[డా॥ వోలేటి పార్వతీశం గారు రచించిన ‘కొన్ని ఊసులు.. ఇంకొన్ని ఊహలు’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ విహారి.]
సాహిత్యంలో ఉన్నత వ్యక్త్తిత్వం, వ్యక్తిత్వంలో ఉత్తమ సాహిత్యం, రెండింటా సంస్కారం, చైతన్యం – అన్నీ కలిసి వెరశి వోలేటి పార్వతీశం గారు. ఆకాశవాణి, దూరదర్శన్, సభలూ, సమావేశాల ద్వారా తెలుగు వారెందరికో సుపరిచితులు. ఆయన మాట అనుద్వేగకరం. సమయజ్ఞతనీ, ఉచితజ్ఞతనీ, విజ్ఞతనీ కలబోసుకున్న మాధుర్యం ఆయన భాషణం. అందుకనే, ఆ సంభాషణ ఎప్పుడూ సహృదయాభిసరణం చేస్తుంది.
‘చిరంజీవి పార్వతీశం కళాహృదయంతో జన్మించినవాడు. ఎన్నో పదచిత్రాలు వాడి, గొప్ప భావాలు ఉదయింపచేస్తాడు కనుక నా కోరిక ఒకటుంది. మంచి కవిత్వాన్ని రాయాలని ఆశిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నాను. నేను పెదనాన్నని. పార్వతీశం ప్రతిభ అవగతం చేసుకోగలను. అతడు సాధించగల ఉత్తమత్వాలను అవగతం చేసుకోగలను. నా హృదయంలో ఉన్న వాంఛితార్థాలను అర్థం చేసుకుని కృషి చేయవలసిందని ఆశీర్వదిస్తున్నాను. సాహితీ చైతన్యం పార్వతీశం’ అన్నారు డా॥ సోమసుందర్.
ఆయన వాంఛితాన్ని నెరవేరుస్తూ వచ్చింది – ఇదిగో – వోలేటి పార్వతీశం కవితా సంపుటి ‘కొన్ని ఊసులు, ఇంకొన్ని ఊహలు’.
సంపుటిలో మొత్తం 32 కవితలు.
‘కొత్తదో పాతదో/ పౌరసత్వం కాగితం ఖరారు చేస్తుంది/వారసత్వాన్ని కణజాలం/ఒడిసి పడుతుంది/గోదావరి నీళ్లైనా/సెయింట్ లారెన్స్ నదీ జలమైనా/జాతి రీతి ఇంకేదైనా/అంతా సలిల ప్రవాహ సంస్కృతి/విపులాచ పృధ్వి అన్నది/ఇప్పటి నా భావాకృతి’.. అంటున్న మనోధర్మ ప్రకటన – ‘విపులాచ పృధ్వి’ మొదటి కవిత. మాంట్రియల్ సందర్శనలో భావభావనల అక్షరీకరణం.
సంపుటిలో మొత్తం 11 కవితలు- విదేశీయానం విదేశ సందర్శనం, సందర్భ వివరణం గురించి సాగాయి.
‘దేశం ఏదైనా కావొచ్చు/దేహం మాత్రం ఒక్కటే/మనిషికైనా, మానుకైనా/అదొక జీవన స్రవంతుల ముచ్చట/అక్కడ అడుగుపెట్టానో లేదో/ఆ చెట్టు నన్ను ఇట్టే గుర్తు పట్టింది’ అని ‘హరితహాసం’లో న్యూజెర్సీ పర్యావరణాన్ని కవితాత్మకంగా దృశ్యీకరించారు. చెస్టర్ ఫీల్డ్‌లో చంద్రయాన ప్రత్యక్ష వీక్షణం గురించీ, కెనడా, అమెరికాల్లో పిల్లల గృహప్రవేశాల గురించీ, అమెరికా పెళ్ళి ఆడంబర విలక్షణత గురించీ, సాల్ట్‌లేక్ సందర్శన విశేషాల గురించీ – భావావిష్కరణం చేశారు. శాండియాగాలో సాగర ప్రపంచాన్ని వర్ణిస్తూ ‘మళ్లీ మళ్లీ నేను అంటున్నది/నీటి చెలమ అయినా, నీటి చరమే అయినా/సంపన్నుల వీటికి చేరిందంటే/పెట్టి పుట్టినట్టే’ అని ఆలోచనాత్మకమైన ముక్తాయింపు నిచ్చారు. అలాగే లాస్‌వెగాస్ బెలాజియోలో ‘o’ ప్రదర్శననీ, అటావాలో దీపావళి సంరంభంనీ దృశ్యమానం చేశారు.
