[శ్రీ అంబల్ల జనార్దన్ రచించిన ‘ఒడ్డున పడ్డ చేపలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


అమ్యామ్యారావుకు అసహసనంగా ఉంది. ఉండదూ మరి? ఎప్పుడూ వందిమాగధులు చుట్టూ ఉండి భజన చేస్తూ తనకి టిఫిన్లూ, కాఫీలు ఇప్పిస్తూ, చికెన్, మటన్ బిర్యానీలతో మందు పార్టీలతో, తమ తమ పనులు చేసిపెట్టడానికి, నగదుతో చేతులు తడుపుతూ ఉన్న రోజులు గతంలోకి జారి పోయాయి. ఇప్పుడతను విశ్రాంత ఉద్యోగి. అతని నమ్మినబంటు రంగా కూడా రిటైరయ్యాడు. ఉద్యోగంతో పాటు తాము యూనియన్ లీడర్లుగా వెలగబెట్టిన పదవులూ పోయాయి. ఆ ప్రైవేట్ కంపెనీలో ఇప్పుడు కొత్త కార్మిక నాయకులను ఎన్నుకున్నారు. అందుకే అమ్యామ్యారావు, రంగా ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలు తాము ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన సామ్రాజ్యం, పరాయి పాలయినట్టుగా ఉంది వారికి. ఉద్యోగంలో ఉండగా ఇటు కార్మికులను ఉసిగొల్పి ఏవో సాధ్యం కాని డిమాండ్లతో సమ్మె చేయించడం, ఆ తర్వాత యాజమాన్యంతో లాలూచీ పడి, కార్మికులను ఏవో కొన్ని చిన్న చిన్న డిమాండ్లకు ఒప్పించి సమ్మె విరమింప జేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదానికి గురైన కార్మికులకు చట్టపరంగా రావాల్సిన నష్ట పరిహారం చెందకుండా, నిర్వాహకులతో కుమ్మక్కై ఎంతో కొంత విదిల్చి, ఇంత తమ జేబులో వేసుకోవడం వారికి గిట్టుబాటైన వనరు. అలాగే సెలవు గాని, జీతం బకాయిలు గాని ఇప్పించినప్పుడు, వాటి నుండి ఎంతో కొంత దండుకోవడం, లేక మందు పార్టీలు తీసుకోవడం కూడా ఆ యూనియన్ నాయకుల జన్మహక్కులా ఉండింది. ఇప్పుడదంతా గతమయ్యేసరికి వారికి ఏమీ తోచకుండా ఉంది.
వారిద్దరు కలిసి ఏంచేయాలా అని తలలు బద్దలు కొట్టుకున్నారు. గత వైభవం ఎలా సాధించాలా అని మల్లగుల్లాలు పడ్డారు. కాసేపైన తర్వాత రంగా “హుర్రే” అని అరిచాడు. ఒక్కసారిగా అమ్యామ్యారావు జడుసుకున్నాడు. అంత అకస్మాత్తుగా ఏమయిందా అని ప్రశ్నార్థకంగా రంగా వైపు చూశాడు.
“నాకో మంచి ఐడియా తట్టింది గురూ! ఈ పరిశ్రమవాడలో వందకు పైగా పెద్దా చిన్నా పరిశ్రమ సంస్థలున్నాయి. వాటి యజమానులందరికి ఒక ఫెడరేషన్ ఉంది. వారి ఉమ్మడి సమస్యలను ఫెడరేషన్ ద్వారా పరిష్కరించుకుంటారు. ఈ పరిశ్రమవాడకు నీటి సరఫరా గానీ, విద్యుత్ ధరల్లో రాయితీలు గానీ, పటిష్టమైన రవాణా వ్యవస్థ గానీ వారు తమ ఫెడరేషన్ ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సాధ్యం చేసుకుంటారు. ఇంకో వైపు, ఇక్కడ వివిధ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు ఉమ్మడి కార్మిక యూనియన్ లేదు. కొన్ని చిన్న ఫాక్టరీల్లోనైతే అసలు కార్మిక సంఘమే లేదు. దాని వల్ల యాజమాన్యాలు కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తూ, ఎక్కువ పని గంటలు, పని చేయించుకుంటున్నారు. కార్మిక చట్టాల ద్వారా వారికి దక్కాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. అలా కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పుడు మీరూ నేనూ రిటైరయ్యాము కాబట్టి మనం ఈ కార్మికవాడలోని కర్మాగారాల కార్మిక యూనియన్ల ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేద్దాం. దానికి మీరు అధ్యక్షులు, నేను కార్యదర్శిని. అప్పుడు మనకు కార్మికుల్లో చక్రం తిప్పడానికి బోలెడు వెసులుబాటు ఉంటుంది. యాజమాన్యాల్లో, కార్మికుల్లో మన పరపతి పెరుగుతుంది.”
