సూరీడు కొండల మాటుకు క్రమంగా అంతర్ధాన మవుతున్న అందమైన సాయంకాలం. ఎంత మనోహరం దృశ్యం! అతివేగంగా అస్తమయం అయిపోయింది. కన్నుల పండుగ ముగిసింది. నగరానికి దూరంగా ఉండటంవల్ల కాసింత ప్రకృతి ఆస్వాదన సాధ్యమౌతోంది. అంతలో ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయలువాడు.. కొండలంత వరములు గుప్పెడు వాడూ..’ వినిపించి వీనులవిందు మొదలైంది.. ‘ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను.. మంచివాడై కరుణ పాలించిన వాడు..’ అన్నమయ్య కీర్తన చివరి చరణం జరుగుతుండగా నా మదిలో ఆలోచనల గది తలుపులు తెరుచుకుంది.
అవునూ.. ఒక్క వేంకటేశ్వరుడేనా ఏడుకొండల వాడిగా జగద్విఖ్యాతమైంది!… నిశితంగా చూస్తే చాలామంది దేవుళ్లు కొండలమీదే కొలువుతీరారు. శివుడు కైలాస శిఖరాన్ని తన నెలవుగా చేసుకుని భక్తుల మొరలకు మంచులా కరుగుతున్నాడు. దక్షిణాదిలో అరుణాచలేశ్వరుడు అశేష భక్తుల ఆరాధ్యదైవంగా ఉన్నాడు. అక్కడ ‘గిరి ప్రదక్షిణ’ విశేషమైంది. రమణ మహర్షి సంచరించిన తావు, ఆయన ఆశ్రమంలో ఉండి, భక్తుల సందేహాలు తీర్చి జ్ఞానాన్ని ప్రసాదించిన నెలవు. ఆధ్యాత్మికతకు ఆటపట్టు అరుణాచలం. శ్రీశైలంలో మల్లికార్జునుడు వెలిశాడు. రాములవారయితే మన భద్రాద్రి పైనుండి భక్తులను భద్రంగా కాపాడుతున్నాడు. కృష్ణుడైతే గోవర్ధన గిరిధారిగా భక్తుల మనసుల్లో తిష్టవేశాడు. నరసింహస్వామి మంగళగిరి, యాదాద్రి, సింహాచలం మొదలైన కొండల పైనుండి కృపా వీక్షణాలు ప్రసరింపజేస్తున్నాడు. సత్యదేవుడు రత్నగిరి మీద స్థిరపడి కష్టాలు బాపి, వరాలిచ్చే దేవుడిగా పేరొందాడు. పళని కొండల్లో సుబ్రమణ్యేశ్వరుడు, శబరిమలలో అయ్యప్ప స్వామి.. ఇలా చెప్పాలంటే ఎందరో దేవుళ్లు.. ఎన్నో కొండలెక్కి కూర్చున్నారు. అసలు పార్వతీదేవే పర్వతరాజు కుమార్తె కదా. హిమవంతుడి పుత్రిక కావటం వల్లే ఆమె హైమవతి అయింది. ‘హిమగిరి తనయే హేమలతే.. అంబ ఈశ్వరి శ్రీలలితే మామవ’ అని ముత్తయ్య భాగవతార్ శుద్ధ ధన్యాసిలో ఎంత చక్కటి కీర్తన అందించారు. ఎన్నో గిరులుండవచ్చు. కానీ హిమగిరికి సాటి లేనే లేదు. అందుకే ఓ సినీకవి ‘హిమగిరి సొగసులు.. మురిపించును మనసులు.. చిగురించునేవో ఏవో ఊహలు’. అనడమే కాదు, ‘యోగులైనా మహాభోగులైన మనసుపడే మనోజ్ఞ సీమ.. సురవరులు సరాగాల చెలుల.. కలసి సొలసే అనురాగ సీమా..’ అంటాడు. అర్ధవంతంగాను, మధురంగాను ఉండేపాట.
