దాక్షిణాత్యా భవద్భంగిః ప్రియాతస్య విలాసినః। కర్ణాటానుగుణష్టంక స్తతస్తేన ప్రవర్తితః॥ (కల్హణ రాజతరంగిణి 7, 926)
కల్హణుడు హర్షుడిని, హర్షుడి పాలనను అత్యంత ప్రీతితో విపులంగా వర్ణిస్తాడు. బహుశా కశ్మీరును అత్యంత వైభవంగా, కొద్ది కాలమైనా అత్యంత సమర్థవంతంగా, జనరంజకంగా, పాలించిన చివరి కశ్మీర రాజు హర్షుడు కావటం కూడా కల్హణుడు హర్షుడి గురించి ప్రతి చిన్న విషయాన్నీ విపులంగా వర్ణించటానికి కారణం అయి ఉండవచ్చు. కల్హణుడి తండ్రి హర్షుడి ఆస్థానంలో పని చేశాడు. అంటే, కల్హణుడు ప్రత్యక్ష సాక్షి హర్షుడి పాలనకు. రాజుల పనితీరును, వారి మనస్తత్వాలను, వారి రాజకీయాలను, కుట్రలను అన్నింటినీ కల్హణుడు అతి దగ్గరగా చూశాడు. అంతవరకూ కల్హణుడు వర్ణించిన విషయాలన్నీ ఆయన పలు మార్గాల్లో సంగ్రహించి గ్రహించినవి. కానీ హర్షుడి గురించి ఎవరూ ప్రత్యక్షంగా తెలుపనవసరం లేదు. ఎలాంటి గ్రంథాలు, శాసనాలు పఠించనవసరం లేదు. తాను కళ్ళతో చూసింది, గ్రహించింది, అర్థం చేసుకున్నది ప్రదర్శిస్తే చాలు. పైగా హర్షుడి జీవితం ఎంతటి వైవిధ్యమైనదంటే, రాజతరంగిణి రచనకు, భావితరాలకు భారతీయ జీవన వైభవాన్ని మరచిపోలేని రీతిలో అందించాలన్న తపనకు హర్షుడి జీవితం ప్రేరణను ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే హర్షుడి పాలనాకాలంలో హర్షుడు ప్రవేశపెట్టిన విధానాలు, భవిష్యత్తులో కశ్మీరం సంపూర్ణంగా రూపాంతరం చెందడానికి, తిరుగులేని విధంగా ఇస్లామీయులు ఆధిక్యం పొందటానికి దారితీశాయి.
“హర్షదేవుడు అవలంబించిన విధాన ఫలితాలకు కశ్మీరం మూల్యం చెల్లిస్తోంది. హర్షుడు రాజుగా ఉన్నప్పుడు తురుష్కులకు కశ్మీరంలో ఆశ్రయం ఇవ్వటమే కాదు, అనేక కీలకమైన పదవులను వారి కట్టబెట్టాడు. ‘పరమత సహనం’ ముసుగులో వారిని ప్రముఖ పదవుల్లో ఉంచడం వల్ల తన పదవికి భంగం కలగదని అనుకున్నాడు.” (తరాల తరంగాలు, కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, కస్తూరి మురళీకృష్ణ, పేజీ నెం.213). అయితే హర్షుడి పాలన అతి గొప్పగా ఆరంభమయింది. ప్రజలు హర్షుడు రాజవటం కోసం తపించారు. హర్షుడు రాజు అయినప్పుడు సంబరాలు చేసుకున్నారు. హర్షుడు రాజు అవటంతో కశ్మీరు స్వర్గంలా మారిందన్నట్టు భావించుకున్నారు. తండ్రి కాలంలో వారిని వారి పదవుల్లో నియమించాడు. ప్రజలకు ధనాన్ని విరివిగా పంచాడు. రాజ్యంలో ఎవరికైనా ఏదైనా కష్టం కలిగిందని తెలిస్తే విలవిలలాడిపోయి వారి కష్టాన్ని తొలగిస్తే కానీ స్థిమితంగా ఉండలేకపోయేవాడు. రాజభవనంలో నాలుగు వైపులా ధర్మగంటలను కట్టించాడు. ప్రజలెవరికీ ఎలాంటి సహాయం కావాలన్నా ఆ గంటను మ్రోగిస్తే చాలు. వారి కష్టం తీరుస్తాడు హర్షుడు. అదీ ఎలాగంటే, వర్షాకాలంలో నీరు నిండిన మేఘం చాతక పక్షి దాహం తీర్చినట్టు ప్రజల కష్టాలు తీర్చేవాడట హర్షుడు.
