కరోనా కాల మధ్యాహ్నం. ఎంత ఇల్లే ఇలలో స్వర్గం అనుకున్నా ఏదో తెలియని అన్రెస్ట్. ఏళ్లుగా అలవాటు పడ్డ రొటీను ఒక్క సారిగా నిరవధిక ఆటంకం ఏర్పడగా వచ్చిన అన్రెస్ట్. ఎంత అనుకూల దృక్పథంతో ఆలోచించినా ఎన్నాళ్లిలా అనే అసహన భావన. చదివే మూడ్, రాసే మూడ్ లేదు. టీవీ అనలే చూడాలనిపించటం లేదు. ఓ మంచి పాత సినిమా చూద్దామా అనుకుంటూ ‘యూ ట్యూబ్’ చూశాను. అప్రయత్నంగానే ‘మాయాబజార్’ మూవీని తాకాయి వేళ్లు. నాటికి, నేటికీ, ఏనాటికీ అందరూ వినోదించ గల చిత్రం. ఎన్నిసార్లు చూసినా విసుగేరాదు. ప్రతి ఫ్రేమ్ ఎంతో గొప్పగా ఉంటుంది. కాకపోతే నేటి తరానికి ఆ గ్రాంథిక సంభాషణలు అంతగా ఎక్కవేమో కానీ మనసు పెడితే మాత్రం మనోరంజకమే. చిన్నారి శశిరేఖ పుట్టినరోజు వేడుకతో ఎంతో ఆహ్లాదకరంగా చిత్రం మొదలైంది.
శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారిశ శిరేఖ వర్ధిల్లవమ్మా వర్థిల్లు మాతల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా..
పాట జరుగుతోంది. మనసులో మాటలు మొదలయ్యాయి. శశిరేఖ తల్లిదండ్రుల, పినతండ్రుల, మేనత్తల గొప్పతనాలను తెలియజేస్తూ వారందరి గారాల పిల్లగా శశిరేఖను ఆశీర్వదిస్తూ సాగే ఈ పాటను పి.నాగేంద్రరావ్ ఎంత బాగా రాశారో. ఎమ్.ఎల్.వసంతకుమారి ఎంతో భావయుక్తంగా పాడింది.. అనుకుంటుండగానే ఫోన్ మోగింది. నేను మూవీని స్టాప్ చేసి మొబైల్ అందుకున్నా.
చూస్తే శర్వాణి వాట్సాప్ కాల్.. ఇవాళ వాళ్ల పాప మొదటి బర్త్ డే అట. ఎంతో గ్రాండ్‌గా చేయాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా మా కలలన్నీ కల్లలయ్యాయి అని ఎంతో బాధపడింది. తనే కేక్ తయారుచేశానని, సాయంత్రం వీడియోకాల్ చేస్తానని, జాయిన్ అవమని చెప్పింది. నేను అలాగే అంటూ వాళ్ల పాపకు ఆశీస్సులందజేసి, బాధపడవద్దని, క్షేమంగా ఉండటమే అన్నిటి కన్నా ప్రధానమని, ఇప్పుడీ వీడియో కాల్ సౌకర్యమైనా ఉన్నందుకు మనం సంతోషించాలని చెప్పాను. సాయంత్రం మళ్లీ వీడియోకాల్ చేస్తానంటూ ‘బై’ చెప్పింది శర్వాణి.
కాల్ అయిపోయిందే కానీ నా మనసంతా శర్వాణి మాటలే నిండి పోయాయి. పాపకు మొదటి పుట్టినరోజు. ఎవరికైనా సరదాగా అందర్నీ పిలిచి వేడుక చేయాలనే ఉంటుంది. కానీ ఏంచేస్తాం. అన్నట్లు మొన్న పేపర్లో చూసింది.
