సగం తెరచిన తలుపులతో… చుట్టూ ఆవరించిన సన్నని నక్షత్రకాంతి వెలుతురులో… శిధిల యౌవనంలో చిరిగిన జరాసంధ్యలా… దీపం వెలగని రాత్రిళ్ళలో… కనిపించని కన్నీళ్ళతో… ఏదో కోల్పోయిన శూన్యానికి సంకేతంలా నిర్వికారంగా ఉంది..!! ‘ఊరి చివర ఆ ఖాళీ ఇల్లొకటి..!!’ దాని చుట్టూ ఆవరించిన స్మశాన నిశ్శబ్ధం చిక్కని నీడలనేవో పరచసాగింది. *** నీలి వెన్నెలలో వెలుగుతగ్గిన వృద్ధ శుక్రతారొకటి ఆశ్రుకణమై రాలినట్టు… ఒకప్పుడు చిలుకలు వాలిన చెట్టులా… పచ్చని లోగిలితో కళకళలాడిన ఆ ఇంటి మాట్లాడే స్వరం నేడు మూగవోయింది! ముకుళిత అభయహస్తముద్రకు పక్షవాతం సోకినట్లు… గిలకల బావిపై ముచ్చట్లాడుకున్న పరాచికాల సందర్భాలు… కోలాహలంతో విరగబడిన నవ్వులు… సంతోషం చిందిన కన్నీరు… ఒక్కొక్క జీవనపరిమళం అన్నీ ఒక అంతర్నిబిడ ధ్యానంలో మాగిపోగా… అత్తరు గుబాళింపుల సన్నివేశాల్ని ముద్రిస్తూ… వెన్నువంగిన గగనంలా… పెరడంతా ఒక మహామౌనాన్ని నింపుకున్న యోగిలా… ధ్యానముద్రలో ఉంది! *** చూరు నుండి జారుతున్న చెప్పని కథలతో… ఏకాంతంగా నిలిచిన బైరాగి ముఖంలా ఉంది… ‘ఊరి చివర ఆ ఖాళీ ఇల్లొకటి…!’ సగం తెరచిన కిటికీ సందులోంచి వాడిన పూలకొమ్మ ఒకటి రాల్చిన పుప్పొడి పరిమళం లేత అగరు ఎండపొడకు అడ్డుతుంటే… చద్దన్నం ముద్దలకై చేతులు చాచిన సమైక్యత నేడు ఖండఖండాతరాల్లో ఒంటరి జెండాయై రెపరెపలాడగా… నిన్నటి చీకటికి ఉపశ్రుతిగా స్వప్నాలను కోల్పోయిన బహుముఖాల ఏకపాత్రాభినయంగా… ఆ ఇంటిగోడలపై బూజుపట్టిన పెద్దల ఫోటోల మౌనసంభాషణ… చీకటి వాకిట్లో మాగిన ముదిమిలా… ముడతలు పడిన శిధిల శిశిరంలో ముప్పిరిగొన్న పరిణితవాణి అంతర్మథనాలకు సాక్షీభూతంలా మిగిలాయి…! *** మాట్లాడలేని ముదిమిని కౌగిలించుకున్న దుఃఖసముద్రంలా… కెంజాయ సంధ్యలో ఒంటరితనాన్ని కప్పుకొని ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి జ్ఞాపకంలా… నిద్రపట్టని ముసలికళ్ళతో ఎవరి కొరకో నిరీక్షిస్తున్నట్టుగా… చుట్టూ ఆవరించిన చెట్ల మధ్య దారి పక్క అనాథ శవంలా పడి ఉంది… ‘ఊరి చివర ఆ ఖాళీ ఇల్లొకటి…!!’ *** ఇనప్పెట్టెలో మూల్గుతున్న పాత వస్తువులు చరిత్ర విప్పని రహస్యంలా… పురాస్మృతుల పరిమళాలను వెదజల్లుతుంటే… పక్షులు వాలని చెట్టులా… ఆ ఇంటి గడప పొక్కిలైన తలవాకిలి దుఃఖంతో చెలిమి చేసింది! మరణశయ్యపై ఆఖరి చూపును మోస్తున్న అమ్మలా… తననందరూ వీడిపోయాక… తెంచుకున్న బంధాలతో… అనుభవాల గాయాల తడిలో నానిన కాగితపు పడవగా… జ్ఞాపకాల పొలిమేరల్లో నిలబడిన అవ్యక్త రేఖలా ఉంది… ‘ఊరి చివర ఆ ఖాళీ ఇల్లొకటి…!!’ *** వారసత్వం రాల్చిన పండుటాకులను ఏరుకుంటూ… కరుగుతున్న కలలా… కళ్లముందు అన్నీ గతించిపోతుంటే… ఒకప్పుడు పుదిచ్చిన బోనంకుండలా వెలిగిపోయిన ‘ఊరి చివర ఆ ఖాళీ ఇల్లొకటి…!!’ నేడు కాలం ప్రసవించని మరో మొహంజదారోగా నిలబడింది. *** ఒకప్పటి రాలెపూల సౌందర్యంగా మెరిసిపో… నేడు కాలం కూల్చిన శిథిల జ్ఞాపకమై మిగిలిపోయి… నీళ్ళు లేని దిగుడుబావిలా నిలబడింది… ‘ఊరి చివర ఆ ఖాళీ ఇల్లొకటి…!!’ *** కిర్రుమన్న పెద్ద దర్వాజా పలకరించే గాజుల సడిలేక చిన్నవోగా… అరుగంచుకు ఒరిగిన గుంజలతో… ఎన్నెన్నో సంస్పందనలను తన రంగు వెలిసిన గుండెల్లో పొదవుకొని…. అనుకోని అతిథిలా… అప్పుడప్పుడు వచ్చి తనపై వాలే ఒక బూడిదరంగు పిట్టతో చెలిమి చేసిన ‘ఊరి చివర ఆ ఖాళీ ఇల్లొకటి…!!’ వీడ్కోలు పలకని విషాదాన్ని నెమరేసుకుంటున్న స్మృతివృక్షమై నిలిచింది! *** నేనెప్పుడైనా ఆ ఇంటివైపు వెళ్తే… నా కొరకు దిగాలుగా ఎదురు చూసే బాల్యస్నేహితుడి జ్ఞాపకం ఒకటి చందమామ పుస్తకంలా… చెదరని సంతకమై ఎదను తొలుస్తుంది! చీకటి చిరునవ్వులా… అల్లుకున్న దాని స్నేహపు పొత్తిళ్ళలో మరొక్కమారు తలదాచుకోవాలని ఉవ్విళ్ళూరుతూ… మట్టిబాటవెంబడి ఎన్నిమైళ్ళు నడిచినా!?… తీరం చేరని కెరటంలా… ఆ ఇంటిని చేరని నా పాదాలు… నేడు జ్ఞాపకాల ముళ్ళు గుచ్చి రక్తసిక్తమయ్యాయి!… బాల్య మిత్రుడిని కోల్పోయిన వేదనలా… కానరాని దృశ్యమేదో పొగమంచులో చిక్కినట్లు…. ప్రతి ఊరి చివర మిగిలి ఉన్న ఇల్లొకటి… పేదరాశి పెద్దమ్మలా… పెదవి విప్పని కథలనెన్నో నెమరేస్తూ… ఒకప్పటి పురాజ్ఞాపకంలా… మిగిలిపోయింది…!! ~
నా స్పందన:
సంచిక వెబ్ పత్రిక వారికి శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు. అనుభూతికి పెద్ద పీట లేసే కవితలకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత ముదావహం. నిజానికి కవులు ప్రకృతి ప్రేమికులు. అనుభూతిని అక్షర ఉద్దీపనతో ప్రకాశవంతం చేసేదే అసలైన కవిత. ప్లూటార్క్ అంటాడు “కవిత అంటే మాట్లాడే పెయింటింగ్” అని, – “పెయింటింగ్ అంటే మాట్లాడని కవిత” అని! ఆయన అన్నట్టుగా నేను రాసిన కవిత ‘ఊరి చివర ఆ ఇల్లొకటి!’ నేను అనుభవించిన సజీవ జీవన చిత్రం. ప్రతి పల్లెలోను ఉండే అరుగుల ఇళ్ళు, చుట్టుబండల ఇండ్లు ఉంటాయి. అలాంటి ఇండ్లలో పెనవేసుకున్న జ్ఞాపకాల చిత్రికనే నా కవిత. మన తొలినాళ్ళ బతుకుకు తీపి దారమైన ఆధారమిది… మన దుఃఖాలను తుడిచి… ఎక్కిళ్ళకు ఉపశమనమిచ్చి మన ప్రాణం తల్లడిల్లిన తావుగా మన సొంత అస్థిత్వ ప్రకటన ఇలాంటి పల్లెలోని ఇండ్లు. ఇలా పాత మొగురాలు, గుంజలు ఉన్న ఇంటిని చూస్తే మరో మొహంజదారో లేదా సింధు నాగరికత క్రమంలోకి నన్ను నేను ప్రవహింపజేసుకున్నట్లుగా అబ్బురమనిపిస్తుంది. ఒక సహజమైన ఆత్మీయరాగమేదో మదిని అల్లకున్నట్లు…. ఇల్లు అమ్మ కొంగునీడై నన్ను సేదదీర్చే నా ప్రియబాంధవి… ఇలాంటి ఇంటిలోనే కదా తల్లి గర్భంలో శిశువు ప్రవేశించినంత సహజంగా… ఉద్వేగంగా…. ఒకింత ఉద్విగ్నంగా తిరుగతూ… నన్ను నేను మరింతగా ప్రేమించుకుంటాను. ఆ ఇంటి ఖాళీతనంతో… శ్యూన్యంతో కాసేపు మమేకమవుతాను. కొన్ని తరాల సంస్పందనలను ఒడిసి పట్టుకున్న దాని గుండె ఘోష వింటాను. ఇంటితో నేను తాదాత్మ్యం చెందుతాను. నా ఆనవాళ్ళను మర్చిపోకుండా మూలమిదేనంటున్న ఒక సజీవ సామాజిక చలనానికి నిదర్శనం… ప్రతీ ఊర్లోనూ ఉండే ఇలాంటి ‘ఊరి చివర ఖాళీ ఇల్లొకటి’ మనుషులు ఎక్కడివారు అక్కడ వెళ్లిపోయాక బోరుమంటున్న దిగుడు బావిలా బేలగా నిలబడ్డ ఇలాంటి ఇండ్ల దుఃఖాన్ని అక్షరబద్దం చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పించాను. దిగూడ్లు, మట్టిమెట్లు, అలికే ఇండ్లు, చెక్క షెల్ఫ్‌లు, పెద్ద దర్వాజా, ఠీవి ఒలకబోసే మందపాటి గడపలు… ఓహ్…! ఒక నోస్టాల్జియా ప్రపంచంలోకి నన్ను లాక్కెళ్తాయి ఇలాంటి పాత ఇండ్లు…. అలాంటి ఇండ్లకు.. అందులో బతుకును పండిచుకున్న మన పెద్దలకు నమస్సులతో…
శ్రీమతి బి. కళగోపాల్ గత దశాబ్ద కాలంగా కవితలు కథల్ని రాస్తున్నారు. పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీషు, బిఎడ్ చేసిన వీరు ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఇంతవరకు వీరివి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. కవితా సంపుటి ‘మళ్లీ చిగురించనీ..’ 2015లో 74 కవితలతో ప్రచురించారు. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం.లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. వీరి కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులను పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంచిక పదసోపానం-27
మలిసంజ కెంజాయ! -22
దుష్టచతుష్టయం
ఫొటో కి కాప్షన్-13
వెర్రి అభిమానంతో మనం తయారు చేసుకునే OTHER GODS
మర్డర్
ఫొటో కి కాప్షన్-3
పదసంచిక-33
నాన్న ప్రేమ
విరాళ హృదయం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®