[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]


మిస్ అయిపోయిన ఎపిసోడ్ శోభారాణి మేడంను అడిగి తెలుసుకోవడం:
ఒక్క ఎపిసోడ్ అనివార్య కారణాల వల్ల మిస్ అయితే ఏదో పోగొట్టుకున్న దానిలా అయిపోయేదాన్ని. అందులో భాగంగా కేబుల్ పోయినప్పుడు వచ్చినప్పటికీ వస్తుందని ఊరుకునే దాన్నికాదు. కేబుల్ వాళ్లకు ఫోన్ చేసి మాకు కేబుల్ రావటం లేదు త్వరగా బాగు చేయండి అని కంప్లైంట్ చేసేదాన్ని. కరెంటు పోతే మాత్రం ఏమి చేయలేను గమ్మున కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా వారానికి ఒకసారి ఎంబ్రాయిడరీ వర్క్ మిస్ అయితే ఫోన్ చేసి ఈ రోజు ఏం వర్క్ చెప్పారు, వీలుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అని రిక్వెస్ట్ చేసేదాన్ని. నేను ఎంత శ్రద్ధగా అడిగానో ఆ మేడం కూడా అంతే శ్రద్ధతో ఫోన్లో ఎంత చెప్పగలరో అంత వీలైనంతవరకు వివరించేది. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించేది. అర్థమైన వరకు అర్థం చేసుకొని కొంత నేను ఎలా చేయాలో ఊహించుకొని ఆ వర్క్ గుడ్డ మీద శాంపిల్‌గా వేయడం మానలేదు. ఆ శాంపిల్స్ చూపించే ఆర్డర్లు తీసుకునే దాన్ని. మూలపేటలో వచ్చినన్ని ఆర్డర్లు పరమేశ్వరి నగర్ వచ్చాక అంతగా రాలేదనే చెప్పగలను. కానీ పద్మజది ఎప్పుడూ ఏదో ఒకటి ఉండేది. అమ్మాయి మాత్రం చాలా చాలా ఇష్టపడి ఎక్కువ కుట్టించుకునేది.
ఎలక్ట్రానిక్ వీల్ చైర్ కోసం మళ్లీ వెతుకులాట:
ఇంతలో నాన్న నన్నుఎత్తుకోవడం ఎక్కువ కష్టం అయిపోవడంతో నాకు సౌకర్యమైన, నేను చెప్పిన విధంగా ఉండే వీల్ చైర్ కోసం మా పెద్ద చిన్నాన్న పెద్ద మేనత్త కుమారుడు చిన్న మేనత్త వాళ్ళు అందరూ కలిసి ఆన్లైన్లో నా వీల్ చైర్ కోసం ఎక్కువ శ్రద్ధతో వెతకడం ప్రారంభించారు.
