ఊరు నిదురోతూ వుంది. ఊరికి దూరాన ఓ పూరిగుడిసెలో రత్తాలు ఓ చింకి చాప పైన కునుకుపాట్లు పడుతూ వుంది. గుడిసెలోని కిరోసిన్ లాంతరు చీకట్ని పారద్రోలే ప్రయత్నంలో విఫలురాలై బిక్కబిక్కు మంటోంది. నిద్దట్లోనే, కిసుక్కున నవ్వుతోంది రత్తాలు. కిరోసిన్ లాంతర్ లాగే ఆకాశంలోని నక్షత్రాలు, చీకటిని పారద్రోలాలనే ప్రయత్నంలో ఓటమి పాలై తామూ నిద్రలోకి జారుకుంటున్నట్లుగా వున్నాయి. దూరంగా ఉన్న చెట్లు, చల్లని గాలి స్పర్శకి తలలూపుతూ జోగుతున్నాయి. అందరి కళ్లూ నిద్రలోకి జారుకుంటూ వుంటే, రత్తాలు మొగుడు కదిరిగాడి కన్నులకి, వాడి చేతిలోని వేటకొడవలికి మాత్రం నిద్ర దూరమయ్యింది. వాళ్లిద్దర్నీ తన ఒడిలోకి తీసుకోడానికి శతవిధాల ప్రయత్నించి ఓడిపోయింది నిద్రాదేవి. వేటకొడవలి తన పదునుని పెంచుకుంటూ పోతూ వుంది. పట్టు విడవకుండా ‘సర్ సర్’ మని వేటకొడవలిని, గార అంచుపైన పైకీ కిందికీ పోనిస్తున్నాడు కదిరిగాడు. వేడెక్కింది కొడవలి. కదిరిగాడి శరీరమూ వేడెక్కింది. కళ్లు ఎఱుపెక్కాయి. కొడవలి అంచు పదునెక్కుతున్నకొద్దీ, కదిరిగాడి కళ్లల్లో కసి పెరుగుతూనే వుంది. “అద్ది పదునంటే ఇల్లాగుండాల. నాయాల్ది, ఎవ్వడైదురైనా ఒకే ఒక్క ఏటు అంతే… మాటల్తో ఇన్నాడా సరేసరి, లేకుంటేనా తల తెగిపడాల. నా కొడుకు…. గొడ్డు సాకిరీ సేయించుకొని, తినడాన్కి ఇంకిన్ని గింజలిమ్మని అడిగితే.. నా కొడుకా… ఇయ్యనంటావురా… మా అయ్య నీకాడే గొడ్డు సాకిరీ సేసినాడు. నేనూ నీకాడనే… నా కొడుకులూ అదే సాకిరీ సెయ్యాల్నా? ఉన్న ఇల్లూ, గొడ్డు గోదా, ఎకరా పొలం నీవే పీక్కొంటివి. మాకింకే ముందని? మానం మూసుకోడానికింత గుడ్డ, తినడానికి పిడికెడు ముద్ద తొంగోడాని ఓ తాటాకుల కొంప – సచ్చేంత వరకూ ఇంతేనా. మాకేం ఇట్టాలు లేవా. అన్నీ మీకే? కట్టుకున్న పెళ్లానికి ఓ కొత్త చీర… థూ… మా బతుకులు చెడా. మీరు కట్టుకుని ఇడిసిపారేసిన గుడ్డల్నే మేం కట్టుకోవాలా? దుడ్లు కాలాలని అడిగితే ‘దుడ్లు సెట్లకి కాస్తాయనుకుంటావురా… లం… కొడకా… మీ అయ్య నా కాడ సేసిన అప్పుని తీర్సకనే ఎల్లి పోయినాడు. ఆ పైసలు ఎవడిస్తాడ్రా మీ తాతనా…’ అంటావా!”
