[దివ్య అమెరికా నుంచి వివేక్కి ఫోన్ చేస్తుంది. మీ మావయ్య ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. ఆమె ఓదార్పుకి కరిగిపోయిన వివేక్ ఆమె ఎదురుగా ఉంటే బావుండేదని అంటాడు. అమృతకి, తనకీ నిశ్చితార్థం జరిగిపోయిందని దివ్యకి చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేకపోతాడు. మావయ్యకి కాన్సర్ అని చెప్తాడు. దివ్య ధైర్యం చెబుతుంది. నేను బయల్దేరి రానా అని దివ్య అడిగితే వద్దని ఫోన్ కట్ చేస్తాడు. మావయ్య కోసం అన్నీ భరించాలని భావిస్తాడు. దివ్య ముఖంలో సంతోషం చూసిన రాధిక – వివేక్ ఐ లవ్ యూ చెప్పాడా అని అడుగుతుంది. అయితే వివేక్ చాలా డిప్రెషన్లో ఉన్నాడనీ, అతని దగ్గర లేనందుకు బాధ పడుతున్నానని అంటుంది దివ్య. దివ్య లవ్ సక్సెస్ అయినందుకు తాను సంతోషిస్తున్నానని అంటాడు మిత్రుడు సునీల్. వాళ్ళ లవ్ సక్సెస్ అయింది కాబట్టి తన లవ్ కూడా సక్సెస్ అవుతుందని అంటాడు. వివరాలు అడిగితే, ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయిందని, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన మూడేళ్ళకి accept చేసిదని అంటాడు, తాను ఆమెను ఇష్టపడుతున్నాని, వెయిట్ చేస్తానని అంటాడు. స్పృహ లోకి వచ్చిన నారాయణరావు అమృత, వివేక్‌ల గురించి అడుగుతాడు. వాళ్ళిద్దరూ క్యాంటిన్ నుంచి రాగానే వివేక్‌తో పెళ్ళి గురించి మాట్లాడుతాడు. తండ్రి ఇలా అనారోగ్యంతో ఉంటే తనకి పెళ్ళేమిటని అంటుంది అమృత. వివేక్ సర్ది చెబుతాడు. నారాయణరావు కృంగిపోతాడు. అమృత, వివేక్ ఆయనకి రెండు వైపులా చేరి ధైర్యం చెబుతారు. అంతలో మందులివ్వడానికి ఓ నర్స్ వస్తుంది. – ఇక చదవండి.]
“తాతయ్యా!.. ఈ రోజు వివేక్‌తో మాటాడాను” అంది దివ్య.
“అలాగా!.. వివేక్ అంకుల్‌కి ఎలా ఉంది?..” అన్నాడు డా. రంగారావు.
వివేక్ చెప్పింది అంతా చెప్పింది దివ్య.
“అరెరె!.. వివేక్ చాలా upset అయ్యుంటాడు.” అన్నాడు.
“అవును తాతయ్యా! వివేక్ వర్రీ చూడలేక నేను రానా అన్నాను.. చాలా బాధగా ఉంది. నేను ఇక్కడ ఉన్నానే కాని..!!”
“అమ్మా దివ్యా! సమయం వచ్చిందని చెబుతున్నాను. నువ్వు వివేక్ని ఎంత లైక్ చేస్తున్నావో.. నాకు తెలుసు.. వివేక్ నిన్ను మంచి ప్రెండ్‌గా అనుకోవచ్చు.. లేదా నీ వర్క్, డెడికేషన్ చూసి నిన్ను అభిమానించవచ్చు. మీ మధ్య ఏముందో తెలియకుండా, వివేక్కి తోడుగా ఉండడానికి ఎలా వెళ్లగలవు? ఒక వేళ వివేక్ ఫ్రెండ్౬గా వచ్చావనుకున్నా, పల్లెటూరు.. ఇంట్లో వాళ్లు.. నిన్ను.. accept చేయవచ్చు.. లేదా ఏదైనా అనుకోవచ్చు..” అని అన్నాడు.
