కరిగిందా కల ఒకటి?
జరిగిందా కధ ఒకటి?
నీకంటూ ఏముందీ లోకంలో….
నీవే నిర్జీవివై నీరై నిప్పై ఆవిరై…
నీ వాళ్ళ కన్నీరై కరిగాక…
నీదంటూ ఏముందిక?
అందుకే…
నాల్గు విత్తనాలు నాటు…ప్రేమతో!!
అందుకే…
నాల్గు మొక్కలు నాటు…ప్రేరణతో!!
ఎంత పోగేసినా…పొగే చివరికి మిగిలేది!!
అలాగని తగలేసినా…అయినోళ్ళ పగే చివరికి మిగిలేది!!
కూసింత ప్రేమగా విత్తనాలు జల్లడం, ప్రేరణగా మొక్కల్ని పెంచడం నేర్పు నీ వాళ్ళకి!!
రేపు వాళ్ళ తర్వాత వాళ్ళకి వాళ్ళూ అదే నేర్పుకుంటారు!!
ఉండే కొన్నాళ్ళైనా…ఊరి బాగు కోరుకుంటారు!!
ఉండేది ఎన్నాళ్ళైనా…అందరి బాగు కోరుకుంటారు!!
కాదూ కూడదూ కూల్చడమే నేర్పుతావా??
అదీ మంచిదే!!
కూల్చడానికి కులాలూ…
మాడ్చడానికీ మతాలూ…
మార్చడానికి అభిమతాలూ…
చాలా చాలా గోడలూ అడ్డు గోడలూ…
ఉన్నాయిక్కడ!!
కుదిరితే…వాటిని కూల్చు!!

ఎం.ఎస్. ఆఫ్తమాలజీ చదివిన డాక్టర్ పొట్లూరి రవికిరణ్ విజయవాడలో ప్రొఫెసర్- ‘ఆఫ్తమాలజీ’ గా పని చేస్తున్నారు. వారి స్వస్థలం నూజివీడు. కర్మస్ధలం- డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గన్నవరం.