రాగలత చిలుక సారంగితో శివాలయం చేరుకుంది. చిలుక శరీరంనుంచి నిజశరీరంలో ప్రవేశించాడు జయదేవ్. ఇద్దరూ నదీతీరానికి విహారానికి పోయారు.
తిరిగి వచ్చేసరికి దుందుభి శివలింగం వెనుక జయదేవుని శరీరము కానరాక, కంగారుపడుతూ, హేమాంగి మైనాకులకు జయదేవుని వృత్తాంతం చెబుతున్నది.
జయదేవ్, రాగలతను చూసి హేమాంగి, మైనాకులు ఆశ్చర్యపోయారు. “ఇద్దరు రాగలతలా! ఇద్దరు హేమాంగులా!”
అచ్చుగుద్దినట్టు ఒకే రూపం. కవలబిడ్డలా!
దుందుభి వారిని ఒకరినొకరికి పరిచయం చేసింది. “నాకు తోబుట్టువులు లేరు. గుండా పకీరు ఎక్కడినుంచో నన్ను అపహరించి తెచ్చాడు” అన్నది హేమాంగి. “నాకూ తోబుట్టువులెవరూ లేరు” అన్నది రాగలత.
మైనాకుడు తమ రాజ్యాన్ని నవరంగ్ ఆబాద్ సుల్తాన్ ‘అమరఖాన్’ ఆక్రమించుకొని, తన తండ్రిని సంహరించి, తనను బంధించాలని ప్రయత్నించడంతో పారిపోయి అజ్ఞాతవాసములో ఉన్నట్లు తెలియజేశాడు. అందరికీ శత్రువైన గుండా ఫకీర్ని సంహరించాలని నిర్ణయించు కున్నారు.
అదే సమయములో గుండా ఫకీరు మహాబలమహారాజును కలవటానికి వెళ్ళాడు. ‘మీరు బ్రతికే ఉన్నారా’ అని ఆశ్చర్యపోయాడు మహారాజు. ‘ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతుల్ని చేయాలని గుర్రం పైనుండి పడిపోయినట్లు నటించాను. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అన్నాడు.
“మాకు గాలి గుఱ్ఱమును కానుకగా ఇస్తామని మీరు అన్నమాట మర్చిపోయారా” అన్నాడు మహారాజు. “మీ అంతఃపురం లోని చిలుకను మాకు కానుకగా ఇస్తామన్నారు కదా” అన్నాడు పకీరు. “తప్పక ఇస్తాను. రేపటి సభకు రండి” అంటూ మహా రాజు వెళ్ళిపోయాడు.
ఫకీరు అక్కడే నిలుచుని, ఒక భటుడు రావడం గమనించి రాగలత గురించి, చిలుక గురించి విషయ సేకరణకు ప్రయత్నించాడు.
‘ఒకసారి రాణివాసం చూడాలని ఉంది’ అన్నాడు. భటులలో నాయకుడైన అతడు ఫకీరును తన స్నేహితురాలు మంజరి వద్దకు తీసుకుని వెళ్లి ‘ఈయనకు రాణివాసం చూపించు’ అని కనుసైగ చేసి చెప్పాడు. ఆమె అతి వినయముతో ఫకీరుని ఉద్యానవనంలోని తీసుకొని వెళ్ళి, అక్కడున్న పెద్ద పాడుబడిన బావిని చూపింది. ‘అంతఃపురానికి వెళ్లడానికి రహస్యమార్గం ఇదే’ అని చెప్పింది. ఆత్రంతో తొంగిచూస్తున్న ఫకీరుని మంజరి, నాయకులు ఇద్దరూ ఆ నూతిలోకి తోసివేశారు.
“మహారాజుచే నరకబడిన నూరుగురు యువతల మృత కళేబరాలు ఆ నూతి లోనే పడేసారు. వారందరూ పిశాచాలు అయినట్టుగా అప్పుడప్పుడు హాహాకారాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ గంటల దెయ్యాన్ని అవి పీక్కు తింటాయి” అన్నది మంజరి. సంతోషంతో ఇద్దరూ అక్కడ నుండి వెళ్లిపోయారు.