“ఉండేందికి అంత పెద్ద కొంప నీకు!… నీవు… నీ బానకడుపు… బానకడుపు నా కొడుకా… కూకుంటే లేవలేవు… లేస్తే కూకోలేవు… నీకూ ఓ పడుస పెళ్లాం కావాల్సి వచ్చిందిరా… థూ…”
ఆగకుండా, గచ్చునేల మీద సరా సరా పైకికిందకీ దిగతూనే వుంది కొడవలి. “పెద్దమ్మగారు, నీవు పెట్టే బాధలు పడ్లేక, ఆయమ్మ నీ పీడ ఒదిలించుకొని సొరగాని కెళ్లి మంచి పని చేసినాది. పెళ్లీడు కొచ్చిన కూతుర్ని బెట్కోని, ఆ బిడ్డకి మనువు సేస్తామనే బుద్ది లేక పాయే గాని రెండో ఆడది కావాల్సొంచ్చిందిరా నీకు… థూ… పాపం ఆ బిడ్డ బంగారం అట్లాంటిది… నీ రెండో పెండ్లాం సేతిలో నరకయాతన పడతా ఉండాది. నీ రెండో పెండ్లాం మాత్రం సొమ్ములన్నీ దిగేసుకుని కులుకుతూ వుంటాది. ఆ ఆడదాని సూపులన్నీ కండ బలసిన మా జీతగాళ్ల మీదే, కొరుక్కొని తినేటట్లుగా వుంటాయి అవి.”
సాన బెట్టటం ఆపి, కొడవలి పదును చూడటానికని ఎడం చేతి బొటన వేలిని కొడవలి అంచు వెంబడి పోనిచ్చాడు. అంతే పై చర్మం తెగి, సర్రున వేడి రక్తం బయటికొచ్చింది. గబుక్కున వేలిని నోట్లో పెట్టుకున్నాడు. ఉప్పగా వేడిగా వుంది. కొడవలి వైపు ఇంకోసారి చూసి దాన్ని ముద్దెట్టుకున్నాడు.
నడి రేత్రి కావడానిక కెంతో సేపు లేదు. ఆలస్యం చేస్తే వ్యవహారం చెడిపోతుంది. తలకు చుట్టుకున్న తుండుగుడ్డని నడుముకు బిగించాడు. గుడిసె తలుపులు మూయటానికని రెండడుగులు ముందుకేశాడు. లోపల రత్తాలు పూర్తి నిద్దట్లో వుంది. ఏం కలవరిస్తూ వుందో ఏమో పెదవులు నవ్వుతున్నాయి. ఎదలని కప్పుతున్న చిరిగిన చీర కొంచంగా దారి తప్పింది. కన్నాల రవికెలోంచి ఎత్తయిన ఎదల రవికె ముడిని తప్పించుకొని బయటకి రావటానిక తాపత్రపడుతున్నాయి. ఇంకో సమయంలోనైతే వాటిని సముదాయించి, బుజ్జగించి, ముద్దుల్తో ముంచెత్తి వాటి సరదా తీర్చేవాడే. కాని ఇప్పటి పరిస్థితే వేరుగా వుంది. రత్తాలు పైన వాడికి మనసు కాలేదు. గుడిసె వాకిల్ని దగ్గరగా వేసి చేత కొడవల్ని బట్టి ముందుకు నడిచాడు.
అర్ధరాత్రి కావస్తోంది. దారి కడ్డం వస్తున్న ముళ్ల తీగ ల్లాంటివి కొడవలి పదునును చవి చూస్తున్నాయి. దారి కానరావటం కష్టం అవుతోంది. ఇంతలో ఆ చీకట్లో నుంచి ప్రాణి ఏదో చెంగున ఎగిరి పైకి దూకింది. అది కుక్కో, అడవి పిల్లో, నక్కో తెలీదు. అంతే కొడవలి దాన్ని చీల్చేసింది.
