[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]
నారద భక్తి సూత్రాలు
1. “అథాఽతో భక్తిం వ్యాఖ్యాస్యామః”
“అథ” అటు పిమ్మట, అటు తరువాత, అని మొదలుపెట్టారు మొదటి సూత్రంలో.
అంటే పూర్వం మాటలో, చేతలో, ప్రశ్ననో, మరోటో ఉన్నదనే కదా అర్థం.
బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు మొదలుకొని, ఈ భక్తి సూత్రాల వరకూ కూడా ఇలా “అటుపై”, అంటూ ప్రారంభం సామాన్యం.
పూర్వపు కొంత ఈ దిశగా పరిశ్రమ చేసి ఉండటమో, లేదా ఈ విషయమై చర్చ జరిగి ఉండటమే కూడా జరిగి ఉండవచ్చని ఈ “అథ” శబ్ధం వలన తెలుస్తోంది.
అంటే ఎవరైతే ఆ భక్తి విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఈ దిశగా కొంత ప్రయాణించి ఉండి ఉండవలెను.
భక్తికి ముందు తెలుసుకోవాలనే జిజ్ఞాస, నమ్మకము, సహనము, ఓపిక, కరుణా, అహింసా ప్రవృత్తి, సత్య వాక్కు సాధన చేసి ఉండాలి. నిష్కామసేవ చేస్తూ ఉండాలి. వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి. అనుమానము లేని నమ్మకం ఉండాలి పరమాత్మ మీద.
అంతఃకరణల శుద్ధి కలిగి జిజ్ఞాసతో పరమాత్మను ప్రేమించగలిగితే, పరమాత్మ నిజతత్త్వం తెలుసుకోగలరు. పరమాత్మను తెలుసుకునే కొద్ది భక్తి కలగటం జరుగుతుంది.
మనకు పెద్దల యందు ఉండే గౌరవం ఈ భక్తి ఒకటి కాదు.
“పూజ్యేషు అనురాగో భక్తిః” పూజ్యులయందు లేదా పూజ్యవస్తువుల యందు మనస్సు నిలిపి, చేర్చి ఉండే ప్రవృత్తిని భక్తి అంటారు. మనకు మన తల్లితండ్రల యందు చూపే భక్తి, భగవంతుని యెడల చూపే భక్తికి సమానం కాదని ఈ నారద సూత్రాలు చెబుతాయి.
విశిష్టాద్వైతాన్ని ప్రసాదించిన శ్రీ రామానుజులు భక్తి మార్గంలోకి రావాలంటే కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పారు. అవి వివేకం, విమోకం (కోరికలు లేకపోవటం), అభ్యాసం, క్రియా (మంచి పనులు చేయటం), కల్యాణము (మంచి మాటలాడటం, కరుణ కలిగి ఉండటం), అనవసద (సంతోషం), అనుద్దరస (అనవసరమైనవి కలిగి ఉండకపోవటం).
ఈ లక్షణాలు కలిగి ఉంటే పరమాత్మ పై ప్రపత్తి కలుగుతుందని రామానుజులు చెబుతారు.
మొదటి కావలసినది భగవంతుని ఉనికి గురించి నమ్మకం. ప్రశ్నించే మనస్సు ఉన్న వారికి, సందేహాత్మునికి భక్తి కుదరటం కష్టం. కొంత పూర్వ పుణ్యం కూడా కలిసి రావాలి. కాయ పండుగా మారకపోతే ఎలాగైతే మనము స్వీకరించలేమో, అలాగే సందేహాత్ములలో భక్తి అన్నది కలగటం దుర్లభం.
అందుకే నారదులవారు ఈ మొదటి సూత్రంలో “ఇతర మార్గములకన్నా భక్తి మార్గం పరమాత్మను చేరటానికి సులభమార్గం కాబట్టి, అట్టి మార్గాన్ని వివరిస్తున్నా” మని చెప్పారు.
2. “సాత్వాస్మి పరమప్రేమ రూపా”
అర్థం: “కరుణామూర్తి అయిన భగవంతుని యందు యపారమైన ప్రేమకు భక్తియని పేరు”.
