అలసి ఉన్న చంద్రహాసిని ముఖం చూసి “యువరాణీ, నా వెంట రండి. ఈ గుహలో మూలకి ఉన్న సెలయేటి పాయలో స్నానం చేసి రండి. నిన్న నేను సేకరించిన మధురమైన ఫలాలు తిని ఆకలి తీర్చుకుందురుగాని.” అన్నాడు.
ఈ గుహలో సెలయేరా అన్నట్టు అతనివైపు ఆశ్చర్యంగా చూసిందామె. వజ్రనేత్రుడు నవ్వుతూ లేచాడు. చంద్రహాసిని అతన్ని అనుసరించింది.
వారున్న ప్రదేశం నుంచి కాస్త ముందుకు అంతా చీకటిగా ఉంది. అటువైపు దారితీశాడతను. ఆ చీకటిలోకి వెళ్ళాక ఎడమవైపు మలుపు తిరిగింది గుహ. నేల చల్లగా తగులుతోంది. అలవాటు లేని ఆ ప్రదేశంలో ఆమె ఇబ్బందిపడకుండా ఆమెకు ఒక అడుగు దూరంలోనే వజ్రనేత్రుడు నడుస్తూ తనను జాగ్రత్తగా అనుసరించమన్నట్టు సైగ చేశాడు. అలా పది అడుగుల దూరం నడుచాక గుహ తిరిగి కుడి వైపుకు ఒంపు తిరిగింది. వారు కూడా అటువైపు తిరగగానే దూరంగా చిన్న వెలుగు కనపడింది. అది గుహ పైనుంచి వస్తోంది. ఆ వెలుగు వల్ల అక్కడ నడవడం ఇబ్బంది కాలేదు చంద్రహాసినికి. వేగంగా నడుస్తూ ఆ వెలుగు పడుతున్న ప్రదేశానికి చేరుకోగానే పైకి చూసింది. అక్కడ ఎత్తులో కొండ మీదుగా మనిషి దూరగలిగినంత కంత ఉంది. అక్కడినుంచే సూర్యరశ్మి పడి వెలుగు వస్తోంది. అంతే కాదు, ఆ కంత లోంచే అతి సన్నటి ధారతో జలపాతం గుహలోకి కారుతోంది నిశ్శబ్దంగా. అక్కడే అది చిన్న సెలయేరులా ఉంది. అక్కడి నుంచి నీరు మళ్ళీ ఏ కంత లోంచో బయటికి పోతోందనమాట.
చంద్రహాసినిని అక్కడ వదిలి వజ్రనేత్రుడు తిరిగి గుహ మొదటి భాగానికి వెళిపోయాడు.
చంద్రహాసిని నవ్వుకుంటూ ఆ సెలయేటిలో సేదతీరేంతగా స్నానమాచరించింది.
చాలా సేపటి తరువాత ఆమె తిరిగి గుహ మొదటి భాగానికి వచ్చేసరికి ఒక పెద్ద ఆకులో రకరకాల ఫలాలు తెచ్చి పెట్టాడు వజ్రనేత్రుడు.
ఆకలిమీద ఉన్న వారిద్దరూ మౌనంగా ఆ ఫలాలన్నీ ఆరగించారు.
చంద్రహాసినికి ఆ గుహ బయటికి వెళ్ళి ఆ గుట్ట మీదనుంచి కనపడే మరిన్ని అందాలు చూడాలని ఉంది. కానీ, రుద్రపాదుడు తనను వెతుకుతూ ఉంటాడేమో. ఈ గుట్ట మీదకేమైనా వస్తాడేమో అన్న భయం ఆమెని బయటికి తొంగి కూడా చూడకుండా ఆపింది.
ఆమెకు ఈ ప్రదేశాన్ని వీడి వెళ్ళాలని లేదు. ఆ రాజభోగాల మీదకి మనసు పోవడం లేదు. మనసంతా ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉంది ఇక్కడ. చల్లటి ఈ గుహలో తన ఆశయానికి నిలువెత్తు ప్రతిరూపంలా వజ్రనేత్రుడు. ఇదే తన జీవన గమ్యం అయినప్పుడు ఈ స్థలాన్ని విడిచి ఎక్కడికి పోగలదు? అతనెవరో, ఏ దేశపు వాడో మెల్లగా అతనే చెబుతాడు. ఎందుకో అవన్నీ తనకు అవసరం అని కూడా అనిపించడంలేదు. చిత్రంగా ఆత్మబంధువుని చేరినంత శాంతి కలుగుతోంది.