హర్షుడి కాలంలో అందమైన, అత్యద్భుతమైన దుస్తులు లేనివారు లేరు. ప్రతివారు బంగారు నగలతో ధగధగలాడేవారు. శ్రీనగరి సింహద్వారం ఎప్పుడూ ప్రజలతో కిటకిటలాడిపోయేది. శ్రీనగరంలో పలు దేశాలకు చెందినవారు ఇబ్బడి ముబ్బడిగా కనిపించేవారు. ఇది చూస్తుంటే సకల దేశాల ఐశ్వర్యం కశ్మీరుకు వచ్చి చేరుతున్నట్లు అనిపించేది. బంగారు నగలతో, పట్టు బట్టలతో రాజభవనం స్వర్గంలా తోచేది. తనకు విధేయులుగా ఉంటామని ప్రమాణం చేసిన వారందరినీ హర్షుడు క్షమించి వారికి తగిన పదవులు అప్పజెప్పాడు. తనకు వ్యతిరేకంగా పని చేసి, తనను హత్య చేయాలని ప్రయత్నించిన వారిని మాత్రం హర్షుడు క్షమించలేదు. తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ రాజే అన్న ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని కలిగించాడు హర్షుడు.
రోజురోజుకీ ప్రజలలో హర్షుడి పట్ల అభిమానం పెరుగుతూ వచ్చింది. ఎలాగయితే పళ్ళతో నిండిన వృక్షం అందరికీ కోరినది ఇస్తూ ఆనందం కలిగిస్తుందో, అలాగ హర్షుడు అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని కలిగించాడు. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారు కూడా పశ్చాత్తాపం వ్యక్తపరచగానే వారిని అక్కున చేర్చుకుని ఆదరించాడు. హర్షుడు గంగా తీర్థయాత్ర చేశాడు. ఈ రకంగా అంతా ఆనందంగా సాగుతున్న సమయంలో కొందరు దుష్టులు విజయమల్లుడి మనసు పాడు చేశారు. ‘నీ సైన్యంతో నువ్వు రాజ్యం గెలుచుకుని హర్షుడికి రాజ్యం కట్టబెట్టావు. హర్షుడిని చంపి నువ్వే రాజువి కమ్మ’ని అతడి మనసులో విషం నింపారు. దాంతో విజయమల్లుడు హర్షుడిని తన భవనానికి రప్పించి హత్య చేయాలని పథకం వేశాడు. ఇది తెలిసిన హర్షుడు అప్రమత్తమయ్యాడు. సైన్యాన్ని సిద్ధపరచాడు. విజయమల్లుకూ హర్షుడి సైన్యాలకు నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. విజయమల్లుడు తన అశ్వంపై భార్యను కూర్చోబెట్టుకుని యుద్ధం చేశాడు. ఎంత వీరోచితంగా పోరాడినా ఓటమి తప్పదని గ్రహించి, భార్యతో సహా వితస్తలో దూకి తప్పించుకున్నాడు. దరదుల రాజ్యానికి చేరుకున్నాడు. ఇప్పటి కిషన్‌గంగ ప్రాంతాన్ని దరదుల రాజ్యంగా భావిస్తారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో దరదులు అధికంగా ఉన్నారు. దామరులు కూడా విజయమల్లుకి మద్ధతు తెలిపారు. ఆ కాలంలో దరదుల ప్రాంతంపై ‘షాహి’ రాజుల పాలన ఉండేది. రాజు పేరు ‘విద్యాధర షాహి’, అంటే సింధు ప్రాంతాన్ని అరబ్బులు ఆక్రమించిన తరువాత చెల్లాచెదురయిన ‘షాహి’ రాజవంశం వారు కశ్మీరు పరిసర ప్రాంతాలలో తమకంటూ చిన్న రాజ్యాలు ఏర్పరుచుకున్నారన్న మాట.
