కర్ణాటక రాష్ట్రంలో రెండున్నర జిల్లాల సినిమా పరిశ్రమ ‘తుళువుడ్’ అని గతంలో ‘ప్రాంతీయ సినిమా’ శీర్షికలో చెప్పుకున్నాం. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలూ, అటు సరిహద్దు కేరళ రాష్ట్రం కాసర గోడ్ జిల్లాలో కొంత భాగమూ కలిపి 20 లక్షల మంది జనాభా తుళు భాష మాట్లాడతారు. ఇంత చిన్న మార్కెట్లో మసాలా కామెడీ సినిమాలతో ప్రేక్షకుల వినోదాల ఆకలి తీరుస్తూనే, అప్పుడప్పుడు ఓ వాస్తవిక సినిమా తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని కూడా తుళు ఉప ప్రాంతీయానికి సమకూర్చి పెడుతున్నారు. అలాటి దర్శకుల్లో పుణె ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ పట్టభద్రుడు అభయ సింహా ఒకడు. ఇతను 2008లో తీసిన ‘గుబ్బచ్చిగళు’ అనే మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు సాధించాడు. ఇది బాలల సినిమా. 2012లో మమ్ముట్టి – పూనం బజ్వాలతో కన్నడ – మలయాళ భాషల్లో వన్య ప్రాణుల మీద ‘షికారీ’ తీశాడు. 2013లో కన్నడలో ‘సక్కరే’ అనే రోమాంటిక్ కామెడీ తీశాక, 2017లో తుళు భాషలో ‘పడ్డాయి’ తీశాడు. దీనికి మరో జాతీయ అవార్డు పొందాడు.
‘పడ్డాయి’ (పడమర) తను తీసిన నాల్గు సినిమాల్లో విశిష్టమైనది. తను తుళు ప్రాంతీయుడే కాబట్టి, అక్కడి సముద్ర జీవితంతో ప్రత్యక్ష అనుభవం, అనుబంధం వున్నాయి. దీంతో ఓ కళాఖండమే అతడి మస్తిష్కంలో రూపుదిద్దుకుంది. కళాకారుడనే వాడు ఏదో ఒకనాడు తన జీవితపు తొలినాళ్ళలోకి తొంగి చూడక తప్పదు. అక్కడ తొలి జ్ఞాపకాల బొత్తిని పొదివి పట్టుకుని కన్పించకా మానడు. ఆ బొత్తి విప్పి కథలల్లుకోకా మానడు. దాంతో వుండే మమకారమలాంటిది. ఆ బొత్తి సముద్రమైతే జీవితకాల దాహమంతా తీర్చేస్తుంది.
ప్రపంచీకరణ వచ్చేసి ప్రపంచాన్ని చదును చేసేసిందని ప్రసిద్ధ పాత్రికేయుడు థామస్ ఫ్రీడ్మన్ ఏనాడో ‘ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్’ అన్న పుస్తకమే రాశాడు. ఆ చదును చేయడంలో విలువలు, ఆత్మలు, ప్రాణాలు సమస్తం నలిగిపోయాయి. అభయ సింహా దీన్నే చెప్పాలనుకున్నట్టు కనపడతాడు. అయితే వేరే పంథాలో, వేరే నేపథ్యంలో. కార్పొరేట్లు వచ్చి కబళించడం ఫ్రీడ్మన్ చెప్పే పద్ధతి. కార్పొరేట్స్ మీదే పడాలనుకునీ కర్సయిపోవడం అభయ సింహా చెప్పిన పద్ధతి. రెండిటి ఫలితాలొక్కటే. ఇదేమిటో చూద్దాం…
ఆ కోస్తా తీరంలో మత్స్యకారులు జీవన పోరాటం చేస్తూంటారు. వాళ్ళది మొగవీరల కులం. ఒకవైపు సాంప్రదాయ పడవల్లో తాము చేపల వేట కెళ్తే, మరో వైపు కంపెనీల వాళ్ళు ట్రాలర్లతో మత్స్య సంపదని కొల్లగొడుతూంటారు. అక్కడి స్థానిక చేపల వ్యాపారి దినేషన్న(గోపీనాథ్ భట్) దగ్గర పని చేస్తూంటాడు మాధవ (మోహన్ షేనీ). మాధవని కొడుకులా చూసుకుంటాడు దినేషన్న. ఈ వృత్తిలోనే వుంటున్న సుగంధి (బిందూ రక్షిదీ) కిచ్చి పెళ్లి కూడా చేస్తాడు. కంపెనీల వాళ్ళతో పోటీ పడేందుకు అధునాతన పడవలు ప్రవేశ పెట్టేందుకు ఒప్పుకోడు దినేషన్న. ఇదిలా వుండగా దినేషన్న కొడుకు మంజేషా (శ్రీనిధీ ఆచార్) ఈ వ్యాపారంలోకి రావడానికి ఇష్టపడడు. దీని మీద మాటామాటా పెరిగి, తన వారసుడిగా మాధవాని ప్రకటించేస్తానని బెదిరిస్తాడు దినేషన్న. ఈ బెదిరింపు, వాళ్ళ కులదైవం విన్పించిన దైవవాణీ రెండూ కలిసి మాధవ, సుగంధిల మనస్సుల్లో విషబీజాలు నాటుతాయి.