“భక్తి” అన్న మాట “భజ్” అన్న శబ్ధం నుంచి జన్మించింది. దీని అర్థం భగవంతుని కలిగి ఉండటము. భజనము, పూజ, అనురాగము, ప్రీతి, ప్రేమ అన్న మాటలు ఆ భక్తికి పర్యాయపదాలుగా వాడబడినాయి.
భగవంతుని మీద ఉన్న భక్తిలో భయానికి తావులేదు. అందుకే ఇక్కడ పరమ ప్రేమరూపా అని చెప్పారు.
భక్తునికి భగవంతుని మీద పరమ ప్రేమగా ఉంటుంది. భగవంతుడు తప్ప మరోటి కావాలన్న కోరిక కూడా ఉండదు. కేవలం ఆ భగవంతుడే, తన ఇష్టదైవం తప్ప మరో విషయం అక్కర్లేనిది. ఇతరములు ఏవీ మనసుకు తట్టవు. భౌతికమైన కోరికల నుండి విడుదల కలిగి, ఉన్న కోరికంతా ఆ భగవంతుని గురించే కలిగి ఉంటుంది. ఈ భక్తిలో ఇవ్వటం తీసుకోవటం వంటి వ్యాపారం లేదు. ఏ కోరిక లేక, ఏ వరమూ కోరక, భౌతిక ఫలాపేక్షలేక కేవలం ఆ పరమాత్మ మీద ప్రేమ ఉంటుంది. ఫలాపేక్షలేనిదీ భక్తి.
ప్రపంచపు విషయాల మీద ఎటు వంటి ఆపేక్షా ఉండదు ఈ భక్తిలో.
మొదట సందేహం లేని నమ్మకంతో మొదలవుతుంది. అది ఆకర్షణగా మారి తదనంతరం పూజ్య భావం కలుగుతుంది. ఆ పూజ్య భావము వల్ల సంసార పరమైన కోరికలు నశిస్తాయి. కోరికలు లేని స్థితితో పరిపూర్ణమైన ప్రేమగా మారుతుంది. కేవలం సంతోషం తప్ప మరో భావం లేని భక్తి కలుగుతుంది.
హనుమంతుడు రాముని మీద గల ప్రేమను ఇలా చెబుతాడు
దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శంభో!
జాతస్తేంఽశో జీవదృష్ట్యాఽత్ర దృష్టే!
సర్వస్యాత్మన్నాత్మ దృష్ట్యా త్వమేవే
త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః॥”
“ఓ రామా! నేను శరీరమైతే నీ దాసుని, నేను ఆత్మనైతే నీలో భాగాన్ని, కాని పరమపూజ్యా నేను సదా నీలోనే ఉన్న నీ భాగాన్ని అన్నదే నా చివరి మాట, అనుభవము” అంటాడు.
పరమాత్మ ముందర అన్నీ వదిలివేస్తాడు భక్తుడు. స్వార్థం, అహంకారం, ఏ విధమైన భయము లేక అత్యంత ప్రియమైనదిగా భగవంతుణ్ని భావిస్తాడు.
కొందరు విష్ణువును సేవించవచ్చు. కొందరు శివుడిని కొలవవచ్చు. లేదా రాముడినో, కృష్ణుడినో పూజించవచ్చు. గురువును ప్రేమతో కొలవవచ్చు.
శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే।
శివస్య విష్ణువు హృదయం, విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు.
కాబట్టి దేవతారాధనలో భేదభావం వదిలెయ్యాలి.
ఎప్పుడు హృదయంలో భగవంతుడ్ని ధ్యానిస్తూ ఉండటము ఇందులో ప్రధానం.
3. “అమృత స్వరూపాచ”
“పరమాత్మ మీద కలిగే అనన్య భక్తి అమృతమైనది”.
ఇతర వస్తువులతో పోల్చలేనిది ఇది. భక్తి అన్నది మధురమైనది. మృతము అంటే మృత్యువు లేనిది అమృతమయమైనది. భక్తుల దగ్గరకు యమరాజు రాలేడు.
