గుగి వా థియాంగో తన జాతికి చెందిన గికుయు భాషలో రైతాంగ, కార్మిక సమ్మేళనంతో ప్రజా రంగస్థలాన్ని నిర్మించే ప్రయత్నం చేసిన నేరానికి గాను 1977 నుండి ఒక సంవత్సరం కాలం పాటు జైలు పాలయ్యారు. ఆ నిర్బంధం నుండి విడుదలయ్యాకా, నైరోబీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగంలోకి తిరిగి తీసుకోకపోవడం ఒక పక్కనా, హత్యా ప్రయత్నాలు మరొక పక్కనా వుండగా, ఆయన స్వదేశం వదిలి ప్రవాసానికి వెళ్ళారు. బ్రిటన్, జర్మనీ, స్వీడన్లలో ప్రవాసంలో వుంటున్నప్పుడు గికుయులో ఈ నవల రచించారు.
కెన్యా స్వాతంత్ర్యం కోసం, బ్రిటీష్ వలసలోంచి విముక్తి కోసం లక్షలాది మంది యోధులు పోరాడారు. కెన్యాట్టా వంటి జాతీయవాదులు, ఒగింగా ఒడింగా వంటి సోషలిస్టులు, కిమాతి వంటి మౌ మౌ విప్లవోద్యమ నాయకులు ఈ పోరాట స్రవంతిలో భిన్న ధోరణులకు నాయకత్వం వహించారు. కెన్యాలోని మౌ మౌ ఉద్యమం, 1963లో స్వాతంత్ర్యం రాగానే కెన్యాట్టా నాయకత్వంలో, కెన్యా ప్రజలు నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారన్న ఆశతో సాయుధ పోరాటాన్ని విరమించింది. కాని కెన్యాట్టా నాయకత్వంలో ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో మౌ మౌ పార్టీకి ఏ స్థానమూ ఇవ్వలేదు. కెన్యాట్టా తరువాత 1978లో అధికారానికి వచ్చిన జనరల్ మోయి మరింత క్రూరంగా, నియంతగా మారాడు. కెన్యా చరిత్రలో కీలక దశ అయిన మౌ మౌ ఉద్యమ కాలంలో బ్రిటీష్ వలస పాలకుల పక్షం వహించిన జనరల్ మోయి కెన్యా అధ్యక్షుడు కావడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.
తూర్పు ఆఫ్రికాలో చాలా స్వతంత్ర్య దేశాల వలెనే కెన్యా ఒక నయా వలసగా మారిపోయింది. బ్రిటీష్ వాళ్ళు వెళ్ళిపోయి దళారీ పాలకుల చేతుల్లోకి అధికారం వచ్చాక ప్రపంచ మార్కెట్లో కాఫీ, టీ ధరలు విపరీతంగా పెరగడంతో, కెన్యా ‘పదిమంది కోటీశ్వరులు, ఒక కోటి బిచ్చగాళ్ళ’ దేశంగా మారింది. సహజంగానే ఈ అంతరాలు తీవ్ర సంక్షోభానికి దారి తీసాయి. ఒక వైపు ఆర్థిక అంతరాల వల్ల రైతాంగంలో భూదాహం పెరిగిపొతుంటే, మరొకవైపు భూ పరిమితి చట్టాలు లేకపోవడం వల్ల గుప్పెడు మంది భూస్వాములు, బహుళ జాతి కంపెనీలు అధికారంలో వున్నవారి అండతో వేల ఎకరాల భూములను దురాక్రమణ చేశారు. ఆధునిక నగర సంబంధ ఆర్థిక విధానంలో భాగంగా కెన్యన్ల నిజ వేతనాలు పది శాతం పడిపోతాయి. ఇంకో వైపు ప్రతి సంవత్సరం, లక్షలాది నిరుద్యోగులు స్కూళ్ళ నుండి, యూనివర్సిటీల నుండి బయటికొస్తున్నారు. 1982 ఆగస్టు 1న అవినితికర మోయి ప్రభుత్వం కూలదోయబడిందని రేడియో ప్రకటించగానే, ఇటువంటి వేలాదిమంది నిరుద్యోగ యువకులు నైరోబీ రోడ్ల మీదకు వచ్చారు. కార్మిక నాయకుడు గరురో వా కిరిరో నాయకత్వంలో ఫ్యాక్టరీల దగ్గర సమ్మెలు చేసిన, ఈ నవలలోని ఘట్టాలు అటువంటి ఎన్నో వాస్తవాలకు అక్షర రూపాలు.