***
ఎనిమిదవ రాత్రి కథను ప్రారంభించింది చిలుక సారంగి.
గోరిలో ఉన్న లాల్మియా వాయసరూపంలో వచ్చిన వానిని గుర్తించాడు. గతం గుర్తుకువచ్చింది……….
దేశాంతరగతుడై, హిమాలయ పర్వత ప్రాంతాలలో సంచరిస్తూ సర్వమంత్ర సిద్ధులు సంపాదించిన లాల్మియా తిరిగి వస్తుండగా ఒక అరణ్య ప్రాంతంలో జంతువులను వేటాడుతున్న ఒక నవమోహనాంగి కనిపించినది. చాలాసేపు వీరోచితంగా వేటాడిన ఆమె డస్సి, కూర్చున్న సమయంలో ఆమె దగ్గరికి వెళ్లాడు తను. ఆమె పేరు “చిత్రరేఖ” అని, వక్రనాథుడు అనే రాక్షసుని పత్ని అని తెలుసుకున్నాడు. ‘నీవంటి సౌందర్యరాశికి భర్త ఒక రాక్షసుడా, నన్ను వరించు’ అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. పెనుగులాడుతూ పెద్ద గొంతుతో అరిచిందామె. పరిసరారణ్యంలో వేటాడుతున్న వక్రనాధుడు భార్య అరుపులు విని పరుగు పరుగున వచ్చాడు. పట్టలేని ఆవేశంతో దూరం నుంచే చేతి కరవాలమును విసిరాడు. కానీ ఆ కరవాలం గురితప్పి తనకు తగలవలసినది పోయి చంద్రలేఖకు తగిలింది. ఆమె విపరీతంగా గాయపడి, క్రిందపడి మరణించింది. భార్య మరణంతో రెచ్చిపోయిన అతడు తనపైబడి కసిగా పోరాట సాగాడు. అతడు మహా బలవంతుడు. అతని ముందు నిలవలేక అదృశ్య విద్య ప్రభావంతో వాని కంటికి కనపడకుండా మాయమై పారిపోయాడు.
ఈ విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు లాల్మియా. మహిమలన్నీ కోల్పోయిన ఈ తరుణంలో తనను రక్షించగలిగినది తల్లి ఒక్కటేనని గ్రహించి ఆమెను ప్రార్థించాడు. కొడుకు నిస్సహాయ స్థితిని గుర్తించిన రోహియా బేగం వచ్చింది. “లాల్! నా మాట విను. నీ పూర్వ శక్తులన్నీ నీకు తిరిగి వచ్చేలా చేస్తాను. కానీ వాటిని ప్రాణరక్షణ కోసం తప్ప ఇతరుల అపకారానికి ఉపయోగించ కూడదు” అని చెప్పింది. సరేనన్నాడు లాల్మియా.
లాల్మియా మంత్ర శక్తులు అన్నీ పోగొట్టిన తర్వాత మకరంద్‌తో పాటు మనోరమ తారానాథ్లు తిరిగి మాధురీబేగం నివాసానికి వచ్చారు అవంతి కోసం. కానీ అక్కడ మాధురీబేగం, అవంతి లేకపోవడంతో ఖిన్నులై ఉండగా వాయస రూపంలో వచ్చిన వక్రనాధుడు “పారిపోండి. తన తల్లి సహాయంతో మంత్ర శక్తులు అన్నీ పొంది లాల్మియా ఇక్కడకు వస్తున్నాడు” అని హెచ్చరించడంతో అందరూ అక్కడి నుంచి తమ ఇంటికి వెళ్లిపోయారు.
