వాడి మాట వేదవాక్కులా భావించాలంటాడు
వాడి అడుగుల్లో అడుగు వేసి నడవాలంటాడు
వాడికొక్కడికే హృదయమున్నట్లు ప్రవర్తిస్తాడు
సర్వజ్ఞుడిలా పరిపూర్ణ జ్ఞాన స్వరూపంలా ఆదేశాలిస్తుంటాడు
వాడి ఆజ్ఞలను పాటించకుంటే
గుండెల్లో బ్లో అవుట్లను సృష్టిస్తాడు
ఎదుటి మనిషికి రక్తమాంసాలుంటాయనీ
స్పందించే మనసు కూడా ఉంటుందనీ
వాడెప్పుడూ గుర్తించనట్లు నటిస్తాడు
గురివిందల్ని ప్రస్తావిస్తాడు
నల్లపూసై తిరుగుతాడు
నలుసులా సలుపుతుంటాడు
బాధలు బాధ్యతలూ నీ వంటాడు
సుఖ సంతోషాలలో ఓలలాడుతాడు
వాడు మగత్వానికి మచ్చుతునక!
నా వ్యక్తిత్వానికి మాయని మరక!

సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.