1982 ఆగస్టు 1 తిరుగుబాటు ఏమి సాధించినా, సాధించకపోయినా జనరల్ మోయి నిరంకుశ పాలన పట్ల ప్రజల నిరసనకు ఒక వ్యక్తీకరణ రూపాన్ని ఇచ్చింది. గుగి తన ముందుమాటలో చెప్పినట్లు మౌ మౌ ఉద్యమం మళ్ళీ చర్చలోకి వచ్చింది. అయితే ప్రజలు తమ స్పష్టమైన భావాలను ఒక మార్మిక భాషలో వ్యక్తం చేసినట్లుగా దేశభక్తులు తిరిగి వచ్చారనే భావనను జీసస్ క్రైస్ట్ పునరుత్థానంగా చెప్పుకున్నారు. దేశభక్తులు తిరిగి రావాలన్న ప్రజల తీవ్రమైన ఆకాంక్ష, గుగి ఈ నవలకు నేపథ్యం. ఈ విషయాన్ని మాజిక్ రియలిజం పద్ధతిలో చెప్పడం వల్ల నవలకు మరింత కొత్త అందాన్ని తెచ్చి పెట్టగలిగింది.
ఈ నవలలోని మాటిగరి మౌ మౌ ఉద్యమ నాయకుడైన కిమాతి ప్రతిరూపాన్ని సహజంగానే చిత్రించారు. ఒక కార్మిక ప్రతినిధి, అన్ని రకాల అణచివేతలతో పాటు లైంగిక హింసకు గురయి ఒళ్ళమ్ముకుని బ్రతికే స్త్రీ, వీధుల్లో పెంటకుప్పలపై కుక్కలతో పాటు తిండి వెతుక్కోవలసి వచ్చే బాలుడు ఈ నవలలో పాత్రలు. అశేష ప్రజానీకం ఆకాంక్షలు, అండదండలు వీరికి వుంటాయి. వీళ్ళ పోరాటాల, త్యాగాల ఫలితంగానే బాలుడయిన మోర్యుకి చేతిలోకి దాచిపెట్టిన ఆయుధాలు వస్తాయి. దుర్భర దారిద్ర్యంలో తిండి కోసం కుక్కలతో కలియబడే పరిస్థితులను ఒక వైపు, నయా పెట్టుబడిదారీ విలాసవంతవైన జీవితాన్ని మరో వైపు ఇందులో చిత్రీకరించారు. శ్వేత జాతీయులతో పాటు నల్లజాతి అధికార వర్గం, పోలీసులు కూడా సాటి నల్లవారిని హీనంగా చూడడం అలాగే కొనసాగుతూ కనిపిస్తుంది. అధికారులకు, పాలకవర్గానికి తొత్తులుగా మారిన పోలీసులు, వారు చేసే హించ హృదయ విదారకంగా వుంటుంది.
వలస వ్యతిరేక పోరాటం ముగిసిందనీ, దేశం స్వాత్రంత్యం సంపాదించిందని భావించిన ఒక స్వాతంత్ర్య సమర యోధుడు అడవిలో తన ఎకె-47 తుపాకిని భూమిలో పాతిపెట్టి, శాంతి కవచం కప్పుకుని, అడవి నుంచి బయటకి వచ్చి, మాటిగరి మా జిరూంగి (బుల్లెట్లను తప్పించుకున్న దేశభక్తుడు) అనే పేరుతో సమాజంలోకి వచ్చి చూస్తే, వలస పాలన కంటే దారుణమైన దోపిడీ, పీడనలు కనబడి తిరిగి పోరాట మార్గం చేపట్టడం ఈ నవల కథా వస్తువు. ఈ నవల వెలువడి, కెన్యాలో ప్రాచుర్యంలోకి రాగానే మాటిగరి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ పేరుతో వ్యక్తి లేడని, అది నవలా నాయకుడి పేరని తెలుసుకుని, నవలను నిషేధించింది. ఆ నవలను వాంగుయి వా గోరో ఇంగ్లీషులోకి అనువదించారు. ఇంగ్లీషు నుంచి ‘వ్యోమ’ (కుందేటి వెంకటేశ్వరరావు) తెలుగులోకి అనువదించగా అది 1996లో పుస్తక రూపంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రెండవ ముద్రణగా వెలువడింది. మంచి అనువాదానికి ఒక ఉదాహరణగా ఈ పుస్తకం నిలిచిపోతుంది.
***
మాటిగరి (నవల) రచన: గుగి వా థియాంగో, అనువాదం: వ్యోమ ప్రచురణ: స్వేచ్ఛాసాహితి, హైదరాబాద్ పేజీలు: 158; వెల: రూ. 120/- ప్రతులకు: ప్రచురణకర్తలు, ఫోన్- 040-66843495
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™