“నీకు.. నీకు.. చెప్పలేదు కదూ?.. వివేక్ తన మనసులో మాట సూటిగా చెప్పసాడు.. నేను, వివేక్ని ఎంత ఇష్టపడ్డానో, దానికి డబుల్ నన్ను వివేక్ ఇష్టపడుతున్నాడు.. నిజం చెప్పాలంటే వివేక్ చాలా కూల్ బాయ్! Well mannered.. నా పట్ల తనకున్న ప్రేమ, అభిమానం అన్నీ.. అన్నీ.. తన మనసులోనే దాచుకున్నాడు.. He loves me so much తాతయ్యా” అంది సంతోషంగా దివ్య.
“O.K, I am very happy.. కాని నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి.. ఆ రోజు మీ అమ్మా, నాన్న నిన్ను నా ఒళ్లో కూర్చోబట్టి ఏమన్నారో తెలుసా?.. ఎందుకు వాళ్లిద్దరి నోటిలో నుండి అలాంటి మాటలు వచ్చాయో తెలియదు.. Surgery లో advanced techniques నేర్చుకోవడానికి London వెళుతూ “మావయ్యా! వన్ మంత్ మేము ఉండం.. దివ్యని కంటికి రెప్పలా చూసుకోవాలి.. మేరీ.. దివ్యని ఎలా చూస్తుందో, డైట్ ఏమిస్తుందో చూస్తారు కదూ?” అని కోడలు డా. సరోజ అనగానే, “ సరూ.. నాన్నకి మనం ప్రత్యేకించి చెప్పక్కర లేదు.. మనిద్దరి కన్నా దివ్య అంటే నాన్నకి పంచ ప్రాణాలు.. మనం tension పడవలసిన పని లేదు..” అన్నాడు నా కొడుకు.. రామ్..
యాక్సిడెంట్లో వాళ్ళిద్దరు చనిపోయాని వార్త విని తట్టుకోలేకపోయాను.
నేను పోతే.. నిన్ను ఎవరు చూసుకుంటారన్న ఒకే ఒక్క కారణంతో నేను గుండెని రాయి చేసుకొని నిన్ను పెంచి పెద్ద చేసాను. వాళ్లు లేకపోయినా.. నువ్వు డాక్టరు కావడం.. నీ ఎదుగుదల చూసి.. గర్వంగా.. నా కొడుకు, కోడలితో.. ఇదిగోండి మీ బిడ్డ..” అని చెప్పి సంతృప్తి పడుతుంటాను.. కాని.. నువ్వు, వివేక్ని ఇష్టపడుతున్నావని తెలిసి, వివేక్ కూడా నిన్న ఇష్టపడుతున్నాడో లేదో.. ప్రేమ విషయంలో దివ్య సక్సస్ అవుతుందో, లేదో, అని టెన్షన్ పడుతూ ఉన్నాను.. ఇప్పుడు నువ్వు.. వివేక్ కూడా నిన్ను లైక్ చేస్తున్నాడు అని చెప్పాక చాలా సంతోషంగా ఉంది.. ఎందుకంటే.. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా.. నీ కంట్లో కన్నీరు రాకుండా పెంచాను.. ప్రేమ విషయంలో నువ్వనుకున్నట్లు జరగకపోతే నువ్వేమవుతావో అన్న భయం నన్ను వెంటాడుతుంది.. ఇక నాకు నిశ్చింత తల్లీ.. ముందు వివేక్‌తో నీకు నిశ్చితార్థం జరగాలి. పి.హెచ్.డి అయినాక నీ పెళ్లి జరగాలి.. అయినా ఈ విషయాలన్నీ నేను వివేక్‌తో మాట్లాడుతాను” అన్నాడు డా. రంగారావు.
ఏం మాట్లాడాలో తెలియనిదానిలా ఒక్క నిమిషం మౌనం వహించింది. “తాతయ్యా.. వివేక్ చాలా డిస్టర్బ్డ్ మూడ్‌లో ఉన్నాడు.. ఇప్పడిలాంటి ప్రపోజల్స్ పెట్టకండి ప్లీజ్.. సమయం చూసి నేను చెబుతాను” అంది.
“ష్యూర్ దివ్యా.. నువ్వు చెప్పింది నిజమే!..” అన్నాడు.