శోభారాణి మేడం మా ఇంటికి రావడం:
ఇదిలా ఉండగా శోభారాణి మేడం నెల్లూరుకు వచ్చినప్పుడు నన్ను కలుస్తాను అంటూనే ఉండింది. ఆ క్రమంలో ఈనాడు వసుంధర పేపర్ వాళ్ళు ఒక ఈవెంట్‌ను నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్లో సఖి ప్రోగ్రాంలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చెప్పే బ్యూటీషియన్ అయిన శోభారాణి మేడంను నెయిల్ ఆర్ట్ టీచింగ్ కోసం గెస్ట్‌గా నెల్లూరుకు ఆహ్వానించారు. ఆ విషయం నాకు శోభారాణి మేడం ఫోన్ చేసి చెప్పింది. “నెల్లూరు వస్తున్నాను మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పింది నాకు చాలా సంతోషం వేసింది. ఇది నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ విషయానికి సంబంధించి ఒక గుర్తింపు. టీవీలో ఎంబ్రాయిడరీ చెప్పే మేడం ఇంటికి వస్తున్నది అంటే చెప్పలేనంత ఆనందం. అంత సపోర్ట్ చేస్తున్న ఆ మేడంకు నా చేత్తో స్వయంగా ఏమన్నా చేసి పెట్టాలనే ఉద్దేశంతో ఆమెను ముందుగా ఏం తింటారు అని అడిగి తెలుసుకున్నాను. అంతలో ఆ రోజు రానే వచ్చింది. నేను వంట చేసేటప్పుడు నాన్న ఎప్పుడూ నాకు కావలసినవన్నీ అందించేవారు. ఆ క్రమంలో ఆ రోజు కూడా నాన్న ఆమె వస్తుందన్న సంతోషంలో వంట పనిలో చాలా సహాయం చేశారు. ఆమె వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళను కొంత హెల్ప్ చేయమని అడిగాను. ఆ రోజు వసుంధర పేపర్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అయిపోయిన వెంటనే మా ఇంటికి రావడానికి అడ్రస్ తెలుసుకోవడానికి సులభం అవడం కోసం ఈనాడు వసుంధర పేపర్ మేనేజర్‌ను కూడా తోడు తెచ్చుకున్నారు. శోభారాణి మేడం, ఆమె భర్త, ఈనాడు వసుంధర పేపర్ మేనేజర్ ముగ్గురు వచ్చారు. నేను చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు ముఖ్యమైన వాళ్లను తోడు సహాయం కోసం పిలిచాను. నేను అప్పుడు చిన్న అత్త వాళ్ళను చిన్న చిన్నాన్న రోహిణి వాళ్ళందరినీ ‘శోభారాణి వస్తోంది మీరు రండి’ అని చాలా ఆశగా పిలిచి ఉన్నాను. ఎందుకంటే “ఈ అమ్మాయి నా ఫ్రెండ్ రోహిణి, ఈమె మా అత్త, మామయ్య, ఈయన మా చిన్నాన్న పిన్నమ్మ” అని శోభారాణి మేడంకు నాన్నతో సహా పరిచయం చేయాలని చాలా ఆశపడ్డాను. కానీ ఆ రోజు మా చిన్న అత్తకు, చిన్నాన్న వాళ్లకు, రోహిణికి ఏదో పని ఉండడం వల్ల రాలేకపోయారు. శోభారాణి మేడం రావడం అన్నది నా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌లో ఉన్న కష్టానికి, ఒక గుర్తింపు. ఈ విషయం తల్చుకుంటే నాకు ఇప్పటికీ బాధే. సరే వాళ్ళ ఇబ్బంది కూడా నేను అర్థం చేసుకోవాలి. తప్పు నాదే. శోభారాణి మేడం వచ్చికూర్చున్నాకా (ఆమె టీవీలో ఎక్స్ప్లెయిన్ చేసిన వర్క్స్) నేను వేసిన శాంపిల్స్ ఇంకా అప్పటికిదే నేను చేస్తున్న ఆర్డర్స్ చూపించాను. చాలా మెచ్చుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అప్పటికి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి. అప్పుడు నేను టీవీ చూసి ఎంబ్రాయిడరీ నేర్చుకున్న వాళ్లలో స్టేట్ సెకండ్ అట. ఈ విషయం నేను ఆమె చెబుతుండగా వినలేదు. పక్కన ఎవరో మాట్లాడితే వాళ్లతో మాట్లాడుతూ ఉండినాను. ఈ విషయం శోభారాణి మేడం వెళ్ళాక నాన్న చెప్పారు. స్టేట్ ఫస్ట్ వచ్చిన ఆమె హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ గురించి ఏ వర్క్ ఎలా కుట్టాలో వివరిస్తూ పుస్తకం కూడా రాసిందట. నాకు మొదట్లో ఈ ఆలోచన రాలేదు. తర్వాత ఎప్పటికో మేడం రాకముందే ఒక అయిదారు వర్కులు రాసాను. అది చూపించాను మేడంకు. గుడ్ అన్నారు. నేను శాంపిల్ వేసిన వర్కులు కూడా చాలా బాగా కరెక్ట్‌గా కుట్టానని మెచ్చుకున్నారు.


