కః కోత్ర భోః?
కః+కః అత్ర+భోః= ఎవరయ్యా అక్కడ?
(ప్రవిశ్య) ఆణవేదు అమచ్ఛో (ఆజ్ఞాపయ త్వమాత్యః)
(ప్రవిశ్య=ప్రవేశించి) ఆజ్ఞాపయతు+అమాత్యః=మంత్రివర్యులు ఆదేశింతురు గాక!
ప్రియంవదక, సాంవత్సరికాణాం ద్వారి కస్తిష్ఠతి?
ప్రియంవదకా, సాంవత్సరికాణాం=జోస్యులలో, కః=ఎవడు, ద్వారి=ఇంటి గడపలో, తిష్ఠతి=ఉన్నాడు?
క్ఖపణఓ (క్షపణకః)
క్షపణకుడు
(ఆత్మగతమ్ అనిమిత్తం సూచయిత్వా) కథం! ప్రథమమేవ క్షపణకః?
(ఆత్మగతమ్=తనలో, అనిమిత్తం+సూచయిత్వా=దుశ్శకునం సూచిస్తూ) కథం=ఎలాగ? ప్రథమం+ఏవ=తొలి దర్శనమ్, క్షపణకః=క్షపణకుడా?
జీవసిద్దీ. (జీవసిద్ధిః)
జీవసిద్ధిః= జీవసిద్ధి
క్షపణకుడంటే సస్న్యాసి (నాశనం చేసేవాడని మరొక అర్థం. అందుకే ఆ పదం అపశకునం). వెంటనే జీవసిద్ధి పేరు వినగానే బౌద్ధ సన్న్యాసి కదా! దోషం లేదని ఒక అర్థం (జీవానికి సిద్ధి కలిగించేవాడని మరొక అర్థం). అందుకే అపశకునం అనే ఆలోచన పరాస్తమైంది.
(ప్రకాశమ్) అబీభత్సదర్శనం కృత్వా ప్రవేశయ.
(ప్రకాశమ్=పైకి) అ+బీభత్స+దర్శనం+కృత్వా=భయం కలిగించే సన్న్యాసి దుస్తులు తీసి వేయించి, ప్రవేశయ=ప్రవేశపెట్టు.
తహ (తథా). (ఇతి నిష్క్రాన్తః)
తథా=అలాగే, (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు)
(ప్రవిశ్య)
సాసణ మలిహన్తాణం పడిపజ్జహ
మోహవాహి వెజ్జాణం
జే ముత్తమాత్త కడుఅం
పచ్ఛా పత్థం ఉవదిసంతి – (18)
(శాసన మర్హతాం ప్రతిపద్యధ్వం
మోహనవ్యాధి వైద్యానామ్
యే ముహూర్తమాత్ర కటుకం
పశ్చాత్ పథ్య ముపదశన్తి).
మోహనవ్యాధి+వైద్యానామ్=అజ్ఞానపు జబ్బుకి వైద్యులైన, అర్హతాం=గొప్ప బౌద్ధ గురువులకి, శాసనం=ఆదేశాన్ని (ఉపదేశాన్ని), ప్రతిపద్యధ్వం=అనుసరించండి;
యే=ఏ గురువులైతే, ముహూర్తమాత్ర+కటుకం=క్షణం సేపు చేదు అనిపించే (రుచించని)దై, పశ్చాత్=విన్న తరువాత, పథ్యం=మేలైనదానిని, ఉపదశన్తి=ఉపదేశిస్తారో (దానిని అనుసరించండి).
(ఉపసృత్య) ధమ్మసిద్ధీ హోదు సావగాణమ్.
ధర్మసిద్ధి ర్భవతు శ్రావకానాం।
(ఉపసృత్య=సమీపించి), శ్రావకానాం=శిష్యులకు, ధర్మసిద్ధిః+భవతు=మోక్షస్థితి కలుగుగాక!
ఆర్య.
