికి తెలిస్తే బాగోదని అలా చెప్పి వుంటుంది. సుజాత మంచి మాటకారి. ఇతరులకు సహాయం చేసే గుణం కూడా బాగా వున్నది. తనిప్పుడు డబ్బు అప్పుగా ఇస్తే ఇంకా పెద్ద పెద్ద వాళ్లతో తనను పరిచయం చేస్తుంది. తన సర్కిల్ ఇంకా పెంచుకోవచ్చు. మొన్న కూడా మనాలి వెళ్లినప్పుడే కొంత మందితో పరిచయం కలిగింది. ఆ మధ్య ఒక చిన్న స్థలం తన పేరున వుంటే మంచి రేటు వచ్చిందని అమ్మి ఆ డబ్బు తన పేరన వేశాడు. ఆలోచించి తర్వాత దేంట్లోనైనా పెట్టవచ్చు అనీ చెప్పాడు. ఇప్పుడా డబ్బులు పాతిక లక్షలు డ్రా చేసి తెచ్చింది.
డబ్బు ఇస్తానని చెప్పి సుజూతని రమ్మని ఫోన్ చేసింది సుధారాణి.
ప్రింటెడ్ ప్రోనోటు మీద వాళ్లాయనతో సంతకం పెట్టించుకొని వచ్చి ఇచ్చి ఆ డబ్బు తీసుకున్నది సుజాత.
“చాలా ధాంక్స్ సుధారాణిగారూ! సమయానికి డబ్బిచ్చారు. మీరిప్పుడు మాకెంతో సహాయం చేసినట్లే. సమయానికి ఇలా సహాయం చేసే గుణం ఎంత మందికుంటుంది చెప్పండి. నేనూ ఇలాగే ఎంతో మందిని ఆదుకున్నాను. వీలైనంత త్వరలో వడ్డీతో సహా మీ డబ్బు తెచ్చిస్తాను. మాతో మీకే విధమైన పేచీ వుండదు. ఏ విధమైన ఆస్తిని హామీ అడక్కుండా ఇంత మొత్తాన్ని మాకు అప్పుగా ఇచ్చినందుకు మావారు కూడా థాంక్స్ చెప్పమన్నారు. వస్తాను” అంటూ సుజాత డబ్బు తీసుకుని వెళ్లిపోయింది.
***
జగన్ మొదటిసారి అసెంబ్లీ సమైవేశాల్లో పాల్గొని ఇంటికి వచ్చాడు. మంత్రి అయిన దగ్గర నుంచీ సన్మానాలకూ, సత్కారాలకూ కొదవలేదు. ఇవేమీ వద్దని కార్యకర్తలకు ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. డబ్బు దుబారా చెయ్యవద్దు. వీలైనంత క్లుప్తంగా కార్యక్రమాలు వుండాలి అని పదే పదే చెప్తున్నాడు. మంత్రి పదవి వచ్చినా ఏ మాత్రం భేషజం పోకుండా అందరికీ కలుపుకుపోతున్నాడు. తన నియోజకవర్గ ప్రజల ఎంతో ఆశతో ఇచ్చే ప్రతి ఫిర్యాదునూ శ్రద్ధగా వింటున్నాడు. రాష్ట్ర పర్యాటక మంత్రిగా తను మారుమూల వున్న ప్రతి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్న విషయం పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు. ఒక మాజీ ఐ.ఎ.యస్. అధికారిని తన కార్యదర్శిగా నియమించుకున్నాడు. జిల్లాల అధికారులందరితోను చర్చించి పర్యాటక రంగానికి సంబంధించిన అన్ని వివరాలనూ తెలుసుకుంటున్నాడు. ఏయే ప్రాంతాలలో పర్యాటకులకు చూడదగ్గ ప్రదేశాలుగా వున్నాయో, వాటినింకా ఎలా అభివృద్ధి చేయాలన్న దిశగా ఆలోచించసాగాడు. స్వయంగా రాష్ట్రంలో వున్న పర్యాటక ప్రదేశాలన్నీ చూడాలన్న ఉద్దేశంతో వున్నాడు. అటవీ ప్రాంతాలలోనూ, జలపాతాలున్న ప్రదేశాల గురించి కూలంకషంగా తెలుసుకుని వాటిని ఇంకా ఎలా అబివృద్ధి చేయటానికి