శోభారాణి మేడమ్ మా ఇంట్లో
వసుంధర పేపర్లో నా గురించి రాయించాలన్న ఆలోచన:
అప్పుడే వసుంధర పేపర్ మేనేజర్ గారికి నన్నుపరిచయం చేసి నా గురించి వసుంధర పేపర్లో రావాలని అందుకు తగిన ఏర్పాట్లుచేయమని ఆ సార్‌కు చెప్పింది. ఆ సార్ వెంటనే ఎవరికో ఫోన్ చేశారు. ఏదో మాట్లాడుతున్నారు. నాకైతే అర్థం కాలేదు. ఒక గంట సేపు ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయారు. ఆమె వైజాగ్ వెళ్ళాక కొద్దిరోజుల తర్వాత అక్కడ ఒక ఈవెంట్లో నా గురించి చెప్పిందట. ఇదంతా శోభారాణి గారి స్నేహితురాలు సుధా గారు ఆ ఈవెంట్లో విన్నదట. విని నా నంబర్ తీసుకున్నదట. శోభారాణి మేడం గారు చెప్పారు. ఆమె ఏదైనా సహాయం చేస్తానంటే వద్దని చెప్పవద్దు అని చెప్పారు శోభారాణి మేడం. సరే ఓకే అన్నాను.
సుధా అక్కతో పరిచయం:
తరువాత కొన్నాళ్లకు సుధా గారు నాకు కాల్ చేశారు. నా గురించి అడిగి తెలుసుకుని సుధా గారు ఆర్థికంగా కొన్ని సంవత్సరాలు ప్రోత్సహించారు. శోభారాణి గారు నాకు ఎంబ్రాయిడరీ నేర్పడమే కాకుండా వారి స్నేహితురాలికి నా గురించి చెప్పినా పురోభివృద్ధికి తోడ్పడ్డారు.
వీల్ చైర్ కంపెనీ – కాలిడాయి మోటార్ వర్క్స్:
ఇది ఇలా ఉండగా మా పెద్ద చిన్నాన్న, పెద్ద మేనత్త కొడుకు నాకు సౌకర్యమైన వీల్ చేరు కోసం ఆన్లైన్లో వెతకడం ప్రారంభించారు కదా. అప్పుడు మా పెద్ద చిన్నాన్న ఉమామహేశ్వరం గారు మద్రాసులో కాలిడాయి మోటార్ వర్క్స్అనే కంపెనీ వాళ్లు నాకు సరిపడే వీల్ చైర్ తయారు చేయగలరని నేను కొలతలు తీసుకోవడం కోసం నేను డబ్బుకట్టాను. వాళ్లు వచ్చి కొలతలు తీసుకుంటారు అని చెప్పారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆ కంపెనీ ఓనర్ నుంచి వర్కర్స్ వరకు అందరూ ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ అని చిన్నాన్న చెప్పారు. అమ్మో అని ఆశ్చర్యపోయాను. లోపాన్ని అధిగమించి అంత పెద్ద కంపెనీని నిర్వహిస్తున్నారంటే ఎంత గొప్ప విషయం హాట్సాఫ్ టు కాలిడాయ్ మోటార్ వర్క్స్. వీళ్ళ గురించి చెప్పాలంటే నా శక్తి సరిపోదు. వీళ్ళ ప్రతిభతో పోల్చుకుంటే నేను వాళ్ల ముందు చాలా చిన్నదాన్ని. ఒకరోజు వాళ్లు వచ్చిఇంటి కొలతలు నాకు చైర్ సరిపడే విధంగా కొలతలు తీసుకొని వీల్ చైర్ తయారు చేయడానికి మూడు నాలుగు నెలలు పడుతుందని చెప్పివెళ్ళిపోయారు.