అంతెందుకు ప్రవరుడు, సిద్ధుడు తన పాదాలకు పసరు పూయగానే కోరుకున్నది హిమవత్పర్వత సందర్శనమే. ‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్’… అని అల్లసాని పెద్దన హిమవత్పర్వత సౌందర్యాన్ని రమణీయంగా వర్ణించాడు. నిజానికి హిమాలయాలు మన భారతదేశానికి ఉత్తరాన పెట్టని కోటగా నిలిచి రక్షణ కల్పిస్తున్నాయి. సినారె కూడా ‘అహో హిమవన్నగము.. భరతావనికే తలమానికము’ అన్నారు. ఎందరో జ్ఞానాన్వేషణలో, ముక్తి మార్గంలో తరించటానికి హిమాలయాలలో జపతపాదులు చేసుకుంటూ మునులుగా, యోగులుగా ధన్యులు కావటం తెలిసిందే. ఇతిహాసాలను అవలోకిస్తే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చి, ఆ ఓషధితో మూర్ఛిల్లిన సౌమిత్రిని రక్షించిన విషయం తెలిసిందే. ఉత్తరాంచల్ లోని ద్రోణగగిరిని సంజీవని ఉన్న ప్రాంతంగా పరిగణిస్తున్నారు. ఇక మందర పర్వతమో.. దేవదానవుల సముద్ర మధన కార్యక్రమంలో కవ్వంగా ఉపయోగపడి విశిష్టంగా నిలిచింది. బీహార్ లోని బంక జిల్లాలో ఉన్న మందర పర్వతం ఇదేనంటారు. దీన్నే ‘మేరు పర్వతం’ అని కూడా అంటారు. అన్నట్లు మైనాక పర్వతం ఉంది. ఈ మైనాకుడు పార్వతికి సోదరుడు.. అంటే శివుడికి బావమరిది. అలనాటి పర్వతాలకు ఎగిరేశక్తి, అవసరాన్ని బట్టి పరిమాణం పెంచుకునే శక్తి కూడా ఉండేవట. ఇంద్రుడు ఓ సందర్భంలో పర్వతాలను అపార్థం చేసుకోనివాటి రెక్కలను తెగగొట్టసాగాడట. అప్పుడు మైనాకుడు వాయుదేవుడి సాయంతో సముద్రం అడుగున చేరి ఆత్మరక్షణ చేసుకున్నాడు. ఆ తర్వాత రామాయణ కాలంలో సీతాన్వేషణకు పయనమైన హనుమంతుడు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా మైనాకుడు పైకి వచ్చి స్వాగతం పలికాడట. రామకార్యంలో సహకరించేందుకు ముందుకు వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు కూడా మెచ్చుకుని ‘ఇక పైనీ ఇష్టమైన తావులో ఉండవచ్చ’ని పలికాడట.
మరి వింధ్యపర్వతమో.. జగతిలో తానే ఎత్తయిన పర్వతంగా ఉండాలని, మేరు పర్వతాన్ని మించిపోవాలని అదే పనిగా ఎదిగి భూమి సమతుల్యతను దెబ్బతీయడంతో ఇంద్రుడు, అగస్త్యముని వద్దకు వెళ్లి వింధ్యను అదుపు చేయమని కోరాడట. అగస్త్యుడు సరేనని తన కుటుంబంతో సహా దక్షిణాదికి బయలుదేరి అడ్డుగా నిలిచిన వింధ్యను చూసి ‘వింధ్యా’ అని పిలవడంతోనే వింధ్య ప్రత్యక్షమై అగస్త్యుడిని గురువుగా సంభావించింది. అగస్త్యుడు తాను దక్షిణాదికి కార్యార్ధిగా వెళుతున్నానని, అందువల్ల అడ్డు తొలగాలని కోరాడట. అందుకు వింధ్య నమ్రతగా వంగిపోయి వెళ్లమందట. అగస్త్యుడు ఎంతో తెలివిగా తాను మరలివచ్చేదాకా అలాగే వంగి ఉండాలని అనడం, వింధ్య అంగీకరించడం జరిగిపోయాయి. అగస్త్యుడు దక్షిణాదిలోనే ఉండిపోయాడు, వింధ్య అలా వంగిపోయే ఉంది. మన పురాణ కథలు ఎంత గొప్పగా ఉంటాయో!
కొండల చరిత్ర కొండంత. కొండలకు, పర్వతాలకు తేడా ఏమిటి అంటే తొమ్మిది వందల మీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉంటే కొండలని, ఎక్కువ ఎత్తు ఉంటే పర్వతాలని అంటారు. పర్వతాలలో ముడుత పర్వతాలు, డోముల్లా ఉండే పర్వతాలు, అగ్ని పర్వతాలు.. వంటి ఎన్నో రకాలున్నాయి. అగ్నిపర్వతాలను ప్రమాద హేతువులుగా మాత్రమే భావిస్తాం కానీ వాటి వల్ల కూడా ప్రయోజనాలున్నాయి. భూమి ఏర్పడిన తొలిదశలో అగ్ని పర్వతాల వల్లనే భూమిమీద సముద్రాలు, పర్వతాలు, పీఠభూములు, సమతల ప్రదేశాలు ఏర్పడటం వల్ల అద్భుతమైన నైసర్గిక స్వరూపం అవతరించింది. లావా ప్రవహించిన నేల అత్యంత సారవంతంగామారుతోంది. అంతేకాదు అగ్నిపర్వతాలు మొక్కలకు కావలసిన కార్బన్ డైఆక్సైడ్‌ను అందిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఉత్తర కాలిఫోర్నియాలో అగ్నిపర్వత ప్రజ్వలనం నుంచి జనించే శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చి వినియోగించుకొంటున్నారు. ఇక రంగు పర్వతాలు మరింత రమణీయంగా ఉంటాయి. చైనాలో డాంక్సియాలోని ‘రెయిన్బో మౌంటెన్స్’ అందాలు చూసి తీరవలసిందే. ఎన్నెన్నో మిలియన్ల సంవత్సరాల పాటు శాండ్‌స్టోన్స్, మినరల్స్ ఒత్తుకోని ఈ రంగు పర్వతాలు ఏర్పడ్డాయట. బ్రిటిష్ కొలంబియాలో కూడా ఇటువంటి రెయిన్బో రేంజ్ ఉంది.