“తాతయ్య!.. మీరు నాకు చెప్పలేదు కాని.. మీరు నా గురించి.. అదే నా పెళ్లి గురించి చాలా వర్రీ అవుతున్నారని తెలుసు.. మీరు ఎన్నో మ్యాచెస్ నా కోసం.. సెలెక్ట్ చేసి.. ఫోటోలు.. నాకు చూపిద్దామని వచ్చారు.. నా మనసులో వివేక్ ఉన్నాడని గ్రహించడం, మ్యాచెస్ చూడమని, ఫోటోలూ చూడమని ఒత్తిడి లేకపోవడం.. ప్చ్! మాటల్లో చెప్పలేను..” అని గబాలున డా. రంగారావు గుండె మీద వాలిపోయి, రెండు చేతులనూ ఆయన నడము చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని “I love you తాతయ్యా” అంది దివ్య.
ఆయన గట్టిగా కళ్లు మూసుకొని, దివ్య తల మీద చెయ్యి వేసి నిమరసాగాడు.
***
డిశ్చార్జ్ అయిన నారాయణరావుని ఇంటికి తీసుకువచ్చారు. ఊరు.. ఊరంతా నారాయణరావు గారింటికి తరలి వచ్చారు.
ఆ ఊరి ప్రజలు, ప్రక్క ఊరి వాళ్లు.. ఎందరో.. తండ్రి కోసం రావడం, తండ్రి పట్ల చూపెడుతున్న ప్రేమ, అభిమానాలు చూస్తుంటే కళ్లల్లో నీళ్లు నిండాయి అమృతకి..
చచ్చినోడి కళ్లు చారడేసి అని ఎవరో చెప్పుకుంటంటే విని నాన్నమ్మని అడిగింది.. దాని అర్థం ఏమిటని, నవ్వుతూ దగ్గరకు తీసుకొని, “ఎవరైనా సరే!.. మంచి వాడు కాకపోయినా, దుర్మార్గుడే అనుకుందాం వాడు పోయాడనుకో అప్పటి వరకు తిట్టుకున్న వాళ్లు కూడా, ఆ చనిపోయిన వాడి గురించి వాడు ఇలాగా, వాడు అలాగా అని చెప్పడం చూసి, చచ్చినోడి కళ్లు చారడేసి అని ఎవరో అన్నారట” అంది..
“నాకు అర్థం కాలేదు నాన్నమ్మా” అని అమృత అంటే..
“నీకు అర్థం అయ్యేలా చెబుతాను.. మనిషి చనిపోయినాక చెప్పడం కాదు.. బ్రతికి ఉండగానే ఆ మనిషి గురించి ఎందరో కాకపోయినా, కనీసం కొందరయినా మంచిగా, గౌరవంగా, ప్రేమగా చెబితే ఆ మనిషి జన్మ ధన్యమైనట్టే” అంది నాన్నమ్మ..
కాని ఈ రోజు నాన్న గురించి ఇంత మంది రావడం, తమ సొంత మనిషిలా చూసుకోవడం, ఎంత అద్భుతం?.. అంత గొప్ప వ్యక్తి, నాన్నకి తన వలన.. బాధ, విచారం.. కలుగుతుందా? తనలాంటి సమస్య అసలేవరికైనా ఎదురవుతుందా? తన సమస్య నాన్నతో ఎలా చెప్పగలదు? అందులోకి ఇలాంటి పరిస్థితిలో.. ఆపరేషన్ జరిగింది, బ్రతికి ఉన్నంత వరకు మందులు వాడాలని చెబుతున్నారు డాక్టర్లు.. అంతే కాదు.. మందుల కన్నా ముఖ్యమైనది పేషంట్‌కి మనోధైర్యం కావాలి!.. చుట్టూ ఉన్న వాళ్లు తనని సంతోషంగా ఉండేటట్లు చూడాలి. అప్పుడే పేషంట్ కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఒక ప్రక్క డాక్టర్లు చెబుతుంటే మరో ప్రక్క వీ.విని నేను ప్రేమించలేదు.. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పిడుగులాంటి వార్తని ఎలా చెప్పగలదు నాన్నతో? జీవితంలో ఒకే ఒక్క కోరిక.. అది అమృత పెళ్లి వివేక్ బాబుతో!.. ఆ పెళ్లి కళ్ళరా చూసి తన చనిపోయినా పరవాలేదని అంటుంటే.. తను ఎలా వివేక్‌తో పెళ్లి నాకిష్టం లేదని, పిడుగులాంటి వార్త చెప్పగలదు? – ఆ ఆలోచలతో అమృత మనసు స్తంభించిపోయింది. ప్రాణం ఎక్కడ పోతుందో అన్నట్లు ఉలిక్కిపడి కంగారుగా అటు ఇటు చూసి.. ఎవరు తన వైపు చూడడం లేదని నిర్ధారణకి వచ్చినాక గబగబా తన గదిలోకి వెళ్లి తలుపు గొళ్లం పెట్టి మంచం మీద పడిపోయి రెండు చేతుల మధ్య ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్వసాగింది అమృత.
