ప్రతి వ్యక్తి ఆలోచనలూ, నిర్ణయాలూ వాళ్ళు చూసిన జీవితానుభవాల నుండి వస్తాయి. నేను సాధారణంగా ఎవ్వరినీ తప్పు పట్టను. సినిమా ఫీల్డ్ గురించి “అది చెడు… అందరూ చెడిపోయిన వాళ్ళే” అంటే, ‘పాపం వీళ్ళకి అసలు మంచి మనుషులు ఈ ఫీల్డ్‌లో తగలలేదనుకుంట!’ అనుకుంటాను. కొందరికి అన్నీ చెడు వాసనొచ్చే కిటికీలతో వున్న కొంపే దొరికితే, ఎన్నని మూసుకుంటారు? అది కర్మ… దురదృష్టం! నాలాంటి వాళ్ళకి చెడు మంచి కన్నా తక్కువ అనుభవం అవడం వలన నేనింకా ఫీల్డులో వున్నాను. పైగా, ఇష్టం లేని చోటు నుండి లేచి నడిచి బయటకి వచ్చేసే అవకాశం నాకు వుంది! పోషించి, మంచి జీవితం ఇచ్చే భర్త నాకు అండగా వుండబట్టి! ఎన్నో పనులు వదిలేసుకుని వచ్చేసాను…
నా కన్నా పొట్టిగా, వింతగా వున్న రూపంలో వున్న ఓ రచయిత నాకు బోలెడు సినిమా ఛాన్సులు ఇస్తాను… తన మాట వింటే అని వెంటబడ్డాడు! అతనికి చెప్పు తీసి సన్మానం చెయ్యబోయాను… ఇప్పటికీ కనిపిస్తే “అమ్మా తల్లీ” అంటు ఆప్యాయత ఒలకబోస్తూ మాట్లాడ్తుంటాడు! కానీ విచిత్రంగా, అతని ప్రతిపాదనకి ఇంకో రచయిత్రి ఒప్పుకోవడం, వాళ్ళు కొంత కాలం కలిసి మెసలడం నేను విన్నాను. కానీ ఆ రచయిత్రికి అతనేమీ సినిమా ఛాన్సులు ఇప్పించలేదు! ఆ తర్వాత నా దగ్గర ‘దొంగ వెధవ’ అని తిట్టింది! ఆ విషయం ముందే గుర్తించడంలో విజ్ఞత దాగి వుంది! అవకాశాల కోసం అతి విలువైనది పోగొట్టుకోకూడదు… అది మన ఆత్మాభిమానం. అది పోగొట్టుకున్నాకా, ఎవరితో పోగొట్టుకున్నారో, వాళ్ళకి కూడా ఈ స్త్రీ అంటే విలువ వుండదు! చులకనగా చూస్తారు. నా దగ్గరకొచ్చి, తమ బోయ్ ఫ్రెండ్స్ వాడుకుని తమని చులకనగా మాట్లాడి వదిలేసారనీ, వాడిని సర్వనాశనం చేస్తాననో, లేదా తాము ఆత్మహత్య చేసుకుంటాం అనో చెప్పిన స్త్రీలు కోకొల్లలు! వీలైనంత వరకూ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాను. మీరు ఆశ పడి కట్టుకునే కలల హర్మ్యాల మీద ఆధారపడి వుంటుంది…. మీరే మార్గం ఎంచుకోవాలో?