కనుమరుగైన ఉత్తరం గురించీ, కొత్తగా వచ్చిన అద్దాలమహల్ క్షౌరశాల గురించీ సహజమైన ‘అయ్యో’ని వ్యక్తం చేశారు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ, ఆనంద విషాదాల్లో ‘పూవు’ పాత్ర గురించీ, రకరకాల ‘చెప్పు’లు చెప్పే విభిన్న వ్యక్తుల గురించీ – స్వరూప స్వభావ చిత్రణ ఆయా కవితల్లో మెరుపులీనింది.
పార్వతీశం గారి కవితాభివ్యక్తిలో ఒక పార్శ్వం- నైరూప్యభావనని శబ్దశక్తితో ఆవిష్కరించటం. ‘ఎంపిక’ అని ఒక ఖండిక – ‘ఆగు- చూడు-నడు’ అన్నట్టు అద్భుతమైన ఆలోచనారేఖల్ని గీస్తూ సాగింది. ‘ఎంపిక మహాకష్టం సుమీ’ అని చరణాలు చరణాలుగా నడిచింది. చూడండి.
‘ఎంపిక/అన్నంత సులువుకాదు/ద్యూతంలో స్థితప్రజ్ఞుని ఎంపిక/పదమూడేళ్ళ వనవాసాన్ని అంటకట్టింది/ఆయుధం ధరించనని అంటూనే వున్నా/అతడే కావాలనే కోరిక/గాండీవి ఎంపిక/కురు వంశ సింహాసనాన్ని కట్టబెట్టింది/ఎంపిక/అరచేతి అమలకం కాదు/ఎల్లవేళలా అందుబాటులో వుండదు/అమ్మ అయినా, జన్మ అయినా/ఎంపికలకు అందేవా/ఆదర్శాన్ని ఎంపిక చేస్తే/అనుసరణ యోగం పడుతుంది/పదుగురి మేలును ఎంపిక చేస్తే/ జీవించే వ్యాకరణం పట్టుపడుతుంది.’
ఇలాంటి కవితే మరొకటి ‘ఇష్టం’ అనేది వున్నది.
‘వయసుకొచ్చిన కాలం/ఇష్టాన్ని భాగాలుగా పంచుతుంది/మజ్జిగలో నీళ్లోసినట్టు సాంద్రత లోపిస్తుంది/వెలుగు, వెలుతురు లేని తనానికి జారినట్టు/ఇష్టం కూడా రజనీ గంధమౌతున్నది/ఈ చీకటిఘడియలు గడిచే లోపు/నేను మాత్రం మారిపోని అమ్మ ఇష్టంలా/చెదరిపోని నాన్న ఇష్టంలా/కాలాధీనం కానివ్వను/రేపటి వెలుగు దుస్తుల్ని/ఈ నిశీధి జాడల్ని చాటు చేసుకుని/ తొందరగా తోడిగేసుకుంటాను’
‘రోజు’ కవిత కూడా వాస్తవాల వివరాలనిస్తూ, హెచ్చరికల చరుపుల్ని పరుస్తుంది.