వీలుంటుందో సంబంధిత అధికారులతో చర్చించాలనుకున్నాడు. ప్రభుత్వానికి పర్యాటక రంగం ద్వారా ఆదాయం సమకూరాలి. మన రాష్ట్రంలో కొన్ని ద్వీపాలున్నాయి. ప్రయివేట్ వ్యక్తులు ఆ ద్వీపాల దగ్గరకు రాకపోకల నేర్పరిచి ప్రయాణీకుల దగ్గర చాలా ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం తరుపున లాంచీలు నడపటం, రిసార్టులను అభివృద్ధి పరచటం చేయాలని సంకల్పించుకున్నాడు. అలా చేస్తే తక్కువ రుసుముకు ప్రయాణీకులు ఎన్నో ప్రాంతాలను చూడగలుగుతారు. దేవాలయ ప్రాంతాలూ, ప్రాచీన కోటలున్న ప్రాంతాలూ శిల్పాల కాలవాలమైన ప్రదేశాలూ దేనికి మినహాయింపు వుండకూడదు. ఎంత మారుమూల ప్రాంతమైనా సరే రవాణా సౌకర్యం కల్పించి యాత్రికులు వుండటానికి తగిన వసతులు కల్పించాలి. వసతులున్న చోట అభివృద్ధి చేయాలి. వసతులు లేని చోట ఏర్పరచాలి. ఏ ప్రాంతాన్నీ నిర్లక్ష్యం చేయకుండా సమ దృష్టి పాటించాలన్న నిర్ణయం తీసుకున్నాడు.
మంత్రిగారిని కలవాలంటూ వచ్చే వాళ్లతో సత్తెనప్లలిలోని రామారావు ఇల్లంతా ఒకటే సందడిగా వుంటున్నది. అటువంటి సమయంలో సుధారాణి పిల్లలను తీసుకుని వచ్చింది. ఇంటి ముందు ఆగి వున్న ప్రభుత్వ వాహనం, గన్మెన్లూ, బావగార్ని కలుసుకోవటానికి వచ్చిన కార్లు బయట రోడ్డు మీద బారులు తీరివున్నాయి. మరో వైపున పోలీసు జీపు. అందులో కొందరు పోలీసులు ఇదంతా చూసి బావగారు ఇంట్లోనే వున్నట్లున్నారు అనుకున్నది. అందుకే ఇంత హంగామాగా వున్నట్లున్నది. తను కూడా పర్మిషన్ తీసుకుని లోపలకు పోవాలేమో అన్నంత జంకు కలిగింది.
డ్రైవరు కారు దిగి గేట్లో నిలబడి వున్న కాపలాదారులతో మాట్లాడి ఫలానా అని చెప్పి వచ్చాడు. ఇంతలో ఎంత మార్పు? ఇలా అవుతుందని తను ఊహించనైనా ఊహించలేదు. ఎంతైనా శశిరేఖ జాతకురాలు అనుకుని నిట్టూర్చింది.
లోపలకెళ్లిన సుధారాణిని, పిల్లల్నీ, శశిరేఖా, సత్యవతీ ఆప్యాయంగా పలకరించారు. సత్యవతి రెండు చేతులు సాచి మనుమళ్లనిద్దరినీ దగ్గరకు తీసుకున్నది.
“ఈ నానమ్మ ఇప్పుడు గుర్తు వచ్చిందా రామ్, కృష్ణ. తాతగారి మీద కాళ్లు వేసి పడుకునే వాడివి. పైగా తాతగార్ని…. మీరిద్దరూ లేకపోతే ఇల్లెంత బోసిపోయిందో” అంటూ ఇద్దరి మనవళ్లని మురిపెంగా నిమిరింది.
శశిరేఖ ముందు కొచ్చి పిల్లల నిద్దర్నీ దగ్గరకు తీసుకున్నది.
“బాగా చదువుతున్నారా రామ్, కృష్ణా! కొత్త స్కూల్ బావున్నదా” అనడిగింది.
“ఏం కృష్ణాబాబూ! అచ్చం చిలిపి కృష్ణుడిలాగా ఇంట్లోకిరాగానే వెన్నపూస అడిగి తిని వెళ్లేవాడివి. రామ్ బాబూ! నువ్వు చపాతీల మీద కూడా జామ్ రాసుకుని ఇష్టంగా తినేవాడివి. ఇద్దరూ కాస్త సన్నబడ్డరయ్యా. సరిగ్గా తినటం లేదా” అన్నది వరలక్ష్మి.