కళ్లల్లో ఫేస్బుక్ నీల్ కనిపించాడు.. ‘సారీ నీల్!.. నీలాంటి మంచి మనిషిని ఇప్పటి వరకు చూడలేదు.. ఆడపిల్ల కనబడితే.. అష్టవంకర్లు తిరిగిపోతూ.. తిక్క వేషాలు వేస్తూ మంచి మర్యద లేకుండా బిహేవ్ చేసే అబ్బాయిలే ఎక్కువ.. కాని మూడేళ్లు కావస్తున్నా నా పట్ల నీ బిహేవియర్ చూసినాకే నిన్ను లైక్ చేయడం మొదలు పెట్టాను. తరువాత నాకు తెలియకుండానే నా మనసులో స్థానం సంపాదించావు..’
‘విధి!.. చాలా విచిత్రమైనది.. I love you నీల్ అని నీతో చెప్పాలనుకున్నాను.. అలా అనుకున్న మరుక్షణం నాకు నాన్న, వీ.వి గుర్తువచ్చారు. ఈ విషయం ముందు వాళ్లతో చెప్పాలనుకున్నాను.. ఎందుకనుకున్నావ్? నాకు జీవితంలో వాళ్ల తరువాతే ఎవరైనా. నా మాట వాళ్లు కాదనరన్న నమ్మకం నాకుంది.. కాని నీతో కనీసం ఫోనులో మాట్లాడకుండా, నువ్వు ఎలా ఉంటావో నీ గురించి వివరాలు తెలియకుండా, Facebook లో మూడేళ్ల బట్టి నన్ను ఫాలో అవుతున్నాడు.. ఈ మధ్యనే ఫ్రెండ్ రిక్వెస్ట్‌కి ఒకే చెప్పాను అని ఎలా వాళ్లతో చెప్పగలను? చెప్పినా పిచ్చి దానిలా నన్ను వాళ్లు చూస్తారు ఏమో అని అనుమానం వచ్చింది.’
‘ప్రేమ అన్నది మొదటి చూపులోనో, మొదటి పరిచయం లోనో, లేక కలిసి ఇద్దరు కొన్నాళ్లు తిరిగినాకో, intimacy ఏర్పడి వాళ్ల మధ్య ప్రేమ పుడుతుంది.. కాని నీకు, నాకు ఫేస్బుక్ పరిచయం.. తరువాత మనం ఫ్రెండ్స్ కావడం, నా మనసులో నువ్వున్నావు అని నాన్నతో, వీ.వితో చెబితే నన్ను పిచ్చిదాన్ననుకుంటారు ఏమో అని ఆలోచిస్తున్నాను.. ఆలోచనలో ఉంటుండగానే నాన్న ఆరోగ్యం ఇలా అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.. నా ఆలోచనలు నాలోనే సమాధి అవుతాయని ఊహించలేదు.. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కపోతున్నాను నీల్!’ అని మనసులో అనుకుంది.
‘ఆలశ్యం అమృతం విషం అన్నది నా విషయంలో నిజం అయింది నీల్!.. నేను మన విషయం చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది ఏమో? కాని ఇప్పుడు చెప్పే అవకాశం లేదు’ అని వెక్కిళ్లు పడుతూ అలా ఏడుస్తూ నిద్రపోయింది అమృత.