“శభాష్ రంగా! ఎప్పుడూ నేను తానా అంటే నువ్వు తందానా అనే వాడివి, ఇప్పుడు స్వతంత్రంగా ఒక బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావ్. మనకు తీరిక లేని పని కలిగేలా ఉంది నీ ఉపాయంతో. ఇక దీన్ని నాకు వదిలిపెట్టు. ఒక నెల లోపల ఇక్కడి కార్మిక సంఘాల నాయకుల్ని సంప్రదించి మన ఫెడరేషన్ రిజిస్టరయ్యేలా చూస్తాను. మళ్లీ మనకు గత వైభవం తీసుకొస్తాను.”
అమ్యామ్యారావు, రంగా ఒక నెల రోజులపాటు ఆ పరిశ్రమవాడలోని కార్మిక సంఘాల నాయకులను కలిసి, వారిని మందు, బిర్యానీ పార్టీలతో మచ్చిక చేసుకొని తమ ప్రణాళికకు ప్రాణం పోశారు. ఆమ్యామ్యారావు అధ్యక్షునిగా, రంగా కార్యదర్శిగా వివిధ కార్మిక యూనియన్ల ప్రతినిధులు సభ్యులుగా ‘కార్మిక జన సేవా సంఘం’ రిజిస్టర్ అయింది. దాని సూచన, యాజమాన్య ఫెడరేషన్‌కు, ఆ పరిశ్రమవాడలోని అన్ని కర్మాగారాలకూ పంపబడింది.
ఏ ఫాక్టరీల్లో కార్మిక యూనియన్ లేదో, ఆ కర్మాగారాల్లోని కార్మికులను సంఘటిత పరిచి వాటిలో తమ ‘కార్మిక జన సేవా సంఘం’ కి అనుబంధంగా కార్మిక సంఘాలు ఏర్పాటు చేశారు. ప్రతి అనుబంధ కార్మిక సంఘం నుండి వాటిలో ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి, తమ ఫెడరేషన్‌కి ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత చందా రావాలని నిబంధన పెట్టారు. కార్మికుల హక్కుల రక్షణకై ఇదేదో కొత్తగా ఏర్పడ్డ సంఘటన అని చాలా కార్మిక సంఘాలు సంవత్సర చందా కట్టాయి. అలా కొన్ని లక్షల రూపాయలు ‘కార్మిక జన సేవా సంఘం’ ఖాతాలో జమ అయ్యాయి. అమ్యామ్యారావు, రంగాల పంట పండింది. వారు మునుపటిలాగే ప్రతి రోజూ మందు, చికెన్ మటన్ బిర్యానీలతో పార్టీలు చేసుకోసాగారు. దినమంతా ఏవో కర్మాగారాలకు వెళ్లడం, అక్కడి కార్మికుల వెతలు విని సానుభూతి చూపించడం, కొన్ని సంస్థల యాజమాన్యాలతో చర్చించి కార్మికులకు అదనపు సౌకర్యాలు చేకూర్చడం, అలా ఫెడరేషన్ స్థాపించిన కొత్తలో కార్మికుల్లో మంచి పరపతి సంపాదించుకున్నారు. తమ దారికి రాని నిర్వాహకులను సమ్మె అస్త్రంతో భయపెట్టి వారి నుండి ఎంతో కొంత వసూలు చేయడం మొదలగు పనులు చేశారు. ఆ తర్వాత వారి అసలు రంగు చూపించడం మొదలు పెట్టారు అమ్యామ్యారావు, రంగాలు. తాము నెలకొల్పిన కొన్ని ఫాక్టరీల కార్మికులను యాజమాన్యానికి విరుద్ధంగా ఉసికొల్పి వారిచే సమ్మెలు చేయించడం మొదలు పెట్టారు. అదే సమయంలో యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికులకు కొంత, తమకు కొంత గిట్టుబాటయ్యేలా సెటిల్మెంట్లు చేయసాగారు. అలా ఓ రెండు సంవత్సరాలు, అమ్యామ్యారావు, రంగాలు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆ తర్వాత వారి ధోరణి మారింది. తమకు జరిగిన అన్యాయాల ఫిర్యాదులతో వచ్చిన వారినుంచి ఎంతో కొంత నగదు తీసుకొని వారి సమస్యలు పరిష్కారం చేయడంలో జాప్యం చేయ సాగారు. కొన్ని కర్మాగారాల్లో అనవసరంగా సమ్మె చేయించి, కొందరు కార్మికుల సస్పెన్షనుకు కారకులైన వారు, ఆ తర్వాత ఆ కార్మికులను పట్టించుకోక పోవడంతో కార్మికులకు ఆ ద్వయంపై అనుమానాలు మొదలయ్యాయి.