కొండల పై గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందో! అందుకే ఆరుద్ర గారు ‘కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది.. గోదావరి తరగలాగా కోరిక చెలరేగింది..’ అని ఓ చక్కని సినీగీతం రాశారు. కొండలు ఎంతగొప్పవి కాకపోతే పిల్లల్ని ‘బంగారు కొండ’ అని ముద్దు చేస్తాం. సినిమాల్లో అయితే హీరోయిన్లు ‘మావారు బంగారు కొండ’ అని, ‘బంగారు కొండ, మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా’ అని పాడటమూ కద్దు. పిల్లలకు చందమామను చూపుతూ, ‘చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. గోగుపూలు తేవే’ అని తల్లులు కమ్మగా పాడటం మామూలే.. ఇప్పుడు అలా పాడటం తగ్గిపోయినా.. నిన్నమొన్నటిని నెమరేసుకొని మళ్లీ పాడితే ఎంత బాగుండు. కొండను ఉపమానంగా చెపుతూ వేమన ‘అనువుగాని చోట నధికులమనరాదు చెమైన నదియు గొదువకాదు కొండ యద్దమందు గొంచెమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ! అన్నాడు. ఇక నిత్యవాడకంలో కొండమీద కోతినైనా తెచ్చిస్తా, కొండను తవ్వి ఎలుకను పట్టారు. కొండంత అండ, మనసులో అగ్ని పర్వతం బద్దలైంది వగైరా ప్రయోగాలు ఉండనే ఉన్నాయి. పర్వతాల ప్రాముఖ్యతను గుర్తించే మన జాతీయగీతం ‘జనగణమన’లో వింధ్య, హిమాచలాలను ప్రస్తావించారు.
కొండలు.. పర్వతాలు ప్రకృతి సౌందర్యారాధకులకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. సమున్నతంగా నిలిచి, రకరకాల ఆకృతులలో, చీకటి, వెలుగులలో వైవిధ్య అందాలను సంతరించుకుంటూ, స్వాగతాలు పలుకుతుంటాయి. ఇలా ఆకర్షిస్తూ తమను అధిరోహించమని సవాలు చేస్తున్నట్లుగా ఉండే పర్వతాలను, కొండలను అధిరోహించటం మనిషి అభిరుచుల్లో ఒకటి. క్లైంబింగ్, ట్రెక్కింగ్, హైకింగ్, మౌంటెనీరింగ్ పేరిట ఎందరో సాహసికులు వాటిని అధిరోహించి, విజయపతాకలు ఎగుర వేస్తున్నారు. ప్రపంచంలో ఎత్తయిన పర్వతశిఖరం ఎవరెస్ట్‌ను ప్రప్రథమంగా అధిరోహించిన ఖ్యాతి నేపాలీ అయిన టెన్జింగ్ నార్గేకు దక్కింది. నాటినుంచి నేటి వరకు ఎందరెందరో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తూనే ఉన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి వనిత ‘తాబే జుంకో ‘. ఎవరెస్ట్‌ను ఎక్కిన తొలి భారతీయుడు అవతార్ సింగ్ కాగా, తొలి భారతీయ మహిళ బచ్చేంద్రీపాల్. ఇంకా ముఖ్యంగా గుర్తుచేసుకోవలసింది మన తెలుగువాడు మల్లిమస్తాన్ బాబు గురించి. పర్వతారోహణ అంటే ప్రాణం పెట్టిన మల్లిమస్తాన్ బాబు 2006 సంవత్సరంలో అన్ని ఖండాలలోని ఏడు అత్యున్నత పర్వతశిఖరాలను అత్యల్ప కాలపరిధిలో… నూటడెబ్బైరెండు రోజుల్లో అధిరోహించిన తొలి భారతీయుడిగా, తొలి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డులకెక్కి, తెలుగుజాతికే గర్వకారణంగా నిలిచారు. అలా పర్వతమంత కీర్తినార్జించిన మల్లిమస్తాన్ బాబు 2015 సంవత్సరంలో ఆండీస్ పర్వతాల్లోని ట్రెస్ క్రుసెస్ సర్ శిఖరాన్ని అధిరోహించి తిరిగి వస్తూ ప్రతికూల వాతావరణంలో ఆ పర్వతాలకే ప్రాణాల నిచ్చేశారు. ఏమైనా