అనాదిగా మన దేశం సాహస మహిళలకు, వీరనారీమణులకు పేరు పొందింది. స్వాతంత్ర్యం రాక ముందు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొంతమంది మహిళలు సాహసాలు ప్రదర్శించి అమరులయ్యారు. అటువంటి వారిలో స్వర్గీయ నీరజా భానోట్ ఒకరు.
నీరజ 1963 సెప్టెంబరు 7వ తేదీన జన్మించారు. ఛండీఘర్కు చెందిన రమా భానోట్, హరీష్ భానోట్లు ఈమె తల్లిదండ్రులు. ఛండీఘర్, ముంబైలలో విద్యాభ్యాసం చేశారు. చదువంతే మొదటి నుండీ చాలా ఇష్టంగా ఉండేవారు. ఆమెకు ఆకాశంలో హంసల్లా ఎగిరే విమానాల్లో ప్రయాణం చేయాలని, అవకాశం వస్తే ఉద్యోగం చేయాలని ఆశ ఉండేది. 22 సంవత్సరాల వయసులో 1985 సంవత్సరంలో ఈమె వివాహం జరిగింది. వరకట్న వేధింపులకు గురయ్యారు.
ఆమె ఆశయం మేరకు 1986 జనవరి 16 తేదీన ‘పాన్ అమెరికన్ ఎయిర్వేస్’లో ఉద్యోగంలో చేరారు. ఈమె నిజాయితీ, అంకితభావాలకు వృత్తి నైపుణ్యం తోడై అత్యున్నత స్థానానికి చేర్చాయి. అతి త్వరలో 1986 ఏప్రిల్ 1వ తేదీన ప్రమోషన్ పొందారు. ‘పర్సర్’గా నియమించబడ్డారు. అపరిమిత ప్రజ్ఞాపాటవాలను నిరూపించుకుంటూ విధులను నిర్వహించేవారు.
ఇలా ఆనందంతో గడుస్తూ ఉండగా, ఒక దుర్ఘటన ఎదురయింది. 1986 సంవత్సరం సెప్టెంబర్ 5 వ తేదీన ముంబై నుండి కరాచీ మీదుగా న్యూయార్క్ నగరానికి ఒక విమానం బయలుదేరింది. ఈ విమానాన్ని కరాచీ విమానాశ్రయంలో హైజాకర్లు హైజాక్ చేశారు. ప్రయాణీకులు, ఉద్యోగులు కలిపి సుమారు 400 మంది దాకా ఉన్నారు. వీరందరూ 17 గంటల సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. అమెరికన్లను పట్టుకుని తీరాలని హైజాకర్లు పట్టుబట్టారు. నీరజ వారందరి పాస్పోర్టులని దాచిపెట్టారు. అమెరికన్లను గుర్తించడం హైజాకర్లకు కష్టమయింది. ప్రయాణీకులను అప్పజెప్పమని వారు నీరజని కోరారు. ఆమె కనీసం పిల్లలను, వృద్ధులను వదిలివేయమని వారిని కోరారు. హైజాకర్లు ప్రయాణీకులు అందరినీ విచారించాలని పట్టుబట్టారు.
పిల్లలకు తుపాకీలను గురిపెట్టారు. నీరజ వారిని అడ్డుకున్నారు. అత్యవసర ద్వారాలను తెరిచి ప్రయాణీకులను బయటకి పంపించారు. విమానంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలలో, బుల్లెట్ల గాయాలతో నీరజ శరీరం రక్తసిక్తమయింది. 20 మంది ఈ దుర్ఘటనలో మరణించారు. మిగిలిన వారందరినీ రక్షించి ప్రాణత్యాగం చేసి అమరులయ్యారు నీరజా భానోట్.
ఈ ప్రాణ త్యాగం ఫలితం, సాహసం ఆమెను భారత వైమానిక చరిత్రలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున నిలబెట్టాయి. అందుకు ప్రతిగా భారత ప్రభుత్వం వారు అత్యున్నత ‘అశోక చక్ర’ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించారు. ది. 8-10-2004వ తేదీన ఈమె జ్ఞాపకార్థం స్టాంపును విడుదల చేసింది భారత తపాల శాఖ.
‘ధీరవనితలను గన్న పునీతురాలు భరతమాత సిగలో నీరజా భానోట్ త్యాగం తరగని నిధి’. ఈమె ‘ది హీరోయిన్ ఆఫ్ ది హైజాక్’గా పేరు పొందారు. తమ దేశ పౌరులను కాపాడినందుకు అమెరికన్ ప్రభుత్వం ‘ఫ్లైట్ సేఫ్టీ పౌండేషన్ హీరోయిజం’ అవార్డును ప్రకటించింది.
నీరజా భానోట్ వంటి వీర వనిత త్యాగమూర్తి గాథను పరిచయం చేసిన రచయిత నాగలక్ష్మి గారికి అభినందనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™