నాకు షుగర్ వ్యాధి:
దీనికి కొన్నినెలలు ముందే నాకు ఆరోగ్య సమస్య వచ్చింది. డాక్టర్‌కు చూపించుకుంటే షుగర్ వ్యాధి వచ్చిందని నిర్ధారించారు. అప్పటివరకు నాకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏమి లేవు. ఇక అప్పటినుంచి ప్రారంభమైనవి. షుగర్ తర్వాత బిపి ఆ తర్వాత కొలెస్ట్రాల్ అన్నిసమస్యలు వచ్చేసాయి. రోజు విధిగా మందులు వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒంట్లో శక్తి కూడా తగ్గడం ప్రారంభమైంది. ఎంబ్రాయిడరీ వర్క్ చేయడంలో స్పీడ్ తగ్గింది. ఆర్డర్లు రావడం కూడా తగ్గింది. అప్పుడు రోహిణి పరిచయం చేసిన అమృత అక్క క్లాత్‌తో చేసిన హ్యాండ్ బ్యాగులు ఇంతకుముందు లాగే రీ-సేల్ చేయమని అవకాశం ఇచ్చింది. ఆ ప్రయత్నం ఇక్కడ చేశాను. కానీ ఏ ఒక్కరూ కూడా కొనడానికి ముందుకు రాలేదు. ఎవరైనా ఏదైనా కొనాలంటే వాళ్లకి ఆ వస్తువు నచ్చాలి, దాని రేటు నచ్చాలి, దాని అవసరం ఉండాలి. బహుశా వాళ్లకు ఇవేవీ అవసరం పడనట్టు ఉంది. అందుకే ఇవి సేల్ కాలేదు.
మా చిన్న అత్త పెద్ద కుమారుడి వివాహం:
అంతలో మా చిన్న అత్త పెద్ద కుమారుడికి వివాహం కుదిరి డేట్ ఫిక్స్ అయింది. ఆ అబ్బాయికి ఏదైనా గిఫ్ట్‌గా చేసిద్దామనుకున్నాకానీ మగ పిల్లవాడు కదా ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని ఆ అమ్మాయికి వెల్వెట్ క్లాత్‌తో ఒక సెల్ ఫోన్ పౌచ్ చేసిద్దామని నిశ్చయించుకొని వెల్వెట్ క్లాత్ దానికి సంబంధించినవి తెప్పించుకొని చేతితోనే సూది దారంతో సెల్‌ఫోన్ పౌచ్ తయారు చేశాను. మొదటి ప్రయత్నం అయినా కూడా చాలా బాగా వచ్చింది. అదే వాళ్ళ వివాహానికి ఆ అమ్మాయికి గిఫ్ట్‌గా ఇచ్చాను. అది ఆ అమ్మాయికి చాలా బాగా నచ్చింది.
సెల్ ఫోన్ పౌచ్ పర్సుల బిజినెస్:
పద్మజ ఎదురింటి ముస్లిం ఆంటీ “చాలా బాగా చేశావు సేల్ చేయ్” అని చెప్పారు. అయినా కూడా దీని కన్నాబెటర్గా ఇంకేదైనా ఉందేమోనని ఆలోచించాను. ఏది దొరకలేదు. ఇక ప్రత్యామ్నాయం ఇదేనేమో అనిపించింది. అయినా ఇంకా ఆలోచిస్తే అప్పుడు సఖి ప్రోగ్రాంలో ఇంకా ఏమి చూపించారు ఏమి నేర్చుకున్నాను అని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయగా వెల్వెట్ క్లాత్‌తో ఐటమ్స్ గుర్తొచ్చాయి. వెల్వెట్ క్లాత్‌తో రోజ్ ఫ్లవర్స్, సెల్ ఫోన్ పౌచ్, హ్యాండ్ పర్సులు, హ్యాండ్ బ్యాగులు నేర్పించారు. రోజ్ ఫ్లవర్స్ షోకేస్‌లో షో పీస్‌గా పెట్టుకోవాల్సిందే. అవి అందరూ కొనరు. అందరికీ ఎక్కువ అవసరమైనవి ఏమిటా అని ఆలోచిస్తే పర్సులు, సెల్‌ఫోన్ పౌచ్ ఇవి అందరికీ అవసరం ఇవైతే అందరూ కొంటారు అని ఆలోచించుకొని ఇవి చేయాలి అని నిశ్చయించుకున్నాను. 50 సెల్ ఫోన్ పౌచులు 50 పర్సులు కుట్టి అమ్మగలిగాను. తరువాత అవి కూడా కొనడానికి ఎవ్వరు ముందుకు రాలేదు.


