(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[కళ్యాణి, మహతి కారులో హాస్పటల్‌కి బయల్దేరుతారు. దారిలో ఒక చోట కారు ఆపించి, డ్రయివర్ని ఏదో పని మీద పంపి, అసలేమయిందని మహిని అడుగుతారు కళ్యాణి. మహి జరిగినదంతా చెబుతుంది. అలతో చర్చించావా అని అడిగితే, లేదంటుంది మహి. అప్పుడు శాస్త్రవాక్యం, మిత్రవాక్యం, ఆప్తవాక్యం గురించి చెప్పి, వాటి ప్రకారం నడుచుకోవాలని చెప్తారు కళ్యాణి. ఇందిరగారు మహితో ఏమయినా మాట్లాడారా అని అడిగితే, అస్పష్టంగా మాట్లాడారని, తన తండ్రి మీద ఆమెకు హక్కున్నట్లుగా మాట్లాడిందనీ చెబుతుంది మహి. తనకి తెలిసి నాన్న ఏనాడూ ఆవిడని కలవలేదనీ, తలవలేదని అంటుంది. కలవకపోవడం నిజమై ఉండొచ్చు కాని, తలవకపోవడం గురించి మనం చెప్పలేమని, ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మీ నాన్నగారేనని అంటారు కళ్యాణి. ఇందిర ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నరని కళ్యాణి అంటే, అవునంటుంది మహి. హాస్పిటల్‌కి వెళ్ళి ముందుగా డాక్టర్ని కల్సి తరువాత అమ్మానాన్నలకి తాము తీసుకువెళ్ళిన టిఫిన్ అందిస్తుంది మహి. పేషంటును చూసి వస్తామని ఇందిర గదికి వెళ్తారు మహీ, కళ్యాణి. ఎలా ఉన్నారని కళ్యాణి అడిగితే, బానే ఉన్నానంటారు ఇందిర. నాకంటూ మిగిలింది బావ ఒక్కరే, కానీ ఆయన సంసారం ఆయనకి ఉంది అంటారు. మీకు మేమంతా ఉన్నామంటుంది మహి. తేలిపోయే మేఘాలు లక్ష వున్నా, ఎదురుచూసేది ఒక్క వర్షించే మేఘం కోసమేగా అని ఇందిర అన్నప్పుడు, దాన్లోని అంతరార్థం గ్రహించి మహి ఏదో చెప్పబోతే, కళ్యాణి సైగ చేసి ఆపుతారు. తేలిపోయే మేఘం కూడా సూర్యుడిని అడ్డుకుని సూర్యతాపాన్ని తగ్గిస్తుందంటు, మేమంతా ఉన్నాం, మీ కోసం ప్రార్థిస్తాం అంటారు కళ్యాణి ఆమెతో. – ఇక చదవండి.]
నేనూ కల్యాణిగారూ, మహతి కల్యాణి గారి ఇంటి హాల్లో సోఫాల మీద కూర్చున్నాం. ‘ఆహారం తరువాతే వ్యవహారాలు చూడాలి/మాట్లాడాలి’ అనే పెద్దల మాటలకి గౌరవం ఇచ్చి కల్యాణిగారు స్వయంగా చేసిన ఆలూ పరోటా, టమోటా ఉల్లిపాయ బంగాళదుంప అల్లం పచ్చిమిచ్చి కలిపిన ముద్ద కూర + ఎర్రగా వర్రగా ఉన్న ఆవకాయ + పెరుగుతో నంజుకుని హాయిగా, కడుపునిండా తినేశాం. మహి, కల్యాణిగారూ కూడా పొద్దున సరిగా తిలేదనుకుంటాను.. చక్కగా తిన్నారు. ఆ తరువాత సగ్గుబియ్యం + సేమియా దిట్టంగా జీడిపప్పు, కిస్మిస్లతో తయారు చేసిన పాయసాన్ని ఊదుకుంటూ తలో గ్లాసు లాగించేశాం. అబ్బ.. నేతిలో వేయించిన జిడిపప్పులూ, కిస్మిస్ పళ్ళు ఎంత బాగున్నాయో.. పాయసంలో తేలుతూ. వాటిని చూస్తుంటే పాలకడలిలో పవళించిన శ్రీమహావిష్ణువు గుర్తొచ్చాడు.
ఆ పాటపాడే SP బాలసుబ్రమణ్యంగారు “నిన్ను మించిన సింగర్ మరొకడుండడు సినిమాల్లోకి రా” అన్న ఆశీర్వాదాన్ని S. జానకి గార్నించి కొట్టేశారు. ఆ తరువాత జానకిగారి నోటి చలవతో దాదాపు 50000 పాటలు అనేకనేక భాషల్లో పాడడమే గాకుండా, ‘పాడుతా తీయగా’ ద్వారా ఎందరెందరో గాయనీ గాయకుల్ని సినిమా రంగానికీ తద్వారా ప్రపంచానికీ పరిచయం చేశారు. వారిలో సాందీప్, మల్లికార్జున్, గోపికాపూర్ణిమ, కౌసల్య, స్మిత, ఉష, లిప్సిక, సాహితి, హరిప్రియ; ఇప్పుడు అప్పుడు నిరంతంరం పాడుతున్న పార్థసారథీ, ఎందరో బాలలకు సంగీత భిక్ష పెట్టిన రామాచారి.. ఇలా ఎందరెందరో యువతీయువక గాయకులు తెలుగు సినీసంగీతానికి స్వరాలూదుతూనే ఉన్నారు. అవన్నీ తలుచుకుంటూ నవ్వాను.