రూపకం – “అర్హతులు, మోహనవ్యాధి వైద్యులు” అనడం చేత.
భదన్త, నిరూప్యతాం తావ దస్మత్ప్ర స్థానదివసః।
భదన్త=స్వామీ (బౌద్ధ గురువుల్ని సంబోధించే పద్ధతి), తావత్=ఇంతలో, ప్రస్థాన+దివసః=యుద్ధానికి బయలుదేరదగిన దినం (ముహూర్తం), నిరూప్యతాం=వెల్లడింతురు గాక!
(నాట్యేన చిన్తయిత్వా) – సావగా, ణిదూవిదా మఏ, ఆమజ్ఘణ్ణాదో ణివు త్తసవ్వక లాణా తిహీ, సంపుణ్ణచందా పుణ్ణమాసీ, తుమ్హాణం ఉత్తలాఏ దిసాఏ దక్షిణాం దిసం పత్థిదాణ ఆదక్ఖిణే ణక్ఖతే, అవి అ,
(శ్రావక, నిరూపితా మయా, మధ్యాహ్నా న్నివృత్తసర్వ కల్యాణా తిథిః సంపూర్ణ చన్ద్రా పౌర్ణమాసీ, యుష్మాక ముత్త రస్యాదిశో దక్షిణాం దిశం ప్రస్థితానాం అదక్షిణం నక్షత్రమ్. అపి చ),
అత్థాహిముహే సూరే ఉదిఏ సంపుణ్ణమండలే చందే
గమణం బుధస్స లగ్గే ఉదిరత్థమిదే అ కేదుమ్మి. – (19)
(అస్తాభిముఖే సూర్యే, ఉదితే సంపూర్ణమణ్ణలే చన్ద్రే
గమనం బుధస్య లగ్నే ఉదితాస్తమితే చ కేతౌ.)
శ్రావక=శిష్యా, మయా+నిరూపితాః=నా చేత నిర్ధారింపబడినది, ఆ+మధ్యాహ్నాత్=మధ్యాహ్నం వరకు, తిథిః=తిథి, సంపూర్ణ+చన్ద్రా+పౌర్ణమాసీ=నిండు చంద్రుడుండే పున్నమి, నివృత్త+సర్వ+కల్యాణా=శుభాలన్నీ తొలగబడినది (అశుభమైనది). యుష్మాకం=మీకు, ఉత్తరస్యాః+దిశః=ఉత్తర దిక్కు నుంచి, దక్షిణాం+దిశం=దక్షిణపు దిక్కుకి, ప్రస్థితానాం=ప్రయాణించేవారికి, అదక్షిణం+నక్షత్రమ్=నక్షత్రం వ్యతిరేకంగా ఉంది. అపి+చ=ఇంకా,
అస్త+అభిముఖే+సూర్యే=సూర్యుడు అస్తమించబోతుండగా, చన్ద్రే+సంపూర్ణ+మణ్ణలే=చంద్రుడు పూర్తి బింబంతో ఉండగా, ఉదితే=ఉదయించగా, ఉదిత+అస్తమితే+చ+కేతౌ= కేతువు ఉదయించినట్లే ఉదయించి అంతలోనే అస్తమిస్తూండగానూ,బుధస్య+లగ్నే=బుధుడు దేవతగా ఉండే సుముహూర్తన, గమనం=ప్రయాణం (తగును).
ఇది – యుద్ధ ప్రయాణానికి ముహూర్త చర్చ. చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం నడుస్తోంది. సౌరమానం ప్రకారం ధనుర్మాసం. సాయంకాల లగ్నం మిథునం అయింది. మిథునలగ్న స్వభావం రెండు రకాలుగా ఉంటుంది. సూర్యుడు సప్తమ కేంద్రంగానూ, కేతువు పాపగ్రహమూ ఉండడం గమనార్హం. ఈ రెండు గ్రహాల కలయిక ప్రయాణానికి తగదు. – అయినా, లగ్నానికి బుధుడు దేవతగా ఉన్నాడు. పూర్ణ చంద్ర యోగం కూడా ఉంది. అందువల్ల యుద్ధ ప్రయాణం చేయవచ్చునని తీర్మానం- అంటూ – జ్యోతిషశాస్త్ర విశేషాన్ని నేలటూరి రామదాసయ్యంగారు తమ వ్యాఖ్యలో విస్తృతంగా వివరించారు.
