నీ కనుపాపల్లో నిలిచిన నా రూపం
నాకే నన్ను కొత్తగా పరిచయం చేస్తుంటుంది!
ఎప్పుడైనా పలకరిద్దామని ప్రయత్నిస్తుంటే
పలకవేమోనన్న సంశయం వెనక్కి లాగేస్తుంటుంది!
అడుగులు కలిపి నడుద్దామని వెనకే వస్తుంటే
ముందుకొస్తున్న సాగర కెరటాలు
నీ అడుగుల ఆనవాలు లేకుండా చెరిపేస్తూ
మన మధ్య దూరాన్ని పెంచుతూ
కలవరపాటుకు గురిచేస్తుంటాయి!
అదేంటో కాని..
కంటి చూపులతో పలకరిస్తుంటావు!
మాటలు లేని మౌనాన్నే వరంగా ప్రసాదిస్తుంటావు!
అడుగులు మాత్రం అందకుండా చేస్తుంటావు!!
మన ప్రేమ పరిచయాలు కలల కావ్యాల పరిమళాలు!
నిజం అనిపిస్తున్నట్లే వున్నా.. నమ్మకం కలగని నిష్కల్మషాలు!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.