“ఎందుకు నవ్వుతున్నావ్?” అన్నది మహీ ఆశ్చర్యంగా.
“కారుణ్యనీ, మిగతా యువ సింగర్స్నీ గుర్తు తెచ్చుకుంటూ నవ్వాను. ఒక్క ఆశీర్వాదం ఎంత మహా సంగీత వృక్షమయింది? ఎందరు సంగీత విద్యార్ధులనీ, గాయకుల్నీ తయారు చేసిందో అది!” అన్నాను.
“అవును అలా! అది నూటికి నూరు పాళ్ళూ నిజమే. ఎందుకంటే, ఒక చెట్టు చాలు వెయ్య పక్షులకి ఆశ్రయం ఇవ్వడానికి. ఏ క్షణాన జానకిగారు ఆశీర్వదించారో, ఏ క్షణాన SP కోదండపాణిగారు బాలూగార్ని ఇతర సంగీత దర్శకులకు పరిచయం చేసి, పాడించమని అర్థించారో, ఆ క్షణాలు నిజంగా అమృతక్షణాలు, లేకపోతే అమృతఘడియలు. మరి SPB ఓనాడు ఇళయరాజాగారికే తన భుజాన్నిచ్చిన వారు. వెన్నెలకంటి వంటి ఉద్దండుల్ని సినిమాకి పరితయం చేసిందీ SPB నే. ఇవన్నీ కొన్ని మాత్రమే.. మనకి తెలియని SPB నిజంగా ఓ మహాపర్వతం.. ఎన్ని భాషల్లో ఎన్ని వేల పాటలు నిర్విరామంగా పాడారు” తన్మయంగా అన్నారు కల్యాణిగారు.
“మహీ.. ఇందిరగారి విషయాన్ని పక్కన బెట్టి సినిమా కబుర్లు ఎందుకు అనుకుంటున్నావా? ఒకే విషయాన్ని సబ్బు రుద్దినట్టు రుద్దుతూ వుంటే, సబ్బు అరిగిపోవడం తప్ప జరిగేదేమీ వుండదు. జస్ట్ కమ్ ఔటాఫ్ దట్ మూడ్. అనగా ఓ స్నేహితురాలా, ఆ మూడ్ నించి బయటకు రమ్ము. కాస్త చల్లగాలి పీల్చుకొనుము. మనసు చల్లబడును. సమస్య తేటతెల్లమగును. కొంచెం సేపు మెదడుకి సాత్వికహారాములు అందించి, అనగా సంగీతసాహిత్యముల నందించి ఆహ్లాదపరచుము. మేమిద్దరం నీ వెంట ఉన్నము కదా!” అన్నాను, NTR స్టయిల్లో. వాళ్ళు నవ్వేశారు.
“అవును అలా. అదీ నిజమే. అసలు మనం ఆలోచిస్తున్న పద్ధతిలోనే లోపం ఉందనిపిస్తోంది.” అన్నది మహీ.
వాళ్ళు హాస్పటల్ నించి నా చోటకి వచ్చి నన్ను కారెక్కించుకుని వస్తూ విషయాన్ని చాలా సున్నితంగానూ, సుస్పష్టంగానూ వివరించారు. అందువల్ల నేనే వాళ్ళని కాస్త ఆ మూడ్ నించి డైవర్డ్ చేశాను.
“అవును. ఖచ్చితంగా మనం, ముఖ్యంగా నువ్వు డీల్ చేసే పద్ధతిలో లోపం ఉంది మహీ.. నా దృష్టిలో నువ్వెప్పుడు చాలా సమర్థురాలైన నాయకురాలివి. ఏ సమస్యనైనా చాలా షార్ప్‌గా ఆలోచించి చాలా ఫాస్ట్‌గా పరిష్కరించే నైజం నీది. ఏ సమస్యనైనా ఎందుర్కోగల ధైర్యం నీ సొంతం. మరి యీ సమస్యని ఎందుకిలా నానబెడుతున్నావూ. నువ్వు చెప్పొచ్చు ఇది ‘నా’ ఒక్కరికీ సంబంధించిన సమస్య కాదని. అది 100% కరెక్టే. కానీ, సమస్య ఎవరిదో వారు, అంటే నీ తల్లిదండ్రులు రోజు రోజుకీ కుదించుకుపోతున్నారు. ఇక్కడ కావలసింది ధైర్యంతో కూడిన చాకచక్యం. ఆ రెండూ నీలో పుష్కలంగా ఉన్నాయి. నువ్వు యీ సమస్య నీది అని అనుకోకుండా, నాదనో మరొకరిదనో ఆలోచించి చూడు. జస్ట్ రిలాక్స్, అండ్ థింక్” మహీ భుజం తట్టి చెప్పాను.