మథురలో ఓ మహిళ తన భర్త ఆర్మీలో ఉన్నాడని, లాక్డౌన్ నేపథ్యంలో తమ పాప తొలి పుట్టినరోజు వేడుక చేయలేకపోతున్నానని పోలీసులకు తెలియజేస్తూ ఎంతో బాధపడిందట. వెంటనే పోలీసులు బర్త్ డే కేక్, రంగురంగుల బెలూన్లు, బర్త్ డే గిఫ్ట్‌తో వారింటి వద్దకు వచ్చారట. అలా పదుగురి మధ్య వేడుక జరిగి ఆ తల్లి ఎంతో సంతోషించింది.
అలాగే ఉత్తర భారతాన పంచకుల అనే చోట కూడా ఒంటరిగా నివసిస్తోన్న ఓ వృద్ధుడి పుట్టినరోజును పోలీసులే వచ్చి సెలబ్రేట్ చేశారట. ఆయన పిల్లలు విదేశాలలో ఉండటంతో, వారు స్థానిక పోలీసులకు తమ తండ్రి పుట్టినరోజని తెలియజేయడంతో పోలీసులు బర్త్ డే కేక్ ఆ వృద్ధుడి కోసం తీసుకెళ్లి ఆ ముచ్చట నిర్వహించారు. అది చూసి వృద్దుడు భావోద్వేగానికి గురయ్యాడట. చిన్న అయినా, పెద్దయినా పుట్టినరోజు పుట్టినరోజే. అది వారికి, వారి ఆత్మీయులైనవారికి మాత్రమే గుర్తుండే రోజు. కొన్ని కార్యాలయాల్లో అధికారికంగా అభినందనలు తెలియజేయటం మామూలే. శ్రీశ్రీ పుట్టినరోజు పాట రాశాడంటే ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ వెలుగు నీడలు చిత్రానికి ఓ చక్కని పాట అందించారు. అది..
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు చేరి మనం ఆడిపాడే పండుగ రోజు వేడుకగా ఈ పూట.. ఆడుదమా దొంగాట.. ॥చిట్టి పొట్టి॥
అలాగే ‘బంగారు కలలు’ చిత్రంలో మరో పాట ఉంది.
పుట్టినరోజు జేజేలు చిట్టిపాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి… కళకళలాడే నీ కళ్లు దేవుని ఇళ్లమ్మా కిలకిల నవ్వే నీ మోమే ముద్దుల మూటమ్మా నీ కోసమే నే జీవించాలి నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి.. ॥పుట్టిన రోజు॥ ఆటలలో చదువులలో మేటిగా రావాలి మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి చీకటి హృదయంలో వెన్నెల కాయాలి నా బంగారు కలలే నిజమై నిలవాలి..
దాశరథి కన్నతల్లి మనసును, ఆశలను చక్కగా పాటలో పొదిగారు.
అసలు సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును తిథి ప్రకారం చేసుకుంటుంటారు. అయితే ఈ కాలంలో రికార్డుల్లో ఉన్న తేదీ ప్రకారంగా చేసుకోవటం రివాజయింది. పైగా అందరికీ తెలిసే తేదీ అదేకదా. అయితే పుట్టిన తేదీలలో చాలాసార్లు పొరపాట్లు దొర్లుతుంటాయి. అంతేకాకుండా గతంలో పిల్లల్ని బడిలో పెద్ద క్లాసులలో చేర్చటానికి వయసు ఎక్కువ రాసేవారు. ‘ఆ.. ఏదో బళ్లో వేసేటప్పుడు ఎక్కువ ఏళ్లు వేశాం. మీ నాన్నకు అన్ని ఏళ్లు లేవురా’ అని బామ్మగార్లు మనవళ్లతో చెప్పడం పరిపాటి. ఇక బస్సుల్లో, రైళ్లల్లో పిల్లలకు టిక్కెట్లు తీసుకోవలసి వస్తుందని వయసు తక్కువ చెప్పడం చాలాసార్లు చూస్తుంటాం. టెక్నికల్‌గా