ఇక్కడా ఒక శ్లేష కూడా గమనించదగి ఉంది. ఈ ప్రాకృత గాథలో ‘అత్థ’ అంటే ‘అర్థః’ అనీ, ‘సూరే’ అంటే ‘సూర్యః’ అనే అర్థం అని కూడా నిరూపించే అవకాశం ఉంటుంది. అప్పుడు ‘అర్ధాభిముఖశూరుడు’ (ఒక ప్రయోజనం కోరుతూ ఎదురువెడుతున్న శూరుడు) రాక్షసమంత్రి కాగలడు. సంపూర్ణ మండలం (రాజ్యం) గల చంద్రుడు చంద్రగుప్తుడు అవుతాడు. ఉదితాస్తమిత కేతువు చంద్రకేతువు కాగలడు (అంటే ప్రస్తుతం అభ్యుదయంతో తోచే అతడు రేపు యుద్ధంలో అస్తమించవచ్చు). దీనికంతటికీ ‘లగ్నం’గా కుదిరే బుధుడు (పండితుడు) చాణక్యుడు కాగలడు.
శ్లేష (నానార్థ సంశ్రయః శ్లేషో వర్ణ్యావర్ణ్యోభయాస్పదః – అని కువలయానందం).
భదన్త, తిథి రేవ న శుధ్యతి.
భదన్త=స్వామీ, తిథిః+ఏవ=తిథే, న+శుధ్యతి=మంచిదిగా లేదు.
సావగా –
ఎక్కగుణ తిథి చఉగ్గుణే ణక్ఖత్తే
చఉసత్తిగుణే లగ్గే ఏసే జోహస తంత సిద్ధం తే. – (20)
(శ్రావక –
ఏక గుణా తిథి శ్చతుర్గుణం నక్షత్రమ్.
చతుఃషష్ఠి గుణం లగ్న మేష జ్యోతిష తన్త్ర సిద్ధాన్తః.)
శ్రావక=శిష్యా, తిథిః=తిథి, ఏక+గుణా=ఒక గుణం కలది. నక్షత్రమ్=నక్షత్రం, చతుః+గుణం=నాలుగింతలు గుణం కలది. లగ్నం=లగ్నం, చతుః+షష్ఠి+గుణం=అరవైనాలుగింతలు గుణం కలది. ఏషః+జ్యోతిష+తన్త్ర+సిద్ధాన్తః=ఇది జ్యోతిశ్శాస్త్ర సిద్ధాన్తం (ఒకదానికంటే ఒకటి బలవత్తరం అని).
లగ్గే హోఇ సులగ్గే సోమమ్మి గహమ్మి జఇ వి దుల్లగ్గే
వహేసి దీహం సిద్ధిం చందస్స బలేణ గచ్ఛంతే. – (21)
(లగ్నం భవతి సులగ్నం సౌమ్యే గ్రహే యద్యపి దుర్లగ్నమ్
వహసి దీర్ఘాం సిద్ధిం చన్ద్రస్య బలేన గచ్ఛన్.)
లగ్నం+యది+దుర్లగ్నమ్+అపి=ఒకవేళ లగ్నం మంచిది కాకపోయినప్పటికీ, గ్రహం+సౌమ్యే=గ్రహం మంచిదైన పక్షంలో, సులగ్నం+భవతి=మంచి లగ్నమే అవుతుంది. చన్ద్రస్య+బలేన= చంద్రుని (యొక్క) బలం వల్ల, గచ్ఛన్=వెడుతూ, దీర్ఘాం=చిరకాలం నిలవగల, సిద్ధిం+వహసి=ఫలాన్ని సంపాదించుకుంటావు.