నాకు తెలుసు నేను మహతికి సలహాలిచ్చేంత మేధ కలదాన్ని కాదని. కానీ, దాని పద్ధతిలో అది డీల్ చేస్తేనే యీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా, తల్లిదండ్రుల వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తే ఆ ఆలోచన ఎడతెగని దానిగానే ఉండిపోతుంది. నా ఉద్దేశం మహి శక్తిని దానికి గుర్తు చేద్దామని. స్వయం నిర్ణయమే కాదు ఎవరి గురించి, ఏ సమస్య గురించిన నిర్ణయమైనా మహీ క్షణాల్లో తీసుకోగలగడమే కాదు, ఆచరణలో కూడా పెట్టగలదు. కల్యాణిగారు మమ్మల్నిద్దర్నీ కూతుహలంగా చూడటం గమనించాను. ఆవిడ దగ్గరా ఓ పరిష్కారం ఉండి ఉంటుందని నాకనిపించింది.
“థాంక్యూ అలా.. ఆ యాంగిల్ లోనూ తప్పక ఆలోచిస్తాను” అన్నది మహతి. ముగ్గరం లేచాం.. బెడ్ రూమ్ లలోకి.
నాకు సినిమా ఫీల్డ్‌లో ఓ డిసిప్లిన్ అలవాటయింది. వీలున్నంత ఎర్లీగా డిన్నర్ చేసేసి, వీలున్నంత త్వరగా నిద్రపోవడం. భోజనానికీ నిద్రకీ మధ్య కనీసం గంటన్నర వ్యవధి ఉండేలా చూసుకుంటాను.
ఇది నాకు చెప్పింది ధీర కెమెరామెన్ డుప్లేకర్. ఆయన్నే బెడేకర్ అనే వాళ్ళం. “అమ్మాయ్ నువ్వు సినిమా నటివి. నీకు అత్యంత ముఖ్యమైనది నీ ముఖం. అది ఎంత ఫ్రెష్‌గా ఉంటే అంత నీకు ప్లస్. మేకప్ వల్ల వచ్చే ఫ్రెష్‌నెస్ కొంత సేపటివరకే. ఫ్రెష్‌నెస్ ఉండాలంటే మితమైన ఆహారం, చక్కని నిద్ర ఉండాలి. స్ట్రక్చర్ అంటే ఆకృతి కోసం యోగా చెయ్యి. జిమ్ జోలికి పోకు. సహజమైన వ్యామాయాలు చెయ్యి. అంటే, వాకింగ్, స్కిప్పింగ్, ఆటలు వంటివి. యోగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచితే, చక్కటి నిద్ర నీ మొహాన్ని అద్దంలా వుంచుంతుంది. రాత్రి నిద్ర లేదనుకో. పొద్దన్న నీకు ఎంత మేకప్ వేసినా ఆ ‘నిద్ర లేమి’ అనే దాన్ని కెమెరా క్షణాల్లో పట్టుకుంటుంది. సహజమైన నిద్రని మించిన సౌందర్య సాధనం మరొకటి లేదు” అన్నారు డుప్లెకర్ గారు.
ఆ క్షణం నించీ వీలున్నంత త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నాను. నిద్రపోయే ముందు కాస్త వాకింగ్ చేసి ఓ గ్లాసెడు గోరువెచ్చని పాలు తాగటం అలవాటు అయింది. పాలు తాగడానికి ముందే చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుని మెత్తని తువాలుతో తుడుచుకుంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేను.
ఇదెందుకు చెబుతున్నాననంటే, ముఖం చక్కగా కళగా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలు చాలు. మొదట చెయ్యాల్సింది సోమరితానాన్ని దూరం పెట్టటం. రెండోది ఖచ్చితంగా టైమ్ పాటించడం. మహీకి నిద్ర రాదని నాకు ఓ పక్క అనిపిస్తున్నా, నా పని నేను రొటీన్‌గా చేసేసి పాలు తాగేసి పడుకున్నాను. ఎందుకంటే, రెండు రోజుల్లో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి కదా!
ఉదయం ఖచ్చితంగా 4.30 కల్లా లేచేసి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసి, యోగా కానిచ్చేసి 5.15 కల్లా హాల్లోకి వచ్చాను. అప్పటికే కల్యాణిగారూ, మహీ కాఫీ తాగుతున్నారు.
“రా.. రా.. కాఫీ కలిపిస్తాను” అన్నారు కల్యాణిగారు. చిన్నగా నవ్వింది మహీ..
“పొద్దున్నే వ్యాయామాలు ఏమిటనా? అవన్నీ ప్రొఫెషన్లో భాగాలే మహీ..” మహీ భుజాన్ని పట్టి అన్నాను.