విజయమల్లు దరదుల ప్రాంతంలో ఆశ్రయం పొందటం, అతడికి దామరులు మద్దతునివ్వటం హర్షుడిలో కలవరం కలిగించింది. దౌత్యం ద్వారా దామరులను, దరదులను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించాడు. కానీ, దౌత్యం సఫలం కాలేదు. విజయమల్లు పెద్ద సైన్యం సమకూర్చుకుని శ్రీనగరంపై దండయాత్రకు బయలుదేరాడు. దారిలో ఓ ప్రాంతంలో గుడారాలు వేసుకున్నారు. కానీ పెద్ద పెద్ద మంచుకొండలు విరిగిపడటంతో విజయమల్లు ప్రాణాలు కోల్పోయాడు. ఆ రకంగా హర్షుడికి సోదరుడి నుంచి ప్రమాదం తప్పింది. సమయం హర్షుడి వైపు ఉంది. విధి హర్షుడికి మద్దతుగా నిలిచింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, కారాగారంలో హర్షుడి ప్రాణాలు ప్రమాదంతో ఉన్నప్పుడు, హర్షుడిని రక్షించి రాజుగా నిలపాలని మరో సోదరుడితో యుద్ధానికి వచ్చిన విజయమల్లు, హర్షుడు రాజు కాగానే, రాజ్యం కోసం హర్షుడితో తలపడటం. తలచుకుంటే, హర్షుడిని కారాగారంలోనే ఉంచి విజయమల్లు రాజు అయ్యేవాడు. కానీ అప్పుడు రాజ్యకాంక్ష లేదు విజయమల్లుకు. కానీ చెప్పుడు మాటలు విని, ఇతరుల దుష్ట ప్రభావానికి లోనయి విజయమల్లు, అన్నకు నిస్వార్థంగా రాజ్యం కట్టబెట్టిన వాడిగా కాక, రాజ్యం కోసం సోదరుడితో తలపడిన వాడిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఈ సందర్భంగా కల్హణుడు రెండు చక్కని శ్లోకాలను రాశాడు. ఏదైనా పని సాధించాలని కంకణం కట్టుకుని ఎంత ప్రయత్నించినా, విధి వ్యతిరేకమయితే ఎంత శ్రమ అయినా క్షణంలో వ్యర్థమవుతుంది. సూర్యుడి వేయి కిరణాలు వికసింపజేసిన కమలాన్ని ఏనుగు క్షణంలో తొండంతో పీకి పారేస్తుందని అంటాడు కల్హణుడు. అంతర్యుద్ధ భయంతో రాజకార్యాలపై దృష్టి సరిగా పెట్టని హర్షుడు, విజయమల్లు మరణంతో మళ్ళీ రాజ్యపాలనపై దృష్టి పెట్టాడు. ఇక్కడి నుంచి కల్హణుడు, కశ్మీరం సంస్కృతి, సంప్రదాయాలలో హర్షుడు తెచ్చిన మార్పులను విపులంగా వర్ణిస్తాడు. అలంకరణల నుంచి ఆనంద సాధనాల దాకా కశ్మీరంలో విప్లవాత్మకమైన మార్పులకు కారకుడయ్యాడు హర్షుడు.