ప్రముఖ రచయిత, ఆకాశవాణి రిటైర్ట్ అధికారి శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారు, వారి సతీమణి హంసవర్ధిని గారు, వేణుగోపాల్ గారి మిత్రులతో ప్రసన్నగారు
సుధా గారు నాకు ఎల్ఈడి టీవీ బహుకరణ:
ఇంతలో ఒకరోజు సఖి ప్రోగ్రాంలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎపిసోడ్ ఉన్న రోజు టీవీ పాడైపోయింది. వెంటనే మెకానిక్ కు ఫోన్ చేసి పిలిస్తే పక్క రోజు వస్తానని చెప్పారు. ఇంకేం చేయను ఆరోజు ఎపిసోడ్లో ఒక వర్క్ మిస్ అయిపోయాను. ఒక్క వర్క్ మిస్సయినా ఏదో పోగొట్టుకున్న దానిలా బాధపడి పోయేదాన్ని. ఇది తప్పని తెలుసు కానీ నన్నునేను కంట్రోల్ చేసుకోలేక పోయేదాన్ని. అదే రోజు ఎందుకు సుధా గారు కాల్ చేశారు. ఎలా ఉన్నావ్ అమ్మా అన్నారు. ఇంకేముంది నాకు ఏది పట్టుకుంటే అది అన్నట్టు మా ఇంట్లో టీవీ పాడైపోయింది ఈరోజు ఎంబ్రాయిడరీ వర్క్ మిస్ అయిపోయాను అని చెప్పాను బాధపడుతూ. ఆ పక్క రోజే మెకానిక్ వచ్చిటీవీ రిపేర్ చేశాడు. టీవీ బాగా అయింది. నాలుగు రోజుల తర్వాత సుధా గారు కాల్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి అని అడిగారు. ఎందుకు అక్కా అని అడిగితే ఏమీ లేదు అంటూ ఏదో చెప్పేశారు. అడ్రస్ ఇచ్చాను. ఇంకా నాలుగు రోజుల తర్వాత ఎవరో ఒకతను కాల్ చేసి మిమ్మల్ని సుధా గారు కలవమన్నారు. మేము ఒక గంటలో వస్తున్నాము మీ అడ్రస్ చెప్పండి అని చెప్పారు. అప్పట్లో మా నాన్న పక్కన ఉన్నా, కొత్త వాళ్లు అపరిచితులు ఇంటికి వస్తున్నారు అంటే నాకెందుకో చాలా భయం. ఎందుకు వస్తున్నారు అని అర్థం కాలేదు. పక్కనున్న సుబ్బమ్మ ఆంటీని తోడు పిలిచాను. మాది సెకండ్ ఫ్లోర్ కదా సుబ్బమ్మ ఆంటీ కిందకు వెళ్లివాళ్లను రిసీవ్ చేసుకుంది. వాళ్లు వచ్చేసరికి నేను మంచం మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు వాళ్లు ఒక పెద్ద బాక్స్ తీసుకొని వచ్చి నా పక్కన పెట్టారు. ఏంటా అని చూస్తే 21 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. అమ్మో ఇదేంటి అనిపించింది. అప్పుడు వాళ్ళు చెప్పారు మీకు సుధా గారు టీవీ బహుకరించారు రేపు టీవీకి సంబంధించిన ఇంజనీర్ వాళ్ళు వచ్చి బిగిస్తారు అని చెప్పారు. ఎంత సంతోషమో చెప్పలేను. నాన్న కూడా చాలా సంతోషపడ్డారు. అంతే వాళ్లు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఈ మాత్రానికి నేను ఎందుకు భయపడ్డాను అని నాలో నేనే