కొంత సేపయిన తర్వాత తన యజమాని ఇల్లు చేరాడు కదిరిగాడు. ఏ వైపు నుంచి లోని కెళ్లాలో తెలీలేదు. దొడ్డి గుమ్మం గుండా వాకిలిని పగులగొట్టయినా సరే లోనికెళ్లాలని, గడ్డివాము ప్రక్కనే నడుచుకుంటూ దొడ్డి గుమ్మం చేరాడు. ఎడం చేత్తో ఒక్కతోపు తోశాడు. తన కోసమే లోపల గొళ్లం వెయ్యకుండా ఉంచినట్టుగా, కిర్ మనే శబ్దంతో తెరుచుకుంది. అలా ఎందుకు తెరచి వుంచబడిందో ఆలోచించే వ్యవధి లేదు కదిరిగాడికి. అడుగులో అడుగు వేసుకుంటూ కొడవల్ని చేత బట్టుకొని ముందుకు నడిచి వెళ్లాడు. డాబా పైకి వెళ్లడానికి గోడకి ఆనించి వుంచిన నిచ్చెన కనబడింది. నెమ్మదిగా, అతి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టే ఎక్కి డాబా చేరాడు. కటిక చీకటి. ఇంతలో ఉన్నది ఉన్నట్టుగా కరెంటు బల్బు వెలిగింది. కళ్లు జిగేల్ మన్నాయి. ఒక్కసారిగా భయం ఆవరించింది. పరుగెత్తి కెళ్లి అక్కడున్న పీపా వెనక నక్కి దాక్కున్నాడు. ఆ వెలుగులో శ్రద్దగా గమనిస్తున్నాడు. ఆవులిస్తూ, బయటకొచ్చింది యజమాని పడుచు పెళ్లాం. బాత్ రూంలో నుంచి. బెడ్ రూం లోకి వెళడానికి తలుపు తెరిచే వుంది. అంతే, అదే అదనుగా, ఒక్క ఉదుటున వెళ్లి ఆమెను వెనకాల్నుంచి వాటేసుకున్నాడు గట్టిగా. బిగ్గరగా అరవబోయింది, బలమైన తన అరచేత్తో, ఆమె నోటిని అదిమి పెట్టి “అరవొద్దు సంపెత్తా” అంటూ వాడి కొడవల్ని ఆమె కంఠం మీద ఉంచాడు. భయంతో వణికి పోతూ, “ఎవర్నువ్వు” అంటూ వాడి చేతి వ్రేళ్ల పట్టునుంచి సడలించుకొని, వెనక్కు తిరిగి, లైటు వెలుగులో కదిరిగాడి ముఖాన్ని చూస్తూ, “నీవా! కదిరిగా! ఇవ్వాళ్లప్పుడు ఎందుకొచ్చావ్ రా” అంటూ చేయి పుచ్చుకొని వెళ్లి తన శయ్యపైన కూర్చోబెట్టింది. ఎన్నాళగానో వాడి పైన మోహం పెంచుకుంది. తలవని తలంపుగా వచ్చిన తన అదృష్టానికి తన్ను తానే మెచ్చుకుంది. మంచం మీద కూర్చున్న కదిరిగాణ్ణి ఒక్కసారిగా వాటేసుకోబోయింది. వాడు విసిరి కొట్టిన కొట్టుడికి అంత దూరంలో ఎగిరి పడింది. దగ్గరి కొచ్చి “కదిరిగా, నా ఆకలి తీర్చు. నీకేది కావాల్సినా ఇస్తా…రా” అంటూ తన చీర పైట జార్చింది.
“థూ… నీవూ ఓ ఆడదే. నాయజమాని పెళ్లానివి. నాతో పడుకొంటావా సిగ్గులేదా?”
“సిగ్గూ, ఎగ్గూ మాట్లాడను ఇది సమయం కాదు… రా… నన్ను సుఖపెట్టు నీకేది కావాలన్నా ఇస్తా.”
“ఏంది కావాలన్నా ఇస్తావా?”
“ఒట్టు”
“అయితే” “అడుగూ” “దుడ్లు కావల్ల… ఇస్తావా? ”
“ఇస్తా… ఎంత కావాలి?”
“ఎంత అంటే, కొత్త గుడిసె కట్టుకోవాలి నా రత్తాలుకి కొత్త సీరలు, చెవులకి పోగులు, నాకు కొత్త బట్టలు ఇన్ని కావాలి.”