వారు సంపాదించిన దాంట్లో సింహ వాటా తను కాజేసి, ఎంగిలి మెతుకులు రంగాకు విదిలించసాగాడు ఆమ్యామ్యారావు. “Nothing corrupts power like power and absolute power corrupts absolutely”, అన్న నానుడి ప్రకారం, ఆమ్యామ్యారావులో అధికార మదం నెత్తికెక్కింది. డబ్బు, అధికార మదంతో కళ్లు నెత్తికెక్కిన అమ్యామ్యారావు, చీటికీ మాటికీ రంగాపై విరుచుకు పడసాగాడు. దాంతో రంగా లోలోపల అమ్యామ్యారావుపై కక్ష పూనాడు. తన ఐడియాతో మొదలు పెట్టిన ‘కార్మిక జన సేవా సంఘం’లో న్యాయంగా తనకు సమానమైన వాటా ఉండాలి. తను పేరుకే కార్యదర్శి. ఆమ్యామ్యారావు అన్నీ తానై, సంస్థ పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. సమయం కొరకు చూసి తిరుగుబాటు బావుటా ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నాడు రంగా. ఇనుము వేడెక్కేవరకు వేచి ఉన్నాడు. అంతవరకు ఆమ్యామ్యారావుకు సహకరించడానికి నిశ్చయించాడు.
వారి ఆగడాలతో విసుగెత్తి పోయిన యాజమాన్య ఫెడరేషన్ వారి ఏ డిమాండ్లను అంగీకరించ కూడదని నిర్ణయించింది. ఫలితంగా వారు బలవంతంగా చేయించిన సమ్మెలు వీగి పోయాయి. ఒక కర్మాగారంలో ఇరవై శాతం బోనస్ డిమాండ్‌తో సమ్మె చేయించింది ‘కార్మిక జన సేవా సంఘం’. కంపెనీ నష్టాల్లో ఉంది కాబట్టి చట్టం ప్రకారం ఎనిమిది పాయింట్ ముప్పైమూడు శాతం బోనస్ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఐనా ఇరవై శాతం బోనస్ ఇవ్వాల్సిందే అని పట్టుపట్టింది ‘కార్మిక జన సేవా సంఘం’. అలా నెల రోజులు సాగింది సమ్మె. యాజమాన్యం తమ ఉత్పత్తి వేరే కంపెనీలో జాబ్ వర్క్ ప్రాతిపాదికన చేయించుకొని తమ ఆర్డర్లు సరఫరా చేసింది. బోనస్ విషయంలో తమ ప్రతిపాదనకు ఒప్పుకోకపోయినట్టైతే, యాజమాన్యం లాక్ ఔట్ ప్రకటిస్తామనడంతో, కార్మికులు తమ ఉపాధికి ముప్పు వచ్చేసరికి బేషరతుగా సమ్మె వెనక్కి తీసుకొని విధుల్లో చేరిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సమ్మె కాలంలోని జీతం కోతతో పాటు, ఫలితం కూడా దక్కకపోగా కార్మికుల్లో అమ్యామ్యారావు, రంగాల పట్ల విముఖత ఏర్పడింది. వారు యాజమాన్యాలతో నేరుగా సంప్రదింపులు జరిపి తమ డిమాండ్లను ఒప్పుకునేలా ప్రయత్నాలు చేయసాగారు. యాజమాన్యాలు కూడా తమ సంస్థలోని కార్మిక సంఘానికి ప్రాధాన్యత ఇస్తూ, కార్మిక జన సేవా సంఘాన్ని పట్టించుకోవడం మానేశాయి. అలా క్రమక్రమంగా వారి ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది.
కొన్ని పెద్ద కర్మాగారాల యూనియన్ నాయకులకు కూడా అమ్యామ్యారావు, రంగాల పెత్తనం మింగుడుపడలేదు. తమ ఆధిపత్యానికి గండి పడడం నచ్చలేదు. వారు కూడా వీరికి ఎదురు తిరిగారు. అలా వారిద్దరు నిర్వీర్యులయ్యారు. వారి ప్రభావం తగ్గేసరికి యాజమాన్యాలు వారిని పట్టించుకోవడం మానేశాయి. యాజమాన్య సంఘం, ‘కార్మిక జన సేవా సంఘం’ గుర్తింపు రద్దు చేసింది. ఇక కార్మికులు మాత్రం వారికి ఎందుకు విలువ ఇస్తారు?