ప్రశ్నించుకున్నాను. ఇలా ప్రతిదానికి భయపడకూడదు, ఏది వచ్చిన ధైర్యంగా సమర్థించుకోవాలి అని అనిపించింది ఆ రోజు. ఇదే నిజం కదా. అప్పుడు ఆ సుధ అక్కకు కాల్ చేసి థాంక్స్ చెప్పి ఇప్పుడు ఎందుకు కొన్నారు అని అడిగాను. నీవు చేసే వర్క్స్ వాళ్ళకు బాగా శ్రమ కదా, అది మామూలు పోర్టబుల్ టీవీ చూస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, దీనికి అంతా ప్రభావం ఉండదు కళ్ళకు ఎటువంటి చెడు జరగదు అని చెప్పింది. టీవీ కూడా నా పేరు తోనే కొన్నది.
సుధా అక్క మా ఇంటికి రావడం:
దీనికి ముందో దీనికి తరువాతనో సరిగా గుర్తులేదు సుధా గారు వారి కజిన్ వారి అన్నయ్య ఇంకొక పెద్దాయన తిరుమల వెళ్లి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి వచ్చారు. అసలు వాళ్లది అమలాపురం. అమలాపురం నుంచి తిరుమల వెళ్లారు. తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో నన్ను కలవాలని అనుకొని వచ్చారు. ఆ టైంలో నెల్లూరులో ఇంకా చెప్పాలంటే మా ఇంటికి వచ్చేదారుల్లో రోడ్లు అన్ని తవ్వేసి ఉన్నాయి. అయినా సరే తిరిగి వెళ్లకుండా ఎంతో ప్రయాస తీసుకుని వచ్చారు. రోడ్లు బాగోలేవనే సాకుతో మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతే నేనేం చేయగలను. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఎంత కష్టమైనా రోడ్లన్నీతిరుగుకొని కష్టపడి కార్లో వచ్చారు. అంటే నాకు ఎంత విలువ ఇచ్చారో అని అర్థమైంది. చాలా సంతోషంగా అనిపించింది. వచ్చారు నలుగురు కూర్చున్నారు. ఒక రెండు నిమిషాలు ఆ మాట ఈ మాట మాట్లాడారు. అంతే కాసేపటికి సుధా గారి కజిన్ కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఆ తర్వాత సుధా గారి కంట్లోనుంచి కూడా నీళ్లు కారుతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగా. ఏం చెప్పలేదు. నేను చేసిన ఎంబ్రాయిడరీ వర్కులు చూపించమన్నారు. చూపించాను. చాలా మెచ్చుకున్నారు. అప్పుడు ఏదో మాటల్లో నాకు కుడి కన్ను పూర్తిగా కనిపించదు చిన్నప్పుడు సూర్యగ్రహణం చూసానట అందువల్ల చూపు తగ్గిపోయింది అప్పట్లో (నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అనుకుంటా) నాన్న ఎత్తుకొని తీసుకెళ్లి డాక్టర్‌కు చూపించారు. అప్పుడు చెప్పారు దానికేమి చేయలేము అని. ఆ విషయం వాళ్లకు చెప్పాను. చెప్పాలన్న ఉద్దేశంతో కాదు. మామూలుగానే చెప్పాను. విన్నారు నేను చెప్పింది. అప్పుడేమి చెప్పలేదు.
