తెలుగు ప్రజల సంస్కృతీ మూలాలు మనదేశంలోని తక్కిన అన్నిభాషా సమాజాలవలే జానపదకళల్లో మౌఖిక సాహిత్యంలో ఉంటాయి. అంటే పల్లెసీమల్లో కష్టజీవుల నిత్యజీవితంలో కళాకారుల్లో ఉంటాయి. కళలకు భారతదేశం నిలయం కనుక ఎన్నో జానపద కళారూపాలు భారతదేశం అంతటా స్ధానిక ప్రజల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రదర్శించడం జరుగుతుంది. మన ప్రాచీన జానపదకళలకు ఊపిరి ఊదడానికి ఎందరో మహనీయులు అహర్నిశలు పాటుపడుతూనే ఉన్నారు.
నేడు నాటకం, సినిమా, టీవీ లధాటికి నానాటికి అణగారిపోతున్న మన జానపద అపురూప కళలు పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. పల్లెల్లో ప్రజలు వీటిపై మక్కువ చూపించడం విశేషం.
ఈ తోలుబొమ్మలాట తమిళనాడును మహరాష్ట్రీయులు పరిపాలించే రోజుల్లో మహరాష్ట్ర నుండి తరలివచ్చింది. దక్షణాది రాష్ట్రాల జానపదకళల్లో తోలుబొమ్మలాట ఒకటి. దక్షణాదిన విశేషంగా ఆదరణ పొందిన లేపాక్షి రామాయణం యక్షగానం, దానవేంద్రుని చరిత్ర యక్షగానం, వీరకాశీ, ఆండిపట్టారంకూత్తు, నల్లూరి భాగవతం, దేవరాట్టం, సేవాట్టం, కిళవన్ కిళివిఆట్టం, కొయ్కాల్కుదిరై, బయినికథలు, పొగిడింపులు, శవయాత్ర పాటలు, సక్కైకుచ్చిఆటం, కట్టబొమ్మలాటం, జిక్కాటం, ఒయిలాట్టం, కోలాటం, విల్లుపాట్టు, పండరి భజనలు, కరగాట్టం, జింపలమేళం, బుర్రకథ, బుడిగ జంగాలాట, జాతిపిళ్లై ఆట్టం, సంతవేలూరు రామనాటంకం, ఉరుములాట, గొరవయ్యలాట, డోలునృత్యం, వీరభద్ర విన్యాసాలు, కోయనృత్యం, గుస్సాడి, పేరిణి తాండవం, తప్పెటగుళ్లు, చిందు భాగవతం వంటి ఎన్నోజానపద కళారూపాలు ఉన్నాయి.
ఈ తోలుబొమ్మలాట అత్యంత ప్రాచీనమైనది. త్రేతాయుగంనుండి ఈ కళ ఉందని తెలుస్తుంది. ఈ కారణంతోటే తోలుబొమ్మలాటలో ఎక్కువగా రామాయణ ఘట్టాలనే ప్రదర్శిస్తుంటారు. తమిళనాట కన్యాకుమారికి చెందిన యాదవ కళాశాలలో ఈ తోలుబొమ్మలాటపై పరిశోధన చేస్తున్న డి.గోవిందరాజన్ తమిళ జానపద సాహిత్యంలో తోలుబొమ్మలాటకు తోళ్పావైకూతు అని, వ్యవహారికబాషలో బొమ్మలాట్టంగా ప్రాచుర్యం పొందింది.
ఒకప్పుడు, కన్యాకుమారి, మధురై, తేని, కంచి జిల్లాలు ఆయువుపట్టుగా ఉండేవి. నేడు ఈ ప్రాంతపు కళాకారులు ఆదరణ లేక కడు దయనీయమైన పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు. ఈ తోలుబొమ్మలాట కళాకారులు ఇళ్లవెంట తిరుగుతూ ఈ బొమ్మలను చూపుతూ ప్రజలు ఇచ్చే గుప్పెడు బియ్యమో, రూపాయి నాణెమో స్వీకరిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ తోలుబొమ్మలాటను బ్రతికించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కాని, కేంద్ర జానపద కళావిభాగం చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వాలతోపాటు ప్రజలు తోలుబొమ్మలాట వంటి జానపద కళలను ఆదరించి మన సంస్క్రతి సంప్రదాయాలను భావితరాలవారికి అందించవలసిన బాధ్యత మన అందరిపైనా ఉంది.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™