తల్లీ, తండ్రీ, చెలికత్తెలు, దేశ ప్రజలు తను ఏమయిపోయిందో అని బాధపడతారు కానీ తప్పదు. ఇదే తను మనసారా తనువారా సంతోషంగా ఉండగల స్థలం అనిపిస్తోంది. తల్లితండ్రులు బాధపడతారని ఇప్పుడు వెళిపోతే ఇక మళ్ళీ తను ఇక్కడికి రాలేననిపిస్తోంది.
ఆలోచిస్తూ విశ్రాంతిగా ఆ గుహ గచ్చు పైనే మేను వాల్చిన చంద్రహాసిని వంక మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయాడు వజ్రనేత్రుడు.
ఒక దేశానికి యువరాణి, ఎన్ని భోగాల మధ్య పెరిగి ఉంటుంది. సౌకుమార్యంకంటే ధైర్య సాహసాలు, పరాక్రమాలే ఆమె సొత్తని ఆమె వదనం, చూపు చూస్తేనే అర్థమవుతోంది. అటువంటి దేశాన్ని వదిలేసి ఇక్కడ తనతో ఉంటానంటోంది. కారణం ఆమె చెప్పకపోయినా తొలి చూపులోనే తన చిత్రాన్ని చూసి ఆమె పరవశించిపోతూ జయదేవ అష్టపదిని గానం చేసిన తీరుని బట్టి ఆమె కూడా తనలాగే గీతగోవింద గ్రంథ ప్రేమికురాలని అర్థమవుతోంది. కానీ, అందుకోసమని ఆ గీతాలకి తను ఆమె సమ్మోహనపడేలా చిత్రరూపాన్ని ఇస్తున్నాడన్న కారణానికి రాజ్యాన్నీ, భోగాలనీ వదులుకుని ఇక్కడ గడపాలనుకునే కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుందో అదే అర్థంకావడం లేదు.
కానీ, ఏదో మాయ ఉంది. ఆ జగన్మోహనాకారుడి మహిమ ఉంది. ఎందుకంటే, గీతగోవిందం మీద ఉన్న ప్రేమతో, ఆ గీతాలన్నిటికీ చిత్రరూపాలనిచ్చి, సామాన్య ప్రజానీకానికి కూడా ఆ గీతాల్లోని మహా సౌందర్యాన్ని అందించాలనే తన తపన తన రాజ్యంలో తీరలేదు. అనుకోకుండా ఇలా అరణ్యవాసం చెయ్యవలసి వచ్చాక ఇక్కడే పూర్తిగా సమయాన్ని తన ఆశయానికే వెచ్చించగలిగేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ అడవిలో దొరికే పూలతో, కొన్ని ఆకులతో రంగులు తయారుచేసుకుని, ఈ రాళ్ళ మీదే చిత్రాలు గియ్యాలని నిర్ణయించుకున్నాడు.
అన్నీ సిద్ధం చేసుకుని చిత్రించే సమయానికి ఎందుకో రాధ ముఖాన్ని చిత్రించలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా ఆ అష్టపదిలో రాధ ముఖంలోని హావభావాలు కేవలం తన ఊహతో చిత్ర్రించలేకపోయాడు. ఇన్ని రోజుల వృథా ప్రయాస తరువాత ఎదురుచూడని విధంగా ఈ సౌందర్యరాశి ఇలా తన గుహలో ప్రవేశించింది. అలికిడి అయితేనే ఎవరికీ కనపడకుండా తలదాచుకోవలసిన పరిస్థితిలో ఉన్న తను కాగడా వెలుగులో ఆమె ముఖారవిందాన్ని చూస్తూనే కలలో నడిచినట్టు వెళ్ళి రంగులూ, కుంచెలూ తీసుకుని ఎన్నాళ్ళగానో పూర్తి చెయ్యలేకపోయిన రాధ చిత్రాన్ని ఆమెను చూస్తూ మొదలుపెట్టడం, అది చూస్తూనే ఆమె తనంతట తానే తనకు కావలసినటువంటి భంగిమలో నిలబడి తను చిత్రాన్ని పూర్తి చెయ్యగలిగేలా సహకరించడం.. ఇదంతా ఆ రాసలీలా ప్రియుడి లీల తప్ప మరింకేముంది?