పొరపాట్లు జరిగి ధ్రువపత్రాల్లో పుట్టినతేదీ పొరపాటు పడటమూ కద్దు. ఇక ఫిబ్రవరి ఇరవైతొమ్మిదవ తేదీన పుట్టినవారు ఖచ్చితంగా అదే తేదీన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోలేరు. ఆ తేదీ మళ్లీ నాలుగేళ్లకు అంటే లీప్ ఇయర్ వస్తే కానీ రాదు. ముందు, వెనుక రోజుల్లో చేసుకోవలసిందే. అయితే నేటి వేగవంతమైన జీవన శైలిలో చాలామంది పుట్టినరోజు ఏ తేదీ అయినా, వారాంతాల్లోనే చేసుకోవటం కూడా జరుగుతోంది. తమకూ, ఇతరులకు కూడా వారాంతాలు సౌకర్యవంతంగా ఉంటాయని వారి భావన. బర్త్ డే అనగానే
“హేపీ బర్త్ డే టు యూ హేపీ బర్త్ డే టు యూ హేపీ బర్త్ డే డియర్.. హేపీ బర్త్ డే టు యూ హేపీ లాంగ్ లైఫ్ టు యూ హేపీ లాంగ్ లైఫ్ టు యూ హేపీ బర్త్ డే టు యూ మే గాడ్ బ్లెస్ యు…”
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పాట లేని బర్త్ డే పార్టీయే లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా పద్దెనిమిదికి పైగా భాషల్లో ఈ పాట అనువాదమయింది. అసలీ పాటకు మూలం అమెరికన్ సిస్టర్స్ పాటీ అండ్ మిల్ డ్రెడ్ జె.హిల్ పంథొమ్మిదవ శతాబ్దంలో రాసిన ‘గుడ్ మార్నింగ్ టు ఆల్’ అనే పాట అంటారు. ఏమైనా ‘హేపీ బర్త్ డే టు యూ’ అనునిత్యం యావత్ ప్రపంచంలో లెక్కలేనన్ని చోట్ల, లెక్కలేనన్నిసార్లు వినిపించే పాట. ఒకప్పుడు పుట్టినరోజంటే పిల్లలకు కొత్త దుస్తులు వేసి, పేరంటం చేసి, పిల్లలకు మంగళహారతి ఇచ్చేవారు. వచ్చినవారికి స్వీట్, హాట్ పెట్టి, కూల్ డ్రింక్ ఇవ్వడం చేసేవారు. సంపన్నులయితే భోజనాలకు పిలిచేవారు. తర్వాత తర్వాత పాశ్చాత్యపోకడ బాగా పెరిగింది. బర్త్ డే ఇన్విటేషన్ కార్డులు మొదలయ్యాయి. వాటిలో ఎన్నో రకాలు. ఇక కేకుల మీద క్రేజ్ ఎక్కువై, బర్త్ డే అంటే కేక్ కట్ చేయాల్సిందే అన్న భావన స్థిరపడిపోయింది. కేక్ డిజైన్లు కూడా ఎన్నో వెరైటీల్లో మొదలయ్యా యి. అది నిజంగా గొప్ప కళ. ఎంత పెద్ద కేక్ కట్ చేస్తే అంత గ్రాండ్‌గా చేసినట్లు. కేక్ మీద పుట్టినరోజు జరుపుకునే వారి వయసును తెలియజేసే సంఖ్యలో కొవ్వొత్తులు వెలిగించడం, సంఖ్య పెద్దదయ్యే సరికి, సంఖ్య మోడల్ లోనే కొవ్వొత్తుల తయారీ ఉండటంతో అది ఒకటే వెలిగిస్తే సరిపోతోంది. అయితే వెలిగించిన దీపాన్ని ఆర్పేయడ మేమిటని సంప్రదాయవాదులు సణుక్కోవడం మామూలే. దీపం ఆర్పేయగానే అందరూ చప్పట్లు కొట్టి, ముక్తకంఠంతో ‘హేపీ బర్త్ డే టు యూ’ పాడేస్తారు. కేక్ కట్ చేసి తినిపించడం, తినడంతో సరిపెట్టక ఇటీవల కాలంలో ఆ కేక్‌ను ముఖాలకు పులుముకొని ఎంజాయ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఇటువంటివి చూసినప్పుడు వెర్రివేయి విధాలనేది నిజమే అనిపిస్తుంది. ఇక అలంకరించిన