పరమాత్మ అమృతమైనవాడు, అనంతుడు, శాంతినిచ్చేవాడు, నిత్యమైనవాడు, చిత్ (చైతన్యం), ఆనందం, ముక్తి నిచ్చేవాడు, సిద్ధినిచ్చేవాడు.
పరమాత్మను ప్రేమింటము వలన అమృతమవుతుంది హృదయం. పరమ శాంతినిస్తుంది భక్తి, అఖండమైన సుఖాన్ని కలిగిస్తుంది. పరమాత్మ నిజతత్త్వం తెలుసుకొని ప్రేమించే భక్తులు పొందలేనిది లేదు. భౌతికమైన వాంఛలు ఈ ఆనందం ముందు నిలబడవు.
ఎందుకంటే భౌతికమైన ఆనందాలలో మార్పులు ఉంటాయి. కాని మార్పులేని మారలేని సదా ఆనందం భక్తి వలన కలుగుతుంది.
భగవద్భక్తిలో మానవుడు మూడు గుణాలైన తమోరజోసత్వ గుణాలను అధిగమించి మృత్యువు మార్పుల నుంచి విడుదలై అమృతత్త్వం పొందుతాడని గీత చెబుతుంది.
“గుణానేతాన తీత్య త్రీ దేహీ దేహ సముద్భవాన్।
జన్మమృత్యు జరాదుఃఖై ర్విముక్తో ఽమృతమశ్నుతే॥”
మతాతీతమైన భక్తితో అమృతతత్త్వం కలుగుతుందని శ్రుతులు, వేదాలు చెబుతున్నాయి.
అమృతత్త్వమే భక్తి అని చెప్పే ఎన్నో ఉదాహరణలు మనకు భగవద్గీతలో, వేదాలలో ఉన్నాయి.
భక్తి అమృతత్త్వాన్ని ఇస్తుందని ఇవి సూచిస్తున్నాయి.
4. “యల్లబ్ధ్వాపుమాన్ సిద్ధో భవత్. అమృతోభవతి తృప్తోభవతి”
ఇది నాలుగవ సూత్రం.
నాలుగు, ఐదూ, ఆరు సూత్రాలు భక్తి వలన కలిగే ఫలితాలను వివరిస్తాయి.
ఈ నాల్గవ సూత్రంలో నారుదుల వారు చెబుతున్నారు, “ఏ మానవుడు లేదా జీవుడు భగవద్భక్తిని పొందుతున్నాడో అతను పరిపూర్ణుడు, సిద్ధుడూ అగుతున్నాడు”.
ఈ సూత్రంలో చెప్పిన “పుమాన్” అన్న మాట ప్రత్యేకమైనది.
ఉత్కృష్టమైన భక్తి వలన ఏ జీవుడైనా తమ నామ, రూప, కుల, వర్ణ భేదం లేక జీవన్ముక్తుడగును.
మానవులు కాకపోయినా పశుపక్షాదులైనా ముక్తి పొందుతున్నాయి. భాగవతములో గజేంద్రుని గురించి తెలుసుకుంటే భక్తితో ఏ జీవుడైనా ముక్తి పొందగలడని తెలుస్తుంది.
భక్తి కలిగిన జీవుడు మరి ఏదీ కోరదు. అతనికి దేవేంద్ర పదవి ఇచ్చినా స్వీకరించడు. కేవలము జీవన్ముక్తి తన ధ్యేయంగా కలిగిఉంటాడు.
అతను పరమాత్మ ధ్యానములో సర్వ సంతోషాలు కలుగుతాయి. వీరిని వేదాంతములో “ఆప్తకాము”లంటారు. భగవద్ధ్యానము వలన కలిగి సంతృప్తి ముందు మరి నిలవగలిగేవీ ఏమీ ఉండవు. ఆ భక్తుడు పూర్ణుడై, సంతృప్తితో ఉంటాడు. అతను సిద్ధుడు. తనలో తాను రమించగలడు. అతనికి సర్వము అమృతముతో సమానము.
భగవద్గీతలో మూడవ అధ్యాయములో
“యస్త్వాత్మరతిరేవ స్వాదత్మతృప్తశ్చ మానవః।
ఆత్మన్యేవ చ సంతృష్టస్తస్య కార్యం న విద్యతే॥” (3-17) అని చెబుతారు.