“వివేక్ బాబూ!.. ఇలా అయితే ఎలా చెప్పు?.. వాళ్ల నాన్న మీద బెంగతో చాలా నీరసించిపోతుంది.. తినడం లేదు, తాగడం లేదు.. నిద్రపోవడం లేదు.. మమ్ములను ఎవరిని దగ్గిరకు రానివ్వడం లేదు.. ఇలా ఎప్పుడు అమృత ప్రవర్తించలేదు. దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది” అంది కళ్లల్లో నీళ్లు నిండుతుండగా సుమిత్ర.
“వదినా!.. హుష్” అని కంగారుగా అటు ఇటు చూసి “అన్నయ్య ఇప్పటికే డీలా పడిపోయాడు.. డాక్టర్లు అందరూ ఎన్ని చెబుతున్నా, తనకి వచ్చింది క్యాన్సర్, ఈ రోజు కాకపోయినా, రేపయినా తన అంతం చూస్తుందని నిన్ననే అన్నయ్య నాతో అన్నాడు.. తనకి ఒకే ఒక్క కోరికని అది అమృత, వివేక్ బాబుల పెళ్లి అని అన్నాడు.. అలాంటి వ్యక్తి ముందు మనం ధైర్యం చెప్పే విధంగానే ఉండాలి గాని ఇలా అమృత గురించి గాని, ఏదైనా సరే.. ప్రస్తావించకూడదు.. చెప్పింది అంతా విన్నావా వివేక్?.. నాన్నా వివేక్!.. మావయ్యని మామూలు మనిషిని చేసే బాధ్యత అమృత, నీ చేతుల్లోనే ఉంది” అంది బాధగా శారద.
అప్పుటికే తలుపు తెరుచుకొని బయటకు వచ్చిన అమృత వాళ్ల మాటలు విని ఒక్క క్షణం అలా ఉండిపోయింది. పెదాలపై నిర్లిప్తమైన నవ్వు బయలుదేరింది..
‘హు!.. కంట్లో నలకపడినా, కాళ్లకి చిన్న ముల్లు గుర్చుకున్నా.. నాన్నా.. అని పరిగెత్తుకొని నీ దగ్గరకు వస్తే – ఎంత ధైర్యం ఆ నలక్కి? నీ కంట్లో పడుతుందా?.. అమ్మో! నా బంగారు తల్లి కాళ్లల్లో ముల్లా?.. ఒక్క నిమిషం ఓర్చుకో తల్లీ’ అనే నాన్నతో ఈ రోజు.. వీ.వితో పెళ్లి నిశ్చయించి, నా గుండె పగిలిపోతుంటే.. నోరు విప్పలేక మౌనం వహిస్తుంది, తన బాధని చెప్పకోలేకపోతుంది.
ఎంతలో ఎంత మార్పు?
కాలం, పరిస్థితితుల బట్టి మనిషి నడుస్తాడు. కాని మనిషిని బట్టి కాలం నడవదని అర్థమైంది.
ముందు, ముందు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతుంది. అస్సలు ఊహించదు కూడా..
ఏం జరిగినా తన చేతుల్లో ఏం లేదు.
‘ఎందుకంటే!.. నాన్న కంటే తనకి ఏది మఖ్యం కాదు.. నాన్న బాగుండాలి!.. సంతోషంగా ఉండాలి అంతే!’
‘పిల్లల కోసం, తల్లిదండ్రులు ఎటువంటి త్యాగం అయినా చేస్తారని తెలుసు.. కాని ఈ రోజు నీ కూతురిగా, నేను నిన్ను ఎప్పటికి బాధపెట్టను నాన్నా! మరి ఇది త్యాగమో! ఏమిటో కూడా నాకు తెలియదు’ అని మనసులో అనుకుంది అమృత.
