తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. శైలజకు మెలుకువ వచ్చింది. అప్పటికే భర్త భాస్కర్ లేచేసి బ్రష్ చేసుకొని పేపర్ తిరగేస్తున్నాడు. గబుక్కున మంచం మీద నుండి లేచేసింది శైలజ. పదినిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే కాఫీ కలిపి భాస్కర్‌కు ఇచ్చేసింది శారదమ్మ, భాస్కర్‌కు తల్లి, శైలజ అత్తగారు.
“లేచావామ్మా? ఇవ్వాళ పాప స్కూలుకు బిర్యాని అడిగింది. చేసేసి ఆ బాక్సులో పెట్టేశాను. పాపను నిద్రలేపమ్మా, స్కూల్‌కి టైమై పోయింది. ఈలోగా మనమిద్దరికీ కాఫీ చేసేస్తాను” అంది శారదమ్మ.
“అయ్యో చేసేశారా అత్తయ్యా అప్పుడే” నసిగింది శైలజ. ‘హుం, ఈ జన్మకి నాకు మొగుడికి, కాఫీ కలిపిచ్చి కలిసి త్రాగే అదృష్టం లేదేమో, పిల్లకి వండి పెట్టాలని నాకుండదా’ మనసులోనే నిట్టూర్చింది.
పాపను లేపి బ్రష్ చేయించి స్నానం చేయించి యూనిఫాం వేసి హాల్లోకి తీసుకొచ్చింది. పాపకు బోర్న్‌విటాతో రెడీగా ఉంది శారదమ్మా.
‘నానమ్మ’ అంటూ పరిగెత్తింది పాప.
‘మా బంగారు తల్లీ’ అంటూ ముద్దుల వర్షం కురిపించింది శారదమ్మ.
“స్కూల్లో ఇంటర్వెల్ టైంలో స్నాక్స్ పై బాక్స్‌లో పెట్టాను చూస్కోని తినమ్మా అకలివేస్తుంది” అంది శారదమ్మ. “అలాగే నానమ్మ” అంది పాప.
పాపను ఆటో ఎక్కించి తిరిగొచ్చింది శైలజ. వంటింట్లోకి వెళ్ళింది శైలజ. అప్పటికే పచ్చడి, చారు పెట్టేంది శారదమ్మ.
“అత్తయ్య కూర ఏమి తరగను” అంది శైలజ.
“బెండకాయలు వున్నట్లున్నయ్యి తరగమ్మా. మీ ఇద్దరూ ఇష్టంగానే తింటారుగా” అంది శాంతమ్మ. శైలజ తరిగి ఇచ్చేలోపు కుక్కర్లో అన్నం పప్పు పెట్టేసింది శారదమ్మ.
బెండకాయ ముక్కలు తీస్కుని బాండీలో వేసింది శారదమ్మ. చేసేది లేక శైలజ రూంలోకి వచ్చింది. భాస్కర్ అప్పటికే స్నానం చేసి రెడీ అవుతున్నాడు.
“ఏమోయ్ వంట అయిందా? ఆఫీస్‌లో కొంచెం ఎక్కువ పనుంది త్వరగా కానీయ్” అన్నాడు భాస్కర్.
“అదేమన్నా నా చేతిలో వుందా? ఆవిడే చేసేసారు అన్నీ. మీకు ఇష్టమని గోంగూర పచ్చడి చేద్దామని అనుకున్నా. ఈలోపే వేరేది చేసేశారు. మొగుడికి, పిల్లకి ఇష్టమైనవి చేసి పెట్టుకునే అదృష్టం లేదేమో ఈ జన్మకి” విసురుగా అంది శైలజ.
“పోన్లే, వూర్కో. అమ్మ వింటే బాధపడుతుంది. సాయంత్రం చెయ్యి పచ్చడి ఏమైంది ఇప్పుడు” అని భాస్కర్ హాల్లోకి వెళ్ళాడు.
“అది కాదండీ” అంటూ వెనకాలే వెళ్ళింది శైలజ.
అప్పటికే వంటంతా టేబుల్ పైన పెట్టిన శారదమ్మ కొడుకు రాగానే వడ్డించడం ప్రారంభించింది. విసురుగా లోపలి కొచ్చేసింది శైలజ.
“శైలూ వెళ్ళొస్తా” భాస్కర్ హాల్లోంచే చెప్పి వెళ్ళిపోయాడు. విని వూర్కుంది శైలజ.
“శైలూ…. అమ్మా శైలూ” పిల్చింది శారదమ్మ, అయిష్టంగా లేచింది శైలజ.
“ఈ బిర్యానీ మిగిలింది…. పక్క ఫ్లాట్‌లో వుంటున్న మీ ఫ్రెండ్ లక్ష్మి ఏదో పరీక్షకి ప్రిపేరవుతుందని చెప్పావుగా ఇది ఇచ్చేసిరా. పాపం ఏదో తిని చదువుకుంటుంది” అంటూ బాక్సు చేతిలో పెట్టింది శారదమ్మ. మాట్టాడలేదు శైలజ.
‘సంఘసేవ కూడా మొదలెట్టినట్టుంది’ స్వగతంలో అనుకుంది శైలజ.
“నేను పూజకి కూచుంటున్నాను. నువ్వు కాసేపు మీ ఫ్రెండు దగ్గర కూర్చుంటే కూచో” అని ఇంకా ఏదో చెపుతూనే వుంది శారదమ్మ, తలుపు విసురుగా వేసేసింది శైలజ బైటికెళ్ళి.
లక్ష్మి ప్లాట్ తలుపు ఓరగా తీసి వుంది. తలుపు తీసేవుంది అనుకుంది శైలజ.