హర్షుడు రాజ్యానికి వచ్చే సమయానికి రాజులు తప్ప సామాన్య ప్రజలు జుట్లు ముడివేసేవారు కారు. తలపాగా ధరించేవారు కారు. ఆభరణాలు ధరించేవారు కారు. మంత్రులు ఎవరయినా అలాంటివి ధరించినా రాజులు వారిని శిక్షించేవారు. హర్షుడు ఇదంతా మార్చాడు. అలంకరణ వల్ల అందంగా కనిపించేవారిని సన్మానించేవాడు. బహుమతులు ఇచ్చేవాడు. దాంతో హర్షుడి మెప్పు కోసం ప్రజలంతా అందంగా అలంకరించుకునేవారు. ఆనందంగా ఉండేవారు. ఈ రకంగా నాగరిక వేషభూషణలు కశ్మీరమంతా విస్తరింప చేశాడు హర్షుడు అంటాడు కల్హణుడు. ఇక్కడ ఒక గమనించదగ్గ శ్లోకం రాశాడు కల్హణుడు.
ఆనందంగా సంబరాలతో జీవితం గడపటం ఇష్టమైన హర్షుడు దాక్షిణాత్య పద్ధతులను కశ్మీరంలో అమలు పరిచాడు. కర్ణాటక పద్ధతిలో నాణేలను ముద్రింపజేశాడు. కశ్మీరంలో హర్షుడికి సంబంధించి రెండు రకాల నాణేలు లభ్యమవుతున్నాయి. రాగి నాణేలు విరివిగా దొరుకుతాయి. కానీ వెండి నాణేలు అరుదుగా దొరుకుతున్నాయి. ఆ వెండి నాణేలను కర్ణాటక హోయసలుల పద్ధతిలో ముద్రించాడు హర్షుడు.
(రాగి నాణేలు)
(వెండి నాణేలు)
(హోయసల నాణేలు)
కల్హణుడు రాసిన శ్లోకం వల్ల కశ్మీరు రాజు హర్షుడు దాక్షిణాత్యుల జీవన విధానానికి, అలంకరణ పద్ధతులకు, సంబరాల విధానాలకు ఎంతగా ప్రభావితుడయ్యాడో తెలుస్తుంది. దక్షిణ రాజుల భోగాలు, ఐశ్వర్యం కూడా అతనిపై ప్రభావం చూపించి ఉంటాయి. కశ్మీరుకు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధం లేదని అనేవారు గమనించాల్సిన విషయం ఇది.
ప్రజలు ధరించే ఆభరణాలు, చేసుకునే సంబరాలు, ధరించే వస్త్రాలు, వారు రాసుకునే గంధం, తాటాకు విసనకర్రలు సర్వం కశ్మీరం దక్షిణమా? అన్న భ్రమను కలుగ చేసేవి అంటాడు కల్హణుడు. నుదుటిపై రాసుకున్న విభూతి మూడు గీతల దగ్గర నుంచి కన్నుల అంచులను కలిపే కాటుక పెట్టుకునే విధానం వరకూ ఎటు చూసినా కశ్మీరంలో దక్షిణపు పరిమళాలు వీస్తుండేవి అంటాడు కల్హణుడు.
కలశుడి కాలంలో కశ్మీరం వదిలి వెళ్ళిన పండితులు, ప్రజలు అంతా మళ్ళీ కశ్మీరం చేరసాగారు. అలా వచ్చి చేరిన వారిలో బిల్హణుడు ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి. బిల్హణుడు కలశుడి పాలనాకాలంలో కశ్మీరు వదిలి కర్ణాటక చేరాడు. కళ్యాణ చాళుక్య రాజు విక్రమాదిత్య త్రిభువన మల్ల ఆస్థానంలో అత్యంత గౌరవం పొందాడు. ‘విక్రమాంక దేవ చరిత్రము’తో భారతీయ సాహిత్య ప్రపంచంలో స్థిరమైన స్థానం ఏర్పాడు చేసుకున్నాడు బిల్హణుడు. కశ్మీరంలో హర్షదేవుడు కవులను, పండితులను ఆదరిస్తున్నాడని తెలిసి, అత్యంత గౌరవ మర్యాదలను పొందుతున్న కర్ణాటకను వదిలి కశ్మీరం వచ్చి చేరాడు బిల్హణుడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి’ అనటానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం లేదు. అంటే, కర్ణాటకలో రాజభోగాలు అనుభవిస్తున్నా, బిల్హణుడి మనసు కశ్మీరంలోనే ఉందన్న మాట. హర్షుడు సైతం బిల్హణుడిని గొప్పగా గౌరవించాడు. అంబారీ ఎక్కించాడు. తానూ గొడుగు పట్టాడు బిల్హణుడికి.