ఎంత పడుకోవాలని ప్రయత్నించినా, నిద్ర పట్టడం లేదు వివేక్కి. ఇప్పటి వరకు తను ఇది కావాలి, అది కావాలని అనుకోలేదు.. టీనేజ్ లవ్ అంటారు.. ఏమిటేమిటో అంటారు.. అలాంటి ఆలోచనలు ఎప్పుడు తనకి రాలేదు. USA వెళ్లినాక రిసెర్చ్‌లో జాయిన్ కావడం, అనువంశిక వ్యాధులు.. మేనరికం వివాహాలు చేసుకుంటే జరిగే పరిణామాల మీద రిసెర్చ్ చేసి, మంచి ఫలితాన్ని కనిపెట్టి అంతో ఇంతో సమాజానికి ఉపయోగపడాలనుకున్నాడు.. తను మెడిసిన్ చదువుతుండగా, ఊర్లో ఎంతో మంది మేనరికం వివాహం వలన పుట్టిన పిల్లలు.. ఏదో ఒక లోపంతో కదలలేని స్థితిలో, కదిలినా లోకం అంటే ఏమిటో తెలియకుండా పెరిగి పెద్ద వాళ్లయిపోయి అనామకులుగా బ్రతుకుతున్న వాళ్లని చూసి తన మనసు చలించిపోయింది. కాని ఇంట్లోనే మేనరిక వివాహం చేయాలన్న ఆలోచన ఉన్నట్లు తను గ్రహించలేదు.. అసలు వాళ్లు కూడా ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. ముందే తెలిస్తే సమస్య అసలు పెద్దదయ్యేది కాదు. తనకి బాగా గుర్తుంది.. మావయ్య ఒళ్లో తను కూర్చొని.. ప్రోగ్రెస్ రిపోర్టు చూపెట్టి క్లాసులో ఫస్ట్ నేనే మావయ్యా అని చెబుతుండగా ఎవరో వ్యక్తి వచ్చి నమస్కారం పెట్టి ‘అదృష్టవంతులు నారాయణరావుగారూ! .. మేనల్లుడిని అల్లుడిగా చేసుకుంటారు, కళ్లెదుటే కూతురు, అల్లుడు ఉంటారు’ అన్నాడు.
‘చలపతిరావుగారూ!.. పిల్లల ముందు ఇలాంటి మాటలు అనకూడదు. వాళ్లని ఎటువంటి ఇలాంటి ఆలోచనలు లేకుండా పెరగనివ్వాలి!.. బాగా చదువుకొని ముందు ప్రయోజకులు అవ్వాలి!.. నువ్వు లోపలికి వెళ్లు వివేక్ బాబూ’ అన్నాడు నారాయణరావు.
“కంటికి రెప్పలా అమృతమ్మని వివేక్ బాబు చూసుకుంటాడు.. అదృష్టవంతురాలమ్మా అమృత” అంది పక్కింటి ధనలక్ష్మి.
“పిల్లల ముందు అలాంటి మాటలు అనకూడదు, వాళ్లు బావ మరదల్లా ఉండరు.. ఆత్మీయలైన స్నేహితుల్లా ఉంటారు” అంది సుమిత్ర..
మావయ్య, అత్తయ్య మాటల గురించి ధీర్ఘంగా ఆలోచించే వయసు లేకపోయినా, ఎప్పుడు బావ, మరదలన్న ఫీలింగ్ అమ్ముకి, తనకి లేదు.
ఒక అన్నకి చెల్లెలు మీద ఎంత అభిమానం, ప్రేమ ఉంటుందో, అంతే ఉంది.. చెల్లెలిని భద్రంగా జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో అలానే అమృతతో ఉన్నాడు.
అమృత అంతే! మాటకి మందు, వెనకా వీ.వి అని తన కూడా తిరిగేది.
ఒకసారి రెండు ఐస్ క్రీములు కొంటే, తన ఐస్ క్రీమ్ కింద పడిపోయింది.. తను బిక్కమొహం వేయడం చూసి – ఏడవకు వివేక్ బాబూ!.. నేను సగం తిని, నీకిస్తానని గబగబా సగం తినేసి, మిగిలిన సగం ఐస్ క్రీమ్ తనకి ఇచ్చింది.. ఇలాంటి సంఘటనలు ఒకటా రెండా?