నేను దాపుడికి నాలుగు, ఇంట్లోకి నాలుగూ చీరలతో టీచర్ వుద్యోగం చేసినదాన్ని! ఈ టీవీ, సినిమా ఫీల్డూ, పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలూ… నన్ను పేరాశ పునాదుల మీద భవంతులు కట్టుకోనివ్వలేదు… నా రియాలిటీ, మా వారి సంపాదనా, నా పిల్లల చదువూ, వారి భవిష్యత్తూ, నాకెప్పుడూ ఎక్కడ ఏ పరిచయాన్ని ఆపాలో, సంపాదన అక్షరాల మీద మాత్రమే సంపాదించాలనీ హెచ్చరించాయి. ఏం సంపాదించావు? అందరూ కోట్లు కోట్లు సంపాదించి, ఫార్మ్ హౌస్‌లూ, ఫారెన్ కార్లూ కొనుక్కుంటున్నారు? అని ఎవరైనా అడిగితే, నేను ఒకటే చెప్తాను… మంచి పేరు, గౌరవం, ప్రేమాభిమానాలు, మంచి స్నేహాలు… ఇవన్నీ సంపాదించాను అని గర్వంగా చెప్పగలను!
ఆ రోజు నంది అవార్డు తీసుకుంటూ దాసరి గారి వైపు నేను అంతే గర్వంగా చూసాను! ఆయనే తడబడి చూపు మరల్చుకున్నారు.
సునీల్ పురానిక్ గారితో రచయిత్రి
ప్రస్తుతంలో కొస్తే… బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎవార్డ్సు జ్యూరీ మెంబర్‌గా నన్ను ఇన్వైట్ చెయ్యడానికి కారణం, కన్నడ చలనచిత్ర అకాడమీ చైర్మన్ సునీల్ పురానిక్. ఆయన నాతో రెండు రోజులు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో కో-మెంబరుగా వున్నారు. మర్నాడు తను నటించిన సినిమా ఎప్పటిదో, ఇప్పుడు పూర్తి చేసి, ఆ ప్రొడ్యూసర్ అవార్డ్స్‌కి పంపడంతో, ‘నైతికంగా, నేను జ్యూరీలో వుండకూడదు’ అని మా ఫిల్మ్ అవార్డ్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరక్టర్ తనూరాయ్‌కి చెప్పి, బెంగుళూరు వెళ్ళిపోయారు. ఆ రెండు రోజుల్లో నా మీద చాలా గౌరవాభిమానాలు పెంచుకున్నారు!
ఆర్.ఎస్.ఎస్. మనిషి. బిజెపి కార్యకర్త. చాలా డిసిప్లిన్డ్. ఆయన కన్నడ చలనచిత్ర అకాడమీ చైర్మన్ అయిన నెలన్నరకి ఓ మహా యజ్ఞం లాంటి ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ దేశ విదేశాల నుండీ సినీ ప్రముఖులనీ, క్రిటిక్లనీ పిలిపించి, పెద్ద ఎత్తున బెంగుళూరులో ఈ ఫంక్షన్ నెల రోజుల ప్రిలిమినరీ స్క్రీనింగ్ తర్వాత, వారం రోజులు ఆడియన్స్‌కీ, వాళ్ళతో బాటు ఫైనల్ కమిటీలో వున్న మాకూ ‘ఓరియన్’ కాంప్లెక్స్‌లో వున్న పి.వి.ఆర్. థియేటర్స్‌లో 13 స్క్రీన్స్‌లో రోజు ఐదు షోలు, పదకొండు వేల మంది ప్రేక్షకులతో నిర్వహించి ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లు నిర్వహించారు.