సుధా గారు నన్ను కంటి ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకు వెళ్లడం:
తర్వాత కొద్దిరోజులకు సుధా గారు కాల్ చేసి మోడరన్ ఐ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాము నిన్ను తీసుకెళ్లి డాక్టర్‌కు చూపించి తీసుకొని వస్తాము రెడీ అవ్వమని కాల్ చేసి చెప్పారు ఒక గంట వ్యవధిలో. ఇక సరే అనుకొని నాన్న నేను వాళ్ళు తీసుకొని వచ్చిన అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి వెళ్ళాము. ఇక ఆ రోజు హాస్పిటల్లో అన్ని కంటి పరీక్షలు చేయించి అద్దాలు రాయించి నాకు ఇచ్చారు. అప్పుడప్పుడు మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి చూపించి తీసుకొని వస్తాము అని చెప్పారు. మళ్లీ ఆ సుధ అక్క వాళ్లు అదే అంబులెన్స్‌లో నన్ను నాన్నను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చారు. ఇది ఏ జన్మ సంబంధమో అర్థం కాని విషయం. అప్పటికి కంటి చూపు తగ్గినా కూడా పర్స్లతో పాటు ఇంకా నేను ఎంబ్రాయిడరీనే చేస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎంబ్రాయిడరీ ఎక్కువమంది ఆర్డర్ ఇవ్వలేదు.
నా ఫ్రెండ్ పద్మజ ప్రోత్సాహం:
ఇక్కడ మా అపార్ట్మెంట్లో మా పై ఫ్లోర్లో ఉండే పద్మజ అనే అమ్మాయి నా ఫ్రెండ్ అయినందున ఆ అమ్మాయికి వీటి మీద ఆసక్తివున్నందున నన్ను ఎంబ్రాయిడరీ చేయమని తన చీరలు, బ్లౌజులు ఇచ్చేది ఎక్కువగా. అవి చేస్తూ ఉండినాను. పద్మజ కూడా సఖి ప్రోగ్రాం ఇంకా కొన్నిఫ్యాషన్ డిజైనింగ్ ప్రోగ్రామ్స్ చూసి వాటిల్లో చెప్పే టెక్నిక్స్, చీరలు బ్లౌజ్‌లను కొన్ని కొన్ని తనే డిజైన్ చేసుకునేది. అవి తెచ్చినాకు చూపించేది. ఈ రకంగా కూడా ఎంబ్రాయిడరీలో మరి కొన్నిమెలకువలు నేర్చుకున్నాను. అదే క్రమంలో ఆ అమ్మాయి నా చేత చాలా బ్లౌజుల పై డిజైన్లు చేయించుకుంది. ఇంకా వాళ్ళ బంధువుల ద్వారా కూడా నాకు కొన్నిఎంబ్రాయిడరీ ఆర్డర్లు ఇప్పించింది. ఇలా వచ్చిన ఆర్డర్లు చేసుకుంటూ టీవీలో చూపించే కొత్త కొత్త డిజైన్లు ఒక చిన్న క్లాత్ మీద వేసుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ జీవితం సాగిపోతుంది. అప్పుడప్పుడు నాకు వచ్చిన షుగర్ వ్యాధి హెచ్చుతగ్గులు, మా నాన్నకు చిన్న ఆరోగ్య సమస్యలు. అయినా సరే ఎంబ్రాయిడరీ ఆర్డర్లు వస్తునంతవరకు నేను మానలేదు. క్రమేణ కంటి చూపు మరింత బలహీన పడడం వల్ల సన్న సూదులలో దారం ఎక్కించడం కష్టతరమైనది. క్రమేణ ఎంబ్రాయిడరీ ఆర్డర్లు కూడా రావడం తగ్గింది. ఇక నాలో భయం! ఏమీ చేయలేనా ఒక వంట చేయడానికి పరిమితమైపోతానా చదువుకొని కూడా ఉద్యోగం చేయలేక ఏదో ఎంబ్రాయిడరీ దొరికింది అది అన్న చేస్తున్నాను అన్న సంతృప్తి కూడా లేకుండా పోతోంది. ఏమి చేయాలి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నేనేమి చేయగలను.