నువ్వు చేస్తున్న ప్రయాణం చంద్రకేతుడితో మంచిది కాకపోయినా, – అయితే, చంద్రగుప్తుడితో చేరిక వల్ల నీకు భవిష్యత్తులో మంచి ఫలం దక్కుతుందిలే – అని వ్యంగ్యం.
శ్లేష. ‘లగ్నం’ ద్వారా చంద్రకేతుడి సహవాసాన్ని, ‘గ్రహం’ ద్వారా చంద్రగుప్తుడితో చేరికనీ చూపించడం గమనార్హం.
భదన్త, అపరైః సాంవత్సరికైః సహ సంవాద్య తామ్.
భదన్త=స్వామీ, అపరైః+సాంవత్సరికైః+సహ=ఇతర జ్యోతిష్కులతో కూడా, సంవాద్యతామ్=సరి చూసుకోబడుగాక!
సంవాదేదు సావగో, అహం ఉణ గమిస్సం (సంవాదయతు శ్రావకః, అహం పున ర్గమిష్యామి.)
శ్రావకః=శిష్యుడే (నీవే), సంవాదయతు=సరి చూసుకోగాక, అహం+పునః=నేనైతే, గమిష్యామి=వెళ్ళివస్తాను.
న ఖలు కుపితో భదన్తః?
భదన్త=స్వామీ, కుపితః+న+ఖలు=కోపగించలేదు కద?
కు విదేణ తుమ్హాణం భదంతే. (కుపితో న యుష్మాకం భదన్తః)
భదన్త=స్వామీ, యుష్మాకం=నీ విషయంలో, కుపితః+న=కోపగించుకోలేదు.
కస్తర్హి?
తర్హిః+కః=మరైతే ఎవరు? (కోపగించారు?)
భఅవం కఅంతో, జేణ అత్తడో పక్ఖం ఉజ్ఝి అ పరపక్ఖో పమాణీ కరీఅది. (భగవాన్ కృతాన్తః, యే నాత్మనః పక్ష ముజ్ఝిత్వా పరపక్షః ప్రమాణీక్రియతే).
(ఇతి నిష్క్రాన్తః క్షపణకః.)
భగవాన్+కృతాన్తః=పూజ్యుడైన (సాక్షాత్తు దైవం) విధి – యేన=ఎవని చేతనైతే, ఆత్మ+పక్షం=నీ పక్షాన్ని, ఉజ్ఝిత్వా=విడిచిపెట్టి, పర+పక్షః=ఎదిరి పక్షం, ప్రమాణీక్రియతే=ప్రమాణంగా భావించడమవుతున్నదో – (నీ ‘విధే’ నిన్ను వంచిస్తున్నది. నీ పక్షాన మాట్లాడే నా వంటి జ్యోతిష్కుణ్ణి కాదని, వేరొక జ్యోతిష్కుడిని సంప్రదించాలని అనుకోవడమే నీ దురదృష్టం అని క్షపణకుడి ఎత్తిపొడుపు. ఇక్కడ వ్యాఖ్యాత డుంఢిరాజు మరొక అర్థం కూడా చెప్పాడు.
“ఆత్మపక్షం” అంటే నందవంశీయుడైన చంద్రగుప్తుణ్ణి కాదని, పరపక్షం వాడైన మలయకేతుణ్ణి నమ్మాలనుకుంటున్నావు. అందుకే ‘విధి’ నీపై అలిగింది” అని క్షపణకుడుద్దేశించిన గూఢార్థం (క్షపణకుడు చాణక్య గూఢచారి కద!).
(ఇతి=అని, క్షపణకః=క్షపణకుడు, నిష్క్రాన్తః=వెళ్ళిపోయాడు.)
ప్రియంవదక, జ్ఞాయతాం కా వేలా వర్తత ఇతి.