“అలా.. నిజంగా నీ దగ్గర్నుంచే నేను కొన్ని నేర్చుకోవాలే. తప్పని సరిగా నేనూ, వ్యాయామం, యోగా మొదలెడతా” అన్నది మహీ. చాలా సంతోషం వేసింది నాకు.
“యోగా అంటే తెలుసా?” కాఫీ తెస్తూ అడిగారు కల్యాణి.
“తెలుసమ్మా. యాగా అంటే ‘జోడించడం’. మనసునీ శరీరాన్ని ఏకాగ్రతతో జోడించడం. యోగాసనాలు అనేవి వేరు. అవి ఆసన సిద్ధికీ, ఆరోగ్య సిద్ధికీ అద్భతంగా ఉపకరిస్తాయి. ఒకే భంగిమలో కొన్ని గంటలపాటు నిశ్చలంగా ఉండగలగటం ఆసన సిద్ధి. మొదట్లో రెండు మూడు నిముషాలకే లేచిపోతాం. కానీ పట్టుపట్టి నిత్యం సాధన చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా వుంటాయి. యోగ గురువుల్లో రెండు రకాలు. ఒకరు వారి ప్రజ్ఞనంతా మనసు + శరీరం మీద ప్రయోగిస్తూ బోధిస్తారు. రెండో వారు శరీరంతో మొదలు పెట్టి మెల్లగా రెండో స్థితికి అంటే మనసు+ శరీరం జోడించే స్థితికి తీసుకువెళ్తారు. ఎందిట్లోనైనా శరీరాన్ని ముందు సిద్ధం చేయ్యాలి” అన్నాను. మహీ నావంకే ఆశ్చర్యంతో చూస్తోంది.
“మహీ ఇదంతా నువ్వు నాకు పంచిన స్నేహం వల్లే. లేకపోతే నేనెంత దుర్బలంగా, ఎంత క్రూరంగా ఉండేదాన్నో. ఇంటర్లో నువ్వు నాకు ఇచ్చిన కౌన్సిలింగే నన్ను మార్చింది” ప్రేమగా మహతిని కౌగిలించుకుని అన్నాను. అవును, లేకపోతే నేను ‘అప్పటి’ అల లాగే చిందర వందర మనస్తత్వంతో ఉండేదాన్నేమో?
“నీ మొహం. శ్రమపడింది నువ్వు. పేరు ఇస్తున్నది నాకు” చిన్నగా నా వీపు చరిచి అన్నది మహతి. నేను కాఫీ తీసుకుని సిప్ చేస్తూండగా “ఓకే ఇప్పుడు చెప్పండి ఏం చేద్దామో” అన్నారు కల్యాణి. ఆవిడలోనూ ఓ పట్టుదల అనిపించింది.
“స్టెప్ బై స్టెప్ వెడదాం. నెంబర్ వన్, మహీ మీ అమ్మా నాన్నగార్లతో విడిగా విడివిడిగా, కలివిడిగా చర్చించడం మంచిదేనా కాదా? మంచిదైతే ఎందుకూ. కాదంటే, ఎందువల్ల?” అన్నాను నేను.. లీడ్ తీసుకుని.
మహీ నోరు విప్పేలోగానే ఫోన్ మ్రోగింది. కల్యాణిగారు తీశారు. ఆవిడ చాలా మెల్లగా మాట్లాడటంతో నాకూ మహీకీ కూడా అర్ధమయింది. ఆ పోను హాస్పటల్ నుంచి వచ్చి ఉండాలని. దాదాపు 20 నిముషాలు పాటు చాలా మెల్లగా మాట్లాడి ఫోన్ పెట్టేశారు కల్యాణిగారు. ఆవిడ ముఖం వాడిపోయి ఉంది.
***
అకాల వర్షం. ఎండల్లోంచి వర్షంలోకి రుతు విహంగం పయనించింది. ఓ కవి అంటాడు – “అందమైన హంసల్లా రుతువులు రెక్కలల్లార్చి నేల మీద వాలుతాయి. కొంత కాలం తమ రెక్కలు విప్పి నాట్యం చేస్తూ లోకుల్నీ లోకాన్నీ ఆహ్లాదపరిచి, మళ్ళీ రెక్కలు విప్పుకుని నీలాకాశంలోకి ఎగిరిపోతాయి” అని.
ఒక్కొసారి ఓకే రుతువులో రెండు పక్షుల్లా ఎండాకాలంలో వర్షాలు వలస విహంగాల్లా బారులు తీరాయి. రోడ్లన్నీ నీటితో చెరువుల్ని తలపిస్తున్నాయి. మేన్ హోల్స్ ఎక్కడన్నాయో కూడా తెలియక స్కూటీలూ పాదచారులూ భయభ్రాంతులవుతున్నారు. సైకిల్‌కి ఛాన్సే లేదు. రైళ్ళూ విమానాలూ దారి మళ్ళించబడ్డాయి.