మరొక దారిలో వచ్చిన అవకాశం:
అవకాశం నాకు ఎటు నుంచి వస్తుంది. ఏ పని అయితే నేను చేయగలను ఏమీ దొరకకపోతే నా పరిస్థితి ఏమిటి? అన్న భయాలు నాలో మొదలైనప్పటికీ నేను ఏదో ఒకటి చెయ్యాలి. చేయకుండా ఉండలేను తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. అన్న తపన ఎక్కువైపోతుంది రోజురోజుకు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే అప్పటికే మా చిన్న అత్త రెండవ అబ్బాయి వివాహం అయి ఆ అబ్బాయికి ఒక బాబు పుట్టాడు. మా నాన్నకు చిన్న అత్త పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్లకు కూడా నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్లు మా సత్యం మామ మా సత్యం మామ అని పిలిచేవాళ్ళు. నాన్నకు కూడా వాళ్లు ఇష్టం కాబట్టి ఆ బాబు బారసాలకు బాబుకు ఒక షర్ట్ కొనుక్కుని తీసుకొని వెళ్ళాడు. చిన్న బాబుకు షార్ట్ ఇస్తే చిన్న అత్త పెద్దకొడుకు పాపకు ఏమి ఇవ్వాలి అని ఆలోచించి మొట్టమొదటిసారిగా థ్రెడ్ బ్యాంగిల్స్ ట్రై చేసి ఆ పాపకు ఇవ్వమని నాన్నకు ఇచ్చాను. గాజులు అత్త వాళ్ళ ఇంటికి పంపకముందే అంటే నేను తయారు చేస్తున్నప్పుడే నా ఫ్రెండ్ పద్మజ మా ఎదురు ఇంట్లో ఉన్న సబిహ ఆంటీ వాళ్లు బాగా చేశావు, దీనినే బిజినెస్‌గా చేయొచ్చుకదా అందరూ కొంటారు అని చెప్పారు. కానీ అవి ఎవరు కొంటారు ఎందుకో నాకు నమ్మబుద్ధికాలేదు.
మొదటిసారిగా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఆర్డర్స్:
మా ఎదురింటి సబిహా ఆంటీ ముందు మా మనవరాళ్లకు చెయ్యి ఆర్డర్ ఇస్తాము అన్నారు. అన్నమాట ప్రకారం వాళ్లు ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ల మనవరాళ్ల కందరికీ చేశాను. ఇంకా వాళ్ళ చెల్లెలు మనవరాళ్ళకు కూడా ఆర్డర్ ఇచ్చిచేయించుకున్నారు. నేను వాటిని చేసేటప్పుడు సబిహ ఆంటీ కూతుళ్లు వాళ్లకు గాజులు చేయడం రాకపోయినా నాకు అందులో మెలకువలు నేర్పించారు. అది బాగాలేదు ఇది బాగాలేదు అలా చేయి ఇలా చేయి అంటూ కత్తికి సాన పట్టిన విధంగా నాకు తగిన సలహాలు ఇచ్చినాకు గాజులు చేయడంలో తగినంత తర్ఫీదు ఇచ్చారని కచ్చితంగా చెప్పగలను. ఇక మెల్లగా పద్మజా ఇంకా ఎవరో ఒకరు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. క్రమేణా నా వర్క్ కూడా నీట్‌గా చేయగలగడం నేర్చుకున్నాను. నా ఫ్రెండు రోహిణి కూడా కొన్నిఆర్డర్లు ఇచ్చింది ఇప్పించింది కూడా.


(ఇంకా ఉంది)
92916 35779
prasunasuram@gmail.com
1 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up
.*