హర్షుడు ప్రతీ రాత్రి తన భవనంలో సంగీత సాహిత్యోత్సవాలు జరిపేవాడు. అతని ఆస్థానంలో మహిమ ధర్మదేవతకు, త్యాగలక్ష్మి విహారోద్యానం, ధనపతి ధర్మరాజుకు నిత్య నివాసమై ఉండేది. అతని సభాభవనం పండితులు, కవులు, గాయకులు, వాయిద్యకారులతో అలరారుతూండేది. వెయ్యి దీపాలతో కళకళలాడుతున్న అతని సభా భవనం సంగీత సాహిత్య నృత్య వాయిద్యాది రవాలతో విలసిల్లక నిశ్శబ్దంగా వున్నప్పుడు, అందరూ ఆనందంగా నమిలే తాంబూలాల శబ్దాలతో కరకరలాడేది. తాంబూలం కశ్మీరానికి అలవాటు లేని పద్ధతి. ఈ పద్ధతిని అనంతుడు కశ్మీరంలో ప్రవేశపెట్టాడు. హర్షుడి కాలం నాటికి తాంబూల సేవనం అలవాటుగా మారింది. సాహిత్య చర్చలకు హర్షుడి ఆస్థానంలో కొదువ లేదు. హర్షుడు సైతం తన గానంతో గంధర్వులను తలపింప చేసేవాడు. గంధర్వలోకం భువిపైన వచ్చిన భ్రమను కలిగించేవాడు.
హర్షుడి ఆస్థానంలో ఒక మంత్రి చంపకుడు. చంపకుడు సంవత్సరంలో ఏడు వారాలు నంది క్షేత్రంలో గడిపేవాడు. ఆ ఏడు వారాల్లో, సంవత్సరం పాటు తాను సంపాదించిన ధనాన్ని అందరికీ పంచుతూ పుణ్య కార్యాలు నిర్వహించేవాడు. ఈ చంపకుడి గురించి కల్హణుడు ప్రత్యేకంగా చెప్పాడు. హర్షుడు దుష్టుడిగా ప్రవర్తించినప్పుడు నిరసించి చంపకుడు నందిక్షేత్రానికి వెళ్ళిపోవటాన్ని సమర్థిస్తూ వివరిస్తాడు. ఇందుకు కారణం చంపకుడు కల్హణుడి తండ్రి కావటమే! తండ్రి రాజాస్థానంలో పడ్డ కష్టాలు చూసిన తరువాత కల్హణుడు రాజును ఆశ్రయించకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ దుష్టులయిన రాజుల నీచ ప్రవర్తన కశ్మీరాన్ని పతనంవైపు పరుగులిడేట్టు చేస్తోందని, సమకాలీన నీచస్థితిని చూసిన ప్రజలు గతకాలపు ఔన్నత్యాన్ని ఊహించలేరని గ్రహించిన కల్హణుడు, భవిష్యత్తు తరాల కోసం గతవైభవ చిహ్నంగా రాజతరంగిణిని రచించాడు.