నా ఢిల్లీ ప్రయాణం మరో వారం వాయిదా పడిందని వినోద్ కపూర్ ఫోన్ చేసి చెప్పాడు. కారణం తరూణీ కిద్యాయ్ కాలు ఫ్రాక్చరవడం ఒకటైతే, డైరెక్టర్ అమిత్ వాళ్ళ నాన్నగారు కాలం చేయ్యడం.
ఎంత గొప్ప భాష మనది! మరణించారు, మృతి చెందారు, చచ్చిపోయారు. అనకుండా మన పూర్వీకులు అంటే కొన్ని తరాల ముందు వారు ‘కాలం చేశారు’ అనేవారు. ఎంత గొప్ప మాట.
జీవితమంటే ఏమిటి? బుద్బుదప్రాయం అంటారు. కాలం అనే నదిలో ఓ బుడగ పుట్టింది.. కొంత దూరం అది పయనించింది. ఓ చోట పగిలిపోయింది. అంటే, నీటిలో పుట్టన బుడగ నీటిలో కలిసిపోయినట్లు పంచభూతాలతో సృష్టింపబడ్డ జీవులు చివరికి పంచభూతాలలోనే కలిసిపోతారు. ఆ పంచభూతాలు ఎక్కడినుంచి వచ్చాయీ?
కాలం నించి అని అంటారు మహాపురుషులు. కాలం లేనిది సృష్టే లేదు. అందుకే భగవంతుడ్ని ‘కాలాయనమః, కాల కాలాయనమః’ అని స్తుతిస్తాం.
ఇవన్నీ నా మనసులో తిరుగుతున్న ఆలోచనలు. మిట్ట మధ్యాహ్నం వర్షం ప్రారంభం కాకముందు హాస్పటల్‌కి ముగ్గురం వెళ్ళొచ్చాం. కారణం ఇందిరగారు హిస్టీరిక్‌గా ప్రవర్తించడమే కాక, మేడమీద నించి కిందికి దూకుతానని బెదిరించడం. ఆ బెదిరింపు మహీ తల్లిదండ్రుల్ని ఉద్దేశించి చేసిన బెదిరింపు. మనుష్యుల్లో మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంటుందో నాకు ఆవిడ మాటల బట్టి అర్థమైంది. నిజం చెబితే నా తల వాలిపోయింది. అందుకే నా మనసుని నేనే డైవర్ట్ చేసుకుంటున్నా. ఒకటి నిజం, తప్పు చేయడం సహజం.. అందులోంచి బయటికి రావాలంటే, చాలా చాలా మానసిక ప్రయత్నం చెయ్యక తప్పదు.
“నువ్వేమంటావు అలా?” అన్నది మహీ. నిజం చెబితే తన ఏం చెప్పిందో కూడా నాకు తెలీదు.
“నిజం చెబితే నేనేమీ నువ్వు చెప్పింది వినలేదు. అబద్దం చెబితే మా డైరెక్టర్ అమిత్ సక్సేనా గారి తండ్రిగారి మృతి గురించి ఆలోచిస్తూ నువ్వు చెప్పింది వినలేదు” అన్నాను.
“అలా.. భలే చెప్పావు. మహీ ఏమందంటే, హాస్పటల్లో జరిగిన రగడకి నీకేమనిపించదనీ, నీ అభిప్రాయం చెప్పమనీ అడిగింది” అన్నారు కల్యాణిగారు.
“ఓకే, ఓకే మీరేమనుకుంటున్నారూ?” ఇద్దర్నీ చూస్తూ అడిగారు.
“ఆ స్టుపిడ్ ఆత్మహత్యకి ప్రయత్నిస్తే అదో పెద్ద నాన్సెస్స్ అవుతుంది. న్యాయాన్యాయాలు సంగతి పక్కన బెడితే, ఇవ్వాళ చట్టాలన్నీ మహీళలకి అనుకూలంగానే ఉన్నై. కానీ, ఇలాంటి రాస్కెల్స్ వాటిని స్వప్రయోజనం కోసమో, తమ మూర్ఖపు పట్టు నెగ్గించుకోవడం కోసమూ, తామ అహంకారాన్ని సంతృప్తి పరచడం కోసమూ వాడుకుని, నిజంగా కష్టంలో ఉన్న మహిళలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు.” సీరియస్‌గా అన్నారు కల్యాణి.
“నేను ఆలోచించిస్తున్నదీ అదే. పరిష్కారం కష్టం కాదు. మ అమ్మనీ నాన్ననీ క్వయిట్గా పంపించైడం, ఆమె బెదరింపులనన్నీ రికార్డు చేసి పోలీసులకి వినిపించి వార్నింగ్ ఇప్పించడం చేస్తే చాలు. కానీ, ఒకవేళ నిజంగా ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే? మనం ప్రశాంతంగా ఉండగలమా? జీవితాంతం ఆ ఘటనని మరచిపోగలమా? ఇది నా ఆలోచన మాత్రమే కాదు; అమ్మానాన్నా కల్యాణిగారూ కూడా యీ యాంగిల్ లోనే ఆలోచిస్తారు. అలా నేను చేయిస్తే ఆవిడకి పంతం ఇంకా పెరిగి మరింత డేంజరస్‌గా కూడా మారొచ్చని అనిపిస్తుంది” అన్నది మహతి.