‘మనిషి జీవిక కాలాధీనం/వివరమెఱుగక భ్రమలో పడి/ఊహాసౌధంలో బ్రతుకు వెళ్లదీస్తాడు/అతడి వర్తమానం/భవిష్యత్తు కోసమని అంగలారుస్తుంది/అందుకే గతం గంగ పాలౌతుంది/గడచిన రోజు/మిగిలివున్న జీవితానికి పద్దులు సరిచూస్తుంది/ఋజుమార్గంలో నడచిచూడు/నీ పయనం/ ఆ రోజుకే బతుకునిస్తుంది’.. అంటూ గతం, భవిష్యత్తు వర్తమానంలో లయించే కాలస్పృహని వెలారుస్తుంది ఈ కవిత.
మనిషి ఎప్పుడూ జ్ఞాపకాలకు బందీయే. ‘మనసుగతి ఇంతే’ అన్నట్టు అవి మనసునీ, తనువునీ ఊపుతాయి, బాధావ్యథల్ని రేపుతాయి. సున్నితమనస్కుడైన కవి వాటి అక్షరీకరణం చేయక తప్పించుకోలడు. తాత గారి నుండి తన నాన్నకు, ఆ నాన్న నుండి ఈయనకు వారసత్వంగా వచ్చిన ‘చెక్క బీరువా’ స్థిరత్వ, అస్తిత్వ విశేషాల గురించి నిఖార్సయిన కవిత్వం రాశారు పార్వతీశం గారు.
‘ఆమె నా కంటికి/పండు గర్భిణిలా వుంది/పొట్టనిండా పట్టెడు పుస్తకాలతో/దక్షిణం గదిమూలన, ఆ చెక్క బీరువా/చిన్నప్పణ్ణుంచి చూస్తూనే వున్నా/అంగుళమైన కదిలింది లేదు..’ అని మొదలుపెట్టి, ‘ఊడిపోయిన బీరువా గొళ్ళెం/పట్టుకుని లాగుదును కదా!/భళ్లున తెరుచుకున్న తలుపుల్లోంచి/దొంతర్లన్నీ దొర్లిపడ్డాయి/బంగారు కణికల్లా కాదు/నాన్న/నా కోసం దాచి ఉంచిన/భవిష్యత్తు శకలాల్లా’.. అంటూ ముగిస్తారు. ‘ఉన్నంతకాలం ఎంతెంత మొహం’ అంటే అనుబంధాన్ని వీడని బరువు నెత్తికెత్తినంత వరకూ! అదంతే! అని, అవి కలిగించే స్పృహ!
ఇలాంటి ‘జ్ఞప్తి’ పరంపరలో మేనమామ సప్తతి, నుమాయిష్, ఆటో వంటివి కావ్య పరీమళాన్ని వీస్తున్నాయి.
అయినవారి మరణం మనిషి జీవితంలో పెనువిషాదం. అందునా వారు మరీ ఆత్మీయులైతే అది మరింత బాధాకరం. పార్వతీశంగారు తన శిష్యుని మరణం గురించీ, శాంతిస్వరూప్ గురించీ, తన మామగారి గురించీ, రామోజీరావుగారి గురించీ ఎలిజీలు రాశారు.
ఎంతటి భౌతికవాది అయినా, సోకాల్డ్ ప్రాపంచిక భావనా నిబద్ధత కలిగినా, కొందరు కవులకు ‘కోహం?’ ప్రశ్న వేధిస్తూనే వుంటుంది. తాత్త్విక వివేచన మేధను వెంటాడుతూనే వుంటుంది. అందునా పార్వతీశంగారి వంటి హృదయవాదికి ఆనువంశికంగా వచ్చిన విలువల ఆధారంగా జీవనం సాగిస్తున్న సంస్కారవంతునికి – ఈ తాత్త్విక స్పృహ ఇంకా ఎక్కువగా వుండటం సహజం.