యువసాహసికులకు మల్లి మస్తాన్ బాబు ఓ స్పూర్తిగా నిలిచే ఉంటాడు. డార్జిలింగ్‌లో, ఉత్తర కాశీలో, గుల్ మార్గాలలో పర్వతారోహణ శిక్షణా సంస్థలు అభిరుచిగలవారికి తర్ఫీదునందిస్తున్నాయి. కొండలు ఆదినుంచి మనిషికి అండగా ఉంటూనే ఉన్నాయి. భూఉపరితలంలో నాలుగో వంతును పర్వతాలు ఆక్రమిస్తున్నాయి – ప్రపంచంలోని ఏడువందల ఇరవై మిలియన్ల ప్రజలకు పర్వతాలు ఆవాసాలుగా ఉన్నాయి. పర్వతప్రాంతాలలో అసంఖ్యాకంగా ఉండే వృక్షాలు, విశేష ఔషధ మొక్కలు ఎన్నెన్నో రకరకాల కలప నందిస్తున్నాయి. మరెన్నోరకాల ఆహార తదితర అవసరాలను తీరుస్తున్నాయి. కొండల పై సైతం వ్యవసాయం సాగుతోంది. ఆదివాసీల జీవనానికి అండగా నిలిచింది కొండలే. కొండల నుండి, పర్వతాలనుండి దూకే జలపాతాలు కనువిందులే కాదు, ప్రాణికోటికి ప్రాణాధారాలు. కొండలు మనుషులకే కాదు, ఎన్నో రకాల జంతువులకు, పక్షులకు ఆవాసాలు. అన్నిటినీ మించి వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తి పర్వతాల సొంతం. వర్షాలు కురిసేందుకు పర్వతాలెంతో దోహదపడుతున్నాయి. పర్వతాలలోని హిమనదాలలోనే ఎన్నో నదులు ఆవిర్భవిస్తున్నాయి. గోదావరి నాసికా త్రయంబకంలో, కృష్ణ మహాబలేశ్వర్‌లో పుట్టడం మనకు తెలిసిందే. ఇలాటివెన్నో.
ప్రశాంత పర్వత ప్రకృతి మానవాళికి నిజంగా వరమే! భారత్‌లో హిమాలయా పర్వతశ్రేణులు కాక, ప్రధానంగా చెప్పుకోవలసినవి కారాకోరం పర్వతశ్రేణులు, పీర్ పంజల్ పర్వత శ్రేణులు, పూర్వాంచల్ పర్వతశ్రేణులు, సాత్పుర, వింధ్య పర్వతశ్రేణులు, ఆరావళి పర్వతశ్రేణులు, పశ్చిమకనుమలు, తూర్పు కనుమలు.
కొండల్ని స్వార్థం కోసం తవ్వేయడం, ఎవరెస్ట్ లాంటి శిఖరాల్ని సైతం ప్లాస్టిక్ తదితర చెత్తలతో నింపేయడం వంటి తప్పిదాలను మనిషి ఎప్పుడు సరిదిద్దుకొంటాడో? తప్పుచేయక, తలవంచనిరీతిలో సమున్నతంగా నిలిచి, మానవాళికి మహెూపకారం చేస్తున్న పర్వతాలు మనిషికి మార్గదర్శులు. వాటి నుంచి స్ఫూర్తి పొంది, మనిషి మానవతతో, కొండంత మనసుతో మహోన్నతంగా ఎదగాలి…
గేటు చప్పుడవటంతో ఆలోచన ‘కొండ’ దిగేసింది. ఎవరో ఆగంతకుడు ఎవరి ఇల్లో వెతుక్కుంటూ వచ్చాడు. ఇంటి నెంబరు చెపితే వెనక రోడ్లోకి వెళ్లమని చెప్పి, దూరంగా ఉన్న కొండలవైపు చూశాను. పైనున్న దేవుడి గుడి మార్గానికి ఇరువైపులా ఉన్న ట్యూబ్ లైట్ల కాంతిలో కొండ మళ్లీ నన్ను హిప్నటైజ్ చేయబోతుంటే టైము గుర్తుకొచ్చి వేగంగా వెనుతిరిగాను.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
5 Comments
Prabhakaram
J. Syamala garu given a vast information on hills and mountains. An excellent article.
Sivvam. Prabhakaram
Syamala Dasika
Beautifully written!
Syamaladevi Dasika
New Jersey
Hima
Thank you for the mountain of information and interesting details Syamala garu . Keep writing…
Himabindu
Deepa
Another excellent read in this series!! Absolutely recommend reading the whole series!!
ఆర్.దమయంతి
baavumdamDi.
abhinandanalu.