[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
పెద్దన కవితా వైభవం
ప్రాచీన కావ్యాలలోని అందాలను వివరించి, వాటిని చదువవలసిన అగత్యం మనకెందుకున్నదో తెలపాలనే కుతూహలంతో యువభారతి – సాహితీ వాహినీ పరంపరలో ఎన్నో చిన్న పుస్తకాలను ప్రచురించింది. ఈ ‘పెద్దన కవితా వైభవం’ ఆ పరంపర లోనిదే.


పెద్దన వాక్కునకు – సౌకుమార్యం, మాధుర్యం – ఈ రెండూ సహజ గుణములు. శృంగారం, శాంతం వంటి లలిత రసములలోనే ఈ వాక్కు రక్తి కడుతుంది. మనుచరిత్రంలో శృంగార, శాంత రసములకు అధిక ప్రాధాన్యత ఉంది. అద్భుత, వీరరసాలకు ఉపమగా ప్రతిపత్తి ఉంది.
ఈ మనుచరిత్రంలో సర్వ గుణోన్నతుడు ప్రవరుడు. అపురూప సౌందర్య రాశి, శృంగార మూర్తి వరూధిని. కపట కాముకుడు గంధర్వుడు. తేజోబలోదారుడు, భోగైక శీలి స్వరోచి. స్నేహార్ద్ర హృదయులు మనోరమ, వభావరి, కళావతులు. దేవకార్య నిర్వహణ దక్షురాలు వనదేవత. సర్వలక్షణ సమన్వితుడు, తేజస్వి ఐనవాడు స్వారోచిషుడు. జాతి సహజమైన మహిమ ప్రాగల్భ్యములు గలవాడు ఔషధసిద్ధుడు. గురువులను అపహసించిన గర్వి – ఇందీవరాక్షుడు.
వీరిలో శుద్ధమైన చరిత్రము కలవారు – ప్రవరుడు, స్వారోచిష మనువు. వీరిద్దరూ కథకు రెండువైపులా నిర్మించబడిన బలమైన స్తంభముల వంటి వారు. వీరి ఆధారంగా నిర్మించబడ్డ నడిమి వంతెన – ‘మనుచరిత్రం’.


ఆచార్య పింగళి లక్షీకాంతం గారు అన్నట్లు – “ఆడంబరము లేని గాంభీర్యము, సౌమ్యమైన ప్రాభవము, ఉద్వేగము లేని శీఘ్ర గమనము, పేలవత్వం లేని స్వాభావికత, వెలితి లేక నిండారి మెరుగులు తీరిన పద గుంఫనము” పెద్దన కావ్య శైలికి ముఖ్య లక్షణములు. దీనినే శ్రీకృష్ణ దేవరాయలు మృదు మధురోక్తులతో కూడిన చతుర రచనమని కొనియాడినాడు.
డాక్టర్ పల్లా దుర్గయ్య గారు, మనుచరిత్రం లోని కొన్ని అందమైన పద్యాలను ఏరి వాటికి రుచిరమైన వ్యాఖ్యానం సమకూర్చారు. డా. దుర్గయ్య గారు విద్వత్కవులు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో చక్కని అభినివేశం సంపాదించినవారు. జ్యోతిర్వేద పారగులు, మధుర సంభాషణా చతురులు. పదహారవ శతాబ్దంలో తెలుగునాట విరిసిన ప్రబంధ వాఙ్మయ వాటికలో విహరించి, ఆ ప్రక్రియను గూర్చి ప్రామాణికమైన పరిశోధన చేసి, పెద్దనను గూర్చిన అనేక అపూర్వ విషయాలను విద్వల్లోకానికి అందించి, ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి డాక్టరేటు పట్టాను పొందినవారు.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.



శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.