“అంతేనా ఇస్తా రా మరి” అంటూ పైబడపోయింది.
“దూరంగుండు ఇప్పుడు కాదు. మెదట పైసలు చేతిలో పడాల, అప్పుడు.”
“అయితే ఉండు” అంటూ లోపలికెళ్లి నోట్ల కట్టల్తో వచ్చి, వాడి ముఖం మీద ఊపింది.
నోట్ల కట్టల్ని చూడగానే కదిరిగాడికి మతిపోయినట్లయ్యింది. వాడి జీవితంలో అంత డబ్బు నోట్ల కట్టల రూపంలో చూసి ఎరగడు. నోరు వెళ్లబెట్టుకుని అట్లాగే చూస్తుండిపోయాడు.
“రా మరి. పడుకుందాం.”
“ఇప్పుడు కాదులే. ఇంకోసారి కొస్తా. ఆ డబ్బిచ్చెయ్.”
“అది కాదులే. నే చెప్పినట్టు చెయ్యి. ఆ తర్వాత డబ్బు” అంది గోముగా.
“ఇవ్వవా… అయితే సూడు దీన్ని…” కొడవల్ని చూపించాడు. భయపడిపోయింది. ఇంతలోనే ఏదో అలికిడి అయ్యింది. దగ్గు లాంటి శబ్దం. మొత్తం కట్టలన్నింటినీ కదిరిగాడి చేతిలో వుంచి, “రేపు రాతిరికి తప్పకరా. నీ కోసం వాకిలి తీసి వుంచుతాను. ఇదిగో ఈ టార్చ్ తీస్కోని పో. రేపు రాత్రి డాబా పైకి లైటు వెయ్యి. నే వచ్చి తలుపు తీస్తా!” అంటూ వాడ్ని వాటేసుకుని ముద్దులు పెట్టుకొని బయటికి సాగనంపి గది తలుపులు మూసుకుంది.
గది నుంచి బయటపడటమే తరువాయి, కదిరిగాడు తన నడుముకు బిగించిన తుండు గుడ్డని తీసి, అందులో నోట్లు కట్టల్నుంచి, రెండు మూడు చుట్టలు గట్టిగా దాన్ని తన నడుముకి బిగించాడు. ఏనుగంత బలం వచ్చింది. వాడికిప్పుడు కొత్త ఇల్లు, మల్లు పంచె, జుబ్బాతో తాను, కొత్త జరీ అంచు చీరలో, చెవులకి రాళ్లకమ్మల్తో, ముక్కు పుడుకతో రత్తాలు వయ్యారంగా ఊగిపోతున్నట్లు కన్పించి చివారికి తానెక్కి వచ్చిన నిచ్చెన గుండా దిగివచ్చి, తెరచి వుంచిన దొడ్డి గుమ్మం గుండా బయటికొచ్చి, గడ్డివాము ప్రక్కగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళుతుండగా, గడ్డివాము ఇంకో దిక్కు నుంచి ఎవరెవరివో గుసగుసలు. “నాకెందుకో బయంగావుంది” ఆడగొంతు, ఏడుపు “ష్. ఏడవబాక, నీకెందుకు నేనుండాను గదా, బయమెందుకు? ఎల్లి పోదం పద. తెల్లార్తే కట్టం… ఎల్లిపోదాం పద”. ఆ గొంతుక లెవరివో కాస్త కాస్త తెలిసివచ్చింది కదిరిగాడికి. నిర్దారించుకోడానికని టార్చ్ వెలిగించాడు. ఇద్దరి ముఖాలపైన కాంతి. తన అనుమానం నిజమయ్యింది. ఆ ఇద్దరి ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. కొయ్యబారిపోయారు. వాళ్లిద్దర్నీ చూసి బిర్ర బిగుసుకుపోయాడు కదిరిగాడు. కాస్సేపటికి తేరుకుని “చిన్నమ్మణ్ణి! మీరా! బికారి నా కొడుకు ఈ కుల్లాయి గాడితో మీరా!” అని, “ఓరే కుల్లాయిగా, చిన్మమ్మగారితోటేరా నీ సరసాలు నా కొడకా. ఈ రోజు నీకు నూకలు సెల్లిపోయాయిరా” అంటూ కొడవల్ని పైకెత్తాడు. అంతలోనే చిన్నమ్మాయిగారు కుల్లాయి గాడి ముందు కొచ్చి “కదిరన్నా నీకు మొక్కుతా, మమ్మల్ని ఇడ్సిపెట్టు. కుల్లాయి గాడి తప్పేంలేదు. నేనీ ఇంట్లో, మా పిన్ని పెట్టే నరకాన్ని భరించలేను. ఈడ వుండే దాని కంటే పారిపోయి, తిరపమెత్తుకోనైనా బతుకతా. నీకాల్మొక్తా కదిరన్నా. నాకీ సాయం చెయ్యి” అని విలపిస్తూ ప్రార్థించింది. కరిగిపోయింది కదిరిగాడి మనసు. అయినా బంగారం లాంటి ఆడకూతురి జీవితం పాడై పోతూవుండే… కృంగిపోయాడు కదిరిగాడు. “అమ్మాయిగోరూ ఇంకోసారి ఆలోచించుకోండి” అన్నాడు ప్రాధేయ పూర్వకంగా.
“నేనీ ఇంట్లో పడే నరకయాతన నీకు తెలీదా కదిరన్నా. తెలిసి తెలిసీ నన్ను ఈ కూపంలోనే ఈదులాడమంటావా కదిరన్నా.”
వస్తున్న కన్నీళ్లని ఆపుకొనే ప్రయత్నం చేస్తూ “సరే అమ్మాయగోరు పదండి మీ ఇద్దర్నీ ఊరు దాటిస్తా. మీకేది బయం లేదు నాతో రండి” అంటూ వాళ్లిద్దర్నీ ఊరు పొలిమేర దాటించాడు.
“వెళ్తొస్తాం కదిరన్నా నీ సాయం ఎప్పటికీ మర్చిపోము” అంటూ వాడి నుంచి సెలవు తీసుకుని అడుగులు ముందుకు వేశారు. వాళ్లనే చూస్తూ నిలబడ్డాడు కదిరిగాడు. అప్రయత్నంగా వాడి చేయి నోట్ల కట్టలున్న తుండుగుడ్డను తాకింది. అంతే, “అమ్మాయిగోరు కాస్తా ఆగండి” అంటూ పరుగున వాళ్లని చేరుకుని తండు గుడ్డ లోనికి నోట్లని విప్పదీసి వాట్ని చిన్నమ్మగారి చేతిలో పెట్టి “ఉంచండి అమ్మగోరు. సుకంగా కాపురం సెయ్యండి” అన్నాడు. నోట్లకట్టలన్ని చూస్తూ ఆశ్చర్యంతో అడిగింది “ఇంత డబ్బు నీకెక్కడిది కదిరన్నా. వద్దు నీవే వుంచుకో” అని వాపస్ ఇవ్వబోతే, “అమ్మాయిగోరు ఇది మీ డబ్బేనండి. నాది కాదు. మీ పుట్టిండిదే. ఎట్లా వచ్చిందని అడగొద్దు. ఉంచండి. ఏరా కుల్లాయిగా అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోరా” అంటూ వాళ్లు వెళ్లిపోతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు కదిరిగాడు.
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు. జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English) హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
శ్రీ మహా భారతంలో మంచి కథలు-1
సరిగ పదమని-6
అమ్మ కడుపు చల్లగా-48
చైతన్య సూర్యుడు
నవ్య సంప్రదాయోద్యమం: విశ్వనాథ భూమిక
కలవల కబుర్లు-24
‘అటుగా వంగిన ఆకాశం’ – పుస్తక పరిచయం
ఫోన్ నెంబర్ ఇవ్వకండి ప్లీజ్
మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-10
నవలా రాణికి పద్య నివాళి!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®