అందమైన రంగురంగుల బెలూన్లను అగరుబత్తితో పొడిచి వాటిని ఠాప్‌ఠాప్‌మని పేలేలా చేస్తారు. అయ్యో పాపం బెలూన్లు అనిపిస్తుంది. వచ్చిన పిల్లలకు టాటూలు వేయడం, బెలూన్లు, చిత్రవిచిత్ర ముఖాల మాలు, క్రౌన్లు ఇస్తుంటారు. ఇవన్నీకాక బర్త్ డే పార్టీలలో వినోదక్రీడలు, మ్యాజిక్ షోలు వంటివి మామూలయి పోయాయి. ఈ వినోద క్రీడలు కేవలం పిల్లలకే కాదు, అక్కడున్న జంటలకు కూడా కావడం ఇంకా విశేషం. వెల్ కమ్ డ్రింక్‌లు, స్నాక్స్ వగైరాలు నడుస్తూనే ఉంటాయి. వినోదాలతో అలసి పోయాక తిన్నంత తినేలా నార్త్, సౌత్ ఇండియన్ డిష్‌లు, ఐస్ క్రీమ్‌లు. అతిథులంతా శక్తి కొలదీ బహుమతు లందించడం మామూలే. ప్రతి నిముషాన్ని వీడియో తీయడం, ఫొటోలు తీయడం సర్వసాధారణమే. బర్త్ డే ఫంక్షన్ కూడా చాలావరకు ఇళ్లలో కాకుండా ఏ హోటల్లోనో, ఫంక్షన్హాల్లోనో చేస్తున్నారు. అంతా విత్తం కొద్దీ వైభోగం. ‘మేరా మున్నా’ అనే ఓ పాత చిత్రంలో పిల్లలు పాడే ఓ సరదా పాట ఉంది. అది..
బధాయి హో బధాయి… జనమ్ దిన్ కి తుమ్ కి సదా దిల్ లగా కె తూ మెహనత్ సె పఢ్నా.. మెహనత్ సె పఢ్నా పఢాయి మె ఆగే సె ఆగే హి బఢానా అచ్ఛాజీ బతావో మైనే ఐసా క్యూ కహా జొ తుమ్ పాస్ హెగె మిలేగె లడ్డూ హమ్ కో బధాయి హెూ బధాయి.. జనమ్ దిన్ కి తుమ్ కి..
చిన్నపిల్లలకు పుట్టినరోజు జరపడంలో అమ్మా, నాన్నలకు ఎంతో ఆనందం, గర్వం వంటి అనుభూతులుంటాయి. పిల్లలు స్కూలు కెళ్లే దశలో పిల్లలకు తమ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవటంపై ఆసక్తి పెరిగిపోతుంది. అమ్మానాన్న అర్థరాత్రి పన్నెండింటి కల్లా పుట్టినరోజు పాపనో, బాబునో లేపి కేక్ కట్ చేసి, బోలెడన్ని గిఫ్ట్‌లు అందించటం ఇప్పటి ట్రెండ్. ఉదయాన్నే పిల్లలు స్కూలు బస్‌లో వెళ్తారు కాబట్టి బస్సులో ఎక్కే పిల్లలందరికీ, టీచర్లకు, ఇతరులకు చాక్లెట్లు ఇవ్వాలని, స్కూలుకెళ్లాక, తమ క్లాసంతా చాక్లెట్లు, చిన్న చిన్న బహుమతులు పంచాలని, క్లాసుకు వచ్చే టీచర్లకు, హెచ్.ఎమ్.కు ఖరీదైన, ప్రత్యేకమైన చాక్లెట్లు ఇవ్వాలని, తాము ఖరీదైన, కొత్త ఫ్యాషన్ దుస్తులు ధరించాలనే కోరికలు ఉంటాయి. తోటి పిల్లలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలనుకుంటారు. కార్పొరేట్ స్కూల్స్‌లో ఈ ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది. కాలేజీ స్థాయికొస్తే క్యాంటిన్లోనో, హోటల్లోనో, పబ్బుల్లోనో పార్టీలు మొదలవుతాయి. ఉద్యోగపు రోజులొచ్చేసరికి ఆ ఉత్సాహం కాస్త తగ్గుతుంది. దానికి ముఖ్యకారణం బాధ్యతలు ఒకటే కాదు, వయసు పెరిగి పోతోందన్న చింత. తల్లిదండ్రులు, భార్య, సన్నిహిత స్నేహితులు వారిని ఉత్సాహపరుస్తూ పుట్టినరోజు జరుపుతుంటారు.
అదృష్టవంతురాలైన చెలి పుట్టినరోజున చెలికత్తెలు పాడే ఓ చక్కని హుషారైన పాట ‘కంచుకోట’ చిత్రంలో ఉంది. అది..
ఈ పుట్టినరోజు, నీ నోములు పండిన రోజు దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు.. తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ.. మీలో విరిసే లేత వెలుగులు మా చెలికన్నుల నింపండి..
సంతోషాలు ధ్వనించే ఈ అందమైన పాటను దాశరథి రాశారు. ఇక సంపన్నురాలైన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలో పేదింటి అమ్మాయి పాడే ఓ మంచిపాట ‘మట్టిలో మాణిక్యం’ చిత్రంలో ఉంది. అది..
మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట.. నీ బతుకంత కావాలి పూలబాట పచ్చగ నూరేళ్లు ఉండాలని.. నా నెచ్చెలి కలలన్ని పండాలని.. ఆశలు ఉంటాయి అందరికీ.. అవి నెరవేరేది కొందరికి ఆనందాల తేలేవేళ.. అభినందనలు ఈ చెలికి..
సినారె రాసిన అర్థవంతమైన పాట.
పుట్టినరోజంటే కేవలం వేడుక చేసుకోవటమేనా? అందులో గ్రహించవలసింది ఏమైనా ఉందా, అంటే ఉంది..
పుట్టినరోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ? ఎందరికి?.. పూవెందుకు పుడమిలోన పుడుతుంది? జడలోనో, గుడిలోనో నిలవాలని ముత్యమేల కడలిలోన పుడుతుంది? ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతిమనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని తనకోసమే కాదు పరులకొరకు బ్రతకాలి తానున్నా, లేకున్నా తన పేరు మిగలాలి…
జీవన తరంగాలు చిత్రానికి సినారె అందించిన ఆణిముత్యం ఈ పాట.
అలాగే తాతా మనవడు చిత్రంలో నాయనమ్మగా నటించిన అంజలీదేవి ఓ చక్కని పాట పాడుతుంది. అది..
ఈనాడే బాబూ నీ పుట్టినరోజు ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు… కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి తనకుతాను సుఖపడితే తప్పుగాకున్నా తనవారిని సుఖ పెడితే ధన్యత ఓ నాన్నా… ఈనాడే॥ తండ్రిమాటకై కానకు తరలిపోయే రాఘవుడు అందుకె ఆ మహనీయుడు అయినాడు దేవుడు తల్లి చెరను విడిపించగ తలపడే ఆ గరుడుడు అందుకె ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు ఓ బాబూ నువ్వు ఆ బాట నడవాలి భువి లోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి.. ధ్రువతారగ వెలగాలి..
ఇదీ సినారె అందించిన గొప్ప సందేశగీతమే.
వయసు పైబడ్డాక పుట్టినరోజును తలచుకుంటే చాలామంది వయసు పెరుగుతోందని, ఆయువు తరుగుతోందని దిగులు పడతారు. అయితే జొయన ఫుక్స్ అనే ఇంగ్లీషు కవి ‘హాఫ్ బేక్డ్’ పేరిట మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు.
