ప్రియమైన మీకు
“మీకు” అని సంబోధించినందుకు ఆశ్చర్యపోకండి. మన పరిచయంలో ఒక అగాధం ఏర్పడి ఇరవై ఏళ్ళయింది కదా.
ఆ జ్ఞాపకాలు తలచుకుంటే హృదయం పులకించి ఓ భావ కవిత రాయాలనిపిస్తుంది. అది విరహ వేదన అని చదివినవారు అనుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. ఇద్దరం రాష్ట్రేతరాంధ్రులం. జన్మతః ఖరగ్‌పూర్ వాసులం. ఉద్యోగార్థం వలస వచ్చిన తండ్రులు రాష్ట్రేతర ప్రాంతమైన పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డంతో వంగ బిడ్డలమైనాం.
నా బాల్యం చదువూ అక్కడే కొనసాగడం… డిగ్రీ ఖరగ్‌పూర్ కళాశాలలో చదువుకోవడం… నేను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా క్లర్క్‌గా ఎంపికవడం జరిగింది. ఉద్యోగం కలకత్తాలో.
ప్రతి రోజూ సూర్యోదయానికి ముందు ఓ టిఫిన్ బాక్స్‌తో ఖరగ్‌పూర్ – హౌరా లోకల్ ట్రైన్ ఎక్కి ఆఫీసులో ఐదు వరకు పని చేసి తిరిగి మళ్ళీ సాయంత్రం లోకల్ ట్రైన్లో ఖరగ్‌పూర్ చేరడం.
శని ఆదివారాలొస్తే ఎంత హాయి. నాకు ఇష్టమైన తెలుగు పుస్తకాలు బాల సేవా సంఘం గ్రంథాలయంలో మెంబర్ కార్డ్‌పై తీసుకుని, ఆ రెండు పుస్తకాల్ని ఓ ఐదు రోజులపాటు విడతలవారీగా చదువుకుని మళ్ళీ శనివారానికి ఎదురుచూడ్డంలో ఎంత ఆనందమో. ముఖ్యంగా ఆ రోజు సాయంత్రం మీ కలయికతో మనస్సు ప్రఫుల్లమయ్యేది. మన ఇద్దరి అభిరుచులూ కలిసి తెలుగు సాహిత్యంపై చర్చలకు దారి తీసేది. మీరు ఆంధ్ర ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారని తెలిసి సంతోషించాను. నాకు కలకత్తా జాతీయ గ్రంథాలయంలో సభ్యత్వం ఉందని తెలిసి మీరు చదవాలనుకున్న తెలుగు సాహిత్య పుస్తకాలు తెచ్చి మీకు అందించినప్పుడు మీరు అందించిన ధన్యవాద సుమాలు ఇప్పటికీ నా మదిలో పరిమళిస్తున్నాయి.
అనుకున్నవి అన్నీ జరిగితే జీవితం ఎలా అవుతుంది?… నేను రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా సెలక్టవడం… కొద్ది రోజులు ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్ లోనే ఉద్యోగించడం మీకు తెలిసిందే. అప్పుడే చిన్నప్పటి మా నాన్న మా అత్త గారి అవగాహనా ఫలితం… నేను మా అత్త కూతురు సుమతిని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. అత్త విశాఖపట్నంలో ఉండడంతో పెళ్ళి అక్కడే జరిగింది. ఆ తర్వాత ఏదో తెలియని మొహమాటం మన మధ్య దూరాన్ని పెంచింది. అత్త కోరికా శ్రీమతి ఒత్తిడిని భరించలేక విశాఖపట్నం బదిలీకి స్వచ్ఛంద దరఖాస్తు పెట్టుకున్నాను. కొందరి సహాయ సహకారాలతో అది మంజూరయింది.
ఇది జరిగి ఇరవై ఏళ్ళు.
నేను విశాఖపట్నంలో చీఫ్ టిక్కెట్ ఇనెస్పెక్టర్‌గా పనిచేస్తున్నాను. మీరు కూడా అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పని చేస్తున్నారని మిత్రుడు రవిశంకర్ ద్వారా తెలిసింది. వాడే ఒక కబురు అందించాడు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులతో ‘ఆంధ్ర ఉన్నత పాఠశాల అపూర్వ విద్యార్థుల సమ్మేళనం’ పేరిట ఒక కార్యక్రమం త్వరలో జరుపనున్నారని. ఆ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలనుకుంటున్నాను. దానికి అధ్యక్షులు మీరే కదా. ఎందరో పాత స్నేహితులు… వారందరి కర స్పర్శకై ఆతృతగా ఎదురుచూస్తున్నాను…
సమ్మేళనంలో నిష్టురాలకు తావు ఉండకూడదు సుమీ. మీ ఇద్దరు ఆడపిల్లలూ బాగా చదువుకుని ఉద్యోగిస్తున్నారని… పెళ్ళిళ్ళు కూడా చేసేసారని తెలిసింది.
నాకు ఒక పాప… ఒక బాబు. పాపకు పెళ్ళి చేసేసాను.
బాబు వైద్యవృత్తిలో ఇంకా స్థిరపడాలి. ఒక సంస్కారవంతమైన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందామంటే మీరేమో అదరాబాదరాగా ఇద్దరు అమ్మాయిల పెళ్ళి చేసేసారాయె…
మన కలయికతో గలగలా పారే కబుర్ల ప్రవాహంలో కేరింతలు కొట్టాలని…
మీకు ఇష్టమైన తెలుగు సాహిత్య దీపికల సేకరణలో
నేను నిశితంగా….
శుభాకాంక్షలతో
మీ
నేను
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
Wednesday
సంచికలో 25 సప్తపదులు-6
మిర్చీ తో చర్చ-31: ప్రేమ – మిర్చీ… ఒకటే-13
విద్యా తపస్విని శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ
అదయ్యా విషయం!!
తెలుగుజాతికి ‘భూషణాలు’-34
సాఫల్యం-15
ఆఖరి నవ్వు 🌿
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 15
సిరివెన్నెల పాట – నా మాట – 26 – ప్రాయాన్ని మించని భాషతో రాసిన పాట
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®