దినేషన్నని హత్య చేసి వ్యాపారాన్ని హస్తగతం చేసుకునేందుకు పథకమేస్తారు. నిజానికి మొదట ఈ విషబీజం సుగంధి మనస్సులోనే నాటుకుంటుంది. ఆమె భర్తకి నూరిపోసి సమాయత్తం చేస్తుంది. విదేశీ సెంటుల మీద మోజున్న సుగంధి రాత్రి పూట పడక మీద మాధవకి మత్తైన సెంటులు పూసి కుట్ర బుద్ధిని రెచ్చ గొడుతుంది. అయితే మాధవ ఆమెలా డబ్బు కోసం గాక, దైవవాణికి ప్రభావితుడై పూనుకుంటాడు. ఇక ఇద్దరూ కలిసి దినేషన్నని హత్య చేసేశాక మొదలవుతుంది వాళ్ళ వినాశ క్రమమే …
సూటిగా షేక్స్పియర్ ‘మాక్బెత్’ నాటకం ఈ కథకాధారం. ఈ కథలో మాక్బెత్ మాధవ అయితే లేడీ మాక్బెత్ సుగంధి. ‘మాక్బెత్’ ఆధారంగానే విశాల్ భరద్వాజ్ తీసిన మాఫియా కథ ‘మక్బూల్’ (2003)లో ఇర్ఫాన్ ఖాన్, టబూల పాత్రల్లాగా ఇది కూడా. ‘మాక్బెత్’ నాటకం హైస్కూలు అప్పట్నుంచీ దర్శకుడు అభయ సింహాని సమ్మోహనపరుస్తూ వచ్చింది. తరతరాలుగా ‘మాక్బెత్’ నాటకం దర్శకుల్ని ఆకర్షిస్తున్న విధం గమనించాడు. తుళునాడు కోస్తాలో మత్స్యకారుల కథతో తను తీయాలనుకున్న ఈ వాస్తవిక కథా చిత్రాన్ని ‘మాక్బెత్’ కోణంలో చూసినప్పుడు సరైన పట్టుపగ్గాలు అతడికి లభించాయి. సామాజికంగా ఆర్థికంగా ఆధునిక యుగంలో ప్రవేశించిన దేశాకాల పరిస్థితుల్ని ‘మాక్బెత్’ ఆధారంగా చూపించాలనుకున్నాడు. పడ్డాయి అంటే పడమర. ఇక్కడి జాలర్లు వేటకి సముద్రంలో పడమర వైపు వెళ్తారు. తాము తూర్పుకి చెందిన వాళ్ళు. తూర్పుకి చెందిన తాము ట్రాలర్ల సాక్షిగా పడమర – అంటే పాశ్చాత్య విలువలకి మారాలన్న తహతహతో పాల్పడే చర్యల పరిణామాల్ని చిత్రించడమే ప్రధానోద్దేశమని చెప్పుకున్నాడు.
వర్షాకాలంలో జాలర్లు సముద్రంలోకి వెళ్లరు. పడవలు తట్టుకోవు. పైగా అది చేపలు గుడ్లు పెట్టే కాలం. ఈ కాలంలో వేట నిషేధించిది ప్రభుత్వం. నిషేధాన్ని ఉల్లంఘించి కంపెనీల వాళ్ళు ట్రాలర్లతో ఫిషింగ్ చేస్తూ గుడ్లని నాశనం చేస్తున్నారు. ఇంకా పర్యావరణానికి హాని కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని కూడా కథలో చిత్రించాడు. పేదరికంలో దురాశకి లోనైతే దురదృష్టం తెచ్చి పెడుతుందని చెప్పాడు.
