అప్పుడప్పుడు
ఆవేశం హద్దులు దాటిపోయి
ఆలోచనకు కళ్ళు మూసుకపోయి
మాటలకు ముళ్ళు మొలుస్తుంటాయి
కళ్ళాలు వదులైపోయి
చేతలు అదుపు తప్పిపోతుంటాయి
తనదైనా పరాయిదైనా
ఎదుటిపక్షం మాత్రం ఆ క్షణంలో
ఎడాపెడా ఇబ్బంది పడిపోతుంది
మనసులకే కాదు మనుషులకూ
కష్టమో నష్టమో
కనులముందు అకస్మాత్తుగానో
మెల్లమెల్లగా ఆ తరువాతానో వాటిల్లుతాయి
తప్పు, తలుపు తెరుచుకుని
సంబంధాల వాకిట్లోకొచ్చి
తలదించుకుని మౌనంగా నిలబడుతుంది
అయినంత మాత్రాన సరిపోతుందా…?
ఎంత ప్రయత్నించినా, ప్రాధేయపడినా
కాలం వెనక్కి తిరిగి నడవదుగా
జరిగిన సంఘటన మాయంకాదుగా
కలిగిన ఇబ్బంది తొలగి, దూరం అయిపోదుగా
అందుకే
క్షమాపణల గంధపుగిన్నె
ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి
మనం చేసిన గాయాలపై
అలాఅలా చల్లి చల్లబరుస్తూనే ఉండాలి…
మనసులను… మాటల మాధ్యమంతోనూ
మనుషులను… వినయపు చేతల చర్యలతోనూ

చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
2 Comments
Shyamkumar chagal
పదాల అల్లిక,
మాటల మాయాజాలం
కవి గారి నేర్పరితనం,
ఆలోచనల మాల,
అన్నీ కలిసి
శ్రీధర్ కవిత్వం
నిత్యం నూతనం.
Sunianu6688@gmail.com
చాలా చక్కగా చెప్పారు. కొన్నిసార్లు ఎదుటివారు ప్రవర్తన వల్ల కూడా అదుపుతప్పి మాట్లాడతాం. కానీ మన మనశ్శాంతి కోసమైనా క్షమాపణల గంధము గిన్నె వాడాల్సివస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.రచయిత గారికి అభినందనలు