చాలా కాలం పాటు పూర్తిచెయ్యకుండా వదిలేసిన చిత్రం ఇప్పుడు చంద్రహాసిని సహకారంతో పూర్తికావడంతో, తదుపరి చిత్రం కూడా వెంటనే ప్రారంభించాలన్న ఉత్సాహం మొదలయింది వజ్రనేత్రుడికి.
తదుపరి చిత్రానికి కావలసిన రంగుల తయారీ కోసం మరునాటి నుంచే అడవిలోకి వెళ్ళి కావలసిన పుష్పాలను సేకరించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
చంద్రహాసినికి వస్త్రాల కోసం కావలసిన నారని కూడా తను వేగిరమే సేకరించుకుని రావాలి.
సాయంత్రం అవగానే చంద్రహాసినికి ఫలాలు తీసుకు వస్తానని చెప్పి బయటికి వచ్చాడు. వజ్రనేత్రుడు సాధారణంగా పగటివేళ బయటకు వెళ్ళడు. ఎంత నిర్జనమైన ప్రదేశమైనా ఏ మనిషైనా తన ఉనికిని గమనిస్తాడేమో అని, సంధ్య వేళ తప్ప గుహ నుంచి బయటకు రాడు.
తనకు కనపడినప్పుడూ చీకటిలోనే అతను ఫల సేకరణకు వెళ్ళడం, ఈ రోజు కూడా చీకట్లు ముసురుకునే వరకూ గుహలోనే ఉండి ఇప్పుడు బయటకు వెళ్ళడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని చంద్రహాసిని ఊహించింది. అదేమిటో అతను చెప్పేవరకూ అడగకూడదనుకుంది.
వజ్రనేత్రుడు ఓషదీ ఫలాల తోటలో అడుగుపెట్టాడు మెల్లగా. ఎప్పటిలాగే ఎవరూ లేరని రూఢి చేసుకున్నాక తనకు కావలసిన ఫలాలని కోసుకుని పేనుతో అల్లిన ఒక బుట్టలో వేసుకున్నాడు. ఆ తరువాత ఆ తోట పక్కనే ఉన్న మరో గుబురు పొదల మధ్యన ఒలిస్తే నార వచ్చే చెట్టువద్దకు వెళ్ళి కొంత నారని ఒలిచి మడిచి పెట్టుకున్నాడు.
ఇక అప్పటికే బాగా చీకట్లు ముసురుకోవడంతో అక్కడినుంచి తన గుహకి బయలుదేరాడు.
వజ్రనేత్రుడు తన గుహవైపు అడుగులు వేసిన కొద్ది క్షణాల వ్యవధిలోనే రుద్రపాదుడు అక్కడికి వచ్చాడు. కోపంతో అతని ముఖం ఎరుపెక్కి ఉంది. పొద్దంతా గడిచిపోయింది. యువరాణి జాడ తెలియలేదు.
తెల్లవారు ఝామున తనకు మెలకువ వచ్చింది. అప్పుడు చూశాడు. యువరాణి అక్కడ లేకపోవడం. ఎలుగెత్తి గొంతు ఆర్చుకుపోయేలా పిలిచాడు. బదులు లేదు. ఇప్పుడు వీలైనంతమేర అడవి మొత్తం గాలించాడు. ఎక్కడా యువరాణి జాడలేదు. ఏమై ఉంటుంది? ఏ క్రూరమృగమైనా జాడ కూడా మిగల్చకుండా సైనికులను తీసుకుపోయినట్టు ఆమె నిద్రలో ఉండగానే…
ఛా.. ఆమెలాంటి పరాక్రమవంతులకి అలా జరగదు.
ఇప్పుడు తను ఏంచెయ్యాలి? ఏ ముఖం పెట్టుకుని మహారాజు వద్దకు తిరిగివెళ్ళగలడు?
ఒకవేళ… తన ఆలోచనలు పసిగట్టి యువరాణి నిశ్శబ్దంగా తన దారిన తాను తిరిగి రాజ్యానికి వెళిపోలేదు కదా? హఠాత్తుగా అనుకున్నాడు. అటువంటి ధైర్యవంతురాలే ఆమె. చాలా తెలివైనది. మనిషి ముఖంలోకి చూసి అతని ఆలోచనలు పసిగట్టగలదు.
పిడికిలి బిగించి పక్కనే ఉన్న చెట్టుమీద గుద్దాడు.
ఎంతకాలం తను మాత్రం ఈ అడవిలో ఉంటాడు? తిరిగి రాజ్యానికి వెళ్ళడమే మంచిది. అక్కడ పరిస్థితి చూసి ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాలి.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™