“మీరు ఆలోచించిన పద్దతి 100% రైట్. విచక్షణా జ్ఞానం కోల్పోయిన వాళ్ళకి ఎవరూ నిజాన్ని బోధపరచలేరు. ఎవరి సంగతో ఎందుకూ? నా సంగతే నీకు ఉదాహరణ కాదా? చచ్చిపోతానని ఎన్ని రకాలుగా, ఎంత క్రూరంగా మిమ్మల్ని భయపెట్టానో నీకు గుర్తులేదా? గుడ్డిలో మెల్ల ఏమిటంటే, అంత తీవ్ర భావజాలం ఉన్న వాళ్ళు, అంటే అప్పటి ‘అల’ లాంటి వాళ్ళు హింసించడానికే పదే పదే ప్రయత్నిస్తారు గానీ, తమని తాము హింసించుకోరు. ఆనాటి నాలాగే, ఎదుటి వాళ్ల భయమే వీళ్ళకి కడుపునిండే ఆహారం. ఎదుటి వాళ్ళు ఎంత భయపడితే అంత హింసిస్తారు” ఆగాను నేను.,
“ఓహో.. ఎదుటి వాళ్ళు భయపడకపోతే?” అన్నారు కల్యాణి.
“వీళ్ళు మరింత క్రూరంగా ఆలోచిస్తారు. మరిన్ని మరిన్ని మార్గాలని వెతుకుతారు. అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. ఎదుటివార్ని నిద్రపోనివ్వరు. మహీ.. అలాంటి స్థితిలో నేనున్నాను గాబట్టి, అలాంటి క్రూరమైన ఆలోచనలనే నేను చేశాను గాబట్టి స్పష్టంగా చెబుతున్నాను.. ఇందిరగారు ఆత్మహత్య చేసుకోదు. మీ నాన్నగార్ని ఎలా హింసించాలా అని తెల్లార్లూ తాను అనుకున్నది సాధించే దాకా ప్లాన్లు వేస్తూనే ఉంటుంది” అన్నాను.
నాలోకి నేను చూసుకున్న ఆ క్షణాన్ని ఎప్పటికీ మరచిపోను. పాపం తిమ్ము. తిమ్ము మాత్రమే కాదు, అతని అడ్రస్ ఇవ్వలేదని మహిని, హరగోపాల్నీ మిగతా వాళ్ళనీ ఎంత హింసించానూ! తల్చుకుంటేనే మనసు వ్యగ్రం అయిపోతోంది.
“అలా. నిజంగా నీకు వందనాలే. ఉన్నది ఉన్నట్లు చెబుతూ ఉన్నా నిన్ను చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉందే. తప్పుని నిర్మొహమాటంగా, ఏ మాత్రం ముసుగు వెయ్యకుండా చెబుతున్న నీ మనసుకి సాష్టాంగపడాలని ఉందే. ప్రాణ మిత్రమా, ఇవ్వాళ నువు చెప్పిన మాటల్లోని సారం, నాకు కొండంత బలాన్నిచ్చిందే. అసలు నీ విశ్లేషణే అద్భుతం. ఇదీ, అసలు సిసలయిన పరిస్థితిని అంచనా వెయ్యడం” గట్టిగా నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టింది మహీ. జీవితంలో మరుపురాని కానుక అది.
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు” అనే పుస్తకాలు వెలువరించారు.
ఆహారం తరువాతే వ్యవహారం అన్నది నిజమే! ఆకలి ఎక్కువ వేస్తే మనసు మిగతా పనులపైకి మనసు లగ్నం చేయనివ్వదు. వంటకాల వర్ణన ఎవరైనా సరే మీ రచనలు చదివి నేర్చుకోవాలి. ఆహా.. ఏమిటీ గురువర్యా పాయసంలో తేలుతున్న జీడిపప్పు కిస్స్మిస్ లు విష్ణుమూర్తి లక్ష్మి దేవులా నమోనమః గురువర్యా.. ఇంకా ఎప్పుడు పాయసం చేసినా ఈ పాల కడలే గుర్తు వస్తుంది. మీ ఆలోచనల్లో నిండున బాలు గారు ఆ తరువాత పాడుతా తీయగా జనరేషన్లు గురించి చాలా చక్కగా చెప్పారు. మీరు+ కోటి గారు కలిసి చేసిన ఆ కార్యక్రమం కూడా చాలా బావుండేది అప్పట్లో.. నిన్ననే ఈ మాట నాతో పిల్లలు కూడా అన్నారు. కళ్యాణి గారు, అలతో కలిసి అలోచించి ఇంకా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండటం కోసం మహతి ఏం చేయబోతుందో అన్న ఆత్రుత ఉంది. వారం వరకూ ఎదురు చూడాలంటే కష్టం. అయినా తప్పదు. ప్రణామం గురువర్యా.