మాక్బెత్ జంట మాధవ, సుగంధిలు రెండు దృక్పథాలు. సుగంధి ధనాశతో నేరుగా దుశ్చర్యకి పూనుకుంటే, మాధవ దైవవాణి కోసం ‘దైవ కార్యం’గా తీసుకుని రంగంలోకి దిగుతాడు. మత్స్యకారిణి సుగంధిలో ఈ కర్కశ స్వభావానికి నేపథ్యం కూడా వుంటుంది. గడుపుతున్న అధమ స్థాయి జీవితంలోంచి ఎంత బలంగా విముక్తి పొందాలనుకుంటోందో ఆమెకున్న ఫారిన్ సెంట్ల మోజే తెలియజేస్తుంది. చేపల కంపుకి అతీతంగా ఏకంగా పతాక స్థాయిలో ఫారిన్ పెర్ఫ్యూమ్స్నే కోరుకునే విముక్తి అది!
ఫారిన్ పెర్ఫ్యూమ్స్నే భర్తకి పూస్తూ మానసికంగా అతణ్ణి ఆధునికంగా సంసిద్ధం చేయాలన్న కోరిక. అందులోంచి హత్యకి మార్గం వేయాలన్న పథకం. ఇంకోటేమిటంటే, తన ఆడతనాన్ని కూడా నిరసిస్తుంది. ఆడతనాన్ని విసర్జించి జెండర్లెస్గా మారాలన్న తపన. ఇదంతా ఎదుటి ప్రపంచంలో రారమ్మని కవ్విస్తున్న సిరిసంపదల ధగధగల్నిచూసే. వాటినందుకోవాలన్న కసితోనే. ‘డబ్బున్న వాళ్ళు హత్యలు చేస్తే చెల్లినప్పుడు, పేదవాళ్లం చేస్తే ఎందుకు చెల్లదు?’ అని ప్రశ్నించే తెగువ.
మాధవ వేరు. చేసింది చేశాక – ‘నేనేం చేయలేదు, దైవవాణి చేయించింది’ అని సెంటిమెంటు రగల్చడం. మొగవీరల కులదైవం చేయిస్తే మొగవీరలు ఎలా కాదంటారు? దీన్నిదర్శకుడు ఇలా పొడిగిస్తాడు: జరగాల్సింది ముందే రాసిపెట్టి వుంటుంది. సమయం వచ్చినప్పుడు దైవవాణి వినిపిస్తుంది. ఇదొక పార్శ్వం. తర్వాత అదే దైవం చేసిందానికి అనుభవించమంటుంది. వీళ్ళిద్దరి విషయంలో ఆ శిక్ష ప్రతీ క్షణం దహించివేసే అపరాధభావం. దుర్మార్గం చేశామన్న అపరాధ భావం దురదృష్టకర పరిణామాల్ని వాళ్ళ చేతలతోనే సృష్టిస్తుంది. అంతమైపోతారు. (Fair is foul, and foul is fair – Macbeth).
దినేషన్న లాభాల గురించి ఆలోచించని అల్పసంతోషి. కంపెనీలు ట్రాలర్లు వాడుతున్నా నాటు పడవలే ప్రాణమనుకుంటాడు. ప్రపంచీకరణ కులవృత్తుల్ని తుడిచి పెట్టేస్తోందన్న చింత అతడికి వుండదు. డబ్బు, సుఖం రెండూ అశాశ్వతాలనుకుంటాడు. శాశ్వతం వారసత్వం, నిరాడంబరతలే. ఈ అల్పసంతోషాన్ని కూడా మిగల్చలేదు మాధవ సుగంధీలు.
