కాంతం అచ్చంగా ఆంధ్రుల ఆడపడుచు. తెలుగువారి ఆడపడుచుకు సహజంగా ఉండే కోపతాపాలు, రాగద్వేషాలు, సులభకోపం, అల్పసంతోషం, భర్త పట్ల అవ్యాజమైన అనురాగం, పిల్లలపై అనంతమైన వాత్సల్యం కాంతంలో నిండుగా ఉన్నాయి. అంతేకాక మాటనేర్పరితనం, గడుసుదనం, హాస్యంతో కూడిన ఎత్తిపొడుపు ఆమెకు అమరిన ఆభరణాలు. అందుకే పొందికైన, సున్నితమైన సంభాషణలతో తెలుగు పాఠకుల హృదయాల్లో చోటు సంపాదించుకోగలిగింది. కాంతం అంటే కేవలం ఒక పుస్తకంలోని పాత్రలా అనిపించదు. చాల కుటుంబాలలో మనకు కనిపించే సాధారణమైన గృహిణులలో ఎప్పుడో ఒకప్పుడు కాంతం ప్రత్యక్షమౌతూనే ఉంటుంది. ఆయా సంఘటనలు ఎదురౌతూనే ఉంటాయి.
తన స్నేహితుని చెల్లెలి పేరు కాంతం అనీ, ఆ పేరంటే తనకు అభిమానం కలిగి, తన మనసులో చిత్రించుకున్న పాత్రకు ఆ పేరు పెట్టానని మునిమాణిక్యంగారు చెప్పారు. పేరు ఏదైనా, కథల కథనాలకి ఆయన భార్యే ప్రేరణ ఆయన మిత్రులకు తెలుసునట. మొదట్లో తన భార్య మాటలు, చేతలు ఆధారమైనా, రానురాను కాంతం పాత్ర తనకు తానే ఎదిగిపోయింది. తానే ఆయన కలాన్ని నడిపించింది. పరిపూర్ణ గృహిణీత్వం మూర్తీభవించుకున్నది.
ఒకరోజు కొడుకు ఏడుస్తూ వచ్చి చెప్పాడు స్కూల్లో మాస్టారు కొట్టారని. చైనా ఎక్కడుందో చెప్పలేక పోయాడట పిల్లాడు క్లాసులో. “ఆ మాస్టారుకి చేతులెలా వచ్చినయ్యో. అనవసరంగా కొట్టాడు పిల్లవాణ్ణి. చైనా ఎక్కడుందో చెప్పమన్నాడట. చిన్న వెధవాయె, ఎక్కడ పెట్టాడో ఏమో మర్చిపోయాడు కామాలు” అంది కాంతం భర్తతో. అంతటితో ఊరుకోక “ఏమిటిరా ఆ దరిద్రపుది చైనా? అసలు దాన్ని నీవు ఎందుకు తీసావు” అని కుర్రవాణ్ణి కోప్పడుతుంది. ఇదే కదా అమాయకమైన తల్లి మనసంటే!
ఓ ప్రముఖ సినీకవి అన్నట్టు “సంసారం…. సంసారం… ప్రేమసుధాపూరం… నవజీవన సారం”. ఆనందంగా జీవించాలంటే డబ్బే ముఖ్యం కాదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను హాస్యంతో తేలిగ్గా తీసుకుని తృప్తిగా జీవనయానం సాగించడం కాంతం కథల్లో కన్పిస్తుంది.
ఒకసారి పిల్లవాడికి జబ్బు చేస్తుంది. వైద్యుడు గాడిద పాలు పోయమంటాడు. తెప్పించమని కాంతానికి చెప్పి వెళతాడు భర్త. కాంతం మర్చిపోతుంది. సాయంత్రం భర్త తిరిగివచ్చి అడిగితే “మర్చిపోయానండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే గుర్తుకు వచ్చింది” అని అమాయకంగా అంటుంది కాంతం. మరోసారి భర్త తెలివిగా ఆమెను దెబ్బకొట్టాలని “మీ చెల్లెలు ఒక కోతి. మీ అక్కయ్య మరొక కోతి. తోకలు మాత్రం లేవు” అంటాడు ఎగతాళిగా. కాంతం ఏమాత్రం తడుముకోకుండా “మీ చెల్లెళ్ళకు ఆ లోటూ లేదు లెండి” అని తాపీగా సమాధానమిస్తుంది.
