

చుట్టూ అందంగా పరుచుకున్న వెన్నెల!
చేమంతి పూల తోటల నుండి వీస్తున్న సుపరిమళాలు!
నీలాల నింగిలో నుండి తొంగి చూస్తూ.. కదులుతూ..
జాబిలమ్మ పరిచయం చేస్తున్న ఆనందాలు!
మేడపై వున్న
నా దగ్గర లో ని మామిడి చెట్టు
సన్నని చిరుగాలుల అలజడి కే ఓర్చుకోలేక
కదులుతున్న శుభ సమయాన
కోయిలమ్మల కమ్మని ‘కుహు.. కుహూ..’
సుస్వరాల పరిచయాల అనురాగాలు!
అవనిలో అద్భుతమై
సుదూర తీరాన కదులుతూ
సెలయేళ్ళు చేస్తున్న గలగలల సవ్వళ్ళ సందళ్ళు!
ఆమని రాకతో పచ్చగా మెరుస్తున్న ప్రకృతి..
వెన్నెల స్పర్షలతో పసిడి కాంతులమయమవుతూ..
పరవశాలకి నిలయమై సచిత్రంలా అగుపిస్తుంది!
గుండె లోగిళ్ళకి
పండగల క్రొత్తదనాలని చూపిస్తూ మురిపిస్తుంటే..
ప్రేమ లోకంలో హాయిగా విహరిస్తూ
కలల కాన్వాసుపై
మనసు గీస్తున్న చిత్రాన్ని అపురూపంగా చూస్తూ..
ప్రకృతిలా నువ్వు ..
ప్రేరణాభరితమైన హృదయంతో నీ నేను!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.