ఎవరైతే పరమాత్మ ధ్యానంలో ఆనందిస్తారో, వారు తమలో తాము సంతుష్టులుగా ఉంటారు. వారే ఆత్మారాములు. వారికి కోరవలసినది ఉండదు.
పరమాత్మను సదా ధ్యానించేవారుకి కోరవలసి కోరికలు కూడా మిగలవు.
చాలా సార్లు ప్రజలు అడుగుతూ ఉంటారు “కనపడని దేవుడ్ని ఎలా ప్రేమించటమ”ని?
సత్సాంగత్యము వలన, భగవంతుని లీలను వినటం వలన, భగవంతుని విభూదిలు చూడటము వలన, పుణ్యప్రదేశాల, క్షేత్రాలు దర్శించటము వలన భగవంతుని ప్రేమను కనుగొనవచ్చును.
5. “యత్ర్పాప్య న కిఞ్చద్వాఞ్చతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి”
యనన్య భక్తి పొందిన పిమ్మట దేనినీ ఆశించక, ప్రాప్తించిన విషయాల గురించి విచారించక, ఇష్టాలకు ఆనందించక, అయిష్టాలకు కృంగక, లభించిన విషయాలపై సదా బేధభావము లేక ఉంటాడు భక్తుడు అని అర్థం.
భక్తి అన్నది జ్ఞానాగ్ని వంటిది. అది సర్వ భౌతికమైన కోరికలను కాలుస్తుంది.
కోరికలన్నవి భయాల వలన, స్వార్థం వలన, అసమానతల వలన కలుగుతాయి. తనకు లేదని, తక్కువని భావన వలన కోరికలు కలగుతాయి. ఈ కోరికలు భయానికి కారణమవుతాయి. ఎప్పుడైతే పరమాత్మ యందు భక్తి కలుగుతుందో, అప్పుడు భగవంతుడు తప్ప మరి కోరవలసినది ఏదీ కనపడదు. ఆ విధంగా భయాలను అధిగమిస్తాడు భక్తుడు.
భక్తుడు దుఃఖపడడు. దానినే సూత్రంలో “నశోచతి” అని చెప్పారు నారదులవారు.
భక్తుడు దేని యందు ప్రతేక్యమైన సంబంధం కలిగి ఉండడు. ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానము ఉండదు. కోరికలు ఉండవు. భయాలు ఉండవు. అందువల్లనే దేని పైన వ్యామోహము కలగదు. కాబట్టి పొందలేదన్న బాధ, దుఃఖం కూడా ఉండదు. అందుకే ఏదీ కోల్పోతామన్న ఆలోచన ఉండదు. అలాంటి వారికి ఏదో కోల్పోయామన్న దుఃఖమెలా కలుగుతుంది?
అందుకే భక్తుడికి ద్వేషభావము కూడా ఉండదు. దానినే “న ద్వేష్టి” అన్నారు. ఇది కోరికలు లేని స్థితి తరువాత కలుగుతుంది. పూర్ణత్వానికి సూచన.
కోరిక లేని స్థితిలో ఎవరి మీద, లేదా ఏ వస్తువు మీద ప్రత్యేకమైన అభిలాష లేకపోవటం వలన వారికి ప్రీతిగా కొన్ని నచ్చకపోవటం కొన్ని అని ఉండదు.
ప్రతి వారిలో ప్రతి పనిలో దైవత్వం చూస్తున్నప్పుడు దేని మీద ద్వేషం ఉండకపోవటం సహజ లక్షణమవుతుంది.
భక్తుడు అందరి క్షేమము కోరుకుంటాడు. దీనుల కోసం పాటుపడుతాడు. వారికి ఊరట అందించే ప్రయత్నం చేస్తాడు. ప్రపంచము పరమాత్మ యొక్క రూపంగా భావించినప్పుడు ప్రపంచములో ప్రతీది వారికి దైవంలానే ఉంటుంది.
ఉన్నతమైన, నీచమైన భావన కలగదు. సరిసమాన దృష్టి కలుగుతుంది.