ప్రియంవదకా!, కా+వేలా+వర్తతే+ఇతి=ఇప్పుడు ఏ వేళ అయిందో, జ్ఞాయతాం=తెలియబడుగాక (తెలుసుకో).
అత్థాహిలాసీ భఅవం సూరో, (అస్తాభిలాషీ భగవాన్ సూర్యః)
భగవాన్+సూర్యః=సూర్య భగవానుడు, అస్త+అభిలాషీ=అస్తమించబోతున్నాడు.
(ఉత్థాయ విలోక్య) అయే, అస్తాభిలాషీ భగవాన్ భాస్కరః, సంప్రతి హి,
(ఉత్థాయ+విలోక్య=లేచి నిలబడి చూసి) అయే=మరే!, భగవాన్+భాస్కరః=దైవం అయిన వెలుగుల రేడు, అస్త+అభిలాషీ=అస్తమించబోతున్నాడు.
ఆవిర్భూతానురాగా క్షణ ముదయగిరే
రుజ్జిహానస్య భానోః
పర్ణ చ్ఛాయైః పురస్తా దుపవనతరవో
దూర మా శ్వేవ గత్వా
ఏతే తస్మి న్నివృత్తాః పున రపరగిరి
ప్రాన్త పర్యన్త బిమ్బే
ప్రాయో భృత్యా స్త్యజన్తి ప్రచలితవిభవం
స్వామినం సేవమానాః – (22)
ఉదయగిరేః+ఉజ్జిహానస్య=తూరుపుకొండ నుంచి ఉదయిస్తున్న, భానోః=సూర్యుడికి, ఉపవన+తరవః=ఉద్యానవనాల్లోని చెట్లు, ఆవిర్భూత+అనురాగాః=ప్రేమ పుట్టినవై,
పర్ణ+చ్ఛాయైః=ఆకుల నీడలతో, పురస్తాత్=ఎదురుగా, క్షణం=ఒక నిమిషం పాటు, ఆశు+ఏవ=వెనువెంటనే, దూరం+గత్వా=చాలా దూరం వెళ్ళి (ఎదురుకోలు చేసి)నవై, (అట్టి), ఏతే=ఈ చెట్లు, అపరగిరి+ప్రాన్త+పర్యన్త+బిమ్బే=పడమటి కొండ సమీపానికి చేరిన బింబం కల, తస్మిన్=ఆ సూర్యుని యందు, పునః+నివృత్తాః=మళ్ళీ వెనుదిరిగినవైపోతాయి.
సేవమానాః+భృత్యా=జీతం కోసం పనిచేసే సేవకులు, ప్రాయః=తరచుగా, ప్రచలిత+విభవం+స్వామినం=సంపద (వైభవం) గతించిన యజమానుణ్ణి, త్యజన్తి=విడిచిపెట్టేస్తుంటారు.
స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.
అర్థాంతరన్యాసం. (ఉక్తి రర్థాంతర న్యాసస్స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలాయనందం).
ఇక్కడ సూర్యాస్తమయ సమయంలో చెట్ల నీడల కదలిక నెపంగా – సుర్యోదయాస్తమయ సమయాల నీడల ప్రవర్తనకు – వైభవంతో ఉన్న/తొలగిన యజమానుడి పట్ల జీతగాళ్ళ ప్రవర్తనతో పోలిక చెప్పడం కారణం (వాటి/వారి – సాధారణీకరణం).
(ఇతి నిష్క్రాన్తాః సర్వే)
(ఇతి=అని, సర్వే=అందరూ, నిష్క్రాన్తాః= వెళ్ళిపోయారు).
ముద్రా రాక్షస నాటకే రాక్షసోద్యోగో నామ
చతుర్థాఙ్కః
ముద్రారాక్షస నాటకే=ముద్రారాక్షసమనే నాటకంలో, రాక్షస+ఉద్యోగః+నామ= ‘రాక్షసమంత్రి ప్రయత్నం’ అనే చతుర్థ+అఙ్కః=నాలుగవ అంకం ముగిసినది.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™