ఈ సంపుటిలో అవసరం – అవకాశం ద్వంద్వాల విశ్లేషణ, చర్చ ఉన్నది. అలాగే, ‘వీలౌతుందా?’లో ఈ ముగింపు పంక్తులు చూడండి. వెనక్కు వెళ్ళి కవితనంతా చదివేయటం అనివార్యమవుతుంది.
‘అవ్యక్తంగా ఉండిపోయిన భావన/ఇప్పుడు చెప్పేదెలా/వాళ్ళు లేరు. కొన్నాళ్ళకి నేనూ అంతే/ఉన్నప్పుడు చెప్పని అభివ్యక్తికి/ఫలశ్రుతి ఎక్కడ/మీరంటే నాకు ఇష్టం అని చెప్పడానికి/నాకు మరో జన్మ కావాలి కాబోలు/వాళ్ళూ పుట్టాలి కదా!’ ఎంత అంతర్ముఖీన వేదన అయినా గాలికి కొట్టుకుపోయిన పేలపిండి కదా – అని హితోక్తి.
వర్తమాన కవిత్వ ప్రచురణలో వస్తు విస్తృతి చాలా దిక్కుల్ని పర్వుతున్నది. అలాగే, అంతర్లోకయానాన్నీ లోతుగానే చేస్తున్నది. అభివ్యక్తి రీతిలో కొత్త సరళి గోచరిస్తున్నది. అలంకారికత వంటి కవితా సామగ్రి ‘సూక్ష్మత’ నుండి ‘స్థూలత’కు నడవటం గమనిస్తున్నాము. అంటే అలంకార ప్రయోగం శబ్దాలుగా కాక వివరణాత్మక వాక్య సముచ్చయంగా దర్శనమిస్తున్నాయి. ఈ సంపుటిలో ‘రంగులు’ వంటి కవితల్లో ఈ గుణ విశేషం పారదర్శకమవుతోంది. అలాగే ‘వీలౌతుందా’ కవితలోని ‘భావభరిత గ్రంథానికి శీర్షిక లాంటిది’ వంటి వాక్యాలు కనిపిస్తాయి. ఈనాటి కవిత్వానికి ఖండిక ఎత్తుగడ మరింత ప్రాణప్రదంగా మారింది. అది చదువరిని సరాసరి ఉత్కంఠలోకి లాగే ఒక చాతుర్యం. ‘వాళ్ళెవరో/అస్థిపంజరాలు కొనుక్కుంటున్నారు/ హాలోవీన్ వేడుక, కోసమేమో’ (రంగుల కల) అనగానే ఆ దృశ్యస్పృహ నిలవేస్తుంది! ఇలా సంపుటి నిండా అనేక అచ్చమైన అనిర్వచనీయ ‘కవిత్వం’ నిబిడంగా కుదురుకుంది. ‘కొన్ని ఊసులు- ఇంకొన్ని ఊహలు’ నిక్కంగా ఒక రసవత్కావ్యంగా చదువరుల్ని అలరిస్తుంది. కొని చదవండి. పార్వతీశంగారికి అభినందనలు!
***


రచన: డా॥ వోలేటి పార్వతీశం
పేజీలు: 115
వెల: ₹ 150
ప్రతులకు:
(A) శ్రీమతి వోలేటి లక్ష్మీప్రసూన
ఫ్లాట్ నెం: 502, బృందావన్ రెసిడెన్సీ,
స్ట్రీట్ నెం: 16, గగన్ మహల్,
దోమలగూడ, హైదరాబాద్- 500029
ఫోన్: 9908575206, 9440031213
(B) కిన్నెర పబ్లికేషన్స్
2-2-647/153,
ఫ్లాట్ నెం: 101 & 102
మద్దాళి గోల్డెన్ నెస్ట్,
సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ,
బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ -13
ఫోన్: 9866057777
(C) ప్రధాన పుస్తక కేంద్రాలు.

విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.