అయితే హర్షుడి పాలన పైకి కనిపిస్తున్నంత ఔన్నత్యంగా లేదు. హర్షుడి మంత్రులు కొందరు నీచ బుద్ధి కలవారు. పిసినారులు, దుష్ట భావ ప్రభావితులు. వారు ధనాన్ని గుప్పెట్లో పెట్టుకోవటం వల్ల కొన్ని మఠాలు నిధులు అందక దెబ్బతిన్నాయి. పరదేశాల నుంచి వచ్చిన కొందరు రాజుపై అమితంగా ప్రభావాన్ని చూపించటంతో హర్షుడి ప్రవర్తన మారింది. స్వభావం మారింది. దుర్బుద్ధి పెరిగింది. ఇలా వచ్చిన వారు ఎక్కడివారో కల్హణుడు చెప్పలేదు. కానీ వారి ప్రభావంతో హర్షుడు వ్యవహరించిన తీరు, అతడు చేపట్టిన చర్యలను పరిశీలిస్తే బయట నుంచి వచ్చి కశ్మీరంపై, కశ్మీరు రాజుపై తీవ్రమైన ప్రభావం చూపించిన వారి గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే వీలు కలుగుతుంది. ఈ సందర్భంగా కల్హణుడు రెండు అద్భుతమైన శ్లోకాలను రచించాడు.
కుష్టువ్యాధి కాళ్ళకు సోకిన నెమలి, పరుగెత్తి పామును పట్టుకుంటుంది. వెయ్యి కాళ్ళున్న సూర్యుడు పాదాలు లేని ఉషారాణి మార్గదర్శకత్వంలో నడుస్తాడు. అత్యంత శక్తిమంతులు కూడా బలహీనుల చేతులో పావులయి, వారు చెప్పినట్టు చేయటం ఈ ప్రపంచంలోని గొప్ప వింతల్లో ఒకటి. సర్వ శాస్త్ర పారంగతుడు, విద్యావంతుడు, కళాకారుడు, ప్రజల మన్ననలందుకుంటున్న వాడు అయిన హర్షుడు, మూర్ఖ మంత్రుల మోహంలో పడి, ప్రలోభానికి గురయి, వారి ప్రభావంలో పడి తనని తాను మరచిపోవటం, తురుష్క హర్షుడిగా హేళనలనుభవించటం విధి చేసే వింత కాకపోతే మరేమిటి? అంటాడు కల్హణుడు.
(ఇంకా ఉంది)
అద్భుతమైన రచన. సామాన్యుల కు తెలియని కాశ్మీర్ చరిత్ర ఇది. మొగల్, బ్రిటిష్ చరిత్ర లను పాఠ్య అంశాలు గా చేర్చిన ప్రభుత్వాలకు ఈ విషయం లో చిత్తశుద్ధి లేదు. ఇంత వివరంగా మనకు అందిస్తున్న శ్రీ మురళి కృష్ణ గారి కి ధన్యవాదాలు.
కొంగొత్త విషయాలు, విశేషాలతో వారంవారం మీ రచన గొప్పగా ముందుకెళుతోంది. అభినందనలు
Sir, The Great Harsha’s history reveals that King Harsha was not only efficient administrator but also cultural motivator. Especially his concept of good looking, wearing of beautiful arnoments etc proved that he is welfare minded. Thank you Murali Krishnagari for betiful historic episode of The great Harsha.
Sir, The Great Harsha was very efficient administrator but also welfare oriented King. Especially people wearing good clothes as well as beautiful ornaments etc proved that The king Harsha was very unique in our indian history. Thank you very much Murali Krishna garu for giving us historic episode of Great Harsha.
హర్షుని పరిపాలనా విశేషాలను కూలంకషంగా వివరించారు.. ధన్యవాదాలండీ! మురళీకృష్ణ గారూ! 🙏🏻🙏🏻
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మహాప్రవాహం!-10
శ్రీపర్వతం-10
అలనాటి అపురూపాలు-72
కైంకర్యము-30
శ్రీవర తృతీయ రాజతరంగిణి-15
ప్రాంతీయ సినిమా – 17: పంజాబీ పదనిసలు
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-30
లోకల్ క్లాసిక్స్ – 23: డిజైనర్ ఆర్ట్ అట్టహాసం
గొంతు విప్పిన గువ్వ – 37
సత్యాన్వేషణ-50
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®