“నేను సర్వాత్రా పరమాత్మను చూస్తున్నాను. ప్రపంచం పరమాత్మ యొక్క లీలావిలాసం.” అంటారు వారు.
రాజుకు దొంగకు తేడా కనపడదు వారి దృష్టిలో. రాయిని రత్నాన్ని సరిసమాన దృష్టితో చుస్తారు.
పండితుడు-పామరుడు, దొంగ-రాజు, కుక్క-గాడిద, ధనవంతుడు- బిక్షు అన్న తేడా ఉండదు వారికి.
నామదేవుడు కుక్కను నమస్కరించి “విఠలా నీవు శునకం రూపంలో వచ్చావా” అని రొట్టె పెట్టేవాడు.
శ్రీరామకృష్ణ పరమహంస సర్వత్రా కాళీమాతనే చూసేవారు.
మీరాబాయి అంతటా కృష్ణుని దర్శించేది. భగవాను రమణులు అందరిలో పరమాత్మను దర్శించేవారు. రమణుల ఆశ్రమంలో దొంగ ఒకడు దూరి ఏమీ దొరకక రమణులను కొట్టి పారిపోతాడు. భక్తులు వచ్చి భగవాను చూసి దుఃఖిస్తూ ఉంటే భగవాను వారితో “మీరు పువ్వులు చల్లినట్లే వారు దెబ్బలు చల్లి వెళ్ళారు” అని చెప్పారు. అంతటా పరమాత్మను చూడగలగటం జీవన్ముక్తులకు మాత్రమే సాధ్యం. భక్తులు పరమోత్కృష్టమైన స్థితిలో అలా చెయ్యగలరు.
“నోత్సాహి భవతి” భక్తులు ప్రచారం కోరరు. ప్రచారం చేసుకోరు.
భక్తులకు తమకంటూ ప్రత్యేకమైన కోరికలు ఉండవు కాబట్టి, లాభనష్టాల జాబితాను ఉంచుకోరు. ప్రపంచానికి సంబంధించిన పనులలో ఏ విధమైన కోరిక లేక ఉంటారు. జయాపజయాలతో వారికి సంబంధం ఉండదు. పరమాత్మకు సంబంధించిన నామమో మరోటే చెయ్యటానికే ఉత్సాహము చూపుతారు. భగవంతుని నామమే తమ సంతోషకారణమన్న విషయం గ్రహింపుతో ఉంటారు భక్తులు.
పరమత్మ నిజతత్త్వం రుచి చూసిన భక్తునికి ఈ మాయ ప్రపంచపు పోకడలు, వాటి మార్పులతో ఎలా సంతోషం కలుగుతుంది?
భగవంతుని యందు పూర్తి విశ్వాసముతో నడిచే భక్తులకు అహంకారం అన్నది ఉండదు. వారి అహంకారం పరమేశ్వ ప్రీతికి అందించబడి ఉంటుంది. అహంకారం పరమాత్మ పరం చేసిన భక్తులకు మిగిలినవన్నీ సహజంగా అమరుతాయి. పరమాత్మ ప్రేమలో మునిగిన భక్తునికి కోరికలేమి ఉంటాయి? ఈ కోరికలేని తనంతో అతనికి పరాభక్తి లభిస్తుంది.
భగవంతుని యందు భక్తి వలన కలిగే సంతోషం బ్రహ్మానందాన్ని ఇస్తుండగా ప్రపంచములో మేడలు ధనము సమస్త సంపదలు ఎలా నిలబడతాయి?
కోరికలేని బ్రహ్మానందములో భక్తులు మునిగిన తరువాత మిగిలినవి త్రుణప్రాయమేగా!!
ఇలా కోరికల తీరం దాటి భగవంతుని యందు అహంకారాన్ని నిలిపిన భక్తుడు పరమాత్మ చేతిలోని పనిముట్టు. పరమాత్మ తమ లీలా విభూతులను ఆ భక్తుల ద్వారా చూపుతారన్నది సత్యం.
అటు వంటి నిజభక్తుడు పరమాత్మ యందు అహంకారాన్ని సమర్పించి బ్రహ్మానందాన్ని పొందుతాడు. సిద్ధుడవుతాడు.
(సశేషం)