[శ్రీ ఐలేని గిరి రచించిన ‘మాటలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]


మాటల్ని ఎవరు కనిపెట్టారో తెలియదు
ఇప్పడవే జీవితాల్ని శాశిస్తున్నాయి
ఎంత కొత్తగా చెప్తే – ఎంత గొప్పగా చెప్తే
ఎంత గుప్తంగా చెప్తే – ఎంత క్లుప్తంగా చెప్తే
ఎంత చెప్తే – ఎలా చెప్తే –
ఏమైనా మాటలు మాయ చేస్తాయి!
మాటలు ప్రాణం తీస్తాయి – మాటలు ప్రాణం పోస్తాయి
చెమట చిందించకుండా బతికిస్తాయి
చెమటనీ రక్తాన్నీ పిండేస్తాయి
ఓ మాట చిగురంత సున్నితంగా-
ఓ మాట పూలు జల్లినట్టు మెత్తగా-
ఓ మాట పుప్పొడి రాలినట్టు సుతారంగా-
ఓ మాట తేనె జారినట్టు తీయగా-
మాట భుజాన్ని తట్టే అభయహస్తం
మాట గమ్యానికి చేర్చే బాట
మాట జీవితానికి సరిపడే ధైర్యం
ఓ మనిషి గణనం మాట
మనిషిని తూచే త్రాసు మాట
మాటల్ని ఎవరు కనిపెట్టారో తెలియదు!
మాట ఓ కనికట్టు – మాట ఓ లోగుట్టు
మాట మాటలో వైవిధ్యం
అస్త్రం కన్నా
మాటను సంధించే వాళ్ళు విజేతలు
మాటను పరికరంగా మార్చుకున్న వారికి
మాటను పనిముట్టుగా చేసుకున్నవారికి
అందరూ చేయెత్తి దండం పెట్టాల్సిందే
మాట ఒక యుద్ధ తంత్రం –
మాట ఓ సమ్మోహనాస్త్రం
మాట ఓ మార్పుకు ఆయుధం!!
1 Comments
Ireni
మాట గొప్పతనం,మాట మంచితనం,మాట మనస్తత్వం, చాలా బాగుంది కవిత….