ఆన్ యువర్ బర్త్ డే, ఇటీజ్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఫర్ ది పాసింగ్ ఆఫ్ టైమ్ లీడ్స్ టు చేంజ్ వాట్ వన్స్ వాజ్ ఇంపార్టెంట్ వుయ్ లీవ్ అవర్ ప్రయారిటీస్ అండ్ గోల్స్ రీఅరేంజ్ ఇటీజ్ అఫీషియల్, యు హావ్ లివ్డ్ వన్ మోర్ ఇయర్ యుఆర్ బర్త్ డే గిప్టెడ్ అండ్ కేక్డ్ బట్ డోంట్ థింక్ యు ఆర్ ఫుల్లీ మెచ్యూర్, ‘కాజ్ యు ఆర్ రియల్లీ ఒన్లీ హాఫ్ బేక్డ్!
నిజమే కదా వయసు పెరిగినంత మాత్రాన జ్ఞానవంతులమైనట్లు కాదుకదా.
మనుషులకే కాదు, దేవుళ్లకు పుట్టినరోజులు జరపడం మామూలే శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, వసంతపంచమి వగైరాలు. అలాగే జన్మ ఎందరో ఎత్తుతారు.
కానీ కారణజన్ములు కొందరే ఉంటారు. శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షులను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక కీర్తిశేషులయిన మహాత్ముల పుట్టిన రోజులను జయంతి పేరిట ప్రపంచం మొత్తం లేదా ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు జరుపుకుంటాయి. మహాత్మాగాంధీ జయంతి, సుభాష్ చంద్రబోస్ జయంతి, నెహ్రూజయంతి, వల్లభాయ్ పటేల్ జయంతి, అంబేద్కర్ జయంతి… ఇలా వివిధ రంగాల్లో ఎందరో విశిష్ట వ్యక్తుల జయంతులను జరుపుకుంటూనే ఉంటాం. అన్నట్లు భూమాత జయంతి కూడా ఉన్నట్లు ఈమధ్య తెలిసింది. మే నెల నేనే పందొమ్మిదవతేదీన మహీ జయంతి అని ఓ వాట్సాప్ పోస్ట్ తెలిపింది. ఏమైనా పుట్టినరోజున ప్రతివారు ఆత్మ విమర్శ చేసుకోవటం ఉత్తమం. మామూలు రోజుల్లో ఆత్మసమీక్ష చేసుకోకపోయినా కనీసం పుట్టినరోజున అయినా చేసుకోవటం మంచిది. పెద్ద పెద్ద ఆశయాలు నెరవేర్చ లేకపోయినా కనీసం మానవతతో, ఆత్మీయతతో తోటివారికి మనం ఏం చేస్తున్నామన్నది ప్రశ్నించుకోవాలి.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ
అన్నాడు బద్దెన. అమ్మా, నాన్నలు పిల్లలు ఎంత పెద్దయినా వారి పుట్టినరోజును ఎంతో సంతోషంగా జరుపతారు. అయితే ఆ పిల్లలు సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు పొందితే ఆ తల్లిదండ్రులకు మరింత ఆనందం. అందుకే ప్రతివారు ఒకింత మంచితనం, ఆత్మీయభావన పెంపుచేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో తమదైన ముద్రను వేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే పుట్టినరోజులకి సార్థకత అనుకుంటుంటే.. ఆలోచనను చెదరగొడుతూ, ఫోన్ మోగింది. చూస్తే శర్వాణి వీడియోకాల్. ఇంకేముంది, పుట్టినరోజు సమీక్షణానికి తెరపడి.. పుట్టినరోజు వేడుక వీక్షణానికి తెర లేచింది.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 60కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. భూమిక కథల పోటీలో ఒకసారి బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన వంటి కాలమ్‌లు రాశారు.
Hearty congratulations for 42nd birthday to manasa sancharare fantastic narration by smt syamala garu regarding birth days From J Guru Prasad
శ్యామలగారు చెప్పినట్టు పిల్లలు సమాజానికి మంచిని చేకూర్చే పనులు చేసినప్పుడు మాత్రమే మంచి పేరు వస్తోంది. అలా మంచి పేరు తెచ్చుకున్న పిల్లలకు బర్త్ డే జరుపుకోవడంలో సార్ధకత ఉంది. పిల్లలు తమ చెడు పనులు ద్వారా తల్లి దండ్రులకు చెడ్డపేరు తెచ్చినట్టయితే అటువంటి పిల్లలు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే ! అటువంటి వారికి పుట్టినరోజులు జరిపితే సమాజానికి చీడపురుగులు పెంచి పంపినట్టే ! రచయిత్రి శ్యామలగారికి అభినందనలు.