“వీ.వి.. ఇటు చూడు.. లంగా కట్టడం లూజు అయిపోయింది.. నాకు గట్టిగా కట్టడం చేతకావడం లేదు.. గట్టిగా కట్టు” అని జాకెట్టు పొట్టపైకి ఎత్తి లంగా బొందు గట్టిగా బిగించమంది అమృత.
“బర్త్ డే గరల్ వి.. నీకు ఇంకా లంగా తాడు బిగించడం తెలియదా?” అని ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తే “నాకు వీ.వి ఉన్నాడుగా, కడతాడు.. మీకు ఎవరు లేరుగా” అని కోపం తెచ్చుకుంది అమృత..
‘ఈ చేతులతో పెంచిన అమ్ముని పెళ్లి చేసుకోవడం ఏమిటి? నిజం చెప్పాలంటే అన్నా, చెల్లెలు బంధం కన్నా గొప్ప బంధం తనది అమృతది. తామిద్దరికి పెళ్లి ఏమిటి?..దారుణం!.. అసలు ఆలోచనే తనని బయపెడుతుంది..’
“వీ.వి.. ఏం చేస్తున్నావు? నాన్న చాలా సేపటి నుండి నిన్ను పిలుస్తున్నారు..” అని ఏదో అనుమానం వచ్చిన దానిలా దగ్గరగా వచ్చి వివేక్ కళ్లల్లో తడి చూసి..
“ప్చ్!.. అర్థం అయింది వివేక్ బాబూ! ..” అని గభాలున వివేక్ గుండె మీద వాలిపోయి.. “ఈ కౌగిలింతలో ఓదార్పు, లాలింపు, భరోసా దొరుకుతుందని ఆశపడుతున్నాను..”
“ఈ కౌగిలింతలో ఇద్దరు ప్రేయసి, ప్రియులకు మధ్య ఉండే తన్మయత్వం, ఆరాధన, ప్రేమ ఉండవని చెబితే ఇంట్లో వాళ్లకి అర్థం అవుతుందా?.. అర్థం అయ్యేటట్లు చెబుదామన్నా, అందరూ ఎలా రియాక్ట్ అయినా, నాన్న.. నాన్నా మాత్రం తట్టకోలేరు.. అంతే కాదు.. తన కూతురికి తగ్గవాడు ఈ ప్రపంచంలో మేనల్లుడు ఒక్కడే అన్న భ్రమలో ఉన్నాడు.. ఏం చేయాలి వీ.వి” అని గుండె మీద వెక్కిళ్లు పడసాగింది అమృత.
అంతదూరం నుండి వాళ్ళని చూసి సుమిత్ర, గబగబా వెళ్లి శారదని పిలిచి.. చూపించి.. “శారదా.. నేను వివేక్ బాబుకి చాలా ఋణపడి ఉన్నాను. వివేక్ బాబు లేకపోతే నా కూతురు ఏమయిపోయేదో?.. అమృతకి కొండంత అండ వివేక్ బాబు!” అంది.
“అటు చూడు.. పాపం అన్నయ్య.. వివేక్ని పిలుస్తున్నాడు. రా వదినా” అని కంగారుగా రూమ్ లోకి అడుగులు వేసింది.
“అమృత వివేక్ని తీసుకు వస్తానని వెళ్ళింది.. ఇద్దరూ రాలేదు.. ఏమయింది శారదా” అన్నాడు నారాయణరావు.
శారద, సుమిత్ర ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు..
చిన్నగా నవ్వి అంది సుమిత్ర “అంతా మీ ఇష్టమేనా?.. నిశ్చితార్థం జరిపించారు. కాసేపు ఇద్దరు కలిసి కూర్చోకూడదా?”
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సినిమా క్విజ్-29
ఆవేదన
ఓ నేస్తమా…
పెద్ద మనసు
వృక్షో రక్షతి రక్షితః
సిరివెన్నెల నిశ్శబ్ద నిష్క్రమణ
‘నాది దుఃఖం వీడని దేశం’ కవితాసంకలనం ఆవిష్కరణ సభ – ప్రకటన
స్వాతి కవితలు-5- అప్పు
వందేమాతరం-6
ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 51 – ఆద్మి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®