ఈ ప్రధాన పాత్రల్లో మోహన్ షేనీ, బిందూ రక్షిదీ, గోపీనాథ్ భట్ లవి మరపురాని నటనలు కురిపించారు. ఎన్ని టేకులు తిన్నారో గానీ, వాళ్ళ నుంచి తానూహించిన పాత్రల్ని వడకట్టి పిండుకున్నట్టున్నాడు దర్శకుడు. అయితే పూర్తిగా మాక్బెత్ మనఃస్థితిని వూహించలేదేమో, లేదా తానూహించిన కథకి అడ్డంకి అనుకున్నాడేమో. మాక్బెత్ది తనకెదురు లేదన్న ఆధిక్య భావం. విధిని ఎదిరించాలన్న మొండితనం. ఇది దర్శకుడి పాత్రలకి లోపించింది. దీంతో సంఘర్షణ కొరవడి మాధవ సుగంధీల పాత్రలు కథని బల్లపరుపుగా చేశాయి. కథలన్నీ సంఘర్షణాత్మకాలేనన్న సాధారణ సూత్రాన్ని మర్చినట్టున్నాడు. దీన్ని గాథగా భావించి తీసి వుంటే అది వేరు, గాథల్లో సంఘర్షణ వుండదు.
కథ చెప్పడానికి యక్షగానాన్ని ఉపయోగించాడు. పురాతనం అధునాతనం విలువల్ని యక్షగానంతో తేటతెల్లం చేశాడు. ‘భూత కోలా’ జానపద గీత ప్రయోగం కూడా చేశాడు. దినేషన్న హత్యతో కథ ప్రారంభించడానికి ముందు బ్యాక్‌డ్రాప్‌ని స్థాపించడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఈ సమయంలో అక్కడి గ్రామ పరిసరాలు, సముద్రం, సముద్రం మీద మత్స్య వ్యాపార స్థితీ, మత్స్యకారుల జీవితాలూ, పాత్రల పరిచయాలూ మొదలైన వాటితో కూడిన కథా ప్రక్రియ సాధనాలు సమకూర్చుకుంటూ వుండిపోయాడు. ఈ మొత్తం దృశ్య వైభవానికి విష్ణు ప్రసాద్ కెమెరా వర్క్ గాంభీర్యాన్ని సంతరించిపెట్టింది. మణికాంత్ కాద్రి సంగీతం నేటివిటీకి పట్టం గట్టింది. సంభాషణలు డబ్బింగ్ చేయకుండా, కెమెరా ముందు నటీనటులు పలికే మాటల్ని నేరుగా సింక్ సౌండ్ ద్వారా ధ్వని ముద్రణ చేశారు. సింక్ సౌండ్ ఇంజనీర్లు జెమీ డిసిల్వా, శిశిర.
తుళునాడు దేశంలోనే అతి చిన్న సినిమా పరిశ్రమ గల రెండున్నర జిల్లాల ఉప ప్రాంతీయ భూభాగం. ఇక్కడ్నించి నిర్మించే ప్రతి వాస్తవిక సినిమా జాతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పండగ చేసుకుంటోంది. ‘బంగర్ పట్లర్’, ‘గుబ్బచ్చిగళు’, ‘శుద్ధ’, ‘దండ్’, తాజాగా ‘పడ్డాయి’… ‘పడ్డాయి’కి ఉత్తమ తుళు భాషా చిత్రం జాతీయ అవార్డుతో బాటు, మూడో ఉత్తమ చిత్రంగా కర్ణాటక రాష్ట్ర అవార్డు లభించింది. నిర్మాత నిత్యానంద పాయ్. ఇలా ప్రపంచీకరణ నేపథ్యంలో ‘మాక్బెత్’కి ఆధునిక రూపమిచ్చిన అభయ సింహా తర్వాతేం అందిస్తాడా అని ప్రపంచం ఎదురు చూస్తోంది…
సికందర్ ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్. సినీరంగానికి చెందిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ఎన్నో పత్రికలలో భారతీయ, అంతర్జాతీయ సినిమాలను విశ్లేషిస్తుంటారు. వీరు నిర్వహించే “సినిమా స్క్రిప్ట్ అండ్ రివ్యూ” అనే బ్లాగు ప్రసిద్ధి చెందినది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఊతం
అమ్మ కడుపు చల్లగా-4
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-3
కలియుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా
ఒక్క పుస్తకం-7
దంతవైద్య లహరి-4
సిలబస్‌లో లేని చదువు కథల సిలబస్
జజ్మెంటల్ హై క్యా? : ఒక సినెమేటిక్ అనుభూతి
టెక్నాలజీ ప్లస్, మైనస్ 1
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®