యామి హృదయ పూర్వక ఆశీస్సులు ఉదయమే చక్కని స్పందనతో నాకు చాలా చాలా ఆనందం కలిగించినందుకు కృతజ్ఞతలు కూడా…. ఆ స్పందన ఇచ్చిన ఆనందాను భూతితో మరింత ఉత్సాహంగా రాసే ప్రయత్నం చేస్తాను థాంక్యూ థాంక్యూ థాంక్యూ
🙏 మీ నవలలు చదువుతుంటే మీరు భోజన ప్రియులని తెలుస్తోంది. పాయసంలో తేలుతున్న జీడిపప్పు కిస్మిస్ లను పాలకడలిలో పవళించిన విష్ణువుతో పోల్చిన ఉపమానం నిజంగా మీరు వివరించినట్లు జానకి గారిఆశీర్వాదంతో S P B సంగీతంతో పాటు తెలుగు భాషలోని సౌందర్యాన్ని స్పష్టతను ఎప్పటికప్పుడు విశదీకరించి భావితరానికి బాటలు వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మీరన్నట్లు చనిపోవాలనుకునేవారు చెప్పరు. బెదిరించి ఎదుటి మనిషిని బాధ పెట్టాలనుకునే వాళ్ళే ఇలా black mail చేస్తుంటారు. మహతి ఆలోచన సమస్యను పరిష్కరించగలదనిపిస్తోంది. ధన్యవాదాలు🙏🌹🌹
శోభా హృదయపూర్వక ధన్యవాదాలు చక్కగా చదివి చక్కని స్పందన తెలియజేసినందుకు ఏ రచయిత అయిన ఆనందపడేది రాసిన దానికి పాఠకులు రెస్పాన్స్ ఇచ్చినప్పుడే. వారం వారం సీరియల్ చదివి చక్కగా స్పందన తెలియజేస్తూ మరింత స్ఫూర్తిని ఉత్సా హాన్ని కలిగిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు…..ధన్యవాదాలు
శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. మంచి భోజనం తో మొదలుపెట్టారు. వంట చేయకుండా తినకుండా తిన్నంత తృప్తిగా ఉంది. ఏదయినా సమస్య వున్నా దానిమీదే కూర్చో కుండా ఎలా బాలన్స్ గా ఉండాలో బాగా వ్రాస్తున్నారు. యోగా ఏమిటి ఆసన సిద్ది ఏమిటి బాగా తెలియ చేసారు. జానకమ్మ ఆశీర్వాదo వటవృక్షం తో పోల్చడం అద్భుతం. బాలూ గారిని, వెన్నెల కంటి గారిని ఎంతోమంది గాయనీ గాయకులను తలుచుకోవటం మీ ఉన్నత మైన మనసుకు తార్కా నం. సినిమా ఫీల్డ్ లో ఉండాలంటే ఎంత డిసిప్లిన్ కావాలి ఎన్ని చిట్కాలుపాటించాలి తెలిపిన మీకు ధన్యవాదములు – రోహిణి 👏
రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చక్కని విశ్లేషణలతో వారం మారం సీరియల్ ని చక్కగా చదివి స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు సీరియల్ ని మరింత బాగా రాసే ప్రయత్నం తప్పక చేస్తాను దానికి కారణం మీవంటి మంచి పాఠకులు అందిస్తున్న స్ఫూర్తి థాంక్యూ సో మచ్
The Real Person!
ఇది రమాదేవి గారి స్పందన: * నమస్తే భువన చంద్ర గారూ. వంటలు వాటి రుచులు తయారీ విధానం మీరు వ్రాసినది చదువుతుంటే ఆకలి, తినాలి అనిపిస్తుంది. ఆహారం ముందు వ్యవహారం తరువాత ఇది అక్షరాలా నిజం. ఆకలితో ఉన్నప్పుడు మనసు దేనిపైకి వెళ్ళదు. ఆకలి తీరాక అన్నీ కావాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా పనిచేస్తుంది. వర్షం గురించిన ఆలోచనలో మేఘాలను వర్ణించటం అమోఘం. మీరు వ్రాసిన వర్షం పాటలు గుర్తొచ్ఛాయి. అందానికి నిద్రకి ఉన్న అవినాభావ సంబంధించిన పూర్తి వివరణలు చాలా బాగా ఇచ్చారు. సౌందర్య పోషణ చిట్కాలు కూడా స్పష్టంగా విడమర్చి చెప్పిన తీరు అధ్భుతం. ఇందిర గారి మనస్తత్వం ఉన్న స్త్రీ మనసుని గురించి అల సిగ్గుపడకుండా చాలా ఖచ్చితంగా తాను తన పైశాచిక ఆనందాన్ని వ్యక్తం చేసింది తన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వాస్తవానికి దగ్గరగా తీసుకొచ్చింది. ఇందిరగారి పాత్రలో పైశాచిక ఆనందం వ్యక్తమవుతోంది. దీనికి సొల్యుషన్ అల సలహాలు