జయంతుని వేషంలో ఉన్న అవంతి గాఢనిద్ర నుంచి లేచి, చుట్టూ పరికించి, తామొక ఓడలో వున్నట్టు, సముద్రమధ్యంలో పయనిస్తున్నట్టు గమనించి భయవిభ్రాంతులకు లోనైంది. పక్కనే ఉన్న మాధురి బేగం కంగారు పడవద్దని, తాము సింహళమునకు పోతున్నామని, మెలకువలో వుంటే ఒప్పుకోక పోవచ్చని గాఢనిద్రలో ఉన్నప్పుడు తనని తీసుకొని బయలుదేరినట్టు చెప్పింది. తన వాళ్లు తన కోసం ఎంతగా ఆత్రుతపడతారోనని అవంతి దుఃఖపడుతుండగా, ‘నీవారు చిరకాలం లోనే సింహళం చేరే ఏర్పాటు చేసి వచ్చాను’ అని చెప్పింది మాధురీబేగం.
కళామందిర్లో మాధురి బేగం కోసం వెతికి అక్కడ ఎవరూ లేకపోవడంతో, సింహళం బయలుదేరి వుంటుందని భావించి, తానూ ఓడలోకి ప్రవేశించాడు లాల్మియా. జయంతునితో ప్రేమగా మాట్లాడుతున్న మాధురీబేగంని చూసి, ఆవేశంతో ఆమె గొంతు పట్టుకున్నాడు. లాల్మియా వెనకనే వచ్చిన వాయస రూపంలో ఉన్న వక్రనాథుడు తన వాడి ముక్కుతో అతని ముఖముపై పొడవసాగాడు. లాల్మియాని గుర్తించిన మాధురి బేగం తన సైనికులు అందర్నీ హెచ్చరించగా వారందరూ లాల్మియా పై కత్తులతో దాడి చేసారు.
ఎదురుగా ఉన్న వాళ్ల మీద లాల్మియా విభూతి జల్లి అచేతనంగా చేయటంతో, వెనక నుండి మరికొందరు భటులు వచ్చి అతని తలపై పెద్ద ముసుగు వేశారు. అందరూ కలిసి అతన్ని గట్టిగా బంధించి, మూటలా కట్టి సముద్రంలోకి విసిరేశారు.
మాధురీబేగం వారి చర్యను అభినందించి, మరింత వేగంగా ఓడను నడపమని ఆజ్ఞాపించింది.
(సముద్రంలో పడిన లాల్మియా ఏమయ్యాడు? ఒకేరూపంలో ఉన్న రాగలత హేమాంగి బంధం ఏమిటి? మైనాకుడి రాజ్యం ఏమైంది? …. తరువాయి భాగంలో..!)
(సశేషం)
డా. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో పనిచేసి, ప్రిన్సిపాల్‌గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్‌గా, ఎడిటర్‌గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ ల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు. విద్యార్థినులు చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం తన కెరీర్లో ఆమెకిష్టమైన పనులు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం సంతృప్తి కలిగించిందంటారు.
గత వారం ఫాలాక్షుడు, ఈ వారం వక్రనాథుడు ,చిత్రలేఖ… కొత్తకొత్త పాత్రలతో కథనం భలే చిత్రంగా సాగుతుంది.
Very interesting
Suseela garu really interesting 👏
కొవ్వలి వారి భారీనవల “జగజ్జాణ”కు సరళ , సంక్షిప్త రూపకల్పన చేస్తున్న డా॥ సుశీలమ్మగారి ప్రయత్నం బ్రహ్మాండంగా సాగుతోంది . మూలకధలో ఇంతవరకూ వచ్చిన 64 పాత్రలను నేర్పుతో కధాక్రమం చెడకుండా ఈ రూపకల్పనలో ఇమిడుస్తున్న డా॥సుశాలమ్మగారి ప్రతిభ ప్రశంసించదగ్గదే
–భోగరాజు సత్యనారాయణ ( సూర్యప్రభాపతి) 21-02-2021 ఆదివారం
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™