కాంతం దగ్గుతో బాధపడడం చూసి భర్త దుంపరాష్ట్రం ముక్క ఇచ్చి “బుగ్గన పెట్టుకో” అని చెబితే, దాన్ని అరచేతిలో పట్టుకుని బుగ్గకు ఆనించుకుని పడుకుంది. భర్త చూసి అదేమిటని అడిగితే “మీరు బుగ్గన ఉంచుకోమంటే బుగ్గన ఉంచాను. నోట్లో వేసుకోమనలేదుగా” అంటుంది. అమాయకంగా, మృదువుగా, మలయమారుతంలా మాట్లాడే కాంతం ఒక్కోసారి నేర్పుగా చురకలూ అంటిస్తుంది. “నేను వొట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం” అని భర్త అనగానే, నవ్వుతూ “అహహా. అనుమానం ఏమీ లేదు. నమ్మకమే” అంటుంది. అతడు ఉడుక్కోకుండా బహుశా నవ్వుకునే ఉండి ఉంటాడు.
ఓరోజు కాంతం భర్త కుంపటి రాజేయడానికి పాత కాగితాలు ఉపయోగిస్తున్నాడు. పాత రైల్వే గైడ్ నుండి కాగితాలు చింపి మంట చేయాలని చూస్తుంటే మండడం లేదు. అప్పుడు కాంతం “అవి రైల్వే గైడ్ లోని కాగితాలు కదండీ. అందుకే మండవు” అంది. రైల్వే గైడ్ లోని టైమ్ ప్రకారం రైళ్ళు ఎప్పుడూ నడవవు. అవి ఎప్పుడూ ఆలస్యమే. అలానే అందులోని పేపర్లు కూడ ఆలస్యంగా మండుతాయి అంటుంది కాంతం.
ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మాట పొందిక కాంతానికి పెట్టని సొమ్ము. ఆమె తన బహుకాల తపఃఫలమని నమ్మి మురిసిపోతాడు భర్త. ఆమె జీవితమే ఒక లలిత మధుర శృంగార కావ్యం. దాంపత్యంలో ఉండే విలువలకు నవ్వుల నదిలో పువ్వుల పడవ లాంటిది కాంతం. మధ్య తరగతి గృహస్థ జీవితంలో కూడ కావలసినంత అందం, ఆనందం ఉందని, దాన్ని గుర్తించే నేర్పు స్పందించే మనసు ఉంటే అంతా ఆహ్లాదమే. ఆడవాళ్ళ మాటల్లో గానీ, చేతల్లో గానీ, సంసారాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నాల్లో గానీ బోలెడంత మాధుర్యం ఉంటుంది.
మొదలి నాగభూషణశర్మ గారన్నట్లు “తెలుగు దేశం లోని వైవాహిక జీవితంలో వున్న సౌకుమార్యాన్ని, భార్యాభర్తల అనురాగంలో ఉండే సున్నితమైన చమత్కారాన్ని పుస్తగతం చేసినవాడు మునిమాణిక్యం. మామూలు జీవితాల్లో ఎదురయ్యే అతి స్నిగ్ధమైన విషయాలను ఈయన చూపినంత స్పష్టంగా, సున్నితంగా మరే రచయితా చూపలేదు. భార్యాభర్తల మధ్య ఉండే సున్నితమైన స్పందన, కోపతాపాలు, విరహ సంయోగాల్లో ఉండే ఆనందం అన్నీ కాంతం కథల్లో రూపుకట్టాయి.”
జీవితంలోని అనేక క్లిష్ట సమస్యలను, ఒడిదుడుకులను హాస్యదృష్టితో చూసి, తేలిగ్గా తీసికొని జీవితాన్ని ప్రతి క్షణం ‘జీవించడం’ నిజంగా గొప్పతనం కదా!!
డా. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో పనిచేసి, ప్రిన్సిపాల్‌గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్‌గా, ఎడిటర్‌గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ ల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు. విద్యార్థినులు చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం తన కెరీర్లో ఆమెకిష్టమైన పనులు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం సంతృప్తి కలిగించిందంటారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™