క్రమక్రమంగా వారి ‘కార్మిక జన సేవా సంఘం’కి వార్షిక చందాల చెల్లింపు ఆగిపోయింది. వారి ఎయిర్ కండిషన్డ్ ఆఫీసు మూసివేయ వలసి వచ్చింది. విశ్రాంత జీవితంలో ఒక వెలుగు వెలిగిన అమ్యామ్యారావు, రంగాల దర్పం మూణ్ణాల్ల ముచ్చటే అయింది. వారు మళ్లీ రోడ్దున పడ్డారు. ఆమ్యామ్యారావు, భూమికి దిగి వచ్చాడు. ఇంకేదైనా ఉపాయం చూడమని రంగాను ప్రాధేయపడ్దాడు. “సరే ఆలోచిస్తాను” అని బదులిచ్చాడు రంగా.
కథ అంతటితో ఐపోలేదు. అతని మనసులో ఏదో పథకం రూపు దిద్దుకుంటోంది. దాని పర్యావసానంగా ఇంకో ఆర్నెళ్లలో మరో ఫెడరేషన్ పురుడుపోసుకుంది. రంగా అధ్యక్షునిగా, మరో బిల్లా కార్యదర్శిగా ‘పరిశ్రమవాడ కార్మిక ఫెడరేషన్’ రిజిస్టరయింది. యాజమాన్య ఫెడరేషన్, కొన్ని పెద్ద కర్మాగారాల యూనియన్ నాయకులతో కుమ్మక్కై రంగా చక్రం తిప్పాడు. నిజానికి అతనే ‘కార్మిక జన సేవా సంఘం’ ప్రాభవం తగ్గడానికి పరోక్ష కారణమయ్యాడు. ఆమ్యామ్యారావు ఖంగు తిన్నాడు. కాని అతనికి ఎవరి మద్దత్తూ లేకపోయింది. మళ్ళీ ఒడ్డున పడ్డ చేప అయ్యాడతను.
ఆమ్యామ్యారావు ఆగడాలను కార్మిక సంఘాల దృష్టికి తెచ్చి, యాజమాన్య సంఘాన్ని కూడా కలుపుకొని ఆమ్యామ్యారావుని నిర్వీర్యం చేశాడు రంగా. అలా ఆమ్యామ్యారావుపై తన కక్ష తీర్చుకున్నాడు. అతని ప్రాభవం కావాలనే తగ్గేలా చేసి, తాను కార్మిక వర్గాల్లో రాజై కూర్చున్నాడు. ఐతే అతను స్వతహాగా కార్మిక వర్గ పక్షపాతి. అందుకని అడ్డదార్లు తొక్కకుండా నిజాయితీగా కార్మికుల సంక్షేమానికి పాటు పడడానికి పూనుకున్నాడు. నిజాయితీగా పని చేసి, అనతి కాలంలోనే కార్మికుల్లో మంచి మార్కులు కొట్టేశాడు.
ఒక కర్మాగారంలో పని చేస్తుండగా ఒక కార్మికుని చేయి మషిన్లో ఇరుక్కుంది. యాజమాన్యం చేతులెత్తేయడంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించింది ‘పరిశ్రమవాడ కార్మిక ఫెడరేషన్’. అక్కడ చేయి పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. రంగా బిల్లాల ఫెడరేషన్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ఆ కార్మికునికి ‘ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం’ ప్రకారం నష్టపరిహారం ఇప్పించింది. దాంతో ఫెడరేషన్ పరపతి ఇంకా పెరిగింది. ఆ ఉత్సాహంతో కార్మిక సంఘాలు లేని కర్మాగారాల్లో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి ఆయా కార్మికులకు కార్మిక చట్టాలు వర్తింప జేసింది ‘పరిశ్రమవాడ కార్మిక ఫెడరేషన్’. చట్టం ప్రకారం, కనీస వేతనం, నిర్ణీత పనిగంటలు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాచ్యుఇటీ మొదలగు సౌకర్యాలు వర్తించేలా చర్యలు తీసుకున్నారు, రంగా, బిల్లాలు. దానితో వారి పరపతి అనూహ్యంగా పెరిగింది.
రంగాలో కూడ అధికార మదం ఎప్పుడు తల కెక్కుతుందో చెప్పలేము. ఇంకో బిల్లా ఎప్పుడు పుట్టుకొస్తాడో తెలియదు. అందుకని ఆ రంగా కూడా ఎంత కాలం వెలుగుతాడో కాలమే నిర్ణయిస్తుంది. కార్మిక యూనియన్ నాయకుల్లో అది సర్వ సాధారణం. ఇరవై నెలలు ముంబయి బట్టల మిల్లుల్లో సమ్మె చేయించి, ఆ మిల్లుల మూతకు కారణమైన దత్తా సామంత్ ఉదాహరణ జ్ఞప్తికి వచ్చింది కొందరికి. ప్రస్తుతమైతే రంగా, బిల్లా చేపలు, నీళ్లలో ఈదులాడుతున్నాయి. పరిస్థితులు వారిని ఎప్పడు ఒడ్డున పడేస్తాయో చెప్పలేము.