సూచనలు సదా ఉపయోగపడతాయి కూడానేమో. బాలూగారి గురించి వాస్తవాలు పాడుతా తీయగా వల్ల ఎందరో వెలుగులోకి తీసుకు వచ్చి న సింగర్స్ గురించి వారి వ్వక్తిత్వాన్ని చూపించారు. నిజంగా అనూహ్యం, అమూల్యం, ఆదర్శం అందరకీ. చాలా బాగుంది అభివందనాలు. సమస్య వచ్చినపుడు సమస్యలో ఉండి ఆలోచించటం కంటే ఇంకొకరి సమస్యగా తీసుకుని ఆలోచించే విధానంలో పరిష్కారం స్పష్టంగా ఉంటుంది. అది చాలా చక్కటి సూచన. చాలా బాగుంది సంతోషంగా ఉంది అండి. హృదయపూర్వక ధన్యవాదాలు అండీ.*
రమాదేవి గారు నమస్కారం చాలా చక్కగా మీ స్పందన తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. భవాని ఆద్యంతం చక్కగా చదివి దానిలోని ప్రతి విషయము వివరిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు థాంక్యూ సో మచ్ మరోసారి ధన్యవాదాలు
భువన్ జీ! శారీరకంగా శక్తిని, తృప్తి నీ ఇచ్చే భోజనాన్ని ఎంత కమ్మగా వివరిస్తారో – మానసికంగా, ఆధ్యాత్మికంగా శక్తి నిచ్చే గొప్ప “తత్త్వాన్ని” విశ్లేషించడం మీ అన్ని రచనల్లో నేను గమనిస్తాను. “కాలం చేయడం” అన్న పదబంధం బహుశా తెలుగు భాష లోనే ఉన్నదన్నారు. అవును. తెలుగు భాష, సాహిత్యాల పట్ల అవగాహన లేని వారికి ఆ గొప్పతనం అవగతం కాదు. పోతన మహాకవి చెప్పిన “అమ్మలగన్న యమ్మ” పద్యం, “ఎవ్వనిచే జనించు” పద్యం విశ్లేషించే కొద్దీ మహత్తర భావాలు ఉద్భవిస్తాయి. ఏ పంచభూతాల నుండి సృష్టించబడిన జీవి చివరికి ఆ పంచభూతాలలోనే కలిసిపోతాయి. ఆ పంచభూతాలు ‘కాలం’ నుండి వచ్చాయి. అనగా భగవంతుని లో లీనమైపోతాయి. “ఎవ్వని యందు డిందు”. పోతన చెప్పిన దానిని “కృష్ణబిలం” ” బ్లాక్ హోల్” అనవచ్చు. ఒక మామూలు నవలలో, కథనంలో గొప్ప తాత్త్వికత ను అంతర్లీనంగా చెప్పే మిమ్మల్ని సినీ గీత రచయిత గా మాత్రమే అనుకోవడం అమాయకత్వం. ప్రాచీన సాహిత్యం పట్ల మీ అభిరుచి, అధ్యయనం, అవగాహన కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ విషయాలను అప్పుడప్పుడు మీతో గంటలకొద్దీ చర్చించే నాకు “కాలాన్ని” సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటో అర్ధమౌతుంది. అది నా అదృష్టం గా భావిస్తాను.
సుశీల గారు వారం వారం ఇప్పుడు నేను ఎదురు చూస్తాను ఎందుకంటే ప్రతి అక్షరాన్ని సంపూర్ణంగా జీర్ణించుకుని అద్భుతమైన విశ్లేషణ చేయడం మీ ఆత్మ లక్షణం అందులో ఎటువంటి పక్షపాతాలు ఉండవు బాగుంటే బాగుందని లేకపోతే లేదని నిష్పక్షపాతంగా చెబుతారు ఏ రచయిత కైనా ఇటువంటి స్పందనలు అద్దం లాంటివి మమ్మల్ని మేము తెలుసుకోవటానికి అద్భుతంగా ఉపకరిస్తాయి ఒక రచయితగా నవల రాయటం వేరు కానీ మీరు చేస్తున్న పని ఏమిటంటే ఒక గీటురాయిగా దానిని విశ్లేషణ చేయడం మీకు మరోసారి మరోసారి ధన్యవాదాలు తో కృతజ్ఞతలతో సమస్యలతో భువనచంద్ర
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తెలుగు భాష ఘనతను చాటిన కవిత ‘తెలుగు వాడా!’
కావ్య పరిమళం-21
కాజాల్లాంటి బాజాలు-43: మరువలేని సంక్రాంతి..
డా. వేదగిరి రాంబాబుగారి సంస్మరణ సభ
చిరుజల్లు-35
ఒకరితో ఒకరుగా అల్లుకున్న ఆనంద విషాదాల కలయికే కుటుంబం అని చెప్పిన నవల FAMILY LIFE
ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 1
రెండు ఆకాశాల మధ్య-37
పుస్తకంతో పుస్తకాలకు జీవం – పరభాషా రచయితల వ్యూహం!
ఆమని -1
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®