[సుగుణ అల్లాణి గారు రచించిన ‘కొడిగట్టిన దీపాలు..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ఉజ్వలంగా ఒక వెలుగు వెలిగి
ఆ వెలుగును నలుగురికీ పంచి
తమచుట్టూ ఏర్పడిన చీకటి వలయాన్ని
తమలోనే దాచుకుని తమ తేజాన్ని
అందరిలోకీ ప్రసరింప జేసిన దీపాలు
కొడిగడుతున్నాయి..!
గాలివానలకు సోలిపోకుండా
తుఫాను బీభత్సాలను తడబడకుండా
తట్టుకొని నిలబడి —
తన చుట్టూ వెలుగు నింపాలని
తాపత్రయపడిన దీపాలు
కొడిగడుతున్నాయి..!
అరచేతులు అడ్డు పెట్టి
ఆరనివ్వకుండా —
కాపాడమని అడగడంలేదు
చిరుగాలికే రెపరెపలాడే
చిరుదీపాలను గాలికి వదిలివేయొద్దని
వేడుకుంటున్నాయి
కొడిగట్టిన దీపాలు..!
సూర్యుని తేజస్సుతో పోటీపడి
ప్రజ్వలంగా వెలుగమంటున్నాయి
కానీ.. తనను వెలిగించిన ఒత్తిని
మరువొద్దంటున్నాయి..
కొడిగట్టిన దీపాలు..!
ప్రమిదలో చమురు
అయిపోయింది..
ఒత్తికి అంటిన చమురుతో
వెలగలేక వెలగలేక
బలవంతంగా ఆరిపోలేక
దేవదేవుని పిలుపుకోసం
ఎదురుచూస్తున్నాయి..
కొడిగట్టిన దీపాలు..!!

శ్రీమతి అల్లాణి సుగుణ పుట్టి పెరిగింది హైదరాబాద్లో. అత్తవారిల్లు కూడా హైదరాబాదే! పదవ తరగతి పూర్తవుతూనే పదహారేళ్లకు పెళ్లైతే, ఆ తర్వాత MA B.Ed వరకు చేయగలిగారు.
వారి శ్రీవారు మడుపు శ్రీకృష్ణారావు గారు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. వారికి ఒక్కగానొక్క కూతురు. ఆర్కిటెక్ట్. చదువు మీద అత్యంత ఆసక్తి, ప్రీతి కలిగిన రచయిత్రి అత్తగారు శ్రీమతి లక్ష్మీబాయి గారు సుగుణగారిని కాలేజీకి పంపి చదివించారు. ఆ ప్రోత్సాహమే ఈనాడు తాను రచయిత్రి/కవయిత్రిగా పరిచయం చేసుకొనే అవకాశం కలిగిందని చెప్పడానికి గర్విస్తారు.
ముప్పై సంవత్సరాలు వివిధ పాఠశాలలలో తెలుగు అధ్యాపకురాలిగా చేసి ప్రస్తుతం మనుమలతో ఆడుకుంటున్న అదృష్టవంతురాలినని అంటారు సుగుణ. ఈ విశ్రాంత జీవనంలో అప్పుడప్పుడు అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ iPad లో కథలు చదువుతూ చిన్న చిన్న కవితలు కథలూ రాస్తూ TV లో సినిమాలు చూస్తూ స్నేహితులను కలుస్తూ కావలిసినంత సంతోషాన్ని పంచుతూ ఆనందపడుతూ కాలం గడుపుతూ ఉంటారు.
2 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగా రాసారు
సుగుణ గారూ
అభినందనలు మీకు.
రఘునాథ్ రావు
చాలా బాగుంది అక్క, ఎవరైనా ఆ దీపాలని కోడిగట్టకుండా నిలబెడితే, ఈ ప్రపంచానికి ఇంకా వెలుగు ఇస్తాయి. కానీ ఎవరికీ పట్టింపు లేదు!