శివ్వాం ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.
శ్యామలగారి ‘పుట్టినరోజు జేజేలు’ పుట్టినరోజు విశిష్టతను, సార్ధకతను చక్కటి పాటలు గుర్తుచేస్తూ సోదాహరణంగా ,హృద్యంగా అక్షరీకరించారు..వారంవారం మనోరంజకమైన వ్యాసాన్ని అందిస్తున్న శ్యామలగారికి అభినందనలు.
శ్రీమతి శ్యామల గారి”పుట్టినరోజు జేజేలు!”శీర్షిక నేటి యువతకు బాధ్యతలను,జ్ఞాన మార్గాన్నీ బోధిస్తుంది.”పుట్టినరోజు పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?”అంటూ సినారే గారి భావోద్వేగ చలనచిత్ర గీతం ద్వారా బాధ్యతా రహితులైన నేటి యువతను ప్రశ్నించారు శ్రీమతి శ్యామల గారు.అంతేనా…బిడ్డల పుట్టినరోజు లను ఆర్భాటంగా జరపాలని తల్లిదండ్రులు ఆశించే రీతిని కూడా వివరంగా చెబుతూ…”కన్నవారి కలలు తెలుసుకోవాలి…ఆ కలల కంట కన్నీరు పెడితే తుడవాలి…”అంటూ నేటి యువతరానికి జ్ఞాన బోధ చేశారు.ఈ వ్యాసంలో విభిన్న అంశాలను క్రోడీకరిస్తూ…Happy birthday పాటకు అసలు మూలాన్ని శోధించి మనకు తెలియ జేయడం ద్వారా ఆమె విషయ పరిశోధనా పటిమ యొక్క విశిష్టత తెలిసిపోతుంది. Good morning to all మూలం నుండి American sisters paaty and Mildred j.Hill 19వ శతాబ్దంలో రాసిన “Happy birth day to you”song ఆవిర్భవించింది అని ఎంత మందికి తెలుసు!? వయసు మళ్ళిన వాళ్ళు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండకుండా joyana fix “Half bekd”పేరిట కొత్త కోణాన్ని ఆవిష్కరించి…వారిని వేడుకలకు సుముఖులను గావించిన “on your birthday ,it is time to reflect for the passing of time leads to change…” కవిత శ్రీమతి శ్యామల గారి లోతైన దృష్టి కోణం ఆవిష్కరించిన సృష్టే గదా! ప్రతి విషయాన్ని విశదీకరించడంలో ఆమె నిరంతర అధ్యయన శీలిగా నా అంతరంగంలో నిలిచిపోయారు.ప్రతి రచయిత శ్రీమతి శ్యామల గారిని ఆదర్శంగా తీసుకుంటే సమాజానికి మేధావులైన రచయితలు లభిస్తారు. కళాభివందనములతో విడదల సాంబశివరావు.
Another enjoyable read from Smt. Syamala! It made me reminisce all my birthdays as a kid to an adult!
Extremely readable piece on birthdays. Children love it as it is the only time they get gifts for which they never asked. On all other occasions they have to use ” Sama Dana , fast ” methods. Celebrating the birthdays of the leaders in different walks in life, is to remind ourselves that they are to be emulated. Ms. J.S as usual has provided so many thoughts to get connected to ones own life and times through her write up .Thank you Syamala garu.
S S Kandiyaped
కరోనా కాలంలో కల్లోలమైన మనసుకు వూరట నిచ్చేలా వుంది శ్యామల గారిరచన. పుట్టినరోజు జరుపుకోవడం తోపాటు లోకంలో తమదైన ముద్రను వేసే ప్రయత్నం చేయాలని సార్థకమైన విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు మేడం 🙏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™