“కూర్చో సుధా, నిలబడే వునావు. అక్కడంతా బాగానే వున్నదా? ఇబ్బందేం లేదుగా? గుడివాడకు విజయవాడ దగ్గరేనా? మీ అమ్మ నాన్నగారూ ఎక్కువగా వచ్చి వెడుతున్నారా?” అన్నది సత్యవతి.
“అమ్మ ఎక్కువగా ఎక్కడికీ రాదు. ఆవిడకు మోకాళ్లు నొప్పులతోనే సరిపోతుంది. నాన్నగారే వచ్చి వెళుతూ వుంటారు. మామయ్య గారు లేరా? బయటికెళ్లినట్లున్నారు.”
“అవును సుధా, దాదాపు మన బిజినెస్ లన్నీ లీజుల మీదే నడుస్తున్నాయి. ఇవ్వాళేదో పని వున్నదని బయటికెళ్లారు. ఊళ్లలో జరిగే కొన్ని ఫంక్షన్ లకూ, ఓపెనింగ్ లకూ తనకు తీరక లేకపోతే పెదబాబు వాళ్ల నాన్నగారిని తనకు బదులుగా పంపిస్తున్నాడు. వచ్చిన వాళ్లను చిన్నబుచ్చటం ఇష్టం లేక మీ మామయ్యగారు ఓపిక చేసుకుని మాజీ యమ్.ఎల్.ఎ. హోదాలో వెళ్లి వస్తున్నారు” అన్నది సత్యవతి.
ఆ పగలంతా జగత్ మోహన్ సుధారాణికి కనపడనే లేదు. బయటున్న డ్రాయింగ్ రూమ్‌లో వచ్చిన వాళ్లతో మాట్లాడి తనూ బయటకి వెళ్లిపోయాడు. ఆరోజు సాయంకాలానికి మఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కర్చీఫ్‌ను చేత్తో పట్టుకుని లోపలకొచ్చాడు జగత్ మోహన్. అప్పటికి రామ్ కృష్ణలు తల్లితో కలిసి తిరుగు ప్రయాణమవుతున్నారు
“అరే రామ్, కృష్ణ! ఎలా వున్నారు? ఎలా చదువుతున్నారు? డాడీ రాలేదా? ఏమ్మా సుధా, ఎలా వున్నావు? సత్యం ఏం చేస్తున్నాడు? మీ పేరెంట్స్ కులాసాగా వున్నారా?” అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు.
“మీరు మంత్రి అయినందుకు చాలా సంతోషంగా వున్నది బావగారు. మా నాన్నగారు కూడా చాలా సంతోషపడ్డారు. వీలు చూసుకుని అన్నయ్యా నాన్నా వచ్చి మిమ్మల్ని కలుస్తారు” అంది.
“అయ్యో పెద్దవారైన మామయ్యగారు ఇబ్బంది పడి రానఖ్ఖర్లేదు. విజయవాడ వైపు వచ్చినప్పుడు నేనే కలుస్తానని చెప్పు” అంటూ లోపలికి నడిచాడు జగత్ మోహన్.
అప్పుడే లోపలికొచ్చిన రామారావు మనుమళ్లనిద్దరినీ ఆనందంగా దగ్గరకు తీసుకున్నాడు. ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నాడు.
“రామ్ కృష్ణ, అమ్మా, నాన్నల మాట వినండి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోండి. ఫోన్‌తో ఎక్కువసేపు ఆడొద్దు” అని చెప్తుంటే అలాగే అంటున్నట్లుగా తలలూపారు.
(ఇంకా ఉంది)
శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి. వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రచయిత శ్రీ డి.ఎన్. సుబ్రమణ్యం ప్రత్యేక ఇంటర్వ్యూ
పదసంచిక-106
పదసంచిక-13
అలనాటి అపురూపాలు-115
జ్ఞాపకాల పందిరి-30
హిచ్కీ: కాళ్ళను కట్టేసే సంకెలు కావు, దాటాల్సిన విశేషానికి ప్రతీక
కలనే కన్నాన
రెండు ఆకాశాల మధ్య-11
సాక్షీ’భూతం’
పొన్న చెట్టు కొమ్మమీద
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®