***
“ఏమ్మా నీ మొగుడికీ పెద్ద కూతురికీ వండుకున్నావ్, పంపించావు. గదిలో కూర్చున్నావేంటీ? మిగిలిన పనులు అన్నీ ఎవరు చేస్తారు?” కటువుగా పలికింది సుభద్రమ్మ కంఠం. ఆవిడ లక్ష్మి అత్తగారు.
“ఈరోజు పనమ్మాయి కూడా రాలేదు అత్తయ్యా. వస్తుందేమో అని చూస్తున్నాను. వంటంతా అయిపోయిందిగా….. అన్నం ఒక్కటే వండాలి. ఇదిగోండి పాప ఆయాసపడుతుంటే ఇక్కడున్నాను. ఒక్కసారి మీరు కూచుంటే దీని దగ్గర, అన్నం కుక్కర్లో పెట్టేసి వస్తాను” అంది లక్ష్మి.
“ఏంటీ పాప దగ్గర కూచోవాలా? ఏం నేనేమన్నా ఆయాని అనుకున్నావా?” అంది సుభద్రమ్మ.
“ఒకళ్ళకిద్దర్ని కన్నావు ఆడసంతానాన్ని వాడి ప్రాణానికి …… నువ్వు పురమాయించే పన్లన్నీ చెయ్యడానికి నాకు తీరిక లేదు. నేను కాలనీ క్లబ్ మీటింగ్‌కు వెళ్ళాలి. నువ్వు చదివి ఉద్ధరించేది ఏదీ లేదు గానీ లే, లే లేచి అన్నం వండు….” సాగుతోంది అత్తగారి వాక్ ప్రవాహం.
“ఏంటి మీ అత్తయ్య చూడాలా… మేమేమన్నా తేరగా వున్నామా? మీ మీద ఆధారపడి బతకట్లేదు మేము. నీకిష్టం లేకపోతే మేమెళ్ళిపోతాం” సాగదీస్తున్నాడు వెనకనుండి మామగారు….
మ్రాన్పడిపోయింది శైలజ. తనెంతో అభిమానించే సుభధ్ర ఆంటీ నిజ స్వరూపం జీర్ణించుకోలేకపోతోంది. లక్ష్మి మామగారి అర్థం లేని వాదన వినలేక పోయింది.
కొడుకు బిడ్డను కాసేపు కనిపెట్టుకుని వుంటే ఆయాతనమా? ఆదారపడి బ్రతకనంత మాత్రాన బాధ్యత లేదా? ఇక లోపలికి వెళ్ళలేకపోయింది. గిరుక్కున తిరిగి ఇంటి కొచ్చేసింది.
***
ఇల్లంతా సాంబ్రాణీ సువాసనలతో, పూవ్వుల వాసనలతో పరిమళభరితంగా వుంది. పూజ గదిలో పటాలకి అందంగా పూలని అమర్చి దీపారాధన చేసి మౌనంగా ధ్యానం చేసుకుంటున్న అత్తగార్ని చూసి చాలా రిలీఫ్‌గా ఫీలయ్యింది.
ఆవిడ కొత్తగా కనపడసాగింది. అన్నిటికీ మించి తనెంతో అదృష్టవంతురాలు అనిపించింది. తను ఆవిడ మీద చేసిన విమర్శలు అన్నీ అర్థం లేవనిపించింది. మౌనంగా శారదమ్మ వెనకాలే కూచుండిపోయింది. అత్తలో అమ్మని చూద్దామని నిర్ణయించుకుంది శైలజ. ఇప్పుడు ఆమెకి ఎంతో తేలికగా ఉంది.
10 Comments
Mohan
Entha baagaa vrasaro …chinna vishayam tho pedda drukpadham lo marpu vatcheche vidham gaa vrasaru… chaala chaala baghundhi …kluptamga….
Mohan
Mohan
Chaala cheppadalachukunna vishayanni kluptamga vyaktha parichi oka maarpu thevadam yee writer pratyekatha….
Lakshmi padmaja
Thanks
శ్రీపాద శ్రీనివాస్
ఈ కథలో వాడిన పదజాలం మృదువుగా చాలా బాగుంది..పదజాలం చక్కగా వాడిన తీరు కారణంగా ఆయా క్యారెక్టర్లు మన కళ్ళముందే తచ్చాడుతున్న భ్రాంతి కలిగింది. . ఈ కథలో మంచి సందేశం ఉంది..అత్త కూడా అమ్మే అని చక్కటి కథనంతో చెప్పించారు…ఒక్కమాటలో చెప్పాలంటే మంచి కథ అంటే ఇట్లా ఉండాలి అని అనిపించారు..రచయిత్రి చిత్రపు లక్ష్మీ పద్మజా గారికి అభినందనలు
…శ్రీపాద శ్రీనివాస్
Lakshmi padmaja
Thank u srinivas garu
C raghu
Excellent padmaja..chapala bagundi
C raghu
Excellent..
షామీరు జానకి దేవి
చాలా బాగుంది .. అందరు అత్తలూ ఇలా ఆలోచిస్తే బాగు..అందరూ శారదమ్మలా ఆలోచించాలి..కూతురు కోసం చేస్తారు కాని కోడలికి చెయ్యరు..ఆడవాళ్ళలో ఈ ఆలోచనా విధానం మారాలి.. ఉద్యోగం చేసే సాటి మహిళగా ఆలోచించాలి..చక్కటి రచనా శైలి తో ఆలోచింపచేసే విధంగా రాసారు..
Lakshmi padmaja
Thank u somuch madam
Cpadmaja
Story is in simple manner having clear expression with clarity. Nice .