కో జ్యూరీ మెంబర్స్ ఎన్. చంద్ర గారూ, రత్నాజ గారితో రచయిత్రి
నా కో జ్యూరీ మెంబర్స్ ఎన్. చంద్ర గారూ, రత్నాజ. ఎన్ చంద్ర అంటే ‘సో గయా… ఏ జహా… సో గయా ఆసమా’ అంటూ సినీ పరిశ్రమని నిద్రలేపి, యావత్ దేశాన్నీ ‘ఏక్ దో తీన్… చార్ పాంచ్ ఛే…’ అంటూ స్టెప్పులేయించిన ‘తేజాబ్’ చిత్రాన్ని రాసి, స్క్రీన్ ప్లే చేసి, డైరక్ట్ చేసి నిర్మించిన ప్రొడ్యూసర్ చంద్రా నార్వేకర్ గారు! ఏ క్షణాన నన్ను కలిసారో, ‘బేటీ బేటీ’ అంటు చివరి రోజు దాకా వదిలిపెట్టలేదు! 1987లో ఆయన తీసిన ‘అంకుశ్’, అందులో ‘ఇతనే శక్తి దో’ అనే పాటతో నాకున్న అనుబంధమే మమ్మల్ని దగ్గర చేసింది అనుకుంట! చివరికి మేం మైసూరు బృందావన్ గార్డెన్స్‌కి వెళ్తే… ఒక్కసారిగా రంగు రంగుల ఫౌంటెన్స్ వెలిగి ‘ఏక్ దో తీన్ చార్’ అని స్టెప్పులేస్తూ నృత్యం చేస్తూంటే, ఆయన కన్నా ముందు నేనూ, పాటిల్, ధ్వని వుప్పొంగిపోతూ, “చంద్రా సాబ్, ఆప్ కా గానా” అంటూ కేకలు పెట్టాం. చివరి రోజున నేను హైదరాబాద్ వచ్చేస్తుంటే, మైసూర్‌పాక్ కొని నా చేతిలో పెట్టి చంద్రా గారు “నా లైఫ్‌లో అతి ముఖ్యమైన సంఘటన నీ పరిచయం తల్లీ!” అని నా తల నిమిరారు. నేను ఒంగి ఆయన కాళ్ళకి నమస్కరించాను. వెళ్ళి నన్ను మరిచిపోలేదు. “ముంబై రా… నీ కథలు ఇక్కడ సినిమాలుగా చేద్దాం… నువ్వు చెప్పిన ప్రతీ కథ ఆణిముత్యం” అని నాకు మెసేజ్ పెట్టారు. ఆయన లోఖండ్వాలాలో, తాప్సీ పన్నూ, ఆయుష్మాన్ ఖురానా లాంటి పెద్ద ఏక్టర్స్ వున్న కమ్యూనిటీలో వుంటారు. “మా కోడళ్ళకీ, నా భార్యకీ నిన్ను పరిచయం చెయ్యాలి, మా ఇంట్లోనే వుందువు గాని” అన్నారు.
అస్సామీ హీరోయిన్ Aimee Baruahతో
ఎన్. చంద్ర, మహేష్ మంజ్రేకర్ గార్లతో
ఎన్. చంద్ర గారితో
మోహన్ అగాషే, ఎన్. చంద్ర గార్లతో
ఇదంతా సునీల్ నన్ను ఆయనకి గొప్పగా పరిచయం చేసి, మేరియట్ హోటల్లో పెట్టి, ఆయనతో సమానంగా నన్ను జ్యూరీలో వెయ్యడం వలన! మాస్ కమ్యూనికేషన్ స్టూటెంట్స్ ఆల్మాస్, స్మృతీ అనే ఆడపిల్లలు మమ్మల్ని బ్యాగ్ కూడా మొయ్యనివ్వలేదు! సినిమాలు చూస్తుంటే ‘కాఫీ కావాలా? ఏమైనా తింటారా?’ అని రిక్లైనింగ్ ఛైర్స్‌లో ఏ సినిమా చూడాలన్నా కూర్చోపెట్టి, కంటికి రెప్పలా చూసుకున్నారు! ఇవంతా నేను సంపాదించుకున్న ఆస్తులు కావా?
(సశేషం)
రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. ‘కాలమ్ దాటని కబుర్లు’ అనే పుస్తకం, ‘రేపల్లెలో రాధ’, ‘ఎవరే అతగాడు’, ‘అనూహ్య’, ‘ఖజూరహో’, ‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ వంటి నవలలు వెలువరించారు.
very nice madam…you deserve it – sannihith
Thanq Sannihith
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™