[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘నేస్తమా.. వింటున్నావా?’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ఒకే చోట కూర్చున్నామనుకో
కొత్త విషయాలేవీ తెలుసుకోలేము!
అలసట ఎరుగని ప్రయాణం
మనమైతే
ప్రపంచం నేర్పే పాఠాలెన్నో!
బావిలోని నీళ్ళు తోడకుండా ఉంటే
పనికి రాకుండా పాడైనట్లుగా..
సరికొత్త కి ఆహ్వానం పలకకపోతే
పాత పద్ధతిలోనే పనిచేస్తుంటే..
మారుతున్న ప్రపంచ పోకడలను,
సాంకేతికతను అర్థం చేసుకోలేము!
అందుకే నేస్తం..
నిత్య చైతన్యం,
తెలుసుకోవాలనే ఆరాటం,
రేపటి పై ఆశ,
ఉన్నతంగా బతకాలన్న ఆశయం..
సదా జ్ఞప్తికి వుంచుకొని జీవించాలి!
అప్పుడే మన బ్రతుకు తీరు పదిమందికి ఆదర్శమయ్యేది!
అర్థవంతమైన జీవితానికి సందేశం మనమై నిలిచి
అందరి మన్ననలు అందుకోగలము!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.